Wednesday 2 October 2013

వేద వ్యాసమహర్షి :

Suneel Kumar Kota
వేద వ్యాసమహర్షి :

వ్యాసమహర్షి ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదు. ప్రతి ద్వాపర యుగములోను ఒక సారి వ్యాస మహర్షి ఉద్భవించి వేదములను విభాగము చేయును. అందుకే ఆయనకు "వేద వ్యాసుడు" అని పేరు వచ్చినది. వేదములు ఇతిహాసములు, పురాణములు ఈయన ద్వారానే లోకములో వ్యాపింప చేయబడును. ప్రస్తుతం మనం వైవశ్వత మన్వంతరంలో 28వ మహాయుగంలో ఉన్నాము. అంటే ప్రతిద్వాపరకు ఒక్కోక్క వేదవ్యాసుడు ఉద్భవించి ప్రస్తుతం 28వ వేదవ్యాసుని కాలంలో ఉన్నాము. గతించిన వేద వ్యాసుల పేర్లు 1. స్వాయంభువ 2. ప్రజాపతి3. ఉశన 4. బృహశ్పతి 5. సవిత 6. మృత్యువు 7. ఇంద్ర 8. వశిష్ఠ 9. సారస్వత 10. త్రిధామ 11. త్రివృష 12. భరద్వాజ 13. అంతరిక్షక 14. ధర్ముడు 15. త్రయారుణ 16. ధనుంజయుడు 17. కృతంజయుడు 18. సంజయ 19. భరద్వాజ 20 గౌతమ 21. ఉత్తముడు 22. వాజశ్రవ 23. సోమశుష్మాయణ 24. ఋక్షుడు 25 శక్తి 26. పరాశరుడు 27. జాతూకర్ణి ప్రస్తుతం 28 వ వేదవ్యాసుని పేరు కృష్ణద్వైపాయనుడు. భవిష్యత్ వేదవ్యాసుడు అశ్వత్థామ అయితే ఈ పేర్ల విషయంలో పాఠాంతరం కలదు.

నారాయణుని నాభికమలము నుండి బ్రహ్మ ఉదయించెను కదా! అతడు వేదములను ప్రసరింపచేయుటకు "అపాంతరతముడు" అనే మానస పుత్రుని సృష్టించెను. నారాయణుడు అతనిని పిలచి నీవు వేదములను దృఢానుడవై విని వాటిని వ్యాసమొనరింపుము అని చెప్పెను. అపాంతరముడు వేద భేదమొనర్చెను. అతనిని వేద వ్యాస అని పిలిచెను బ్రహ్మ. అంతేకాక బ్రహ్మ అతనితో నీవు నాకు పుత్రునివై ఆహ్లాదమొనర్చితివి. నీవు యిదేరీతిగా ప్రతి మన్వంతరములోను చేయుము అని ఆజ్ఞాపించెను. అంతే కాక నీవు రాబోవు కాలంలో వశిష్ఠ పౌత్రుడు పరాశరుడు అనువానికి పుత్రుడుగా జన్మించెదవు అని కూడా తెలిపెను.

వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే, పౌత్రమకల్మషమ్
పరాశరాత్మజమ్ వందే శుక తాతం తపోనిధిమ్

వశిష్ఠుని కునారుడు శక్తి. శక్తి కుమారుడు పరాశరుడు. పరాశరుని కుమారుని కుమారుడు వ్యాసుడు కృష్నద్వైపాయనుడు ఆయన కుమారుడే శుక మహర్షి. పరాశరుడు తీర్థయాత్రలు చేయుచూ యమునా నదీ తీరానకేగెను. సత్యవతి దాశరాజు కుమార్తెను చూచి మోహితుడయ్యెను. ఆమె నడుపు నావను ఎక్కిఆమెకు తన కోరికను చెప్పెను. తన తాప ప్రభావము చేత కన్యత్వము చెడకుండానే పుత్రుడు ఉదయించేటట్లు చేసేను. అలా సత్యవతికి జన్మించిన వాడే కృష్ణద్వైపాయన వేద వ్యాసుడు. వేద వ్యాసుడు పుట్టగానే తల్లికి నమస్కరించి, కృష్ణజినదండ, కమండలము ధరించి తల్లితో "అమ్మా నాతో పని కలిగినప్పుడు తప్పక తలంపుము" ఆక్షణమే నీ దగ్గరకు వచ్చి నీ పనిని పూర్తి చేసెదను అని తెలిపి లోక హితార్ధమై తపోవనములకు పోయి ఘోర తపము చేసెను. వేద వ్యాసుని వద్ద ఎందరో ఋషులు శిష్యులుగా చేరి విద్యార్జన చేసిరి

