Friday 16 November 2012


మన సంస్కృతిలో దీపారాధన అనేది ప్రధానాంశం. ఈ దీపారాధన పూజామందిరమందు, దేవాలయములో గృహప్రాంగణములలో, తులసీ బృందావనమందు, మారేడు, రావి వంటి దేవతా వృక్షాల వద్ద, పుణ్య నదీతీరములందు ప్రాతః కాలమందు, మరియు సంధ్యా సమయమందు వెలిగించుట అత్యంత పుణ్యప్రదమని పురాణాలు వర్ణించి చెబుతున్నాయి.

కార్తీకే తిలతైలేన సాయంకాలే సమాగతే, ఆకాశదీపం యో దద్యాత్ మాసమేకం హరిం ప్రతి,మహతీం శ్రియమాప్నోతి రూప సౌభాగ్య సంపదం(నిర్ణయ సింధు)

సంకల్పం: అహం సకల పాపక్షయపుర్వకం శ్రీ రాధా దామోదర ప్రీతయే అద్య ఆరంభ కార్తీక అమావాస్యా పర్యంతం యథా శక్తి ఆకాశ దీపదానం కరిష్యే.

అని దీపం వెలిగించిన తరువాత ఈక్రింది శ్లోకం చదువుతూ నమస్కారం చేయాలి.

దామోదరాయ నభసి తులాయాం లోలయా సహా,
ప్రదీపం తే ప్రయచ్చామి నమో అనంతాయ వేధసే (నిర్ణయ సింధు)

ఇలా రోజూ చేయడం కుదరని పక్షంలో మాసాంతంలోని చివరి మూడు రోజులు చేసిననూ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ది కలుగుతుంది

Shared from Goda Kannaiah garu

Wednesday 14 November 2012


  • పద్మ పాదుడు!

    పద్మ పాదాచార్యుల వారు ఆది శంకరాచార్యుల వారి నలుగురు ప్రధాన శిష్యులలో ఒకరు. వీరి జీవిత చరిత్రకు సంబంధించి అనేక ఆశ్చర్య కరమైన సంఘటనలు, ఆది శంకరాచార్యులవారి జీవితంతో ముడి వేసుకుని వున్నవి, ప్రసిద్ధమైనవి వున్నాయి! ఆది శంకరాచార్యుల వారు తమ తల్లికి ఒక మాయా మయమైన మొసలి తనను పూర్ణా నదీ స్నానానికి వెళ్ళినప్పుడు పట్టుకున్నట్లు భ్రమ కల్పించి, ఇక తను బయట పడడం అసంభవం అని, తనకు సన్యాసం తీసుకొనడానికి అనుమతి ఇవ్వమని అభ్యర్ధించి, తల్లి అనుమతితో జందెమును తీసివైచి సన్యాసం స్వీకరించిన తర్వాత, ఆ మాయ మొసలి మాయమైపోయి, ఆది శంకరుడు వొడ్డుకు వచ్చి, తల్లికి నమస్కరించి, ఉత్తర భారతానికి వెళ్లి, గోవింద భగవత్పాదా చార్యుల వారి శిష్యరికం చేసి, అక్కడినుండి కాశి కి వెళ్ళినప్పుడు, ఎక్కడో దక్షిణా పథాన చివర వున్న కేరళ నుండి విష్ణు శర్మ అనే నంబూద్రి బ్రాహ్మణ యువకుడు ఆది శంకరుడిని వెదుక్కుంటూ కాశీ కి చేరుకున్నాడు. ఆది శంకరాచార్యులవారు అతనిని శిష్యునిగా చేసుకుని, సన్యాసం ఇచ్చి, 'సనందనుడు' అనే సన్యాసాశ్రమ నామధేయాన్ని ఇచ్చారు. ఆది శంకరాచార్యులవారు ప్రధమంగా దీక్షను ఇచ్చింది ఈయనకే! ఈయన ఒక నాటి సాయంత్రం నదికి అవతలి వొడ్డున గురువు గారు అప్పజెప్పిన పనిలో వుంటే..సాయం సమయ బోధకు సమయం దాటి పోతున్నదని మిగిలిన శిష్యులు త్వర పడుతుంటే, పెడుతుంటే, ఆది శంకరాచార్యులవారు నది ఇవతలి వొడ్డు నుండి సనందనుల వారికి రమ్మని చేతితో సంజ్ఞ చేస్తే, గురువు గారు రమ్మన్నారనే ఆత్రుతతో ఈయన నదిలో కాలు వేసిన ప్రతి చోట..ఒక పెద్ద పద్మం మొలచి..ఈయన నీటిలో మునిగి పోకుండా కాపాడుతుంటే, అలా గంగా నదిలో పద్మముల మీద నడుస్తూ ఇవతలి వొడ్డుకు వచ్చి, గురువు గారి పదములకు వందనం చేశారు ఆనంద బాష్పాలతో! ఆనాటినుండి పద్మ పాదాచార్యులవారు గా ప్రసిద్ది పొందారు. ఇదంతా కూడా సనందన చార్యులవారి మీద దయతో, ఆయన పట్ల అసూయను పెంచుకున్న మిగిలిన శిష్యులకు ఆయనకు వున్న గురుభక్తిని నిరూపణ చేసే ఉద్దేశంతో ఆది శంకరులు కల్పించిన ఒక అద్భుతమైన మాయ మాత్రమే!

