Thursday, 3 October 2013

వరలక్ష్మీ పూజా విధానం:

Bramhasri Samavedam Shanmukha Sarma

వరలక్ష్మీ పూజా విధానం:

ధ్యానమ్:

పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే!
నారాయణ ప్రియే దేవీ సుప్రీతా భవసర్వదా!!

క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే!
సుస్థిరా భవమే గేహే సురాసుర నమస్కృతే!!

ఆవాహనమ్:

సర్వమంగళ మాంగళ్యే విష్ణు వక్ష స్థలాలయే
ఆవాహయామి దేవీ! త్వాం సుప్రీతా భవ సర్వదా!!
కలశం మీద అక్షతలను, పూలను వేయవలెను.
తోరములను కలశం వద్ద ఉంచవలెను.

ఆసనం:
అనేక రత్న ఖచితం క్షీర సాగర సంభవే!
స్వర్ణ సింహాసనం దేవీ స్వీకురుష్వ హరి ప్రియే!!
వరలక్ష్మీ దేవ్యై నమః ఆసనం సమర్పయామి
కలశం మీద అక్షతలను, పూలను వేయవలెను.

పాద్యం:
సువాసిత జలం రమ్యం సర్వ తీర్థ సముద్భవం!
పాద్యం గృహాణ దేవీ త్వం సర్వదేవ నమస్కృతే!!
వరలక్ష్మీ దేవ్యై నమః పాద్యం సమర్పయామి
ఉద్ధరిణెతో నీళ్ళు తీసుకొని అమ్మవారికి చూపించి పళ్ళెంలో వదలవలెను.

అర్ఘ్యం:
గంగాది సమానీతం సువర్ణ కలశస్థితమ్!
గృహాణమర్ఘ్యం మయా దత్తం పుత్ర పౌత్ర ఫల ప్రదే!!
వరలక్ష్మీ దేవ్యై నమః అర్ధ్యం సమర్పయామి
ఉద్ధరిణెతో నీళ్ళు తీసుకొని అమ్మవారికి చూపించి పళ్ళెంలో వదలవలెను.

ఆచమనం:
ప్రసన్నం శీతలం తోయం ప్రసన్న ముఖ పంకజే!
గృహాణ ఆచమనార్ధాయ గరుడధ్వజ వల్లభే!!
వరలక్ష్మీ దేవ్యై నమః ఆచమనీయం సమర్పయామి
ఉద్ధరిణెతో నీళ్ళు తీసుకొని అమ్మవారికి చూపించి పళ్ళెంలో వదలవలెను.

మధుపర్కం:
మహాలక్ష్మీ మహాదేవీ మధ్వజ్య దధి సంయుతం!
మధుపర్కం గృహాణీమం మధుసూదన వల్లభే!!
వరలక్ష్మీ దేవ్యై నమః మధుపర్కం సమర్పయామి
ఉద్ధరిణెతో నీళ్ళు తీసుకొని అమ్మవారికి చూపించి పళ్ళెంలో వదలవలెను.

పంచామృత స్నానం:
పయోదధి ఘ్రుతోపేతం శర్కరా మధు సంయుతం!
పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే!!
వరలక్ష్మీ దేవ్యై నమః పంచామృత స్నానం సమర్పయామి
కొబ్బరి కాయ కొట్టి ఆ నీటిని లేదా ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవునెయ్యి, పంచదార, తేనె లను కలిపి ఉద్ధరిణెతో తీసుకొని అమ్మవారికి చూపించి పళ్ళెంలో వదలవలెను

శుద్ధోదక స్నానం:
గంగాజలం మయానీతం మహాదేవ శిరః స్థితం!
శుద్ధోదక స్నానమిదం గృహాణ విధు సోదరీ!!
వరలక్ష్మీ దేవ్యై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి
ఉద్ధరిణెతో నీళ్ళు తీసుకొని అమ్మవారికి చూపించి పళ్ళెంలో వదలవలెను.

