Sunday, 20 September 2015

http://vibhaataveechikalu.blogspot.in/

కార్తీక మాసము-

-తులసి పూజ కార్తీక మాసము--తులసి పూజ కార్తీక మాసమంతా పరమ పుణ్యప్రదము. ఇందులో అతి ముఖ్యమైనవి కార్తీక శుక్ల ద్వాదశి , పౌర్ణమి మరియూ అమావాస్య. కార్తీక సోమవారాలు శివప్రీతి కరమైనవి అయితే ఏకాదశి , ద్వాదశులు విష్ణువుకు ప్రీతి పాత్రమైనవి . బిల్వపత్రములు శివుడికైతే , తులసీ దళములు , ఉసరి ఫలములు విష్ణువుకు. ఇంక కార్తీక మాసములో విడువ వలసినవి , నల్లావాలు , కందులు , మినుములు ,పెసలు , నువ్వుల నూనె మరియూ బహుబీజకములైన వంకాయలు , మెంతులు , మొదలగునవి. కార్తీకమాసములో కేశకర్తనము [ క్షవరము ] చేసుకొనరాదు. పూజా ప్రతీకగా విష్ణు సంబంధమైన సాలగ్రామము అగ్రగణ్యమైతే , పూజాద్రవ్యములలో తులసిది అగ్ర స్థానము. సాలగ్రామము లేనిదే పుణ్య తీర్థము లేనట్టే , తులసి లేనిదే పూజ లేదు. జంతువులలో గోవు , మనుషులలో జ్ఞాని , సస్యములలో తులసి ప్రత్యేకమైనవి. దేవతలు లేని ప్రదేశమే లేదు , భగవంతుడు లేని చోటే లేదు. అయినా , సకల దేవతలు వెలసిన చోట్లు రెండే రెండు. ఒకటి గోవు , రెండు తులసి. తులసిలో సకల దేవతలే కాక పుష్కర క్షేత్రములు , గంగాది సకల తీర్థములు కూడా ఉన్నాయని పురాణములలో వర్ణించబడినది. చరించు దేవాలయం గోవైతే , సస్యరూపమైన దేవాలయమే తులసి. తులసి అంటేనే ’ తులనము లేని సస్యము ’ అనగా , దేనితోనూ సమానము కాని సస్యము. తులసికి అధిదేవత సాక్షాత్తూ మహా లక్ష్మియే ! తులసి గురించి , " తులస్యుపనిషత్ " అను యొక ఉపనిషత్తే ఉన్నతర్వాత , తులసి మాహాత్మ్యము ఎంత గొప్పదో అర్థము చేసుకోవచ్చు. మహాలక్ష్మి సాన్నిధ్యము వల్లనే తులసి కూడా ఐశ్వర్యప్రదమైనది. పద్మ పురాణము , స్కంధ పురాణము , బ్రహ్మాండ పురాణము మొదలగువాటిలో తులసి మహిమ కీర్తించబడినది. యే దానము చేయవలెనన్నా తులసి ఉండవలెను. జపతపములు పూర్ణముగా ఫలించవలెనంటే తులసిమాల అత్యావశ్యకము. తులసి ఎక్కడుంటే అక్కడే విష్ణువు సన్నిధానముండును. తులసి మాలలేకున్నచో ఒక ఆకైనా చాలు. తులసీ కాష్టము కూడా శ్రేష్టమే. తులసి ఎండిపోయి ఉన్ననూ యే దోషమూ లేదు. అనివార్యమైనపుడు , నిర్మాల్య తులసిని కూడా మరలా కడిగి , పూజకు ఉపయోగించవచ్చును. అథమ పక్షము తులసీ నామమును జపించినా విశేష ఫలమే. ఈ తులసి , దర్శనమాత్రము చేతనే సకల పాపములనూ పరిహరించును. స్పర్శనము చేత శరీరమును పావనమొనరించును. నమస్కారము చేత రోగములను పోగొట్టును, తులసినీటిని ప్రోక్షణ చేసుకున్నంత మాత్రమున మృత్యు భయమును పోగొట్టును , తులసి మొక్కను ఇంటిలో పెంచుకొనుట వలన కృష్ణ భక్తిని పెంపొందించును. శ్రీహరి పాదార్పణము చేసినంతనే ముక్తి ఫలము దొరకును. ఈ తులసి , రాక్షస శక్తులను కూడా నశింపజేయగల పరిణామకారి. ఆ కారణమువల్లనే పురాణములన్నీ , ’ సదా తులసి ఇంటియందు ఉంచుకోతగినది ’ యని ఘోషిస్తాయి. ఈ తులసికి పురాణములలో అనేక నామములు గలవు. తులసిని బృందావనములో పెంచి పూజించుటవలన విశేష పుణ్యము దొరకును. కార్తీక పౌర్ణమినాడు తులసి ప్రాదుర్భవించినది కాబట్టి ఆ దినమే తులసీ జయంతి. ఆ దినము తులసిని భక్తితో పూజించువారు సకల పాపములనుండీ ముక్తిని పొంది విష్ణులోకాన్ని చేరగలరని బ్రహ్మ వైవర్తస పురాణము తెలుపుతుంది. కార్తీకమాసము తులసి జన్మ మాసము కాబట్టే ఆ మాసములో తులసి పూజకు అంత ప్రాముఖ్యము. ఉత్థాన ద్వాదశి నాడే తులసీ వివాహమైన పుణ్యతిథి. ఆనాడు విష్ణువును ఉదయమే పూజించి తులసీదళాన్ని సమర్పించవలెను. సాయంత్రము , తులసి సాన్నిధ్యములో ధ్వజపతాక రంగవల్లుల అలంకారము గావించి , దామోదర రూపుడైన ఆ శ్రీహరిని పూజించాలి. తోరణములతో శోభించే మంటపమునేర్పరచి , ముత్యాల మాలలతో అలంకృతమైన సింహాసనములో దామోదర మూర్తిని పంచరాత్ర విధానముతో భక్తితో పూజించవలెను. మనోహరములైన రకరకాల పూలమాలలతోను , అనేక విధములైన రత్నములతోను , అసంఖ్యాకమైన నేతిదీపాలతోను శ్రీహరిని ఆరాధించవలెను. పాలు , వెన్న , పెరుగు , నేయిలను , వాటితో చేసిన పంచ భక్ష్యాలను , సుగంధ ద్రవ్య పూరితమైన జలములను , లవంగ సహితమైన తాంబూలమును , దక్షిణతో పాటు సమర్పించవలెను. పరిమళభరితములైన వివిధ పుష్పాలతో సమర్చించవలెను. తులసీ దళములచేతను , ఉసరిక ఫలముల చేతను , పూజింపవలెను. ఉసరికలు మహా విష్ణువుకు ప్రీతి పాత్రమే కాదు , సర్వ పాపములనూ పరిహరించగలదు. అందుకే , ఉసరి చెట్టు నీడలో పిండదానమాచరించినవాని పితరులు మాధవుని అనుగ్రహము వలన ముక్తి పొందుతారు. కార్తీకమాసములో శరీరం నిండా ఉసరిఫలాల గుజ్జును పూసుకొని , ఉసరికాయలతో అలంకరించుకొని , ఎండిన ఉసరి ఫలాలను ఆహారముగా స్వీకరించిన నరులు నారాయణులే అవుతారు. ఉసరి చెట్టు నీడలో విష్ణువును అర్చిస్తే వారు అర్పించిన ప్రతి పుష్పం వల్లనూ అశ్వమేధ ఫలం లభిస్తుంది. కార్తీక మాసములో ధాత్రీ వృక్షములు[ ఉసరి చెట్లు ] గల వనములో విష్ణువును చిత్రాన్నములతో సంతోషపరచి , బ్రాహ్మణులను భుజింపజేసి , తాము భుజించాలి. కార్తీక మాసములో రోజు విడచి రోజు మూడు రాత్రులు ఉపవాసము చేసిన కానీ , ఆరు , పన్నెండు , లేదా పక్షము రోజులు లేదా నెలరోజులూ , ఒంటిపూట భోజనము చేసి గడపినవారు పరమపదాన్ని చేరుకుంటారు. ప్రతి సాయంకాలమూ ఇంటి బయట నువ్వులనూనెతో ఆకాశదీపమును పెట్టవలెను. చతుర్దశి , అమావాస్యలలో ప్రదోషకాలపు దీపము పెట్టటం వలన యమ మార్గాధికారులనుండీ విముక్తుడౌతాడు. కృష్ణ చతుర్దశి యందు గోపూజ చేయాలి. కార్తీక పౌర్ణమిలో దేవాలయములలో దీపాలు పెట్టాలి. పురుగులు , పక్షులు , దోమలు , వృక్షములు, మరియూ నీటిలోను , భూమియందు తిరుగుతున్న జీవులూ-- ఈ దీపాలను చూస్తే తిరిగి జన్మను పొందవు. చండాలులు , విప్రులూ కూడా ఈ దీపాలను చూస్తే మరుజన్మను పొందరు. కార్తీకమాసమందు కృత్తికా నక్షత్రము రోజున కార్తికేయుని దర్శనము చేసుకున్నవారు ఏడు జన్మలు విప్రులౌతారు. ధనవంతులూ , వేదపారగులూ అవుతారు. [ ఈ నెల ఎనిమిదవ తేదీ నాడు కృత్తికా నక్షత్రము.. మధ్యాహ్నము వరకూ ] కార్తీకమాస నియమాలను పాటించి సర్వులూ శుభములను , సుఖములను పొందెదరు గాక. || శుభం భూయాత్ ||
 