    ఆది శంకరులను ఆశ్రయించక మునుపు ఆయన విష్ణు శర్మగా వ్యవహరింపబడే రోజుల్లో తీవ్ర నృసింహ ఉపాసకులు. తిరుమల కొండ శిరస్సుగా, శ్రీ శైలం తోకగా వ్యాపించివున్న పర్వత శిఖరములను ఆది శేషుని అంశ అని మహానుభావులైన వైష్ణవ ఆళ్వారులు స్తుతించారు. ఆ పర్వత శ్రేణులలో వెలసిన ఒక దివ్య నృసింహ క్షేత్రం అహోబిలం! అహోబిలం సమీపాన అడవులలో విష్ణు శర్మ నృసింహ సాక్షాత్కారం కోసం తీవ్రంగా పరితపిస్తూ, తపిస్తూ, నృసింహ దివ్య నామాన్ని జపిస్తూ, దర్శనం కొరకు విలపిస్తూ ఆ అరణ్యాలను గాలిస్తూ తపస్సు చేస్తుంటే, ఒకనాడు ఒక గిరిజనుడు తపస్సులో వున్న ఈయనను చూశాడు. ఎప్పటినుండో ఈయనను ఆ నిర్జన అరణ్యాలలో చూస్తున్న కారణంగా..ఉండ బట్టలేక ఒక నాడు ఈయనను అడిగాడు..సామీ ఎవరి కోసం ఇక్కడ తిరుగుతున్నారు? అని..విష్ణు శర్మ నవ్వి..నీకు చెప్పినా అర్థం కాదులేరా..అంటే వాడు చెప్పమని పట్టుబట్టి, బ్రతిమిలాడుతుంటే..విరక్తిగా..సగం సింహం సగం మనిషి రూపం తో వున్న ఒక దివ్యమైన మూర్తి కోసం వెదుకుతున్నా..అని చెప్పాడు. ఆ గిరిజనుడు ఒక పిచ్చివాడిని చూసినట్లుగా ఈయనను చూసి నవ్వి..ఈ అడవులలో పుట్టినప్పటినుండీ తిరుగుతున్నా.. మీరు చెప్పినటువంటి ఆకారం వున్న జంతువు ఎన్నడూ కనపడ లేదు..అసలు అలాంటిది ఉండదు అని వాదించాడు. విష్ణు శర్మ వారు వాడికి నృసింహ రూప వర్ణన చేసి..నమ్మబలికాడు..ఎందరో మహానుభావులు ఆ దివ్య రూపాన్ని చూశారు అని నిశ్చయంగా చెప్తే..వాడు..సరే! ఈ అడవులన్నీ గాలించి అయినా సరే..అలాంటిది ఒకటి అంటూ వుంటే కట్టేసి మీ దగ్గరికి తెస్తా సామీ ! అని వెళ్ళిపోయాడు. తదేక ధ్యానంతో, పట్టుదలతో, విష్ణు శర్మ వారి పలుకుల మీది నమ్మకంతో... వాడు రాత్రనకా, పగలనకా వెదుకుతుంటే వాడికి నృసింహుడు దర్శనమిచ్చాడు.ఆ అమాయక గిరిజనుడు 'తస్సాదియ్యా..ఎన్నాళ్ళకు దొరికావే...బాపనయన నిజమే చెప్పాడు!' అని ఆ నృసింహ మూర్తిని లతలతో కట్టేసి, లాక్కుంటూ విష్ణు శర్మ వారు తపస్సు చేసుకుంటున్న స్థలానికి తీసుకు వచ్చాడు! అల్లంత దూరం నుండే భీకరమైన ధ్వనులు, సింహ గర్జనలు, ఆటవికుడి అదలింపులు వింటున్న విష్ణు శర్మ వారికి..వాడు వుట్టి లతలను లాక్కుంటూ వచ్చినట్లు కనిపించింది కానీ..నృసింహ మూర్తి దర్శనం ఇవ్వలేదు. ఆ గర్జనలు, భీకరమైన ధ్వనులు మాత్రం వినిపిస్తూనే వున్నాయి! ''ఇదిగోండి సామీ..దీని తస్సా దియ్యా..నానా యాతన పెట్ట్టింది..ఇక దీన్ని తీసుకొని ఇంటికెళ్ళి పొండి..ఈ అడవులలో తిరక్కుండా..'' అని వాడు అంటుంటే..ఆవేదనతో, ఆర్తి తో..రోదిస్తూ 'స్వామీ ఈ గిరిజనుడికి కూడా పట్టుబడి దర్శనమిచ్చిన నువ్వు... నీకై ఇంత సాధన, ఇంత పరితాపం చెంది నేను ప్రయత్నిస్తే నన్ను కరుణించక పోవడం న్యాయమా..ఇక నా జన్మ ఎందుకు?' అని ఆత్మ త్యాగం చేసుకొనబోతుంటే, దివ్య నృసింహ మూర్తి 'వీడు కోటి జన్మలలో కూడా సాధ్యం కాని తీవ్రమైన ఏకాగ్రతను ఒక్క నీ బోధతోనే సాధించాడు..కనుక పట్టుబడ్డాను..నీకు మంత్ర సిద్ది కలిగింది..ఎప్పుడు నీవు అవసరమై నన్ను స్మరిస్తే అప్పుడు నీ కోర్కె నెరవేరుస్తాను..ఈ జన్మకింతే ప్రాప్తం..ఈ జన్మ అనంతరం నీవు నా సన్నిధిని చేరుకుంటావు' అని తన పలుకులను మాత్రం వినిపించాడు, కనిపించకుండా! ఆ గిరిజనుడికి నమస్కరించి, స్వామిని ధ్యానిస్తూ వెళ్ళిపోయిన విష్ణు శర్మ అనంతర కాలంలో ఆది శంకరుల శిష్యుడై, ఆయనకు కొందరు ప్రయోగం చేసి తీవ్రమైన 'భగ రంద్ర' వ్యాధిని కలిగిస్తే, తన మంత్ర శక్తి తో దాన్ని నయం చేసి ఆయనను రక్షించారు!

