Monday, 30 June 2014

షష్టి పూర్తి (లేక )ఉగ్రరథ శాంతి

http://vibhaataveechikalu.blogspot.in/     

                                      షష్టి పూర్తి  (లేక )ఉగ్రరథ శాంతి 


                     మానవుని జీవితములో అనూహ్య సంఘటనలు , అనుకోని పరిణామాలు ఎదురైనపుడు భీతి చేత  స్పందించుట అతి సహజము.  అట్టి పరిణామములు సంభవించకుండా అనాదిగా ,మానవాళి ఎన్నో ఉపాయములను , పద్దతులను పాటిస్తున్నది. అయితే ఆయా పద్దతులకు  శాస్త్ర ప్రమాణము , వేద ప్రమాణము అందినపుడు , వాటి విలువా , ఆచరణా కూడా పెరుగుతాయి. 

                     మానవ జీవితము లో సగము ఆయుర్దాయము గడచు ఘట్టము చాలా ముఖ్యమైనది.  జ్యోతిష్య శాస్త్రము ప్రకారము , మానవుని పూర్ణాయుష్షు నూట ఇరవై సంవత్సరాలు. అంతలోపల అన్ని గ్రహముల దశలూ పూర్తిగా జరిగిపోతాయి. అరవై సంవత్సరాలు నిండేటప్పటికి , జాతకుని జన్మ కుండలిలో ఉన్న స్థానాలకే ఆయా గ్రహాలు వచ్చి చేరుతాయి. జాతకుడు పుట్టిన సంవత్సరమే ( నామ సంవత్సరము ) మరలా పునరావృత్తి అవుతుంది.  అంటే ఉదాహరణకి ప్రభవ నామ సంవత్సరములో పుట్టి ఉంటే , అరవై యేళ్ళు నిండగనే అరవై ఒకటో సంవత్సరం మరలా ’ ప్రభవ ’ యే వస్తుంది. సగము ఆయుర్దాయము గడచిన తర్వాత ప్రతి ఇక్కరూ ఆధ్యాత్మికం గా ఎంతో కొంత ఉన్నతిని సాధించి ఉంటారు. అందుకు కృతజ్ఞత గా భగవంతునికి ఆరాధనాపూర్వకముగా అనేకులు ఈ షష్టి పూర్తిని జరుపుకుంటారు. అదేకాక , ఆసమయములో గ్రహ సంధులవల్ల కొన్ని దోషాలు కలుగవచ్చు. దానితోపాటుగా, ఏ జన్మలో చేసిన  పాపపు ఫలము ఆజన్మములోనే తీరునన్న నమ్మకము గలవారు,   గడచిన తమ అరవై సంవత్సరాల లో ( అనగా ఆయుర్దాయపు మొదటి ఆవృత్తము )  చేసిన పాప ఫలము  రెండవ ఆవృత్తములో తక్కువ కష్టముతోనో , బాధ తెలియకుండానో తీరవలెనన్న, ఆ పాపముల తీవ్రతను శమింపజేయుటకు శంకరుడైన రుద్రుని ఆరాధించుట అవశ్యము.   రుద్రుడు సాధారణముగా సర్వులనూ , సర్వమునూ లయము చేయు కార్యములో  ఉంటాడు. ఈ రుద్రులు అనేకులు గలరు. ముఖ్యముగా  ఏకాదశ రుద్రులు గణ్యులైననూ నూట ఇరవై మంది రుద్రులు ఉంటారు అని కూడా శాస్త్ర వచనము. వందలకొలదీ రుద్రులున్నట్టు కూడా ప్రమాణమున్నది. వీరిలో , అనేకులు సౌమ్యులు , శాంతులు. కొందరు ఉగ్రులు , మరికొందరు రౌద్రులు.  ఉగ్రరథుడు అను రుద్రుడు మానవులను అరవైయవ యేట హింసించును. సంసారము నాశనమగుట , ఆయుష్షు తీరిపోవుట , అప మృత్యువు పాలగుట , శరీరము అనారోగ్యము పాలై అవయవములు శిథిలమగుట మొదలగు పరిణామములు కలిగే అవకాశము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీనిని తప్పించుటకు , ఉగ్రరథుడు అను ఆ రుద్రుని శాంతింపజేయుటయే తరుణోపాయము.  ఈ ఉగ్రరథ శాంతినే షష్ట్యబ్ధ పూర్తి లేదా షష్టి పూర్తి అని వ్యవహరిస్తారు. 
( షష్టి అంటే అరవై )

జననకాలము నుండీ అరవైయవ సంవత్సరము వచ్చినపుడు , జన్మ నామ సంవత్సరము , జన్మ మాసము , జన్మ నక్షత్రము , జన్మ దినమందు సర్వారిష్ట పరిహారము కోసము అచరించవలసిన శాంతి క్రమమే ఉగ్రరథ శాంతి.

                   ఈ షష్టి పూర్తిని అనేకులు , షోడశ సంస్కారాలలో ఒకటి అనుకుంటారు. కానీ కాదు, ఇది కేవలము ఒక శాంతి ప్రక్రియ మాత్రమే. అథర్వణ వేదములోను , యజుర్వేద బ్రాహ్మణములోను , ఋగ్వేదములోను ఈ శాంతికి సంబంధించిన కొన్ని  మంత్రాలున్నాయి. ఇది కేవలము శాంతి ప్రక్రియ మాత్రమే గనుక , ఇంటిని గోమయముతో అలుక్కోవడమో , గోమూత్రము ప్రోక్షించుకోవడమో , పంచగవ్య ప్రాసనమో  చేయవచ్చు. పందిళ్ళ వంటి ఆర్భాటాలు అవసరములేదు. పందిళ్ళు వేయదలుచుకున్నవారు , వాటిని తమకు సౌకర్యముగా వేసుకోవచ్చునే తప్ప , దానికి యే నిబంధనలూ లేవు. 

