Sunday 13 October 2013

విజయదశమి (దసరా)



  • విజయదశమి (దసరా)
    దసరా ఒక ముఖ్యమైన హిందువుల పండుగ. ఆశ్వయుజ(అశ్వనీ నక్షత్రం పౌర్ణమి రోజున వస్తే అది ఆశ్వీయుజ మాసమౌతుంది.) శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు. ఈ నవరాత్రుల లో దుర్గమ్మ ని తొమ్మిది విధాలుగా అంటే బాలాత్రిపుర సుందరి, మహాలక్ష్మి, గాయత్రి, అన్నపూర్ణ, సరస్వతి, శ్రీలతా త్రిపురసుందరి, దుర్గ, మహిషాసురమర్థిని, రాజరాజేశ్వరిగా భావించి విభిన్నమైన అలంకారాలతో అర్చిస్తారు. పదవ రోజు విజయదశమి కలసి దసరా అంటారు. దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. తెలంగాణా లో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు.

    దేవదానవులు పాలసముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్తదినం ఈ విజయదశమి రోజే అని తెలియజేయబడింది. 'శ్రవణా' నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి 'విజయా' అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయదశమి' అనుపేరు వచ్చినది. ఏపనైనా తిధి, వారము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మున్నగునవి విచారించకుండా, విజయదశమినాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము. 'చతుర్వర్గ చింతామణి' అనే ఉద్గ్రంధము ఆశ్వీయుజ శుక్ల దశమినాటి నక్షత్రోదయ వేళనే 'విజయం' అని తెలిపియున్నది. ఈ పవిత్ర సమయము సకల వాంచితార్ధ సాధకమైనదని గురువాక్యము.

    విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయటం రివాజు. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసుని తో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదే విజయదశమి.అర్జునుడు కూడా విజయదశమి రోజునే ఉత్తర గోగ్రహణంలో విజయాన్ని పొందాడనీ తెలస్తున్నది.

    'శమీపూజ' చేసుకునే ఈరోజు మరింత ముఖ్యమైనది. శమీవృక్షమంటే 'జమ్మిచెట్టు'. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను, వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి, తిరిగి ఆయుధాలను వస్త్రములను పొంది, శమీవృక్ష రుపమున ఉన్న 'అపరాజితా' దేవి ఆశీస్సులు పొంది, కౌరవులపై విజయము సాధించినారు.

    శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి, రావణుని సహరించి, విజయము పొందినాడు.
    తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం 'పాలపిట్ట'ను చూచే ఆచారం కూడా ఉన్నది.

    ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని, విజయదశమిరోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి, ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలుచేస్తారు.

    శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |
    అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||


    పైశ్లోకము వ్రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటు, శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.

    మహిషాసురమర్ధిని

    బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతల్తో ఘోరమైన యుద్ధమి చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది.

    శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణ దేవుడు పాశము , బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పింది. మహిషాసురుని తరఫున పోరు సల్పుతున్న ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది. ఈ యుద్దములో ఆదేవి వాహనమైన సింహమూ శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము, సింహరూపము, మానవరూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి మహిషిరూపములో దేవిచేతిలో హతుడైనాడు.ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినంగా ప్రజలచే కొనియాడబడింది.

                                                                                                                                                                       హైందవ సంస్కృతి మాస పత్రిక