Thursday 10 October 2013

నవరాత్రుల నవవిధుల సూక్తి ప్రకీర్ణకము - 1

Jaji Sarma
నవరాత్రుల నవవిధుల సూక్తి ప్రకీర్ణకము - 1

ధర్మాధర్మ , ఉచితానుచిత, న్యాయాన్యాయ విధులను, వివిధ వాఙ్మయ ధారల నుండి సేకరించి గ్రుచ్చెత్తిన ప్రకీర్ణకము

1. ఙ్ఞానాన్ని పొందాలని ఆశించే వ్యక్తి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, తదితర హీన నిమ్న మరియు హూణ జాతుల లోని ఏ వ్యక్తి నుండి అయినా దానిని అనగా ఙ్ఞానాన్ని సముపార్జించవచ్చు, అందులో దోషము లేదు. ( మహాభారతం—శాంతిపర్వము ౩౧౮/౮౮; మనుస్మృతి-- ౨/౨౩౮; భవిష్యపురాణం –బ్రహ్మ పురాణం ౪/౨౦౭)

2. శాస్త్రాధారము లేకుండా కేవలము మౌఖికంగా, ప్రాయశ్చిత్త, చికిత్స, జ్యోతిష, ఫలాదేశములను చెప్పే వ్యక్తి బ్రహ్మహత్యా పాతకము చేసిన వానితో సమానుడు అవుతాడు.( నారద పురాణం—పూర్వ ౧౨/౬౪)

3. రేపటి దినము చేయవలసిన విధిని నేడు, సాయంత్రము నిర్వర్తింప దలచిన విధిని ప్రాతఃకాలమందే పూర్తిచేయవలెను, ఎందుకంటే మృత్యువుకు కార్య పరిసమాప్తితో నిమిత్తము లేదు.( విష్ణుస్మృతి – ౨౦)

4. ఇవ్వ వలసినవి, పుచ్చుకో వలసినవి మరియు యోగ్యమయిన సుకర్మలను శీఘ్రముగా చేసివేయవలెను, ఏలననగా కాలయాపనము వాటి రసమును పీల్చివేయును.( హితోపదేశము –సంధి ౧౦౧ )

5. అనేక కార్యములను చేయవలసి వచ్చినప్పుడు, బుధ్ధిమతి అయిన వ్యక్తి సుయోగ్యమైన కార్యములను సత్వరము చేయవలెను. లౌకిక కార్యకలాపములను వెనుకగా చేయవలెను ( శుక్రనీతి ౩/౧౪౧—౧౫౦ )

6. కుటుంబములో ధన, భాగ్య, సంపదల పంపకములు ఒకే ఒక పర్యాయము చేయవలెను. అదే విధముగా కన్యాదానము కూడ ఒకే ఒక పర్యాయము చేయవలెను. ఏదైనా ఒక వస్తువుని దానమిచ్చే ప్రతిఙ్ఞని కూడా వెంటనే ఒకే ఒక పరి చేయవలెను అదియే సత్పురుషుల మతము ( మనుస్మృతి ౯/౪౭; మహాభారతం – అరణ్య ౨౯౪/౨౬)

7. కనులు మూసుకొని నిద్రని జయించాలని ప్రయత్నించ వద్దు. కామోపభోగము చేత స్త్రీని అనుభవించి ఆమెని వశపరచుకోవాలని అనుకోవద్దు, వంట చెరుకుని వేసి అగ్నిని జయించాలని ఆశించ వద్దు, అత్యధికముగా మదిరా పానము చేసి వ్యసనాన్ని త్యజించాలని ఊహించ వద్దు. ( మహాభారతం – ఉద్యోగపర్వం—౩౧/ ౮౧ )

8. బాగుగా ఆలోచన చేసి ఏ పనినైనా చెయ్యవలెను. తొందరపాటుతో ఏ విద్యనైనా నేర్చుకోకూడదు. అవివేకముతో హఠాత్తుగా ఏ పనినైనా చేబడితే, విపత్తులను ఎదుర్కొనవలసి వస్తుంది. అందువలన సువిచారముతో పనిని చేసిన వారి దగ్గరకి సంపద తనంతట తానే వస్తుంది. ( మహాభారతం – ఉద్యోగపర్వం—౩౪/ ౮ )

9. బుధ్ధిశాలియైన వ్యక్తి, రాజు , బ్రాహ్మణ, వైద్య, మూర్ఖ, మిత్ర, గురు, ఇంకా తదితర ప్రియజనులతో వాద వివాదములకు పూనుకోడు. ( పద్మపురాణం—సృష్టి—౫౧/౧౦౧; చాణక్య సూత్రం ౩౫౨)