Thursday 16 May 2013



నరసింహ శర్మ
  • జాబాలి

    1. సత్యకామ జాబాలి - చాంద్యోగ్యోపనిషత్తు
    ఒకనాడు సత్యకాముడనే బాలుడు హుటాహుటిని తల్లివద్దకు వచ్చి ఇలా ప్రశ్నించాడు : “అమ్మా ! మన గోత్రం ఏమిటి ? నేను సద్గురువును సమీపించి బ్రహ్మచర్యదీక్ష స్వీకరించాలనుకుంటున్నానమ్మా ! వారు అడిగితే నేనేమని చెప్పేది ?”
    తల్లి సందిగ్ధంలో పడింది. అయినా ఇలా సమాధానం చెప్పింది “ “నాయనా ! మన గోత్రం ఏంటో నాకు తెలియదు. నా యౌవనంలో దాసిగా పనిచేస్తూ అనేకచోట్ల తిరిగాను. అనేకమందిని సేవించాను. నిన్ను కన్నాను. కానీ నీ తండ్రి ఎవఱో నాకు తెలియదు. ఒక్కటి మాత్రం సత్యం. నా పేరు జాబాలి. నీ పేరు సత్యకామ. గురువర్యులు ప్రశ్నిస్తే ‘సత్యకామ జాబాలిని నేను’ అని సమాధానం చెప్పు.”
    సత్యకాముడు తల్లివద్దనుండి గురువు వద్దకు పయనమయ్యాడు. అతడు గౌతమ మహర్షివద్దకు చేఱుకున్నాడు. శిష్యునిగా స్వీకరింపమని అర్థించాడు. మహర్షి – “బిడ్డా ! నీ గోత్రం ఏంటి ? నీవు ఏ వంశంలో జన్మించావు ?” అని ప్రశ్నించాడు. సత్యకాముడు, “స్వామీ ! నేను ఇంటివద్దనుండి బయలుదేఏ సమయంలోనే మా అమ్మని ఈ విషయం గుఱించే ప్రశ్నించాను. ఆమె ఇలా సమాధానం చెప్పింది – ‘నాకు తెలియనే తెలియదు. నా యౌవనంలో దాసిగా పనిచేస్తూ అనేకచోట్ల తిరిగాను. అనేక మందిని సేవించాను. నిన్ను కన్నాను. కానీ నీ తండ్రి ఎవఱో నాకు తెలియదు. ఒక్కటి మాత్రం సత్యం. నా పేరు జాబాలి. నీ పేరు సత్యకామ. గురువర్యులు ప్రశ్నిస్తే ‘సత్యకామ జాబాలిని నేను’ అని సమాధానం చెప్పు’ – ఇది నా తల్లి నాకు చెప్పిన సమాధానం. యథాతథంగా నివేదిస్తున్నాను.”
    తర్వాత గౌతమ మహర్షి ఇలా అన్నాడు : “సత్యవాక్య పరిపాలన చేసే బ్రాహ్మణుడు కాక మఱెవ్వఱు ఇలా ఉన్నదున్నట్లు చెప్పగలరు ? నాయనా, సత్యకామా ! సమిధలు సంపాదించుకునిరా. నీకు ఉపదేశం చేస్తా. బ్రహ్మచర్యదీక్ష స్వీకరిద్దువు గాని. సత్యపథం నుండి తొలగిపోనివారంతా బ్రహ్మానుభవ పథానికి అర్హులే.” అనంతరం సత్యకామ జాబాలి సమిధలు తీసుకుని వచ్చాడు. సంప్రదాయ సిద్ధంగా హోమం జఱిగింది. సత్యకామునికి బ్రహ్మచర్యదీక్ష ఇవ్వబడింది. అతడు యథావిధిగా గౌతమ మహర్షికి శిష్యుడై ఆశ్రమవాసి అయ్యాడు.
    తర్వాత కొన్నాళ్ళకు గౌతములు సత్యకాముని పిలిపించి నాలుగువందల చిక్కిపోయి వట్టిపోయిన ఆవులను, ఆబోతులను అప్పజెప్పి ఇలా ఆజ్ఞాపించాడు – “సత్యకామా ! వీటన్నింటినీ తోలుకొనిపోయి జాగ్రత్తగా కాపాడుకో. ఈ పశువుల మంద వెయ్యివఱకూ పెఱిగే పర్యంతం మళ్లీ తిరిగిరాకు.” గురువుగారు చెప్పిన పని ఎంత కష్టమైనదైనా చేసి గురుహృదయాన్ని సంతృప్తిపఱచడం గురుసేవలో ఒక మార్గం. గౌతమ మహర్షి ఆజ్ఞానుసారంగా సత్యకాముడు గొల్లవానివలె ఆ పశువులను అరణ్యానికి తోలుకునిపోయాడు.