http://vibhaataveechikalu.blogspot.in/

రజస్వలా ధర్మాలు.
 రజస్వలా ధర్మాలు.
            ఈ కాలములో అంటు , ముట్టు అనేవి ఎవరికీ అర్థము కావు. అర్థమయినవారు , తెలిసిన వారు అనేకులు వాటిని పాటించడము లేదు. అదంతా ఒక మూఢ నమ్మకమనీ , అశాస్త్రీయమనీ , ఇంకా రకరకాలుగా హేళన చేసేవారు పుట్టుకొచ్చారు.. మతమార్పిడులకు ఇది కూడా ఒక కారణమట ! అనాదిగా అన్ని మతాలవారూ దీన్ని పాటిస్తున్నారు, అయితే సనాతన ధర్మములో మాత్రము ఇంకా కొద్దో గొప్పో ఇది మిగిలి ఉంది. అంటు , ముట్టు లను గురించిన నేటి శాస్త్రీయమైన / అశాస్త్రీయమైన అవగాహన ఏమిటి అన్నది అటుంచితే , అసలు మన సనాతన ధర్మము దీన్ని గురించి యేమంటున్నది అని తెలుసుకోవడము ముఖ్యము. సనాతన ధర్మములో అంటు , ముట్టు అనేవే లేవని మిడిమిడి జ్ఞానముతో వాదించే పండిత పుంగవులు కూడా పుట్టుకొచ్చారు. కృష్ణ యజుర్వేదము రెండో కాండలో ఐదో ప్రశ్న చాలాభాగము దీనిగురించే వివరిస్తుంది. అందులో ఈ ఉదంతము ఉంది, దీనికన్నా ముందు , ఋగ్వేదపు ( 1-20-6 ) సూక్తము నొకదాన్ని చూద్దాము, ద్వాదశాదిత్యులలో ఒకడైన " త్వష్ట " ను ’ విశ్వ కర్మ ’ అని కూడా అంటారు. ఇతడే దేవ శిల్పి. ఇతడు కశ్యప ప్రజాపతి ( మానస ) పుత్రుడు .ఋగ్వేదము ఇతడిని బ్రాహ్మణుడు అంటే , యజుర్వేదము ఇతడిని ప్రజాపతి యనీ , అథర్వణ వేదము పశుపతి యనీ , శ్వేతాశ్వతరోపనిషత్ ప్రకారము రుద్రశివుడనీ వర్ణిస్తాయి. ప్రహ్లాదుడి కుమార్తె , ’ రచన ’ ఇతడి భార్య. వీరి పుత్రుడు " విశ్వరూపుడు " ఇతడికి మూడు తలలుండుట చేత , " త్రిశీర్షుడు " అంటారు. ఈ విశ్వరూపుడు , ప్రహ్లాదుడి దౌహిత్రుడు కాబట్టి , రాక్షస పక్షపాతి అని పేరు, అయితే కొంతకాలము దేవతల పురోహితుడుగా ఉన్నాడు. అతడి మూడు తలలలో ఒకతలతో సోమపానము చేసేవాడు , ఇంకొక తలతో సురాపానమూ , మూడో తలతో అన్న భక్షణమూ చేసేవాడు. పురోహితుడిగా యాగములు చేయించేటప్పుడు , దేవతలకు హవ్యభాగాన్ని ప్రత్యక్షంగా ఇప్పించేవాడు , అయితే , రహస్యంగా రాక్షసులకు కూడా హవ్యభాగాన్ని ఇప్పించేవాడు. ఇది తెలుసుకున్న ఇంద్రుడు , ’ ఇతడు దేవలోకాన్ని రాక్షసుల పరం చేయవచ్చు’ నని బెదరినాడు. కాబట్టి , స్వామిద్రోహి , దేవ ద్రోహి యైన విశ్వరూపుడి మూడు తలలూ తన వజ్రాయుధముతో నరికివేస్తాడు. ( సోమపానము చేయు తల ’ కపింజలము’ అను పక్షిగాను , సురాపానము చేయు తల గుడ్లగూబ గాను , అన్నము తిను తల , ’ తిత్తిరి పక్షి ’ గాను రూపాంతరము చెందుతాయి ) ఆత్మ జ్ఞాని యైన ఇంద్రుడికి దుష్ట శిక్షణ చేసినందువల్ల , బ్రాహ్మణ హత్య పాపము కాదని తెలుసు. అయినా సామాన్యులకు జనాపవాద నివృత్తి చేయుట ఎలాగ అన్న విషయము తెలుపుట కోసము , ఇలా చేస్తాడు. ధర్మ దేవతల ఎదురుగా తన అంజలితో బ్రహ్మ హత్యా పాపాన్ని స్వీకరిస్తాడు. తాను తప్పుచేయలేదన్న భావనతో ఆ పాపాన్ని ఒక సంవత్సరము భరిస్తాడు. అయితే సృష్టిలోని ప్రాణులన్నీ , ఇంద్రుడిని " బ్రహ్మ హత్య చేసినవాడు " అని ఆక్షేపిస్తాయి. కాబట్టి , సామాన్యుల దృష్టిలోకూడా దాని నివృత్తి కోసము బ్రహ్మ హత్యా పాపాన్ని ఇతరులకిచ్చి , తీసుకున్నందుకు ప్రతిగా వారికి వరాలను ఇవ్వాలనుకుంటాడు. మొదట , భూదేవిని ప్రార్థించి , తన పాపములో మూడో భాగాన్ని తీసుకోమని కోరుతాడు. భూమి , వరాన్ని ఇలా అడుగుతుంది , " జనులు నన్ను త్రవ్వేటప్పుడు నేను పీడను అనుభవిస్తాను , దానివలన నాకు హింస కలుగుతుంది. కాబట్టి , నాకు వ్యథ తెలియకుండా , హింస కలుగకుండా చూడు " . ఇంద్రుడు దానికి సమ్మతించి , జనులు భూమిని త్రవ్వేటప్పుడు భూమికి నొప్పి కాకుండానూ , అంతేకాక, ఆ త్రవ్విన చోట ఒక సంవత్సరములోపల దానికదే పూడుకొనే లాగానూ వరమిచ్చి , పాపపు మూడో భాగాన్ని వదిలించుకుంటాడు. బ్రహ్మ హత్యా పాపం తో కూడుకొన్నది కావున తనకుతానుగా పూడుకొన్న అటువంటి బంజరు భూమిని ఎవరూ నివాసము కోసమూ , యాగముల కోసము ఉపయోగించరాదు. తర్వాత ఇంద్రుడు, వృక్షములను , సస్యములనూ ప్రార్థించి , బ్రహ్మ హత్యా పాపంలో ఇంకో భాగాన్ని తీసుకొమ్మని కోరుతాడు. అప్పుడా సస్యజాలము , "జనులు మమ్మల్ని కత్తరించుటవలన మేము