పిమ్మట కొంత కాలమునకు కురు రాజు శంతనుడు సత్యవతిని మోహించి ఆమెను వివాహమాడెను. ఆ వివాహ సమయంలో సత్యవతి తండ్రి పెట్టిన నిభంధనల ప్రకారము సత్యవతికి జన్మించిన పుత్రునికే రాజ్యము ఈయవలెనను. శంతనునికి ఈ వివాహం పూర్వమే భీష్ముల వారు జన్మించెను. సత్యవతి శంతనుల వివాహ నిమిత్తంగా ఆజన్మ బ్రహ్మచారిగా వుండుటకు ప్రతిజ్ఞ చేసినారు. సత్యవతీ శంతనులకు చిత్రాంగద, విచిత్రవీర్యులను పుత్రులు కలిగిరి వారు యౌవనులు కాకుండానే మరణించిరి. విచిత్ర వీర్యుని భార్యలు అంబిక అంబాలికలు. చిత్రాంగద విచిత్ర వీర్యులకు వివాహము కాలేదు. భీష్ములవారు బ్రహ్మ చర్యములో ఉన్నారు. అంతట ఆసమయములో సత్యవతి తన పుత్రుడైన వ్యాసుని తలంపగా ఆయన ప్రత్యక్ష మయ్యెను.

కురు వంశమును నిలపమని ప్రార్థించెను. అంతట వ్యాసుల వారు దేవర న్యాయమున అంబిక అంబాలికలకు సంతానము ప్రాప్తింపదలచెను. అంబికకు వ్యాసుల వారు పుత్ర దానమొనరింపగా ఆమె వ్యాసుని చూచి కనులు మూసుకొనెను. అందుకే ఆమెకు దృతరాష్ట్రుడు గుడ్డివానిగా జన్మించెను. వ్యాసుని వలన అంబాలికకు సంతాన తృప్తి కలుగ చేయు సందర్భములో ఆమె వెల్లనై పడిఉన్న కారణముగా ఆమెకు పాండురోగి అయిన వ్యక్తి పాండురాజు ఉద్భవించెను. అంబికకు అంధుడు జన్మించును కావున మరల పుత్రప్రాప్తి కలుగ చేయుము అని అడుగగా అంబిక స్థానములో దాసిని ఉంచెను. అందువలన దాసీవలన యముని అంశతో విదురుడు పుట్టెను. యమునికి మాండవ్యముని శాపం వలన యీవిధంగా విమరుని రూపంగా జన్మింపవలసివచ్చినది. ఈ విధముగా వ్యాసమహర్షి వలన కురు వంశం నిలపబడినది. విశేషం ఏమిటంటే మహా భారతం రచన చేసినది వేదవ్యాసుల వారు. ఆయన అనుగ్రహం లేకుంతోనే కురు పాండు వంశాలు ఉద్భవించాయి. ఒక కోణంలో మహా భారతం యుద్దం జరగడానికి ములకారకుడు కూడా వ్యాసుల వారే. ధృతరాష్ట్రునికి గాంధారి వలన దుర్యోదనొదులునూ, పాండురాజు వలన పాండవులు కలిగిరి. పాండురాజు మరణానంతరం సత్యవతీ, అంబిక, అంబాలికలకు ధర్మబోధ చేసి వనవాసముకు పంపి వారికి పుణ్యగతులను పొందుటకు మార్గదర్శకులయ్యారు ఈ వేదవ్యాసుల వారు.

పాండవులుఅరణ్యవాసమున లక్క యిల్లుదాటి వెడుతూ వుండగా అక్కడకు వెళ్ళి వారికి ధర్మబోధలు చేసి ఏకచక్రపురమున బ్రహ్మణ వృత్తియందు వుండమని ఆజ్ఞాపించెను. అంతే కాకుండా భీముని హిడింభతో వివాహమును, ద్రుపుద పుత్రిక పాండవుల ఇల్లాలు అగుట వంటి ఎన్నో విషయాలు పాండవులకు ముందుగానే తెలియజేసెను. పాండవులను ఇబ్బంది పెట్టు ఆలోచనలతో ఉన్న దుర్యోధనాదులను నిందించి వ్యాసుల వారు దృత రాష్ట్రుల వారికి బుద్ది చెప్పారు. అంతే కాకుండా పాండవులకు ప్రతిస్మృతి విద్యను ఉపదేశించి తద్వారా వారు మంచి తపోధనులయి ఎన్నో అస్త్రశత్రములను సంపాదించుటకు మూల కారణమయ్యిరి.