    చాలా కాలం ఆ ఆవులను, ఆబోతులను మేపుకుంటూ కాపాడుకుంటూ ఆ ఘోరారణ్యంలో సత్యకాముడు కొన్ని సంవత్సరాలు గడిపాడు. అతని హృదయం సత్యసాక్షాత్కారం కోసం అన్వేషిస్తూనే ఉంది. అరణ్యంలో అతనికి ప్రత్యక్షమయ్యే ప్రతి ప్రకృతి రామణీయకతా అతనికి ఏదో ఒక పాఠాన్ని నేర్పుతూనే ఉంది. అనురాగ రంజితాలైన ఆవులూ, ఆబోతులూ, గుసగుసలాడే చెట్ల ఆకుల గలగలలూ, పాటలుపాడే పక్షులూ, పరవళ్ళు తొక్కే సెలయేరులూ, వెలుగును వెదజల్లే సూర్యచంద్రులూ, దూరదూరంగా మిణుకుమిణుకుమంటూ పలకరించే నక్షత్త్రాలూ అతనికి అనుక్షణం సందేశాలను అందజేయసాగాయి.
    పశువుల మంద సహస్రసంఖ్యగా పెఱిగింది. ఆ మందలోని ముసలి ఆబోతు సత్యకాముని సమీపించి ఇలా అంది : “ సత్యకామా ! మా మంద అనుకున్న ప్రకారం వెయ్యివఱకూ పెఱిగింది. మళ్ళీ మీ గురువర్యుల వద్దకు మమ్ములను తోలుకొనిపోయే సమయం ఆసన్నమైంది. సత్యకామా ! ఒక దృష్ట్యా చూస్తే బ్రహ్మతత్త్వ విజ్ఞానం నాలుగుపాదాలతో కూడుకుని ఉంది. అందులో ఒక పాదాన్ని గుఱించి నీకు ఉపదేశించాలని నాకు సంకల్పం కలిగింది. విను.” సత్యకాముడు “సరే” అన్నాడు. ఆ ముసలి ఆబోతు ఇలా చెప్పింది : “ ఈ విశ్వంలోని నాలుగు దిక్కులూ ఆ బ్రహ్మతత్త్వంలో ఒక భాగం. అదే ఒక పాదం. ఆ బ్రహ్మతత్త్వం గుఱించి నీకు ఇంకా కొంత అగ్నిదేవుడు ఉపదేశిస్తాడు”
    సత్యకాముడు గౌతమ మహర్షి ఆశ్రమానికి తిరిగి ప్రయాణం కట్టాడు. సాయం సమయం అయింది. నిప్పుముట్టించాడు. ఆ అగ్నిజ్వాలకు ఎదురుగా ప్రాచీ (తూర్పు) దిశగా కూర్చున్నాడు. ఆ సమయంలో ఆ జ్వాల నుండి ఇలా సందేశం వినిపించింది. “సత్యకామా ! నీకు బ్రహ్మతత్త్వాన్ని గుఱించిన మఱో పాదాన్ని వివరిస్తాను. ఈ భూమ్యాకాశాలు, సప్తసముద్రాలు అన్నీ ఆ బ్రహ్మపదార్థంలో అంతర్భాగాలే అని గ్రహించు. తర్వాత ఒక హంస మఱో పాదాన్ని గుఱించి నీకు బోధ చేస్తుంది”
    సత్యకాముడు ప్రయాణాన్ని ముందుకు సాగించాడు. మఱునాడు సాయంత్రం కూడా అగ్నిని సమకూర్చుకుని ప్రాగ్ (తూర్పు) దిశగా కూచుని ప్రార్థన చేసుకునే సమయంలో ఒక హంస ఎగిరివచ్చి అతని నమీపాన వ్రాలి ఇలా చెప్పింది : “కుమారా ! నేను బ్రహ్మతత్త్వంలో మఱొక పాదాన్ని నీకు వివరించడానికి వచ్చాను. నీ ప్రాంగణంలో ఉన్న జ్వలింపజేయబడిన అగ్ని బ్రహ్మమునందు ఒక భాగము. అలాగే సూర్యుడు, చంద్రుడు, విద్యుల్లతలు అన్నీ ఆ తత్త్వమునందు అంతర్భాగాలే. మఱొక పాదాన్ని నువ్వు తర్వాత తెలుసుకుంటావు. గ్రహించు”