    ఉభయభారతిని జయించిన అనంతరం, దక్షిణా పథానికి పయనమైన ఆది శంకరాచార్యుల వారు శ్రీ శైలం సందర్శించి..అక్కడి గుహలలో తపస్సు చేస్తూ, శివానంద లహరి, సౌందర్య లహరి, భ్రమరాంబ అష్టకం మొదలైన దివ్య స్తోత్రాలను వెలువరించి, తమ భాష్యాల ఉపదేశాలు కూడా చేశారు. శ్రీ శైల పరిసర ప్రాంతాలు తీవ్రమైన కాపాలిక మత ఉపాసనా కేంద్రాలు, ఆ నాడు, ఈ నాడు కూడ! తీవ్రమైన అనాచారాలతో, దురాచారాలతో హింసాత్మకమైన ఉపాసనా విధానమైన కాపాలిక మతానుయాయులను ఆది శంకరులు తమ బోధనలతో అనేకులను తమ శిష్యులుగా చేసుకుని ఆ మతానికి చెందిన వారిని ఆగ్రహానికి, నిస్ప్రుహకూ గురి చేశారు! ఒక నాడు కాపాలిక మతాచార్యు డొకరు ఆది శంకరుల వారిని వంచనతో వినయం గా సమీపించి ఒక వరదానమిమ్మని అడిగాడు. సరేనన్న ఆది శంకరులతో తన తపస్సిద్దికై మహా చక్ర వర్తిని గానీ, మహా జ్ఞానిని గానీ స్వచ్చందంగా ముందుకు వచ్చిన వారిని బలి ఇవ్వాలనీ..చక్రవర్తిని ఎవరినీ వోప్పించడం సాధ్యం కాదు కనుక, ఆది శంకరుల కన్నా జ్ఞాని ఎవరుంటారు కనుక ఆది శంకరులను బలికి అంగీకరించమని వేడుకుంటే..భోళా శంకరుని ప్రతి రూపమైన ఈ ఆది శంకరుడు సరే అని, మర్నాడు, తన శిష్యులు ఎవరూ గమనించకుండా వచ్చి తన పని పూర్తి చేసుకొమ్మని ఆది శంకరులు చెప్తే, ఆ కాపాలికుడు సంతోషం గా వెళ్లి, మర్నాడు ఉదయమే, తన తీవ్ర క్షుద్ర పూజలు ముగించుకుని, సురాపానం చేసి, గండ్ర గొడ్డలిని ధరించి వచ్చాడు. పద్మ పాదుల వారు ఎక్కడ వున్నా ఆయన దృష్టి, మనసు సర్వం ఆది శంకరుల మీదే ఉండేదిట. గండ్ర గొడ్డలిని ధరించి వస్తూన్న కాపాలికుడిని అల్లంత దూరం నుండే చూసి ఏదో జరుగ కూడనిది జరుగ బోతున్నదని అనుమానించి ఆయన పరుగున ఆది శంకరుల సన్నిధికి చేరుకుంటుంటే, తమ ధ్యానాన్ని ముగించిన ఆది శంకరులు కాపాలికుడికి అంగీకార సూచకంగా తలను ఊపి కనులు మూసుకున్నాడు. కాపాలికుడు తన గండ్ర గొడ్డలిని పైకెత్తి ఆది శంకరుల వారి శిరస్సును ఖండించబోతుంటే..పద్మ పాదుల వారు సమయం లేదని గ్రహించి..నృసింహ మంత్రాన్ని పఠించి స్వామిని ప్రార్ధిస్తే..ఉగ్ర నరసింహుడు పద్మ పాదులవారి శరీరం పై పూని..వుట్టి చేతులతో..గోళ్ళతో..ఆ కాపాలికుడిని చీల్చి ముక్కలు ముక్కలు చేసి..వాడి ప్రేవులను ధరించి మహోగ్రుడై ప్రళయం సృష్టిస్తుంటే..అప్పటికి..ఆ కాపాలికుడి మంత్ర కట్టు విడిపోయి..కనులు తెరచిన ఆది శంకరులు నృసింహ శాంతి మంత్రాలతో పద్మ పాదాచార్యులవారిని శాంతింప జేయాల్సి వచ్చింది. ఆ రకంగా మరొక సారి ఆది శంకరుల వారిని ప్రాణాపాయం నుండి పద్మ పాదాచార్యుల వారు రక్షించి హైందవ ధర్మానికి మహోపకారం చేశారు! 