దృతరాష్ట్రునికి సంజయుని ద్వారా కురుక్షేత్ర సంగ్రామంలో జరుగు ప్రతి అంశము యధాప్రకారం తెలియునటుల కరుణించి రాబోవు యుద్ధంలో పాండవపక్షం వారు మాత్రమే జయింతురని తెలియజేసిరి. యుద్ధసమయంలో పాండవులను తరచుగా కలిసి వారిని ప్రోత్సహించిరి. అభిమన్యుని మరణానంతరము సువర్ణష్టీ వ్యాదుల కథను ఎరిగించి వారికి దుఃఖోపశమనము కలిగించిరి. నారాయణాస్త్రం కృష్ణర్జునుల ఎడ వృధా అవ్వగా అందుకు చింతించుచున్న అశ్వత్థామకు దాని వివరం తెలిపిరి. నారాయణుడు శివుని గూర్చి తపమొనర్చి సకల శాస్త్రములను గాంచి చావు లేకుండా వరము అందుకున్నట్లు అతడే శ్రీ కృష్ణుడని అతని అంశయే అర్జునుడని తెలియ జేసెను. కురుక్షేత్రానంతరము పుత్రశోకమున దృతరాష్ట్రుడుపాండవులను శపించునేమో అని వ్యాసుడు దృతరాష్ట్రుని కడకు పోయి ఉపశమనమునకు ధర్మభోధ చేసెను. కొంతకాలం తర్వాత దృతరాష్ట్ర, విదుర, గాంధారీ, కుంతీ వీరు వానప్రస్థంలో నుండగా వ్యాసమహర్షి తన తపఃప్రభావముచే రణమృతులయిన వీరులందరిని చూచి సంభాషించిరి.

వేదములను విభాగములుగా చేసి ఋగ్వేదము "పైలుని" ద్వారాను యజుర్వేదము "వైశంపాయనుని" ద్వారాను సామవేదమును "జైమిని"ద్వారాను అధర్వణ వేదమును "సుమంతుని" ద్వారా వ్యాపింప చేసెను. తాను రాసిన పురాగేతి హాసములు రోమ మహర్షి పుత్రుడు "సూతుని" ద్వారా వ్యాపింప చేసెను. ఈ విధముగా వ్యాసుల వారు తన శిష్యుల ద్వారా వేద పురాణాలను తన శిష్యుల ద్వారా ప్యాపింప చేసిరి.

వ్యాస మహర్షి పుత్రార్ధియై ఈశ్వరుని గూర్చి తపస్సు చేసిరి. శివుడు అనుగ్రహించెను. వ్యాసుడు ఒకనాడు అరనని మధించుచుండగా "ఘతాచి" అను అప్సరస గోచరమయ్యెను అంతట వ్యాసులవారు కామమోహితుడయి వుండెను. అరణిని మధించుచున్న వ్యాసునికి శుక్రము జారి అరణి యందు పడెను. అందుండి "శుక మహర్షి"పుట్టెను. కుమారునికి వ్యాసుల వారే వేద శాస్త్రములు నేర్పిరి. ముక్తి మార్గము మాత్రము జనకుని దగ్గర నేర్చుకోమని పంపెను. వ్యాసుడు ఒకనాడు కాశీ పట్టణంలో భిక్ష లభింపక ఆకలికి తట్టుకోలేక కాశీ జనులను శపింప సంకల్పింపగా పార్వతి దేవి అది గమనించి ఆయన క్షుద్భాధను తీర్చి-నీవు కాశీ జనులను శపింప దలచినావు కావున నీకు కాశీ నివాస యోగ్యం లేదని చెప్పి వెళ్ళమనెను. వ్యాసుల వారు తన తప్పులను క్షమింపమని అడుగగా నీవు అష్టమినాడు చతుర్ధశినాడు కాశీవిశ్వేశ్వర దర్శనం చేసుకోమని వరమిచ్చెను.
రాబోవు సూర్యపావర్ణి మన్వంతరములో వ్యాసుడు సప్తఋషులలో ఒకడు.