నశిస్తుంటాము, కాబట్టి మేము నాశనము కాకుండా వరమియ్యి " అని అడుగుతాయి. ఇంద్రుడు ఒప్పుకుని , " నరికినచోట అనేక చిగుళ్ళు మొలవనీ " అని వరమిచ్చి , పాపపు రెండో భాగం వదిలించుకుంటాడు. అందుకే , చెట్లను కొట్టివేస్తే అక్కడే అనేక చిగుళ్ళు పుట్టుకొస్తాయి. అయితే , అది బ్రహ్మ హత్యా పాపంతో కూడుకున్నది కాబట్టి , ఆ కొట్టివేసిన చోట , గట్టియైన రసము ( బంకపాలు లేదా జిగురు) కారుతుంది. కాబట్టి ఆ రసమును తాగరాదు. ( కల్లు వచ్చేది ఇలాగే , అందుకే కల్లుతాగుట నిషేధము. ) కాబట్టి , ఎరుపు రంగుతో ఏదైతే కారుతుందో , లేక , కొట్టివేసిన చోటే బయటికి కారుతుందో , అది తినుటకు యోగ్యము కాదు. అయితే , కొట్టివేయకుండానే కారే రసాలకు ఈ నిషేధము లేదు. ఆ తర్వాత , మిగిలిన బ్రహ్మ హత్యా పాపంలోని మూడోభాగాన్ని తీసుకోమని ఇంద్రుడు , స్త్రీ సమూహాలను కోరుతాడు. అప్పుడు స్త్రీలు , " నిషిద్ధ దినములలో పురుష సంయోగము వల్ల కలిగే దోషము లేకుండా , దానివలన గర్భమునకు హాని కలుగకుండా వరమునియ్యి " అని అడుగుతారు. ( పురుష సంయోగము కేవలము సంతాన ప్రాప్తికే అయిననూ , ప్రసవము వరకూ , ఇచ్చానుసారముగా పురుష సంయోగమును యే దోషమూ లేకుండా పొందుటకు యోగ్యతను పొందుతారు ) ఆ వరము వలన , ప్రథమ రజోదర్శనముతో మొదలు పెట్టి , ఋతుకాల సంబంధమైన వీర్య సంయోగము వలన సంతానము పొందుతారు , ప్రసవము అయ్యేవరకూ , ఇచ్చానుసారము పురుష సంయోగము పొందే శక్తిని పొందుతారు. అయితే , అది బ్రహ్మహత్యా సంబంధమయినది కాబట్టి , ఆ పాపము స్త్రీల రజోరూపమైనది. అనగా రజస్సును అంటిపెట్టుకొని ఉండును.           
రజస్వల అయిన స్త్రీ మలిన వస్త్రములను ధరించినదానితో సమానము. అట్టి రజస్వలతో ఎవరూ సంవాదములు చేయరాదు. పక్కన కూర్చొనరాదు. ఆమె ముట్టిన అన్నమును తినరాదు. బ్రహ్మ హత్యారూపాన్ని శరీరం లో ధరించినది కావున , స్త్రీలకు ప్రియమైన అభ్యంగనాది తైలములను రజస్వలలు తీసుకోకూడదు. సౌందర్య సాధనములను వాడరాదు. ( ఇతర వస్తువులను తీసుకొన వచ్చును ) ముఖ్య నియమములు :- ఎవడైతే రజస్వలతో సంయోగిస్తాడో , ఎవడైతే ఆ సంయోగము వలన పుట్టునో , వాడు నీలాపనిందల పాలై కష్టములనుభవిస్తాడు. అడవిలో రజస్వలతో సంయోగఫలముగా పుట్టినవాడు , దొంగ అవుతాడు. సిగ్గుతోగానీ , భయం తోగానీ , నిరాకరించిన స్త్రీని ఎవరైనా కూడితే , ఆమెకు పుట్టువాడు , సభలలో మాట్లాడుటకు సిగ్గుపడి , తలవంచుకొనెడు పుత్రుడు అవుతాడు యే రజస్వల అయితే స్నానము చేస్తుందో , ఆమెకు , నీటిలో మునిగి చనిపోగల సంతానము కలుగును ( రజస్వలలు ఆ మూడు రోజులూ స్నానము చేయరాదు) యే రజస్వల అభ్యంగన స్నానము చేస్తుందో , ఆమెకు కుష్టు రోగము , చర్మ రోగములు కల సంతానము కలుగును. యే స్త్రీ అయితే గోడలమీద బొమ్మలు వేస్తుందో , ఆమెకు కేశములు లేని , బట్టతల కలుగువారునూ , దుర్మరణము / అకాల మరణమునకు పాలగువారు పుడతారు. ఎవతె కంటికి కాటుక పెట్టుకొనునో , ఆమెకు , కళ్ళులేనివారు , నేత్రరోగులు పుడతారు. ఎవతె , దంతధావనము చేయునో ( వేపపుల్లతో ) ఆమెకు పాచి పళ్ళు , పుచ్చుపళ్ళు కలవారై పుడతారు. యేస్త్రీ గోళ్ళను కత్తరించుకొనునో , ఆమెకు వికృత గోళ్ళు కలవారు పుడతారు. యేస్త్రీ గడ్డి కోస్తుందో , చాపలల్లుతుందో , ఆమెకు నపుంసకులు పుడతారు. ఎవరైతే పగ్గములను ( తాళ్ళను ) పేని తయారు చేస్తారో , ఆ స్త్రీలకు ఉరిపోసుకొని చచ్చువారు పుడతారు. యేస్త్రీ ఆకులతో నీరు తాగునో , ఆకులలో భోజనము చేయునో , ఆమెకు ఉన్మాదులు / పిచ్చివారు పుడతారు. ఎవరైతే అగ్నిలో కాల్చిన మట్టికుండలలో నీరు తాగుతారో , ఆమెకు మరుగుజ్జులు ( పొట్టివారు ) పుడతారు. ఈ నియమాలు మూడురాత్రుల కాలము ముగియువరకూ పాటించవలెను. పచ్చికుండలలో , పచ్చి మూకుడులలో నీళ్ళు తాగడము , భోజనము చేయడము చేయవచ్చును. ఈ నియమాలు పాటిస్తే ఉత్తమ సంతానము కలుగును. ఇతరులకు కామోద్రేకము కలుగులాగ ప్రవర్తించరాదు. ఈ నిషిద్ధ కార్యములకు ఫలము అరిష్టమే కాబట్టి , అరిష్టము తెచ్చు యే పనినీ చేయరాదు. శ్రద్ధాళువులు సనాతన ధర్మపు సాంప్రదాయములను , ఆచారములను పాటించి శుభమును పొందెదరు గాక . 

