Tuesday, 15 October 2013

షణ్ముఖుడు

Bharadwaja Chadalavada
షణ్ముఖుడు
షణ్ముఖుడు అనగా కుమారస్వామి శివ పార్వతుల తనయుడు.వినాయకుని తమ్ముడు. దేవతల సేనాధిపతి. ఈయనకే 'స్కందుడు' అని, 'కార్తికేయుడు' అని, 'శరవణుడు' అని, 'సుబ్రహ్మణ్యుడు' కూడా పేర్లున్నాయి. ఈయన వాహనము నెమలి. స్కంద పురాణంలో ఈయన గాధ వివరంగా ఉన్నది. ఇతన్ని కొలిచే పర్వదినం సుబ్రహ్మణ్య షష్టి ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి రోజు జరుపుకొంటారు.
నెమలి వాహనంతో కుమారస్వామి
ఈయన బ్రహ్మచారి అని కూడా చెబుతారు. ఒక రోజు కార్తికేయుడు ఒక పిల్లిని గిల్లితే ఆయన తల్లికి బుగ్గ మీద గాయమయ్యిందట.జగజ్జనని, "నాయనా! ఈ ప్రపంచములోని ప్రతి ప్రాణిలోనూ నేను వున్నాను, నేను కానిది వేరే లేదు, ఈ సృష్టి అంతా నేనే ! అందువల్ల నువ్వు ఎవరిని గాయపరచినా నన్ను గాయపరచినట్లే అని చెప్పింది. అది విన్న కార్తికేయుడు పెళ్ళి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. అందరు స్త్రీలలోను తన తల్లి మూర్తీభవించి ఉంది కనుక తాను ఇక ఎవరినీ పెళ్ళాడలేను అనుకుని కార్తికేయుడు బ్రహ్మచారి గా వుండి పోయాడట.
సురాపద్ముడు, సింహముఖుడు, తారకాసురుడు అనే రాక్షసులు లోకకంటకులై దేవతలనూ, మానవులనూ బాధిస్తున్నారు. శివపార్వతుల ఔరస కుమారుడే వీరిని చంపగలడని బ్రహ్మ తెలిపాడు. తన పూలబాణాలతో శివుని తపస్సు భంగముచేసి ప్రణయములోనికి దింపాలని ప్రయత్నించిన మన్మధుడు శివుని కోపాగ్నికి భస్మమయ్యాడు. శివునినుండి వెలువడిన దివ్యతేజస్సు ఆరుభాగాలుగా విభజింపబడింది. వాటిని వాయువు, అగ్ని దేవుళ్ళు గంగానదిలో ఉంచారు. అవి ప్రవాహంలో వెళ్ళి ఒక వనంలో శరంలో (రెల్లుగడ్డిలో) చిక్కుకొని ఆరు చక్కని బాలురుగా మారాయి. వాటికి కార్తీక నక్షత్ర దేవతలు జోలపాడారు. విషయం తెలిసిన పార్వతి 'స్కందా' అని పిలుస్తూ వారిని అక్కున చేర్చుకోగా వారు ఆరు ముఖాలూ, 12 చేతులూ గల ఒకే బాలునిగా అవతరించారు. అందుకే ఆయనకు అన్ని పేర్లు వచ్చాయి
షణ్ముఖుడు - ఆరు ముఖాలు గలవాడు
స్కందుడు - పార్వతి పిలచిన పదాన్ని బట్టి
కార్తికేయుడు - కృత్తికా నక్షత్ర సమయంలో అవతరించాడు
వేలాయుధుడు - శూలము ఆయుధంగా గలవాడు
శరవణభవుడు - శరములో అవతరించినవాడు
గాంగేయుడు - గంగలోనుండి వచ్చినవాడు
సేనాపతి - దేవతల సేనానాయకుడు
స్వామినాధుడు - శివునకు ప్రణవ మంత్రము అర్ధాన్ని చెప్పినవాడు
సుబ్రహ్మణ్యుడు - బ్రహ్మజ్ఙానము తెలిపినవాడు

శ్రీ వల్లీ దేవ సేన సమేతులైన కుమారస్వామి .
దేవతల కోరిక మేరకు ఈయన సురపద్ముని, సింహముఖుని, తారకాసురుని వధించాడు. ఈయనకు వల్లి, దేవసేన అను ఇద్దరు భార్యలు ఇచ్ఛాశక్తికి, క్రియాశక్తికి స్వరూపాలు. వినాయకుడు నారదునికి కృత్తికావ్రతము ఆచరించమని బోధించాడంటారు.
తత్వార్ధాలు

షణ్ముఖుడి ఆరు ముఖాలు పంచ భూతాలను + ఆత్మను సూచిస్తాయంటారు. ఇంకా అవి యోగ సాధకులకు షట్చక్రాలకు సంకేతాలు. తెలుగునాట సుబ్రహ్మణ్య షష్ఠి ఒక ముఖ్యమైన పండుగ. తమిళనాట మురుగన్ దేవాలయాలు, పేర్లు,
ప్రార్ధనలు

"సుబ్రహ్మణ్యాష్టకము" నుండి
హే స్వామినాథ కరుణాకర దీనబంధో,
శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో |
శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||

దేవాదిదేవనుత దేవగణాధినాథ,
దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద |
దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||

నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్,
తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ |
శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||

క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల,
పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే |
శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||

దేవాదిదేవ రథమండల మధ్య వేద్య,
దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తమ్ |
శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||

హారాదిరత్నమణియుక్తకిరీటహార,
కేయూరకుండలలసత్కవచాభిరామ |
హే వీర తారక జయాౙ్మరబృందవంద్య,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||

పంచాక్షరాదిమనుమంత్రిత గాంగతోయైః,
పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః |
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||

శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా,
కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తమ్ |
భక్త్వా తు మామవకళాధర కాంతికాంత్యా,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||

సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః |
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః |
సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మకృతం పాపం తత్‍క్షణాదేవ నశ్యతి ||
దేవాలయాలు

తిరుప్పరంకుండ్రం
తిరుచెందూర్ [1]
పళని
స్వామిమలై
తిరుత్తణి
పలముతిర్‌సొలై