Saturday, 5 October 2013

దేవీభాగవత౦ - శ్రవణ ఫలం - గురుకృప:

Bramhasri Samavedam Shanmukha Sarma

దేవీభాగవత౦ - శ్రవణ ఫలం - గురుకృప:

వివస్వంతుని కుమారుడు శ్రాద్ధ దేవుడను మహారాజు. అతని భార్య శ్రద్ధాదేవి. వారికి ఎంతకాలానికీ సంతానం కలుగలేదు. మగబిడ్డ కలగాలని ఆకాంక్షించి వసిష్ఠుల వారి అనుమతితో పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించాడు. తనకు ఆడపిల్ల కావాలనీ ఆవిధంగా హోమం నిర్వహించమనీ శ్రద్ధాదేవి అభ్యర్దించినందువల్ల హోత అలాగే హోమం చేశాడు. కొంతకాలానికి శ్రద్ధాదేవి గర్భం ధరించి ఆడపిల్లను ప్రసవించింది. ఇలాదేవి అని పేరు పెట్టారు. మగపిల్లవాడు కావాలని సంకల్పించి ఇష్టి నిర్వహిస్తే ఆడపిల్ల పుట్టింది అని మహారాజు మనస్సు కలుక్కుమంది.ఇది ఎలా జరిగింది అని గురువైన వసిష్ఠుల వారిని అడిగాడు. వ్యతిక్రమం ఎలా జరిగిందో చెప్పి మగపిల్లవాడుగా మారాలంటే పరమశివుని ప్రార్ధించమన్నగురువు వసిష్ఠుని సలహా మేరకు శివుణ్ణి ప్రార్ధిస్తాడు శ్రాద్ధదేవుడు. శివానుగ్రహమూ, గురువు అనుగ్రహమూ కలిసి ఇలాదేవి పురుషుడుగా మారిపోయింది. సుద్యుమ్నుడు అని నామకరణం చేశారు. ఆ రాకుమారుడు సకల విద్యా పారంగతుడయ్యాడు. యౌవనంలోకి అడుగు పెట్టాడు. ఒకనాడు వేటకోసం మేరుపర్వతానికి చేరువలో ఉన్న ఒక మహావనం లోకి అడుగుపెట్టాడు.

ఆ వనానికి ఒక చరిత్ర ఉంది. ఒకప్పుడు శివపార్వతులు అక్కడ క్రీడిస్తూ౦డగా శివదర్శన లాలసులైన మునులు తెలియక హఠాత్తుగా ప్రవేశించారు. పార్వతి సిగ్గుపడింది. అది గ్రహించిన మునులు వెంటనే వెళ్ళి శ్రీహరిని శరణు వేడుకున్నారు. కానీ పార్వతిని సముదాయించడం కోసం శివుడు ఈ రోజునుంచీ ఈ వనంలోనికి ప్రవేశించిన పురుషులెవరైనా సరే స్త్రీలుగా మారిపోతారు అని ఆ వనానికి ఒక శాపం ఇచ్చాడు.ఈ వృత్తాంతం తెలిసిన పురుషులెవరూ ఆ వనం దరిదాపులకైనా వెళ్ళరు. సుద్యుమ్నుడికి ఈ విషయం తెలియదు. తానూ తోటివారు అందరూ స్త్రీలుగా మారిపోయారు. మగ గుర్రాలు కూడా ఆడ గుర్రాలైపోయాయి. చేసేది లేక అలాగే ఆ అరణ్యాలలో సంచరిస్తూ బుధుడి ఆశ్రమం చేరుకున్నారు. ఇరువురూ ఒకరియందు ఒకరు మరులుకొన్నారు. ఆ సోమనందుడి ఆశ్రమంలో కామసుఖాలాలు అనుభవిస్తూ చాలాకాలం ఉండిపోయి పురూరవసుడికి జన్మనిచ్చింది. కొంతకాలం గడిచింది. ఒకనాడు తన పూర్వరూపం, తన రాజ్యం తల్లిదండ్రులు అన్నీ జ్ఞాపకం వచ్చి దుఃఖించి అక్కడ ఉండలేక వెళ్ళిపోయింది. వెతుక్కుంటూ వెళ్లి వశిష్ఠుని ఆశ్రమం చేరుకొని, కాళ్ళమీద పడి విలపించి, మళ్ళీ పురుషత్వం వచ్చేట్లు అనుగ్రహించమని ప్రార్ధించింది. వసిష్ఠుడు మంత్రశక్తితో జరిగినదంతా తెలుసుకుని కైలాసానికి వెళ్లి శివుణ్ణి అర్చించి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు
"నమోనమః శివాయాస్తు శంకరాయ కపర్దినే!
గిరిజార్ధాంగదేహాయ నమస్తే చంద్రమౌళయే!!
అని భక్తి భావంతో స్తుతించాడు. భోళాశంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆడపిల్లగా జన్మించి మగపిల్లవాడుగా మారి, మళ్ళీ స్త్రీత్వం పొందిన ఇలాదేవికి(సుద్యుమ్నునికి) తిరిగి పురుషత్వం ప్రసాదించమని అభ్యర్ధించాడు. ఒక నెల పురుషుడుగా ఒక నెల స్త్రీగా ఉంటుందని శివుడు అభ్యనుజ్ఞ ఇచ్చి అంతర్ధానం చెందాడు. అంతటితో సంతృప్తి చెందని వశిష్ఠుడు జగదీశ్వరిని స్తుతించాడు.
"జయదేవి మహాదేవి భక్తానుగ్రహకారిణి!
జయ సర్వ సురారాధ్యే జయానంతగుణాలాయే!!
వశిష్ఠుని స్తోత్రానికి జగదీశ్వరి ప్రసన్నురాలై వశిష్ఠునితో ఇలా అన్నది.."సుద్యుమ్నుని మందిరానికి వెళ్లి భక్తితో నన్ను అర్చించు నాకు అత్యంత ప్రీతి పాత్రమైన దేవీ భాగవతాన్ని నవాహోనియమంతో అతడికి వినిపించి అది ముగిసేసరికి తిరిగి పుంస్త్వం పొందుతాడు" అని ఆజ్ఞాపించింది. వశిష్ఠుడు ఆశ్రమానికి తిరిగి వచ్చి దేవి ఆజ్ఞ ప్రకారం ఆశ్వయుజ శుక్ల పక్షంలో దేవిని ఆరాధింపజేసి భాగవతం తనే పురాణశ్రవణం చేయించాడు. సుద్యుమ్నుడు భక్తితో విన్నాడు. వినిపించిన వశిష్ఠుని అర్ధించాడు. వెంటనే పురుషత్వం పొంది రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. ప్రజారంజకంగా పరిపాలన సాగించాడు. భూరి దక్షిణలతో దేవీ యజ్ఞాలు అనేకం నిర్విహించాడు. పుత్రులని పొందాడు. వారికి రాజ్యం అప్పగించి తానూ తపస్సు చేసుకొని దేవీ సాలోక్యం చెందాడు.

దేవీ భాగవత మహిమ అంతటిది.చదివిన వారికీ విన్నవారికీ సకల వాంఛాప్రదం. ఇహపరాలకు సాధకం. కనుక అ౦దర౦ ఈ పది రోజులూ దేవీభాగవత పఠన౦/శ్రవణ౦ చేసి ఆ అమ్మవారి కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రుల౦ అవుదాము