వస్త్రం:
దివ్యాంబర యుగం సూక్ష్మం కంచుకం చ మనోహరం!
వరలక్ష్మీ మహాదేవీ గృహాణీదం మయార్పితం!!
వరలక్ష్మీ దేవ్యై నమః వస్త్రం సమర్పయామి
క్రొత్త వస్త్రమును/ప్రత్తి సమర్పించవలెను

కంఠసూత్రం:
మాంగల్య మణి సంయుక్తం ముక్తా విద్రుమ సంయుతం
దత్తాం మంగళ సూత్రం చ గృహాణ హరి వల్లభే!!
వరలక్ష్మీ దేవ్యై నమః మంగళ సూత్రం/కంఠాభరణం సమర్పయామి
బంగారు ఆభరణమును నీటిలో కడిగి సమర్పించవలెను

ఆభరణం:
రత్నతాటంక కేయూర హార కంకణ భూషితే!
భూషణాని మహారాణి గృహాణ కరుణా నిధే!!
వరలక్ష్మీ దేవ్యై నమః ఆభరణాని సమర్పయామి

గంధం:
కర్పూర చందనోపేతం కస్తూరీ కుంకుమాన్వితం!
సర్వ గంధం గృహాణాద్య సర్వ మంగళదాయినీ!!
వరలక్ష్మీ దేవ్యై నమః దివ్య పరిమళ గంధం సమర్పయామి
ఒక పువ్వును గంధంలో ముంచి కలశం వద్ద ఉంచవలెను

అక్షతలు:
అక్షతాన్ ధవళాన్ దేవీ శాలియాన్ తండులాన్ శుభాన్!
హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతామబ్ధి పుత్రికే!!
వరలక్ష్మీ దేవ్యై నమః అక్షతాన్ సమర్పయామి
అక్షతలను తీసుకొని కలశం పాదముల వద్ద ఉంచవలెను

పుష్పం:
మల్లికా జాజి కుసుమైః చమ్పకైః అపి వకులైస్తథా!
శత పత్రైశ్చ కల్హారైహ్ పూజయామి హరిప్రియే!!
వరలక్ష్మీ దేవ్యై నమః పుష్ప మాలా సమర్పయామి
పుష్ప మాలతో కలశాన్ని అలంకరించవలెను

అంగపూజ:
చంచలాయై నమః - పాదౌ పూజయామి
చపలాయై నమః - జానునీ పూజయామి
పీతాంబరధరాయై నమః - ఊరూ పూజయామి
కమలవాసిన్యై నమః - కటిం పూజయామి
పద్మాలయాయై నమః - నాభిం పూజయామి
మదనమాత్రే నమః - స్తనౌ పూజయామి
లలితాయై నమః - భుజద్వయం పూజయామి
కంబుకంట్యై నమః - కంఠం పూజయామి
సుముఖాయై నమః - ముఖం పూజయామి
శ్రియై నమః - ఓష్టౌ పూజయామి
సునాసికాయై నమః - నాసికాం పూజయామి
సునేత్రే నమః - నేత్రం పూజయామి
రమాయై నమః - కర్ణౌ పూజయామి
కమలాయై నమః - శిరః పూజయామి
ధనలక్ష్మ్యై నమః - సర్వాణి అంగాని పూజయామి

అర్చనం:
ఓం శ్రియై నమః; ఓం లక్ష్మ్యై నమః; ఓం వరదాయై నమః; ఓం విష్ణు పత్న్యై నమః; ఓం వసుప్రదాయై నమః; ఓం హిరణ్య రూపాయై నమః; ఓం స్వర్ణ మాలిన్యై నమః; ఓం రజతస్రజాయై నమః; ఓం స్వర్ణ ప్రభాయై నమః; ఓం స్వర్ణ ప్రాకారాయై నమః; ఓం పద్మ వాసిన్యై నమః; ఓం పద్మ హస్తాయై నమః; ఓం పద్మ ప్రియాయై నమః; ఓం ముక్తాలంకారణాయై నమః; ఓం సూర్యాయై నమః; ఓం చంద్రాయై నమః; ఓం బిల్వ ప్రియాయై నమః; ఓం ఈశ్వర్యై నమః; ఓం భుక్త్యై నమః; ఓం ముక్త్యై నమః; ఓం విభూత్యై నమః; ఓం రుధ్యై నమః; ఓం సమృద్ధ్యై నమః; ఓం కృష్ట్యై నమః; ఓం పుష్ట్యై నమః; ఓం ధనదాయై నమః; ఓం ధనేశ్వర్యై నమః; ఓం శ్రద్ధాయై నమః; ఓం భోగిన్యై నమః; ఓం భోగదాయై నమః; ఓం ధాత్ర్యై నమః; ఓం విధాత్ర్యై నమః.
పై నామములు చెప్తూ పువ్వులతో పూజించవలెను