    అనంతర కాలంలో పద్మ పాదాచార్యుల వారు శంకరాచార్యుల వారి బ్రహ్మ సూత్రాల భాష్యానికి 'పంచ పాదిక' అనే టీకా వ్రాసి, గురువు గారికి వినిపిస్తే, ఆది శంకరాచార్యుల వారు..తదేక ధ్యానంతో ఆ టీకా ను సమగ్రం గా విన్నారు. ఆది శంకరుల దక్షిణ దేశ యాత్రల సందర్భంగా ఆయనతోనే వున్న పద్మ పాదాచార్యులవారు రామేశ్వర సమీపంలోని, పూర్వాశ్రమంలోని తమ మేన మామ గారి ఇంటికి వెళ్లారట, వారి ఆహ్వానం మేరకు. ఆ మేనమామ మీమాంసా శాస్త్రం లో ఉద్దండ పండితుడు. తన మేనల్లుడికి ఈర్ష్యతో మతి మరపు మందు పెట్టి ఆయనను ఉన్మత్తుడిని, అజ్ఞానిని చేసి, అంతటితో ఊరుకోకుండా 'పంచ పాదిక' గ్రంధాన్ని అగ్నిలో ఆహుతి చేశాడట. విషయం గ్రహించిన శంకరాచార్యుల వారు తన మహిమతో శిష్యుని మామూలుగా చేసి, అంతకు ముందు తాము అతను పఠిస్తుంటే విన్న 'పంచ పాదిక' గ్రంధాన్ని ఆసాంతం తిరిగి అప్ప జెప్పి..మరలా ఆ గ్రంధాన్ని లిఖింప జేశారు. ఇప్పుడు ఆ గ్రంధంలో కేవలం నాలుగు సూత్రాలకు మాత్రమే టీకా దొరుకుతున్నదని శంకరుల అనుయాయుల ఉవాచ! పద్మ పాదుల వారి చేత శంకరాచార్యుల వారి తల్లి బదరీ క్షేత్రంలోని దేవాలయానికి ధనం పంపించిందని దానితో దేవాలయ కార్యక్రమాలను పూర్తి చేశారని కూడా శంకర విజయాలు చెప్తాయి! అనంతర కాలంలో పూరీ జగన్నాధ పీఠానికి అధిపతి గా పద్మ పాదాచార్యుల వారు ఆది శంకరుల సేవా మార్గంలో ధన్య జీవిగా తనువు చాలించారు! అంతే కాదు..వ్యాస మహర్షి శంకరాచార్యుల వారి భాష్యాన్ని వినాలని వృద్ధ బ్రాహ్మణ రూపం తో వచ్చి వాదనకు దిగితే..ఇరువురి మధ్య తీవ్రమైన చర్చ జరుగుతుంటే, ఆది శంకరుల భాష్యానికి వంద ఉపమానాలతో ఖండన చేసిన వ్యాసుల వారి వాదాన్ని ఒక వేయి ఉపమానాలతో ఆది శంకరుల వారు ఖండించి, నాలుగు రొజుల పాటు విరామం లేకుండా, ఆసనాల మీది నుండి లేవ కుండా వాదం ప్రతివాదం జరుగుతుంటే..ఆ వచ్చిన వారెవరో ముందుగా గ్రహించినది పద్మ పాదాచార్యుల వారే. వాదం లో వున్న ఇరువురి మధ్యన నిలబడి..వినయంగా నమస్కరించి..తమరు సాక్షాత్తూ నారాయణాంశా సంభూతులైన బాదరాయణులు..నా గురుదేవుడు సాక్షాత్తూ కైలాస వాసి ఐన పరమ శివుడు..శివ కేశవుల వాదానికి కింకరుడనైన నేనేమి చేయగలను? అని పలికితే ఆది శంకరుల వారు అప్పుడు తమ ఎదురుగా వున్నది వ్యాసుల వారే అని తెలుసుకుని వందనం చేశారుట!

    జయ జయ జయ శంకర!!! 


    -వర ప్రసాద్

Tuesday 13 November 2012

గీర్వాణ వాణి 

శతేషు జాయతే శూర: , సహస్త్రేషు చ పండిత: 
వక్తా దశసహస్త్రేషు , దాతా భవతి వా న వా .

వందలమందిలో ఒక శూరుడుంటాడు. వేలమందిలో ఒక పండితుడు ఉంటాడు.పదివేలమందిలో ఒక వక్త (విశేషంగా మాట్లాడేవాడు)ఉంటాడు. కానీ, నిజమైన దాత ఉంటాడో ఉండడో !
కార్తీక స్నాన విధి:

కార్తీకేహం కరిష్యామి ప్రాతః స్నానం జనార్ధన!
ప్రీత్యర్ధం దేవ దేవేశ దావెూదర మయా సహా!!

అని శ్లోకాన్ని జపిస్తూ ప్రతి రోజూ ఉదయాన్నే చన్నీటి స్నాన మాచరించాలి.
ఆ తరువాత ఈ క్రింది మంత్రములు చదువుతూ సూర్యునికి అర్ఘ్యమును ఈయవలెను.
"మయా కృత కార్తీక స్నానాంగం అర్ఘ్య ప్రాదానం కరిష్యే
వ్రతినః కార్తికే మాసి స్నానస్య విదివన్మమ, ఘ్రుహానార్ఘ్యం మయా దత్తం దనుజేంద్ర నిషూదన - శ్రీ కృష్ణాయ నమః ఇదం అర్ఘ్యం

నిత్య నైమిత్తికే కృష్ణు కార్తికే పాపనాశనే, ఘ్రుహానార్ఘ్యం మయా దత్తం రాధాయా సహితో హరే - శ్రీ హరయే నమః ఇదం అర్ఘ్యం

అనేన అర్ఘ్య ప్రదానేన శ్రీ హరిః ప్రీయతాం"

Shared from Goda Kannaiah garu

Monday 12 November 2012




ఆశ్వయుజ అమావాస్య - దీపావళి స్నానవిధి.

కాలము అత్యంత బలవత్తరమైనది. సనాతన ధర్మంలో కాలమే సమస్తమైనదిగా నిలబడుతుంది. అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు 'కాలః కలయతామహం' అంటాడు. నేను కాలస్వరూపంలో ఉండి లెక్కలు కట్టుకుంటూ ఉంటాను అంటాడు. వ్యాసభగవానుడు దేవీ భాగవతం చేస్తూ అంటాడు

'కాలోహి బలవాన్ కర్తా సతతం సుఖ దుహ్ఖయో:!
నరాణాం పరతంత్రానాం పుణ్య పాపానుయోగతః!!
అని. ఇవ్వాళ జీవుడు ఈ శరీరంలో ఉన్నాడు గతంలో ఏ శరీరంలో ఉన్నాడో? చేసిన పాప పుణ్యములు అనుభవము చేతనే పోవాలి. పాపము అనుభవస్వరూపముగా పోవడానికి దుఃఖము, అలాగే పుణ్యము అనుభవస్వరూపముగా పోవడానికి సుఖము, రెండిటినీ ఇవ్వాలి. అందుకే ధూర్జటి:

