అక్టోబర్ 13నే విజయదశమి
భక్తి సమాచారం
అక్టోబర్ 13నే విజయదశమి
ఈ సంవత్సరం విజయదశమి పర్వదినం అక్టోబర్ 13వ తేది ఆదివారం నాడే ఆచరించాలి. 14వ తేది ఆచరించకూడదు. దీనికి సంబంధించిన ధర్మశాస్త్ర నిర్ణయాలను పాఠకులు, పండితులు గమనించి, ఆకళింపు చేసుకుని అక్టోబర్ 13న విజయదశమిని ఆచరించండి.
దినద్వయే అపరాహ్ణవ్యాపిత్యే శ్రవణర్క్షం యోగే పూర్వాకార్యా
యదా పూర్వస్మిన్ దినే అపరాహ్ణ వ్యాప్తి విశిష్ట
దశమ్యాం శ్రవణాభావః పరేద్యు ఉదయమాత్ర కాల వ్యాపినీ
దశమి శ్రవణ ర్క్షంయుతా చేత తదా పరాగ్రాహ్య - ధర్మసింధు
1. దశమి తిథి రెండు రోజులు ఉండి, రెండవరోజున అపరాహ్ణములో దశమి తిథి ఉన్నచో రెండవరోజే విజయదశమి
2. దశమి తిథి రెండు రోజులలోను అపరాహ్ణ సమయములో ఉండి శ్రవణానక్షత్రము ఉన్ననూ, లేకున్ననూ ముందురోజే విజయదశమి.
3. రెండు రోజులలో దశమి తిథి అపరాహ్ణంలో లేని యెడల, శ్రవణయోగము రెండురోజులలో ఉన్ననూ, లేకున్ననూ ముందురోజే విజయదశమి.
4. దినద్వయమందు అపరాహ్ణవ్యాప్తి ఉన్న పక్షములలో, ఏ రోజున శ్రవణయోగంతో కూడిన దశమి తిథి అపరాహ్ణంలో ఉండునో... అదే విజయదశమి.
5. ముందురోజు దశమి తిథి అపరాహ్ణ వ్యాప్తి కల్గి, రెండవ రోజు సూర్యోదయం తదుపరి దశమి తిథికి మూడు ముహూర్తముల కాలం శ్రవణా నక్షత్రం కలిసి ఉన్నచో పరదినమే విజయదశమిని ఆచరించాలి.
ఇయమేవ విజయదశమి సాచద్వితీ యదినే శ్రవణయోగా భావే పూర్వాగ్రాహ్య
దశమ్యాంతు నరైః సమ్యక్ పూజనీ యా పరాజితా ఐశానీం దిశమాశ్రిత్య అపరాహ్ణె ప్రయత్నతః - నిర్ణయసింధు
6. దశమి తిథికి రెండవరోజున శ్రవణనక్షత్ర యోగం లేకపోతే పూర్వపు రోజు గ్రహించాలి. జనులు దశమి తిథి యందు అపరాహ్ణ కాలములో ఈశాన్య దిక్కు నాశ్రయించి అపరాజితాదేవిని ప్రయత్న పూర్వకంగా పూజించాలి.
అశ్వినే శుక్ల పక్షేతు దశమ్యాం పూజయేన్నరః
ఏకాదశ్యాంచన కుర్వీత పూజనంచా పరాజితం
ఇతి యదాతు పూర్వ దినే శ్రవణ యోగాభావః పరదినే చాల్పాపితద్యోగినీ, తదా పరైవ తధా చ - నిర్ణయసింధు
7. ఆశ్వీజ శుక్ల దశమి తిధిన అపరాజితాదేవిని అర్చించాలి. ఏకాదశి నాడు అర్చించకూడదు. మొదటిరోజు శ్రవణం లేక, పరదినమందు కొద్దిగా శ్రవణ యోగం ఉన్నప్పుడు పరదినమే విజయదశమిని ఆచరించాలి.
అపరాహ్ణె పరదినే అపరాహ్ణె శ్రవణాభావేతు సర్వ పక్షేషు పూర్వైవ - నిర్ణయసింధు
8. శ్రవణా నక్షత్ర యోగంతో కూడిన అపరాహ్ణ వ్యాప్తి కల్గినదే విజయదశమి. రెండవ రోజు అపరాహ్ణకాలములో శ్రవణ యోగంలేనిచో ముందురోజే అన్నీ రకములుగా విజయదశమిని ఆచరించాలి. ఈ ఎనిమిదవ పాయింట్ ప్రకారం శ్రీ విజయలో విజయదశమి నిర్ణయానికి వర్తిస్తుంది.
దృగ్గణితరీత్యా 13 ఆదివారం దశమి తిధి మధ్యాహ్నం 1గం. 18ని. లకు ప్రారంభమై 14 మధ్యాహ్నం 11గం.16ని.లకు వెళ్ళిపోతున్నది. శ్రవణా నక్షత్రము 13 ఉదయం 6 గం.22ని.లకు ప్రారంభమై 14 సూర్యోదయం లోపలే 5గం.01ని.నకు శ్రవణం వెళుతుంది. 13 ఆదివారం దశమి మరియు శ్రవణా నక్షత్రమునకు అపరాహ్ణవ్యాప్తి కలదు. 14న శ్రవణా నక్షత్రం లేదు. పైన ఉదహరించిన ధర్మసిందు, నిర్ణయసింధు వంటి ప్రామాణిక ధర్మశాస్త్రాల నిర్ణయానుసారం ఇచ్చిన 8 పాయింట్లలో చివరి పాయింట్ ప్రకారం దృగ్గనితరీత్యా 13 అక్టోబర్ విజయదశమిని జరుపుకోవాలి. 14వ తేది సోమవారం విజయదశమి జరుపుకొనుటకు శాస్త్ర విరుద్ధము