 సంప్రదించిన గ్రంధములు : కృష్ణ యజుర్వేద భాష్యము , Encyclopedia of Hinduism , బోధివృక్ష --కన్నడ వార్తా పత్రిక , పురాణ భారత కోశము Posted by Janardhana

 http://vibhaataveechikalu.blogspot.in/

పంచగవ్యము ---దాని ప్రాశస్త్యత

  పంచగవ్యము ---దాని ప్రాశస్త్యత పంచగవ్యము అంటే గోవు నుండీ లభించే అయిదు పదార్థాలతో చేసిన ఒక లేహ్యము వంటిది. అవి , ఆవుపాలు , ఆవుపాలు తోడుపెట్టిన పెరుగు , ఆవు వెన్నతో చేసిన నెయ్యి , గోమూత్రము మరియు గోమయము. ఈ అయిదింటినీ ఒక ప్రత్యేక నిష్పత్తిలో ఆయా మంత్రాలతో అభిమంత్రించి కలిపి , చేసిన ద్రవమునే పంచగవ్యము అంటారు. సనాతన ధర్మములో గోవుకున్న ప్రాముఖ్యత , గౌరవము , విలువా అంతాఇంతా కాదు. వేదములో అనేకచోట్ల , ’ గోబ్రాహ్మణ ’ అన్న పదము తరచూ వస్తుంది. బ్రాహ్మణుల , గోవుల హితము కొరకు పనిచేయుట చాలా పవిత్రమైన కార్యము. గోవులను పూజించుట వేలయేళ్ళ నుండీ వాడుకలో ఉంది.. అనేకులు ఋషులతో పాటు , భగవంతుని అవతారాలయిన శ్రీ కృష్ణుడు , శ్రీ రాముడు వంటి వారు కూడా గోపూజను చేసినవారే.. అట్టి గోవునుండీ లభించు పదార్థాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. మానవుడు చేసే అనేక పాపాలలో , పొరపాట్లలో ఎన్నింటికో , సనాతన ధర్మశాస్త్రములలో అనేక ప్రాయశ్చిత్తాలు విధింపబడినవి. పంచ గవ్యము యొక్క ప్రాశన ( తాగుట ) వాటిలో ఒకటి. దీనిని బట్టే గోవులకు గల ప్రాశస్త్యము ఎట్టిదో తెలుస్తున్నది. ఒక కపిల గోవు ( ఎర్రావు )పాల నుండీ చేసిన పంచగవ్యము ఇంకా ఫలవంతమైనది.