లక్ష్మీ అష్టోత్తరముతో కూడా పూజించవలెను

శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి :
ఓం ప్రకృత్యై నమః ,
ఓం వికృత్యై నమః ,
ఓం విద్యాయై నమః ,
ఓం సర్వ భూత ప్రదాయైనమః
ఓం శ్రద్దాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం వాచ్యై నమః
ఓం పద్మాలయాయై నమః 10
ఓం పద్మాయై నమః
ఓం శుచ్యై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్య పుష్టాయై నమః
ఓం విభావర్యై నమః 20
ఓం ఆదిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం క్రోధ సంభవాయై నమః 30
ఓం అనుగ్రహ ప్రదాయై నమః
ఓం బుద్యై నమః
ఓం అనఘాయై నమః
ఓం హరి వల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోక శోక వినాశిన్యై నమః ,
ఓం ధర్మ నిలయయై నమః ,
ఓం కరుణాయై నమః
ఓం లోక మాత్రే నమః 40
ఓం పద్మ ప్రియాయై నమః
ఓం పద్మ హస్తాయై నమః
ఓం పద్మ సుందర్యై నమః
ఓం పద్మ ముఖ్యై నమః
ఓం పద్మనాభ ప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మ మాలా ధరాయై నమః
ఓం దేవ్యై నమః 50
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మ గంధిన్యై నమః
ఓం పుణ్య గందాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభి ముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్ర సహోదర్యై నమః 60
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్ర రూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందు శీతలాయై నమః
ఓం ఆహ్లాద జనన్యై నమః
ఓం పుష్ణ్యై నమః
ఓం శివాయై నమః
ఓం శివ కర్త్ర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వ జనన్యై నమః 70
ఓం పుష్ణ్యై నమః
ఓం దారిద్ర్య నాశిన్యై నమః
ఓం ప్రీతి పుష్కరిణ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్ల మాల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వ నిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః 80
ఓం వసుందరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమ మాలిన్యై నమః
ఓం ధన ధాన్య కర్త్యై నమః
ఓం సిద్యై నమః
ఓం స్ర్యైణ సౌమ్యాయై నమః
ఓం శుభ ప్రదాయై నమః
ఓం నృప వేశ్మ గతానందాయై నమః
ఓం వరలక్ష్మై నమః 90
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం సముద్ర తనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగళా దేవ్యై నమః
ఓం విష్ణు వక్షస్థల స్థితాయై నమః
ఓం విష్ణు పత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః
ఓం ఓం నారాయణ సమాశ్రితాయై నమః 100
ఓం దారిద్ర్య ద్వంసిన్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవ దుర్గాయై నమః
ఓం మహా కాళ్యై నమః
ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః
ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః 108
లక్ష్మీ అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి .

ధూపం; దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం!
ధూపం దాస్యామి దేవేశీ గృహ్యతాం పుణ్య గంధినీ!!
వరలక్ష్మీ దేవ్యై నమఃధూపమాఘ్రాపయామి
అగరువత్తి వెలిగించి ధూపము చూపవలెను.