    మఱునాడు సాయంకాలం మామూలుగా అగ్నిని జ్వలింపజేసి ప్రార్థన చేసుకునే సమయంలో మద్గు అనే ఒక నీటిపక్షి వచ్చి తన సందేశాన్ని ఇలా అందించింది : “బిడ్డా ! నీకు బ్రహ్మపాదాన్ని గుఱించి చివఱి పాదాన్ని వివరిస్తా. ప్రాణం బ్రహ్మం. దృష్టి బ్రహ్మం, శ్రవణం బ్రహ్మం. మనస్సు బ్రహ్మం. ఇవన్నీ కలిసి బ్రహ్మములో అంతర్భాగములై (మఱల) బ్రహ్మతత్త్వము ఒక భాగంగా రూపొందినవని తెలుసుకో”
    చివఱకు సత్యకాముడు గురుపాదులైన గౌతమ మహర్షి ఆశ్రమానికి చేఱుకున్నాడు. గౌరవ పురస్సరంగా నమస్కరించి గురువర్యుని వద్ద వినయంగా నిలబడ్డాడు. గౌతముడు సత్యకాముని ముఖమండలం చూడగానే ఆనంద పారవశ్యంలో మునిగిపోయి, “నాయనా ! సత్యకామా ! నీ ముఖం బ్రహ్మజ్ఞానం పొందినవానివలె ప్రకాశమానంగా వెలిగిపోతున్నది. నీకు ఆ బ్రహ్మతత్త్వాన్ని గుఱించి ఎవఱు ఉపదేశించారు బాబూ ?” అని అడిగాడు.
    సత్యకాముడు ఇలా సమాధానం చెప్పాడు : “ స్వామీ ! ముఖ్యంగా మానవేతరములైన జీవరాశుల వల్ల నేను ఈ తత్త్వాన్ని గ్రహించాను. మీరు కూడా మీ బోధను అనుగ్రహించండి గురుదేవా ! గురువులేని విద్య ఫలింపదనీ, గురూపదేశం లేక నిఃశ్రేయసం లభింపదనీ పెద్దలు చెప్పగా వింటున్నాను.”
    అప్పుడు గౌతముడు తనకు తెలిసిన సర్వవిజ్ఞానాన్నీ సత్యకామునికి ఉపదేశించాడు.

    2. జాబాలిముని - త్రేతాయుగము

    జాబాలిముని దశరధ మహారాజు రాచపురోహితులలో ఒకరు. ఆయన మంత్రి వర్గ సభ్యులలో కూడా ఒకరు. శ్రీరామచంద్రుడు అరణ్యవాసమునుండి తిరిగి ఎలాగైనా అయోధ్యకు తీసుకుని వచ్చి పట్టాభిషిక్తుని చేయాలని తలంపుతో భరతునితో కూడావెళ్ళిన పరివారములో ఒకడు. జాబాలి రామచంద్రునితో " ఏమిటీ, పితృవాక్యపరిపాలన అంటూ ఏవేవో కబుర్లు చెపుతున్నావు. అవన్నీ ఇహలోక విషయాలు కావు. నీవు, నీ సుఖము చూచుకో! అదే జీవితానికి ప్రధానము" అంటూ భౌతికవాదము చేస్తాడు. అప్పుడు శ్రీరాముడు కృద్ధుడై "నీవంటి నాస్తికుని మా తండ్రి ఎలా చేరదీశాడు" అంటూ జాబాలి చేసిన వాదన్ని తీవ్రంగా ఖండిచివేస్తాడు. అప్పుడు వశిష్టుడు కలుగచేసుకుని, "శ్రీరామా! నిన్ను అయోధ్యాధీశునిగా పట్టాభిషిక్తుని చేయాలని తలంపుతోనే జాబాలి అలా మాట్లాడాడు గాని, నిజానికి అతను నాస్తికుడు కాడు" అంటూ శ్రీరాముని అనునయిస్తాడు. జాబాలిముని చార్వాక మతమును త్రేతాయుగములో వ్యాప్తిచేసిన బోధకుడిగా ఆయనను ముద్రవేస్తూ రచనలు వచ్చినాయి కాని అవి అన్నీ ప్రక్షిప్తములే. దైవాసుర సంపద్విభాగ యోగంలో (16:7-8) చార్వాక మత ఖండన ఉన్నది.