 

 పంచగవ్య పదార్థాలను కలపవలసిన నిష్పత్తి ఈ క్రింది విధముగా ఉండాలి.

:: గోక్షీరము ఎంత తీసుకుంటే , అంతే పెరుగు కూడా తీసుకోవాలి.. గోక్షీరములో సగము గోఘృతము ( ఆవు నెయ్యి ) , గోఘృతము లో సగము గోమూత్రము , గోమూత్రములో సగము గోమయము ( ఆవుపేడ ) ఈ పంచగవ్యాన్ని అనేక ప్రయోజనాలకోసము వాడతారు... * పాపనివృత్తియై , దేహము శుద్ధముగా ఉండుట కోసము పంచగవ్యమును స్వీకరిస్తారు.

 

, * యజ్ఞోపవీత ధారణ సమయములో శరీర శుద్ధి కోసము పంచగవ్యమును మొదట ప్రాశన చేస్తారు. * కొన్ని పూజలముందరకూడా పంచగవ్య ప్రాశన చేస్తారు...,

 * ఏదైనా ఒక శివలింగముకానీ , సాలిగ్రామము కానీ , రుద్రాక్షకానీ , లేక చిన్న విగ్రహముకానీ పూజగదిలో ఉంచి పూజించుటకు ముందు , వాటిని పంచగవ్యముతో మంత్ర సహితముగా అభిషేకము చేసి , ఆ తర్వాతనే పూజించాలి. పంచగవ్యమును

ఉపయోగించు విధము యే ప్రయోజనము కోసము పంచగవ్యమును వాడుతున్నామో , ఆ సంకల్పాన్ని మొదట చెప్పాలి,

 

ఉదాహరణకు , యజ్ఞోపవీత ధారణ సమయములో శరీర శుద్ధి కోసము చేస్తుంటే , మొదట ఆచమనము , ప్రాణాయామము చేసి , దేశకాల సంకీర్తనానంతరము , 1. "|| మమ శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్ఠాన యోగ్యతా సిధ్యర్థం , శరీర శుద్ధ్యర్థం , పంచగవ్య ప్రాశన -యజ్ఞోపవీత ధారణమహం కరిష్యే || తదంగ పంచగవ్య మేళనం యజ్ఞోపవీత సంస్కారమహం కరిష్యే ||| అని చెప్పాలి. తర్వాత , పంచగవ్యము కలుపవలసిన పద్దతి :- ఒక అరిటాకులోగాని , పళ్ళెం లో గానీ శుభ్రమైన బియ్యం పోసి , దానిపైన స్వస్తిక గుర్తు వేలితో రాయాలి. ఆ గుర్తుపైన ఒక మట్టి పాత్రగానీ , ఇత్తడి లేక కంచు లేక వెండి పాత్రగానీ పెట్టి , దానికి తూర్పు దిక్కున అటువంటిదే ఒక చిన్న పాత్రలో గోమూత్రాన్ని ఉంచాలి. దక్షిణాన ఒక పాత్రలో గోమయమునుంచాలి. పశ్చిమాన వేరొక పాత్రలో ఆవుపాలను పోయాలి. ఉత్తరాన అటువంటిదే ఇంకో పాత్రలో ఆవుపెరుగు పోయాలి . మధ్యలోని పాత్రలో ఆవునెయ్యి పోయాలి. ఇవికాక , వాయవ్యములో ఒక పాత్రలో కుశోదకం పోయాలి ( దర్భలు ఉంచిన నీరు ) . ఇప్పుడు అన్ని పాత్రలలోనూ , ఆయా పదార్థాల అధిదేవతలను ఆవాహన కింది విధంగా చేయాలి తూర్పు పాత్రలో , || గోమూత్రే ఆదిత్యాయ నమః ఆదిత్యమావాహయామి || ( అని పలకాలి ) దక్షిణ పాత్రలో , || గోమయే వాయవే నమః వాయుమావాహయామి || పశ్చిమ పాత్రలో , || గోక్షీరే సోమాయ నమః సోమమావాహయామి || ఉత్తర పాత్రలో , || గోదధ్ని శుక్రాయ నమః శుక్రమావాహయామి || ( గో దధి అంటే ఆవుపెరుగు ) మధ్య పాత్రలో , || ఆజ్యే వహ్నయే నమః వహ్నిమావాహయామి || ( వహ్ని అంటే అగ్ని ) వాయవ్య పాత్రలో , || కుశోదకే గంధర్వాయ నమః గంధర్వమావాహయామి || ఇలాగ ఆవాహన చేసి , కుంకుమ , గంధము , పూలతో పూజించాలి, తర్వాత మధ్యలో ఉంచిన పాత్రలో , ఒక్కొక్క పదార్థాన్నీ కింది మంత్రాలతో కలపాలి ( మంత్రము పూర్తిగా ఇవ్వడము లేదు , వాటిని స్వరముతో పలుకవలెను. మంత్రము రానివారు , ఆయా దేవతలకు ఆయా పదార్థాలతో అభిషేకం చేసినట్లు భావించుకుంటూ ) మధ్యలోని పాత్రలోకి , గాయత్రీ మంత్రం పలుకుతూ గోమూత్రాన్ని , " || గంధ ద్వారే ...|| " అను మంత్రముతో గోమయాన్ని , "|| ఆప్యాయస్వ ...|| " అనే మంత్రంతో గోక్షీరాన్ని , "|| దధిక్రావ్‌ణ్ణో....|| " అనే మంత్రముతో పెరుగునూ , " || శుక్రమసి జ్యోతిరసి.... || " అనే మంత్రముతో నేతినీ , " || దేవస్యత్వా సవితుః .....|| " అనే మంత్రముతో కుశోదకాన్నీ కలపాలి. దర్భలు తీసుకొని , " || ఆపోహిష్ఠా ... || " అనే మంత్రముతో మధ్యపాత్రలో కలయబెట్టాలి " || మానస్తోకే తనయే ....|| " అను మంత్రముతో అభిమంత్రించి , అందులోకి మరలా గాయత్రీ మంత్రము చెబుతూ సూర్యుడిని ఆవాహన చేయాలి. తర్వాత పంచగవ్యానికి పంచమానసపూజలు చేయాలి ( లం పృథివ్యాత్మనే నమః .... ఇత్యాది ) మరలా వ్యాహృతులతో గాయత్రీ మంత్రం జపించి ,