నిను సేవింపగ నాపదల్పొడమనీ, నిత్యోత్సవంబబ్బనీ జనమాత్రుండననీ మహాత్ముడననీ సంసారమోహంబు పై కొననీ జ్ఞానముగల్గనీ గ్రహగతుల్ కుందింపనీ,మేలు వ చ్చిన రానీ యవి నాకు భూషణములే శ్రీ కాళహస్తీశ్వరా!
అలా ఉండగలిగినటువంటి పరిణతి ఈశ్వరునియొక్క కృపవలనే సంభవం అవుతుంది. అటువంటి కాలము పరమ బలవత్తరమైనటువంటి స్వరూపము. అది ఈశ్వర స్వరూపంగా ఉండిసుఖ దుఃఖముల రూపములో పాపములను అనుభవింప చేసి దానివలన కంటికి కనపడనటువంటి ఈశ్వరుని యొక్క ప్రజ్ఞని గుర్తెరిగి ఆయన పాదములయందు నిరతిశయమైనటువంటి భక్తీ పెంపొందింపచేసుకోగలిగి కృతార్ధుడు కాగలిగినటువంటి వ్యక్తీ ధన్యాత్ముడు. అందుచేతనే ఋషులు కాలాన్ని విభాగం చేశారు. అది ఋషుల యొక్క దార్శనికత. అందుకే పుట్టుకతోనే ఋషులకు రుణపడిపోయాము మనం. ఋషిఋణం తీరాలి అంటే ఋషిప్రోక్తమైనటువంటి వాజ్ఞ్మయాన్ని చదువుకోవాలి. చదవడం రాని వారు రోజూ ఒక పుష్పం వాటిమీద ఉంచాలి. అవి చేయని నాడు ఋషిఋణం తీరదు. అటువంటి ఋషి కాలాన్ని విభాగం చేసి ఏ సమయమునందు మనం పరమేశ్వరానుగ్రహం పొందడానికి కాలము మనకి యోగ్యమైన రీతిలో ఉంటుందో నిర్ణయం చేశారు. అందుకే ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు దక్షిణాయనము, ఉత్తరాయనము అను రెండు పేర్లతో నడుస్తుంది. వీటిలో దక్షిణాయనము తక్కువని, ఉత్తరాయనము ఎక్కువని భావన చేయకూడదు. శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్ర భాష్యం చేస్తూ 'కొన్ని కొన్ని లోకముల మీదుగా జీవుడు ప్రయాణం చేస్తూ బ్రహ్మలోకంలో కొంతకాలం వాసం చేసి మహాప్రళయమందు ఈశ్వరునియందు ఐక్యం అయ్యేటువంటి స్థితి దక్షిణాయనం' అన్నారు. యదార్ధమునకు ఉత్తరాయణంకన్నా దక్షిణాయనం చాలా గొప్పది. ఎందుచేతననగాదక్షిణాయనం ఉపాసనా కాలము. పరమేశ్వరుని ఆరాధన చేయడానికి యోగ్యమైన కాలము.
ఒక మహత్తరమైన విషయాన్ని చెప్పేటప్పుడు ముందే దాని గురించి ప్రారంభం చేస్తారు. అందుకే శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి సుందరకాండ ప్రారంభానికి ముందు కిష్కిందకాండ చిట్ట చివర ఒక శ్లోకాన్ని రచన చేశారు.'సవేగవాన్ వేగసమాహితాత్మాహరిప్రవీరః పరవీరహన్తా.మనస్సమాధాయ మహానుభావోజగామ లఙ్కాం మనసా మనస్వీ'కార్తీకమాస వైభవం ఆశ్వయుజ మాసపు చిట్టచివరి తిధిలో ఉంది. ఆశ్వయుజ అమావాస్యనే ప్రేత అమావాస్య అంటారు. ప్రతి అమావాస్యకి ప్రదోష కాలానికి పితృ దేవతలు వస్తారు. అందుకే అమావాస్య సాయంకాలం అన్ని పూజలకన్నా ముందు పూజ దివిటీ కొట్టడం. ఇది మగపిల్లలు చేయాలి. ఆడపిల్లలు చేయరాదు. వారు గోగు కర్ర మీద జ్యోతి వేసి ఒత్తి వెలిగించి దక్షిణ దిక్కుగా వాటిని ఎత్తి చూపించాలి. 'నాన్నగారూ నేను వేద ధర్మాన్ని తెలుసుకున్నాను. వేద ప్రమాణమునందు గౌరవం ఉంచాను. ఇవాల్టి తిధిని నేను జరుపుకొని అలక్ష్మిని పోగొట్టుకుంటాను. నేను భగవదనుగ్రహాన్ని అంతరంగమందు పొందుతాను. జీవుడు ఉన్నతిని కొరకు. బాహ్యమునందు లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందుతాను. నేను పెద్దల వలన తెలుసుకున్నాను ఆశ్వయుజ మాస వైభవాన్ని. కాబట్టి నేను పాటిస్తాను. మీరు బయలుదేరండి చీకటి పడుతోంది కాబట్టి వెలుతురు చూపిస్తాను' అని జలతర్పణ చేయకుండా దివిటీ చూపించే తిథి ఆశ్వయుజ అమావాస్య. శరీరాన్ని మనకి ఇచ్చి తమ శరీరాన్ని విడిచి పెట్టిన పితృ దేవతలు జ్యోతిస్వరూపులై అంతరిక్షమునందు ప్రయాణం చేస్తారు. వారిని గౌరవించవలసిన అవసరం ఒక కొడుకుగా నీకు ఉంది. ఆశ్వయుజ కార్తీకములు అత్యంత ప్రమాదకరమైన నెలలు. ఉపాసనకు ఎంత గొప్పతిధులో బాహ్యమునందు అంత ప్రమాదకరమైన నెలలు. శరదృతువులో ఆశ్వయుజ మాస ప్రారంభంలో యమధర్మరాజుయొక్క దంష్ట్ర బయటికి వస్తుంది. కార్తీక మాసం చివరిలో లోపలి తీసుకుంటాడు. మళ్ళీ చైత్ర మాస ప్రారంభంలో దంష్ట్ర బయటికి వస్తుంది. వైశాఖ మాసం చివరిలో లోపలి తీసుకుంటాడు. ఆశ్వయుజ కార్తీకములలో అత్యంత ప్రధానమైనది దీపము. దీపావళి అనగా దీపముల వరుస.