దీపం:
ఘ్రుతాక్తవర్తి సంయుక్తం అంధకార వినాశకం!
దీపం దాస్యామి తే దేవీ గృహాణ ముదితోభవ!!
వరలక్ష్మీ దేవ్యై నమః దీపం దర్శయామి
దీపము చూపవలెను

ఆచమనం;
ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి
ఉద్ధరిణెతో నీళ్ళు తీసుకొని అమ్మవారికి చూపించి పళ్ళెంలో వదలవలెను.

నైవేద్యం:
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధీయోయోన ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువ స్వాహా సత్యం త్వర్త్యేన పరిషించామి
అంటూ ఉద్ధరిణే తో నీరు తీసుకొని కుడిచేతిలో పోసుకొని నైవేద్యానికి ఉంచిన పదార్ధముల చుట్టూ తిప్పి వదలవలెను
అమృతమస్తు పదార్ధములపై నీటిని చల్లవలెను
అమృతోపస్తరణ మసి
ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా
అంటూ పదార్ధములను అమ్మవారికి చూపించవలెను

ఉత్తరాపోశనం సమర్పయామి - ఉద్ధరిణెతో నీళ్ళు తీసుకొని అమ్మవారికి చూపించి పళ్ళెంలో వదలవలెను.
హస్తౌ ప్రక్షాలయామి - ఉద్ధరిణెతో నీళ్ళు తీసుకొని అమ్మవారికి చూపించి పళ్ళెంలో వదలవలెను.
పాదౌ ప్రక్షాలయామి - ఉద్ధరిణెతో నీళ్ళు తీసుకొని అమ్మవారికి చూపించి పళ్ళెంలో వదలవలెను.
తాంబూలం సమర్పయామి -ఆకు, వక్క, పండుతో తాంబూలమును చూపవలెను

కర్పూర నీరాజనం:
నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం
తుభ్యం దాస్యామ్యహం దేవీ గృహ్యతాం విష్ణు వల్లభే!!
వరలక్ష్మీ దేవ్యై నమః ఆనంద మంగళ నీరాజనం సమర్పయామి
నీరాజనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి - ఉద్ధరిణెతో నీళ్ళు తీసుకొని అమ్మవారికి చూపించి పళ్ళెంలో వదలవలెను.

మంత్రం పుష్పం:
సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధకే
శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే!!
పై శ్లోకము చదివి చేతిలో పుష్పములు తీసుకొనిఅమ్మవారి కాళ్ళవద్ద ఉంచవలెను

ప్రదక్షిణ నమస్కారం:
నమోస్తు నాళిక నిభాననాయై నమోస్తు నారాయణ వల్లభాయై
నమోస్తు రత్నాకర సంభవాయై నమోస్తు లక్ష్మ్యై జగతాం జనన్యై!!

తోర గ్రంథి పూజ:

కమలాయై నమః - ప్రథమ గ్రంధిం పూజయామి
రమాయై నమః - ద్వితీయ గ్రంధిం పూజయామి
లోకమాత్రే నమః - తృతీయ గ్రంధిం పూజయామి
విశ్వ జనన్యై నమః - చతుర్థ గ్రంధిం పూజయామి
మహాలక్ష్మ్యై నమః - పంచమ గ్రంధిం పూజయామి
క్షీరాబ్ధి తనయాయై నమః - షష్ఠమ గ్రంధిం పూజయామి
విశ్వసాక్షిన్యై నమః - సప్తమ గ్రంధిం పూజయామి
చంద్ర సహోదర్యై నమః -అష్టమ గ్రంధిం పూజయామి
హరివల్లభాయై నమః - నవమ గ్రంధిం పూజయామి

ఈ క్రి౦ది శ్లోకం చదువుతూ తోరము తీసుకొనవలెను
సర్వ మంగళ మాంగల్యే సర్వ పాప ప్రణాశిని
తోరం ప్రతి గృహ్ణామి సుప్రీతా భవ సర్వదా!!

