Wednesday 15 May 2013


Paritala Gopi Krishna

తిలకధారణం, కర్మానుష్ఠానము మరియు ఈశ్వర భక్తి విశేషం: -- పరమపూజ్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి (మహాస్వామి లేక కంచి పరమాచార్య)

"లలాట లిఖితా రేఖా పరిమాష్టుం న శక్యతే"

"బ్రహ్మదేవుడు నుదుట వ్రాసిన గీత తప్పించ ఎవరికి శక్యముగాదు" అని చెప్పుకొంటారు లోకములో. కష్టములు తప్పించుకోలేము అంటారు. కాని ఎవ్వరు ముఖమున బొట్టు పెట్టుకుంటారో వారు బ్రహ్మదేవుడు వ్రాసిన వ్రాతను చెరిపి మంచి వ్రాత వ్రాసుకుంటారన్నమాట! పార్వతీపరమేశ్వరులు మనకు తల్లిడండ్రులు. పరమేశ్వరుని గుర్తుగా విభూతి, పార్వతీదేవి గుర్తుగా కుంకుమ మనము ధరిస్తాము. కనుక హిందువులందరూ ఉదయమున లేచి ముఖమున బొట్టు పెట్టుకొని శుచిగా భగవంతుని ధ్యానము చేయాలి.

"లోకాస్సమస్తా స్సుఖినోభవంతు"

అలాగా సుచిగా ఉండి, తనకు ఇష్టము వచ్చిన స్తోత్రమునో, శ్లోకమునో లేక మంత్రమునో చదువుకొని భగవంతుని మానసికముగా కేవలము మన క్షేమముకొరకే కాకుండా "అందరూ క్షేమముగా ఉండాలి, వర్షాలు కురవాలి, అందరి కష్టములూ తొలగిపోవాలి, అందరి మనస్సులూ శాంతంగా ఉండాలి" అని ప్రార్థించాలి. తమ క్షేమము కొరకు ప్రార్థించేవారికంటే అందరి క్షేమము కొరకు ప్రార్థించే వరు ఉత్క్రుష్టులు. మానసికముగా ప్రార్థన చేయడానికి డబ్బు ఖర్చు లేదు గదా!

కావున హిందువులందరూ (1) తిలకధారణము, (2) సమిష్టి క్షేమము కొరకు మానసిక ప్రార్థన, (3) ఈశ్వర భక్టి, (4) కర్మానుష్ఠానము నందు శ్రద్ధ అలవరచుకోవాలి.