 

  || యత్త్వగస్థి గతమ్ పాపమ్ దేహే తిష్ఠతి మామకే ( ఇతరులకోసం చేస్తుంటే , ’ తావకే ’ ) || ప్రాసనం పంచగవ్యస్య దహత్వగ్నిరివేంధనం ||

 

  అని పలికి , ఓంకారము పలికి , పంచగవ్యాన్ని ప్రాశనము చేయవలెను ( త్రాగ వలెను ) శరీర శుద్ధికోసము అయితే ఇంతవరకే.

 2. యజ్ఞోపవీత ధారణ కోసమయితే పైదంతా చేసి , తర్వాత రెండుసార్లు ఆచమించి , కొత్త యజ్ఞోపవీతాన్ని ఎడమ చేతిలో ఉంచుకొని , " || ఆపోహిష్ఠా ..|| . మంత్రముతో మొదలుపెట్టి సంధ్యావందనములోని మార్జన మంత్రాలన్నీ చెప్పవలెను. తర్వాత , ఉదకశాంతి మంత్ర పాఠము అయినవారు , "|| పవమానః సువర్జనః .... నుండీ మొదలుపెట్టి , "

|| జాతవేదా మోర్జయంత్యా పునాతు ...||. " వరకూ చెప్పి , యజ్ఞోపవీతాన్ని నీటితో అభ్యుక్షణము చేసి ( మూసిన పిడికిలితో నీళ్ళను ప్రోక్షించి ) మూడు తంతువులలోకి వ్యాహృతులను , దేవతలను ఆవాహన చేయాలి. ప్రథమ తంతౌ ఓం భూః ఓంకారమావాహయామి , ఓం భువః ఓంకారమావాహయామి , ఓం సువః ఓంకారమావాహయామి , ఓం భూర్భువస్సువః ఓంకారమావాహయామి ,అని వ్యాహృతులను ఆవాహన చేయాలి. తర్వాత , ద్వితీయ తంతి లోకూడా ‘అలాగే వ్యాహృతులను ఆవాహన చేయాలి తృతీయ తంతౌ అగ్నిమావాహయామి , నాగమావాహయామి , సోమమావాహయామి , పితౄనావాహయామి , ప్రజాపతిమావాహయామి , వాయుమావాహయామి , సూర్యమావాహయామి , విశ్వాన్దేవానాహయామి... అని పలికి , మూడు సూత్రములలోనూ , బ్రహ్మాణమావాహయామి, విష్ణుమావాహయామి , రుద్రమావాహయామి , అని ఆవాహన చేసి అక్షతలు వేసి పూజించాలి. తర్వాత , "|| స్యోనా పృథివి...... సప్రథా || " అని పలికి , యజ్ఞోపవీతా(ల)న్ని కింద భూమిపైన గానీ ఒక పళ్ళెములోగానీ పెట్టవలెను. "|| ఓం దేవస్యత్వా సవితుః ....హస్తాభ్యామాదదే || " అనే మంత్రముచెప్పి చేతిలోకి తీసుకొని , "|| ఉద్వయం తమసస్పరి....... జ్యోతిరుత్తమం || " అనే మంత్రాలను పలికి యజ్ఞోపవీతాన్ని ఆదిత్యుడికి చూపించవలెను. తర్వాత హృదయాది న్యాసములు చేసి , " ముక్తా విద్రుమ ... " ధ్యాన శ్లోకము చెప్పి , ఒక్కొక్క యజ్ఞోపవీతాన్నీ పది సార్లు గాయత్రీ మంత్రముతో అభిమంత్రించి , " || యజ్ఞోపవీతమిత్యస్య పరబ్రహ్మ పరమాత్మా త్రిష్టుప్ ఛందః | శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థే యజ్ఞోపవీత ధారణే వినియోగః || " || యజ్ఞోపవీతం పరమం ... తేజః ||" అని పలికి యజ్ఞోపవీతాన్ని ధరించవలెను. మరలా ఆచమించి , || అజినం బ్రహ్మ సూత్రం

చ జీర్ణం కశ్మల దూషితం | విసృజామి సదా బ్రహ్మవర్చో దీర్ఘాయ్తురస్తు మే || అని పాత యజ్ఞోపవీతాన్ని తీసివేయవలెను. || అనేన మయాకృత పంచగవ్య ప్రాశన- యజ్ఞోపవీత ధారణ విధి కర్మణా శ్రీ పరమేశ్వరః ప్రీయతాం || మళ్ళీ ఆచమనము చేయాలి. 3. కొత్త శివలింగము , సాలిగ్రామము , విగ్రహము , రుద్రాక్ష మొదలగునవి మొదటిసారి ధరించుటకు ముందు , పైన చెప్పినట్లే పంచగవ్య మిశ్రణము చేసి , ఆ మిశ్రణముతో " పవమానస్సువర్జనః ..." అనే మంత్రములతోను , మలాపకర్షణ మంత్రములతోను , అభిషేకము చేయవలెను. తర్వాతనే వాటిని ఉపయోగించవలెను. 4. పంచగవ్యపు ప్రయోజనాలు ఇంకా చాలానే కలవు. వాటిలో ముఖ్యమైనది , ఇంట్లో అంటు , ముట్టు పాటించుటకు వీలు కాకపోతేనో , అంటు కలసిపోతేనో , ప్రతిరోజూ కానీ , నాలుగవ రోజుకానీ ఈ పంచగవ్య ప్రాసనము చేయాలి. చివరిగా , పంచగవ్యముతో క్రిమి నివారకాలను కూడా తయారు చేస్తారు || శుభం భూయాత్ ||