దీపావళి అమావాస్యనాడు గంగ ఎక్కడున్నా మనం స్నానం చేస్తున్న నీటిలోనికి ఆవాహన అవుతుంది.

'తైలే లక్ష్మీర్జలే గంగా దీపావళి తిథౌవసేత్!
అలక్ష్మీ పరిహారార్ధం తైలాభ్యంగో విధీయతే!!

దీపావళి నాడు గంగ నీటిని, లక్ష్మి నూనెను ఆవహిస్తుంది. అందుకే నూనె రాసుకొని స్నానం చేయాలి. ఎందుకంటే లక్ష్మీ స్పర్శవల్ల అలక్ష్మీ పోతుంది. గంగ స్నానం చేత పాపరాశి ధ్వంసం అవుతుంది. ఆరోజు తప్పకుండా దీపముల వరుస వెలిగించి వాటి కాంతిలో అలక్ష్మిని తొలగగొడతారు. అంతరమందు జీవుని యొక్క ఉన్నతినీ, బాహ్యమునందు అలక్ష్మిని పోగొట్టుకొంటున్నాము అని చెప్పడానికి పెద్ద చప్పుళ్ళు చేస్తూ వెలుతురుతో కూడిన వివిధరకములైన బాణా సంచా కాలుస్తాము. బాణసంచా కాల్చడానికి కారణం నరకాసురవధ అని కాదు...'అలక్ష్మీ పరిహారార్ధం'. పితృదేవతలకు మార్గం చూపించడానికి ఇంట్లోకి వెళ్లి కాళ్ళూ చేతులూ కళ్ళూ కడుక్కొని ఆచమనం చేసి లక్ష్మీ పూజ చేస్తారు. తరువాత దీపముల వరుసలు పెడతారు. ఆకాలమందు అమ్మవారు ఉత్తరేణి చెట్టు వ్రేళ్ళయందు ప్రవేశిస్తుంది. ఈరోజు మట్టితో కూడుకున్న ఉత్తరేణి తీసుకొని స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పి తలమీదనుంచి నీళ్ళు పోసుకుంటూ ఆ ఉత్తరేణి చెట్టు యొక్క మట్టి మీద పడేట్లుగా తిప్పుకోవాలి.

ఆ సమయంలో ఒక శ్లోకాన్ని మంత్రరూపంలో చెప్తారు. మంత్ర రూపంలో చెప్తే కొంతమందికే అధికారం వస్తుంది. శ్లోక రూపంలో చెప్తే అందరూ దానిని అనుసంధానం చేసుకోవచ్చు. అందుకని ఒక శ్లోక రూపంలో మహర్షులు మనకు అందించారు.

'శీతలోష్ణ సమాయుక్తా సకంటక దళాన్వితా!
హరపాప మపామార్గా బ్రాహ్మ్యమాణ పునః పునః!!

అపామార్గా=ఉత్తరేణి చెట్టూ; శీతలోష్ణ సమాయుక్తా=మట్టి పెళ్ళలతో కూడుకున్న దానివి ఉన్నావు; నిన్ను నేను నా చుట్టూ తిప్పుకుంటున్నాను. ఎందుకంటే పరదేవతానుగ్రహము నీయందు ప్రవేశించి యమదంష్ట్ర తగలకుండా దూరంగా తొలగదోయగలవు. అందుకని నా వంటికి రక్ష పెట్టుకుంటున్నాను అమ్మవారి రూపంలో..ఏ చిన్న పాపమో అడ్డుపెట్టి నన్ను ప్రమాదంలో పడతోయకుండా పాపమును తీసి అపమృత్యువునుంచి గట్టెంకించదానికి నిన్ను నేను తిప్పుకుంటున్నాను. అందువల్ల నా పాపములను శమింపచేయి. నాకు అపమృత్యువు రాకుండా కాపాడు అని అనుకుంటూ తిప్పి పక్కన పడేస్తారు.

