కురుక్షేత్రము
Jaji Sarma
కురుక్షేత్రము
కురుక్షేత్రము గురించి మిత్రులు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో తెలియదు.
నాకు తెలిసిన కురుక్షేత్రము గురించి వివరిస్తాను.
కురుక్షేత్రము చాలా గొప్ప పుణ్యక్షేత్రము. మన భారత రాజధాని డిల్లీపట్టణమునకు ఉత్తరముగా వెలయుచున్నది. మహాభారతములోని వనపర్వమున, 83వ అధ్యాయమునందును, శల్యపర్వమున 53వ అధ్యాయమునందును ఈ కురుక్షేత్రము యొక్క మహిమను గురించి చాలా చక్కగా తెలుపబడియున్నది. పూర్వము బహ్మదేవుడు, ఇంద్రుడు, అగ్ని, మున్నగు వారు ఇక్కడ తపస్సు చేశారని మన పురాణములు తెలుపుచున్నవి. కౌరవులకు, పాండవులకు మూలపురుషుడైన కురుమహారాజు, కురుమహారాజు ఈ పుణ్యస్థలమున అనేకానేకమైన ధర్మకార్యములాచరించెను. ఒకానొక సమయమున కురు భూపాలుడు ఆ ప్రదేశమును దున్నుటచేత దానికి కురుక్షేత్రము అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రమున ఎవరు తపస్సు చేయుదురో లేక మరణించుదురో వారుత్తమలోకములు వెళ్ళుదురని ఇంద్రుడు కురునకు వరమిచ్చెను. పరశురాముడు కూడా ఇక్కడే పితృతర్పణము గావించియుండెను. ఎందరో మహనీయులా స్థలమున పెక్కు ధర్మకార్యములాచరించి యుండిరి. కాబట్టి అది ధర్మక్షేత్రము అయినది. అందుకనే తన కుమారులు ఆ ధర్మక్షేత్రములో ప్రవేశించి దయాది సద్గుణములుధ్బవించి యుద్దమాగిపొవునేమోననే కుశంకతోనే దృతరాష్ట్రుడు కురుక్షేత్రములో "వారేమి చేసిరి" అని ప్రశ్న వేశాడు.
పైగా ఇంతటి మహత్తుకల పుణ్యక్షేత్రము కావుననే దుష్టశిక్షణ భగవానుడు చేయ సంకల్పించాడు. హిందూధర్మమున అతి పవిత్రమయిన శ్రీమద్భగవద్గీత ఉద్భోద ఇక్కడే శ్రీకృష్ణభగవానులు చేశారు.