క్రింది శ్లోకం చదువుతూ కుడి చేతికి తోరము కట్టుకొనవలెను
నవతంతు సంయుక్తం నవగ్రంథి సమన్వితం
బద్నీయం దక్షిణే హస్తే తోరకం హరి వల్లభే!! (లేక)
బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం
పుత్ర పౌత్రాభివృద్ధిం చ సౌభాగ్యం దేహిమే రమే!!
తరువాత ఒక ముత్తైదువకు తోరము కట్టవలెను

ఇప్పుడు క్రింది శ్లోకం చదువుతూ వరలక్ష్మీ దేవికి పాలతో అర్ఘ్యము ఇవ్వవలెను
గో క్షీరేణ యుతం దేవీ గంధ పుష్ప సమన్వితం
అర్ఘ్యం గృహాణ వరదే వరలక్ష్మీ నమోస్తుతే!!
వరలక్ష్మ్యై నమః ఇదం అర్ఘ్యం

పూజ ముగిసిన పిదప ఒక ముత్తైదువకు ఇంటికి ఆహ్వానించి యథాశక్తి (తాంబూలం, రవికెల గుడ్డ/చీర, శనగలు, పిండి వంటలు)తో వాయనం ఇచ్చి నమస్కరించాలి
వాయనం ఇచ్చేటప్పుడు చదవవలసిన శ్లోకం
ఇందిరా ప్రతి గృహ్ణాతు ఇందిరావై దదాతి చ
ఇందిరా తారకో బాభ్యాం ఇందిరాయై నమో నమః

ఆరోజు సాయంత్రం ముత్తైదువలను కొందరిని పిలిచి పేరంటము చేసుకొనవచ్చును.