Friday 9 November 2012

విదురనీతి




Jaji Sarma

  • విదురనీతి
    దృతరాష్ట్రుడు " నిద్ర పట్టటం లేదు ఎమైనా మంచి వాక్యాలు చెప్పు" అడిగిన దానికి విదురుడు ఇచ్చిన బదులు విదురనీతిగా ప్రసిద్ధి పొందింది. విదురుడు " రాజా! మనిషి తనను లోకులు నిందించే పని చేయక లోక హితమైన కార్యాలు చేయాలి. పరుల సంప్దకు ఈర్ష్యపడక నలుగురితో కలిసి మెలిసి బ్రతకాలి. కోపం, పొగడ్తలకు పొంగి పోవడం , గర్వించడం, ఎంత ఉన్న అసంతృప్తి, దురభిమానం, ఏపనీ చేయక పోవడం దుర్జనుల లక్షణం. తనను పాలించే రాజును , లోకాన్నిరక్షించే భగవంతుని, కట్టుకున్న భార్యను, బంధువులను సముచితంగా ఆదరించక పోతే ఏ కార్యం సత్ఫలితాన్ని ఇవ్వదు. అవివేకులు తమను ప్రేమించే వారిని వదిలి ద్వేషించే వారి వెంట పడతారు. ఎదుటి వాడు బలవంతుడని తెలిసినా వారిని హింసిస్తాడు. ధనము, విద్య,వంశము మంచి వారికి గౌరవాన్ని అణుకుకువను కలిగిస్తే చెడ్డవారికి మదాన్ని గర్వాన్ని కలిగిస్తుంది. ఒకని బాణం శత్రువును నిర్జించ వచ్చూ లేక తప్పి పోవచ్చు కాని ఒకని నీతి శత్రువును నాశనం చేస్తుంది. తాను ఒక్కడే తినడమూ అందరూ నిద్రిస్తున్నప్పుడు ఒక్కడే ఆలోచించడం , ఒంటరిగా ప్రయాణం చేయడమూ మంచిది కాదు. లోకంలో సత్యానికి మించిన మంచి గుణం లేదు. క్షమాగుణాన్ని చేతగాని గుణంగా భావిస్తారు కాని దానికి మించిన ధర్మం లేదు. పరుషవాక్యములు మాట్లాడక పోవడం, పాపపు పనులు చేయక పోవడం వలన మనిషి ఉత్తముడు అవుతాడు. బలవంతుడై శాంతంగా ఉండే వాడు, పేద వాడైనా దానం చేసే వాడు పుణ్యపురుషుడు అనిపించు కుంటాడు. న్యాయార్జితమైన ధనాన్ని అర్హులకు ఇవ్వక పోవడమూ అనర్హులకు ఇవ్వడమూ వలన కీడు కలుగుతుంది. పరస్త్రీ వ్యామోహం, మద్యపానం, వేటాడటం, పరుషభాషణ, వృధాగా ధనమును ఖర్చు చేయడమూ, పోట్లాడటమూ సప్త వ్యసనాలని విజ్ఞులు చెప్తారు. కనుక వారు వాటి జోలికి పోరు. తనకు ఉచితమైన దుస్తులు ధరించడమూ, ఆత్మ స్తుతి చేయక పోవడమూ, దానిమిచ్చి పిదప చింతించక ఉండుట, కష్ట కాలంలో కూడా ధర్మ మార్గాన్ని విడనాడక ఉండుట మంచి నడవడి అనిపించుకుంటుంది. స్నేహం, మాటలు, పోట్లాట తనకు సమానులతో చేయాలి కాని అల్పులతోను అధికులతోను కాదు. తనకు ఉన్నంతలో ఇతరులకు ఇవ్వాలి, శత్రువనా కోరిన సహాయం చేయాలి. ఎక్కువగా కష్టపడి తక్కువగా సుఖపడాలి. మంచి వారు పొగడ్తలకు మేలు చేస్తారు కాని కీడు చేయరు. నేను చెప్పిన లక్షణాలు ధర్మజునిలో ఉన్నాయి. నీవు వారిని ఆదరించి ఇప్పుడు నిరాదరణకు గురి చేసావు. వారి రాజ్యభాగాన్ని వారికి ఇచ్చి వారిని ఆదరించడం నీ ధర్మం. మీరు కలసి ఉన్నంత కాలం దేవతలు కూడా మీ వంక కన్నెత్తి చూడలేరు " అన్నాడు.
    విదురుని మాటలు విన్న దృతరాష్ట్రుడు " విదురా? నన్ను ఇప్పుడు ఏమి చేయమంటావు " అని అడిగాడు. విదురుడు " అలా అడిగితే నేను ఏమి చెప్పను? రాజ్యం దక్కింది కదా అని తమ్ముని రాజ్యం కాజేయాలని చూసావు. చేపతో సహా గాలం కూడా మింగిన చందాన ఉంది నువ్వు చేస్తున్న పని. పక్వానికి రాక మునుపే పండును కోసిన రుచిగా ఉండక పోవడమే కాక దాని విత్తనం తన ప్రయోజనాన్ని కోల్పోతుంది. పరుల ధనానికి, విద్యకు, పరాక్రమానికి ఈర్ష్య చెందే వాడు ఏరోగం లేక పోయినా బాధ పడక తప్పదు. ఎదుటి వానికి ప్రియం కలిగించేలా మాట్లాడలేక పోయిన ఊరక ఉండటం మంచిది. మాటల వలననే పగ, చెలిమి, తెలివి, కలత, ధర్మము, పాపము, కీత్రి, అపకీర్తి కలుగుతాయి. గొడ్డలితో నరికిన చెట్టు కూడా చిగురిస్తుంది కాని మాటలతో చెడిన కార్యం సిద్ధించదు. మనసుకు తగిలిన గాయం మాన్పవచ్చు కాని శరీరానికి తగిలిన గాయం మాన్పలేము. ధర్మరాజు నోటి వెంట ఒక చెడు మాట కూడా రాదు కాని నీ కుమారులు నీచపు మాటలు నీకు తెలియనివా? చేటు కాలం దాపురించిన చెడ్డ మాటలు కూడా తీయగా ఉంటాయి. దుష్టులు చేసే దుర్మార్గం కూడా బాగానే ఉంటుంది. కాని మనసుకు అవి తగని పనులని తెలుసు. ధర్మ నిరతుడైన ధర్మరాజు తన సంపదకు దూరం కావడం ధర్మమా? అతడు నీ పెద్దరికాన్ని గౌరవిస్తున్నాడు కాని నీవు పాండవుల విరోధం కోరుతున్నావు.