 http://vibhaataveechikalu.blogspot.in/   ఉపాకర్మ ఉపాకర్మ అనగా ,

 " ఉపక్రమణ కర్మ " ( ఆరంభించుట ) ప్రాచీన కాలములో , వేదాధ్యయనము చేయు బ్రహ్మచారులు గురుకులం లో నివశిస్తూ ఉండేవారు. వేదాధ్యయనము సంవత్సరము పొడగునా ఉన్నా , మధ్య మధ్యలో కొంత వ్యవధి ఉండేది.. ఆ వ్యవధిలో వారు తమ ఇళ్ళకు వెళ్ళిరావడమో , లేక ఆచార్యుని ఇంటనే ఇతరపనులు చూసుకోవడమో చేసేవారు. వేదాధ్యయనమును తాత్కాలికముగా నిలిపివేయడము , తర్వాత మళ్ళీ మొదలుపెట్టడము అన్నవి గొప్ప ఉత్సవాలు. ఈ రెంటినీ మంత్రపూర్వకముగా , సంస్కారపూర్వకముగా , గృహ్యసూత్రానుసారము ఆచరిస్తారు. వేదాధ్యయనాన్ని తాత్కాలికంగా నిలిపివేయడాన్ని " ఉత్సర్జనము " అనీ , నిలిపిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టడాన్ని " ఉపాకర్మ " అని అంటారు. రెంటినీ కలిపి ఉత్సర్జనోపాకర్మ అంటారు. ఈ ఉపాకర్మను ఆచార్యుడు శిష్యులతో పాటూ ఏదైనా నదీతీరములో ఆచరించుట శ్రేష్ఠమని చెప్పబడినది. కొన్ని సమయాల్లో నదులకు దోషాలుంటాయి.. అప్పుడు ఆ సమయాల్లో నదీస్నానము వంటివి చేయరు. కానీ ఉపాకర్మ నాడు నదులలో ఎట్టి దోషమున్ననూ అది దోషము కాదు అని గార్గ్యోక్తి. విద్యార్థులు ఆనాడే వపనము చేయించుకొనవలెను. వారికి కూడా వపనము నకు చూడవలసిన తిథివార దోషములు ఆనాడు వర్తించవు. ఉత్సర్జనము ఉత్సర్జనములో భాగముగా , దర్భలతో చేసిన కూర్చలలో కాండఋషులను ఆవాహన చేసి , షోడశోపచార పూజచేసి , తర్పణము ఇచ్చి , ప్రతిష్టిత అగ్నిలో షట్పాత్ర ప్రయోగపూర్వకముగా నవకాండ ఋషులకు , చతుర్వేదాలకు హోమము చేసి హవ్యమునర్పిస్తారు. ఉపాకర్మ ఉపాకరణము ( ఉపాకర్మ ) అనేది కూడా రెండు రకాలు. ఒకటి అధ్యాయోపాకరణం , రెండోది కాండోపాకరణం. ఉపనయనము అయిన తర్వాత , వేదాధ్యయన ప్రారంభాన్ని అధ్యాయోపాకరణము అంటారు. అధ్యాయోపాకరణానికి ముందర , వేదములోని కాండఋషులకు హోమములు చేసి, ఆ తర్వాతనే అధ్యయనము చేయవలెను. కాండఋషులకు చేయు హోమాలనే కాండోపాకరణం అంటారు. యజుర్వేదులకు , కాండోపాకరణము అంటే , ప్రాజాపత్య , సౌమ్య , ఆగ్నేయ , వైశ్వ దేవ , మొదలుగాగల తొమ్మిది కాండముల ఋషులకు ( నవకాండ ఋషులు ) హోమము చేయుట. తర్వాత ఆయా కాండములను అధ్యయనము చేయవలెను. కాని , యజుర్వేదములో మంత్రాలు , ( సంహిత , బ్రాహ్మణము , ఆరణ్యకములలోని మంత్రాలు ) ప్రత్యేకముగా ఉండక అన్నీ కలగలసి ఉంటాయి. ఇలా కలగలసి ఉన్న మంత్రాల పాఠమును సారస్వత పాఠము అంటారు. కాండ పాఠానికి అనుగుణముగా , అదే క్రమములో సారస్వత పాఠము ఉండదు. ( అంటే , ఒక కాండ ఋషి కనుగొన్న మంత్రాలు అన్నీ ఆ కాండములోనే ఉండవు. మిగిలినవాటిలో కలగలసి ఉంటాయి ) కాబట్టి , కాండోపాకరణము ఎప్పటికప్పుడు కాక, అధ్యయనోపాకరణము తర్వాత , సర్వ కాండఋషి హోమము ( కాండోపాకరణము ) చేయుట రూఢియై ఉన్నది. కాబట్టి యజుర్వేద ఉపాకర్మలో భాగముగా , మొదట గణపతి పూజ , పుణ్యాహవాచనము చేసి , తర్వాత ఉత్సర్జనలో వలెనే , కాండఋషులను ప్రతిష్టించి, షోడశోపచార పూజ చేసి , తర్పణమునిచ్చి , షట్పాత్ర ప్రయోగము ద్వారా హోమము చేసి , బ్రహ్మముడిని విప్పిన యజ్ఞోపవీతమును హోమములో అర్పిస్తారు. అంతేకాక , నూతన యజ్ఞోపవీతాలకు పూజచేసి , దక్షిణలతో పాటు పెద్దలకు దానము చేసి , ఆశీర్వాదముపొంది , తర్వాత , తాముకూడా " శ్రౌత స్మార్త కర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధి " కోసము నూతన యజ్ఞోపవీతాన్ని ధరించి , జయాది హోమములను , ( ప్రతి ముఖ్యమైన హోమములలోనూ ఈ జయాది హోమములు చేయుట తప్పని సరి ) , తర్వాత , హోమకాలములో సంభవించు అనేక లోపదోషములకు