వరలక్ష్మీ వ్రత కధా ప్రారంభము
సూత పౌరాణి కుండు శౌనకుడు మొదలగు మహర్షులను చూచి యిట్లనియె : ముని వర్యులారా స్త్రీలకు సకల సౌభాగ్యములు కలుగునట్టి ఒక వ్రత రాజంబును పరమేశ్వరుడు పార్వతీ దేవికి చెప్పెను. దానిని చెప్పెదను వినుడు.
ఒకప్పుడు కైలాస పర్వతమున వజ్రములు, వైడూర్యములు, మణులు, మొదలగు వాటితో కూడిన సింహాసన మందు పరమేశ్వరుడు కూర్చుండి యుండగా పార్వతీ దేవి పరమేశ్వరునకు నమస్కరించి 'దేవా ! లోకమున స్త్రీలు ఏ వ్రతము చేసినచో సర్వ సౌభాగ్యములు ,పుత్ర పౌత్రాదులు కలిగి సుఖంబుగా నుందురో అట్టి వ్రతము నాకు చెప్పు మనిన ఆ పరమేశ్వరుడు ఈ విధంగా పలికెను. 'ఓ మనోహరీ ! స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులను కలుగ చేసెడి వరలక్ష్మీ వ్రతము అను ఒక వ్రతము కలదు. ఆ వ్రతమును శ్రావణ మాస శుక్ర పక్ష పూర్ణిమకు ముందుగా వచ్చెడి శుక్రవారము నాడు చేయవలయు ' ననిన పార్వతీ దేవి యిట్లనియె . 'ఓ లోకారాధ్యా ! నీ వానతిచ్చిన వరలక్ష్మీ వ్రతమును ఎట్లు చేయ వలయును? ఆ వ్రతమునకు విధియేమి? ఏ దేవతను పూజింప వలయును? పూర్వము ఎవరిచే ఈ వ్రతము ఆచరింప బడినది? వీని నెల్ల వివరముగా చెప్ప వలయు ' నని ప్రార్ధింపగా పరమేశ్వరుండు పార్వతీ దేవిని చూచి యిట్లనియె - 'ఓ కాత్యాయినీ ! వరలక్ష్మీ వ్రతము వివరముగా చెప్పెదను వినుము. మగధ దేశమున కుండినము అను నొక పట్టణము కలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారంబుల తోడను ,బంగారు గోడలు గల ఇండ్ల తోడను గూడి యుండెను.అట్టి పట్టణము నందు చారుమతి యను నొక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితా మణి పెనిమిటిని (భర్తని ) దేవునితో సమానముగా తలచి ప్రతి దినమును ఉదయమున మేల్కొని స్నానము చేసి పుష్పములచే పెనిమిటిని (భర్తను ) పూజ చేసిన పిదప అత్త మామలకు అనేక విధములైన ఉపచారములు చేసి ఇంటి పనులను చేసికొని ,గయ్యాళి గాక మితముగాను ,ప్రియముగాను భాషించుచు నుండెను.
ఇట్లుండగా ఆ మహా పతివ్రత యందు మహాలక్ష్మీ దేవికి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నంబున ప్రసన్నయై ' ఓ చారుమతీ ! నేను వరలక్ష్మీ దేవిని ,నీయందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్ష మైతిని .శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చెడు శుక్ర వారము నాడు నన్ను సేవించినచో నీకు కోరిన వరములిచ్చెద ' నని వచించెను. చారుమతీ దేవి స్వప్నములోనే వరలక్ష్మీ దేవికి ప్రదక్షణ నమస్కారములు చేసి –
శ్లో || నమస్తే సర్వ లోకానాం జనన్యై పుణ్య మూర్తయే ,
శరణ్యే త్రిజగ ద్వంద్వే విష్ణు వక్ష స్థలా లయే||
అని అనేక విధముల స్తోత్రము చేసి 'ఓ జగజ్జననీ ! నీ కటాక్షంబు గలిగె నేని జనులు ధన్యులగును, విధ్వాంసులుగను , సకల సంపన్నులుగను, నయ్యెదరు. నేను నా జన్మాంతరమున చేసిన పుణ్య విశేషము వలన మీ పాడ దర్శనము నాకు కలిగెనని నమస్కరించెను. మహాలక్ష్మి సంతోషము చెంది చారుమతికి అనేక వరములిచ్చి అంతర్దానంబు (అదృశ్య మయ్యెను ) నొందెను. చారుమతి తక్షణంబున (వెంటనే ) నిదుర మేల్కొని ఇంటికి నాలుగు ప్రక్కలం జూచి వరలక్ష్మీ దేవిని గానక ' ఓహొ ! మనము కలగంటి 'మని ఆ స్వప్న వృత్తాంతమును పెనిమిటి (భర్త ) - మామగారు మొదలైన వారితో చెప్పగా , వారు ' ఈ స్వప్నము చాలా ఉత్తమ మైనదని ,శ్రావణ మాసము వచ్చిన తోడనే వరలక్ష్మీ వ్రతమును తప్పక చేయవలసిన 'దని , చెప్పిరి.