ఎన్ని పుణ్య కార్యాలు చేసినా అవి ధర్మవర్తనకు సరి రావు. ఉత్తముడు లంభించిన కీర్తి ఇహ లోకంలో ఉన్నంత కాలం అతడు పరలోకంలో పుణ్యగతులు పొందగలడు. పూర్వం ప్రహ్లాదుడు రాక్షస కులంలో జన్మించినా ధర్మ మార్గం తప్పక అంగీరసునికి తన కుమారునికి వచ్చిన వివాదంలో పక్షపాత రహితంగా అంగీరసుని పక్షాన న్యాయం చెప్పాడు. కనుక నీవు కూడా నీ కుమారుల పట్ల పక్షవాతం వదిలి ఇరువుకి సంధి చెయ్యి. అందు వలన అందరూ సుఖపడతారు. పెద్దలు లేని సభ సభ కాదు, న్యాయం మాటాడలేని వారు పెద్దలు కారు, సత్యం లేని ధర్మం ధర్మం కాదు, ఏదో ఒక మిష మీద చెప్పేది సత్యము కాదు. నీతి మార్గంలో నడవడం ఉత్తమం, శౌర్యంతో సంపదలు పొందుట మద్యమము, భారంగా బ్రతుకు లాగుట అధమం. నీతి దూరులను ఉత్తములు మెచ్చరు. నీ పుత్రులు ఎప్పుడూ నీతి మాలిన కార్యాలను మాత్రమే చేస్తారు. యుద్ధోన్మాదంలో ఉరకలు వేస్తుంటారు. దానికి కర్ణుడు అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లు ప్రోస్త హిస్తుంటాడు. నీకేమో నీతి పట్టదు. పాండవులు కయ్యానికి కాలు దువ్వరు; కయ్యానికి పిలిచిన వారిని వదలరు. పాడవులు నిన్ను తండ్రి మాదిరి గౌరవిస్తున్నారు నీవు అలాగే వారిని కన్న కొడుకులుగా చూడటం మంచిది. మేలు చేసిన వాడికి కీడు చేసిన వాడి శవాన్ని కుక్కలు కూడా ముట్టవు. నీ తమ్ముడు పాండు రాజు నీకు పరమ భక్తుడు, పాండవులు నీకెంతో మేలు చేసారు. వారిని ఆదరించడం మంచిది. ప్రతి మనిషికి సుఖ దుఃఖాలు సహజం. దుఃఖించడం వలన శక్తి నశిస్తుంది, మతి చెడుతుంది, శరీరం కృశిస్తుంది, రోగం వస్తుంది శత్రువుకు అది బలాన్ని చేకూరుస్తుంది కనుక దు॰ఖించడంమాను " అన్నాడు. దృతరాష్ట్రుడు " విదురా! నేను ధర్మతనయుని నా మాటలతో చేతలతో బాధించాను. అందు వలన నా కుమారులకు మరణం తధ్యం. నేను దుఃఖించక ఎలా ఉండగలను " అన్నాడు. విదురుడు " రాజా! నీవు లోభం విడిచి మనసు అదుపులో పెట్టుకుంటే మనశ్శాంతి అదే లభిస్తుంది . జ్ఞాతి వైరం వదిలి పెట్టు. గోవులను, బ్రాహ్మణులను అగౌరవ పరచ వద్దు. అన్నదమ్ములు కలిసి ఉండేలా చూడు. ఒక్క చెట్టును కూల్చడం తేలిక అదే అనేక చెట్లు ఒకటిగా ఉండగా పెను గాలి కూడా వాటిని కూల్చ లేదు.పాండు పుత్రులను పిలిచి వారికి హితం కలిగించి నీ పుత్రులను బ్రతికించుకో. జూదం ఆడిన నాడే నేను వద్దని చెప్పాను నీవు విన లేదు. కాకుల వంటి నీ కుమారులను నమ్మి నెమళ్ళ వంటి పాండవులను వదులుకుని ఇప్పుడు తల్లడిల్లి పోతున్నావు. కుల నాశకుడైన కుమారుని వదిలితే వచ్చే నష్టం ఏమిటి. భీష్ముడు, కర్ణుడు, ద్రోణుడు, పాండుపుత్రులు సుయోధనాది పుత్రులు మనుమలైన లక్ష్మణ కుమారుడు, అభిమన్యుడు నిన్ను సేవిస్తుంటే నీ వైభవం ఎలా ఉంటుంది. శత్రు రహితమైన ఆ వైభవంతో సాటి ఏమి ? " అన్నాడు. దృతరాష్ట్రుడు " విదురా! నీవు చెప్పిన మాటలు బాగున్నా నా కుమారులను వదల లేను కనుక ధర్మం జయిస్తుంది " అన్నాడు. విదురుడు " రాజా! నీవు నీ కుమారులను వదల వద్దు పండవులను దూరం చేసుకోవద్దని మాత్రమే నేను చెప్తున్నాను. నీ కుమారులను ఒప్పించి పాండవులకు ఐదు ఊళ్ళైనా ఇప్పించు.ఉద్ధం నివారించడానికి కొడుకులను వదల మన్నాను కాని సంధి చేసుకుంటే అందరికీ క్షేమమే కదా! ఎన్ని భోగాలు అనుభవించినా మహారాజులకైనా చావు తప్పదు. కనుక నీకొడుకులను సంంధికి ఒప్పించు ధర్మరాజును శాంత పరచు " అన్నాడు. దృతరాష్ట్రుడు " విదురా! నీ మాటలు బాగున్నాయి. అలాగే చేస్తాను " అన్నాడు.విద్రుడు " ఆ మాట మీద ఉండు దుర్యోధనుని చూసి మనసు మార్చుకోకుండా ధర్మరాజుతో సంధి చేసుకో " అని చెప్పి తన మందిరానికి వెళ్ళాడు.