ప్రాయశ్చిత్తముగా ’ ప్రాయశ్చిత్త హోమము ’ చేసి , ప్రత్యేక మంత్రాలతో పూర్ణాహుతి చేసిన ఉపాకర్మ సమృద్ధి అవుతుంది. అనంతరము , గడచిన సంవత్సరంలో వేదాధ్యయనములోను , సంధ్యావందనాది అనుష్ఠానములలోను ,మరియు ఇతర వైదిక కర్మల దోషములు , లోపముల పరిహారము కోసము నువ్వులు , బియ్యపు పిండి , మరియూ నెయ్యి కలిపిన పురోడాశము ( హవిస్సు ) తో రెండుచేతులతోనూ " విరజా హోమము " ఆయా మంత్రములతో చేయవలెను. తర్వాత ’ బ్రహ్మ యజ్ఞము ’ చేసి , అగ్ని మరియు ఋషులకు నమస్కారములు చేయవలెను. బ్రహ్మచారులు " ఆయుర్వర్చో యశోబలాభివృధ్యర్థం " అని చెప్పుకొని ప్రాతరగ్ని కార్యము చేయవలెను. ఆచార్యుడిని , దక్షిణ , తాంబూల , నూతన వస్త్రములతో సత్కరించవలెను. నవకాండఋషులను విసర్జించి , పర్జన్య సూక్తముతో నదీనీటిలో విడువవలెను. మరునాడు , గాయత్రీ హోమమును కానీ , సహస్ర గాయత్రిజపము కానీ చేసి , పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించవలెను. ఇక , ఉత్సర్జనం ఎప్పుడు చేయాలి , ఉపాకరణం ఎప్పుడు చేయాలి ? గృహ్య సూత్రాల ప్రకారము , యజుర్వేదీయులు ఉత్సర్జనమును పుష్యమాసపు పౌర్ణమియందు చేయవలెను. ఋగ్వేదులైతే ఈ ఉత్సర్జనమును మాఘ పౌర్ణమి నాడు చేస్తారు. యజుర్వేదీయులు ఈ ఉపాకర్మను శ్రావణమాసపు పౌర్ణమి యందు , ఋగ్వేదీయులు శ్రావణ మాసములో శ్రవణ నక్షత్రము వచ్చిన దినమందు , సామవేదులు భాద్రపద మాసపు హస్తా నక్షత్రపు దినమందు ఆచరించుట వాడుకలో ఉంది. అయితే , ఉత్సర్జనమును పుష్యమాసములో ఒకసారి , తర్వాత ఉపాకర్మను శ్రావణములో ఒకసారి చేయుట అనుకూలము లేనివారు , ఉత్సర్జనమును కూడా ఉపాకర్మ నాడే , ఉపాకర్మకన్నా ముందుగా చేయుట ఆచారములో ఉంది. అయితే ఇలా చేస్తే ఉత్సర్జనము చేయుటకు కాలాతీతము అగును కాబట్టి , దానికి పరిహారముగా , మొదట పాహిత్రయోదశ హోమమును చతుష్పాత్ర ప్రయోగముతో ఆచరించవలెను. వేదాధ్యయనమును ద్విజులు అందరూ , వీరు వారు అనుభేదములేక చేయవలెను. ఈ కాలము , పౌరోహితులు మాత్రమే వేదాధ్యయనము చేయవలెను / చేస్తారు అన్న ఒక అపోహ చాలామందిలో ఉంది. అది సర్వథా అసత్యము. ప్రతి ఒక్క ద్విజుడూ వేదాధ్యయనము చేసి , క్రమం తప్పకుండా ఈ ఉత్సర్జన ఉపాకర్మలను ఆచరిస్తే , వారి జీవితాలు అద్భుతంగా అభ్యుదయ మార్గంలో పయనించి ధన్యులవుతారు. ప్రథమోపాకర్మ నూతనముగా ఉపనయనము అయిన వటువులు , ఉపాకర్మను ప్రథమముగా జరుపుకొనేటప్పుడు మొదట నాందీ పూజ చేయవలెను. బ్రహ్మచారులు యజ్ఞోపవీతానికి ఒక చిన్న కృష్ణ జింక చర్మపు ముక్కను తగిలించుకోవడము ఆనవాయితీ . దీనికి రెండు కారణాలు. ఒకటి , యజ్ఞాలలోను , బలులలోను కృష్ణాజినమును కప్పుకొనుట , కృష్ణాజినముపై కూర్చొనుట విహితమని చెప్పబడినది. అది ధరించిన వటువు , " ఈ దినము నుండీ నా జీవితము ఒక యజ్ఞము లేక త్యాగము వంటిది. నా జీవితాన్ని లోకకల్యాణమునకై అర్పించవలెను " అని భావించవలెను. రెండోది , కృష్ణాజినము వలన , చిత్తము నిర్మలమై , సాత్త్వికమైన ఆలోచనలు కలుగుతాయి. ఈ కాలము ఇవన్నీ కేవలము సూత్రప్రాయముగా మిగిలిపోతున్నాయి. కొందరు కేవలము యజ్ఞోపవీతము మార్చుకొనుటే దీని పరమార్థముగా భావిస్తున్నారు. ఉపాకర్మ ఎందుకు చేయవలెను , అందులోని ముఖ్యాంశాలేమిటి అన్నది మాత్రమే ఇక్కడ చర్చించడమైనది. ఉపాకర్మ పద్దతి , వివరాలతో , ఇంకోసారి. యజ్ఞోపవీత ధారణ విధి ఈ మధ్య విరివిగా పుస్తకాలలోనూ , అంతర్జాలములోనూ దొరకుతున్నందున ప్రత్యేకించి రాయలేదు. యజ్ఞోపవీతాన్ని , సూతకము తర్వాతా , ఉపాకర్మ సమయములోనూ , అలాగే ప్రతి నాలుగు నెలలకొకసారీ మార్చుకోవలెను.