పిమ్మట చారుమతీ దేవియును ,స్వప్నంబును విన్న స్త్రీలను శ్రావణ మాసము ఎప్పుడు వచ్చునా యని ఎదురు చూచు చుండిరి . ఇట్లుండగా వీరి భాగ్యో దయంబున (అదృష్టము వలన ) శ్రావణ మాస పూర్ణిమకు ముందుగా వచ్చెడి శుక్రవారము వచ్చెను. అంత చారుమతి మొదలగు స్త్రీలందరును ఈ దినమే కదా వరలక్ష్మీ దేవి చెప్పిన దినమని ఉదయంబునే మేల్కాంచి స్నానము చేసి శుభ్రమైన వస్త్రములను కట్టుకుని చారుమతీ దేవి గృహమున ఒక ప్రదేశము నందు గో మయంబుచే (ఆవు పేడచే) అలికి మంటపమును ఏర్పరిచి అందు ఒక ఆసనము వైచి దానిపై బియ్యము పోసి కలశం ఏర్పరిచి అందు వరలక్ష్మీ దేవిని ఆవాహనము చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తి యుక్తులై సాయంకాలమున -
శ్లో || పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణ ప్రియై దేవీ సుప్రీతా భవ సర్వదా ||
అను శ్లోకముచే ధ్యానా వాహనాది షోడశోపచార పూజలను చేసి తొమ్మిది సూత్రములు గల తోరములను దక్షిణ హస్తమున (కుడి చేతి యందు ) కట్టుకుని వరలక్ష్మీ దేవికి నానా విధ భక్ష్య భోజ్యంబులను (అన్ని రకముల పిండి వంటలను ) నైవేద్యము చేసి , ప్రదక్షిణము చేసిరి .
ఇట్లొక ప్రదక్షిణము చేయగా నా స్త్రీలకందరికి కాళ్ళ యందు ఘల్లు ఘల్లు మను నొక శబ్దము కలిగెను .అంత కాళ్ళను జూచుకొనిన గజ్జెలు మొదలగు నాభరణములు కలిగి యుండ చారుమతి మొదలగు స్త్రీలందరూ 'ఓహొ ! ఇవి వరలక్ష్మీ దేవి కటాక్షము వలన కలిగినవి ' అని పరమానందము పొంది మరియొక ప్రదక్షణము చేసిన హస్తములందు ధగ ధగ మెరయు చుండు నవరత్న ఖచితములైన కంకణములు మొదలగు ఆభరణములు ఉండుట చూచిరి.
ఇంక చెప్పనేల ! మూడవ ప్రదక్షణము చేసిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వ భూషణ అలంకార భూషిత లయి చారుమతి మొదలగు ఆ స్త్రీల గృహముల నెల్ల స్వర్ణ మయము లయి (బంగారముతో నిండి ) రధ గజ తురగ (రధములు, ఏనుగులు ,గుర్రములతో ) వాహనముల తోడ నిండి యుండెను.
అంత ఆ స్త్రీలను తీసికొని గృహములకు పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు ,ఏనుగులు, రధములు ,బండ్లను వరలక్ష్మీ దేవిని పూజించు చుండు స్థలమునకు వచ్చి నిలిచి యుండెను .పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతలచే పూజించి పండ్రెండు కుడుములు ,పాయస దానంబిచ్చి దక్షిణ తాంబూలముల నొసంగి నమస్కారము చేసి బ్రాహ్మణో త్తమునిచే ఆశీర్వాదంబు నొంది వరలక్ష్మీ దేవికి నివేదనము చేసిన భక్ష్యాదులను బందువుల తోడ ఎల్లరును భుజించి , తమ కొరకు వచ్చి కాచుకొని యున్న గుర్రములు ,ఏనుగులు, మొదలగు వాహనముల నెక్కి తమ తమ ఇళ్ళకు పోయిరి. అపుడు వారు ఒకరితో నొకరు ' ఆహా ! చారుమతీ దేవి భాగ్యంబే మని చెప్ప వచ్చును. వరలక్ష్మీ దేవి తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్ష మయ్యెను. ఆ చారుమతీ దేవి వలననే గదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు గలిగేనని చారుమతీ దేవిని మిక్కిలి పొగడుచు తమ తమ ఇండ్లకు పోయి చేరిరి . నాటి నుండి యు చారుమతి మొదలగు స్త్రీ లందరును ప్రతి సంవత్సరము ఈ వ్రతంబు చేయుచూ పుత్ర పౌత్రాభి వృద్ది కలిగి ధన కనక వస్తు వాహనముల తోడ గూడుకుని సుఖంబుగ నుండిరి.
కావున ఓ పార్వతీ ! యీ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతులవారును చేయవచ్చును .అటు లొనర్చిన సర్వ సౌభాగ్యములు కలిగి సుఖముగ నుందురు .ఈ కథను విను వారలకు ,చదువు వారలకు వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యంబులు సిద్దించును.
ఆ చారుమతీ దేవి చేసిన వ్రతమును లోకమంతా చేశారు .లోకమంతా చేసిన వ్రతమును మనమూ చేశాము .వ్రత లోపమైనా కధ లోపం కారాదు. భక్తి తప్పినా ఫలం తప్పరాదు.సర్వే జనాః సుఖినో భవంతు అని నమస్కారము చేయవలెను.
ఇది భవిష్యోత్తర పురాణము నందు పార్వతీ పరమేశ్వర సంవాదమైన వరలక్ష్మీ వ్రత కల్ప కధా సంపూర్ణము