                    వేదశృతి ప్రకారము , మానవుడి ఆయుర్దాయము ఒక్కొక్క యుగములో ఒక్కో విధము. మొదటిదైన కృతయుగపు మొదటిపాదములో మానవులు వేలకొద్దీ యేళ్ళు జీవించేవారు. రెండో పాదములో ఆయుర్దాయము తక్కువ. ఒక్కో పాదానికీ ఆయుర్దాయం తగ్గుతూ , మనిషికి ఇప్పుడు వందసంవత్సరాలు ఆయుష్షు.  అదికూడా పూర్తిగా జీవించలేకపోవుటకు కారణము అనేక జన్మలలో చేసుకున్న పాప ఫలితము అని చెప్పవచ్చును. కృతయుగము నాటి వైశంపాయన మహర్షి , తర్వాత ఎప్పుడో రాబోయే కలియుగపు మానవుల ఆయుర్దాయము తగ్గుటకు చింతిస్తూ , వ్యథ చెందినవాడై , వేద వ్యాస మహర్షిని ఇలాగ ప్రశ్నిస్తాడు.  

                     " ఓ మహర్షీ , దేహమున్న యెడల అన్ని ధర్మములనూ పాటించవచ్చును. మానవుడిగా పుట్టుటయే శరీరము కోసము కదా ! ఆ శరీరము పడిపోయిన , లేదా వ్యాధి గ్రస్తమైనచో కర్మలనెట్లు ఆచరించగలడు ? కాబట్టి కలియుగములో మానవుడు పుత్రపౌత్రులతో సర్వ సంపదలతో కూడి , దుఃఖము లేనివాడై ఉండవలెనన్న , దానికి యే హేతువు కారణమగును ? దానికి యే ధర్మమునాచరించవలెను ? "
వ్యాస మహర్షి , లోక హితమునకై వైసంపాయనులు అడిగిన ప్రశ్నకు హర్షమును పొందినవాడై , ముఖములో ఆ ఆనందము కనపడుచుండగా ఇలా బదులిచ్చినాడు, 

                   " వత్సా , లోకమునకు హితము కలిగించునట్టి , ఆయుర్వృద్ధిని కలిగించునట్టి , దేహపటుత్వమును పెంచునట్టి ఒకానొక రహస్యమైన ప్రక్రియ కలదు. అదే షష్ట్యబ్ధి వ్రతము. కలియుగములో , మానవుడు అరువది యవ సంవత్సరము రాగానే , శ్రద్ధాభక్తులతో ఈ షష్టిపూర్తిని ఆచరించవలెను. వేదవిదులగు బ్రాహ్మణులను పిలిపించి , నదీ తీరమునగానీ , స్వగృహమునగానీ , లేదా తనకనుకూలమైన ఏదైనా ఒక చక్కటి ప్రదేశమున గానీ సంకల్ప పూర్వకముగా స్నానము చేసి , ఈ ప్రక్రియను వేదోక్త విధముగా ఆచరించి పూర్తి చేయవలెను. రాబోవు కాలములలో అనేకులు దీనిని సూత్రములలో వివరింపబోవుచున్నారు. ఆ రీతిన జేసినచో మనుష్యుడు దీర్ఘాయువు కలవాడై , రోగరహితుడై , వంశాభివృద్ధి కలిగి , ఉత్తమ కర్మలను చేయగలడు. " 

                 " దీనిని పూర్వము , నహుష చక్రవర్తి కుమారుడైన యయాతి చేసినాడు. ఆతడు తన మామగారైన శుక్రుడితో శపింపబడి ముసలివాడైనపుడు , శాప విముక్తికై యయాతి ప్రార్థింపగా , శుక్రుడు , " ఓ రాజా , షష్టి పూర్తి యను ఒక రహస్య వ్రతము కలదు. ఆ వ్రతమును చేసిన , తిరిగి యవ్వనమును పొందగలవు. నీ కుమారులలో ఒకరు తన యవ్వనమును నీకిచ్చిననూ నీకు యవ్వనము కలుగును ."  అని పలికెను.

                మొదట యయాతి తన కుమారులలో ఒకని యవ్వనమును తీసుకొని తన వార్ధక్యాన్ని అతడికి ఇచ్చినాడు. ఆ తరువాత అది అధర్మమని గుర్తెరిగి , పుత్రుడి యవ్వనమును అతడికే ఇచ్చివేసి , షష్టి పూర్తి వ్రతము చేసి మరలా యవ్వనవంతుడై , భోగభాగ్యాలు అనుభవించి ,  యజ్ఞయాగాదులు చేసి ,  చివరికి విష్ణు సాయుజ్యాన్ని పొందినాడు.

               ఆపస్తంబ , బోధాయన మరియూ ఇతర గృహ్య సూత్రాలలో షష్టిపూర్తికి సంబంధించిన తంతు క్లుప్తముగా వివరింపబడి ఉంది. అనాదిగా ఈ షష్టి పూర్తిని మనుషులు ఆచరిస్తున్ననూ , దీనికి ఇదమిత్థమని ఒక నిర్దిష్టమైన పద్దతి లేదు. కానీ , షష్టి పూర్తి లో భాగముగా ముఖ్యముగా చేయవలసిన విధానము పురాణములలో లభ్యమగుచున్నది. ఇది ప్రధానముగా మనిషి ఆయురారోగ్యాలకు సంబంధించినది కాబట్టి , రుద్రహోమము , మృత్యుంజయ హోమము , ఆయుష్య హోమము , నవగ్రహ హోమము వంటివి చేయుట అనాదిగా వాడుకలో ఉంది. 

             కాలము మారుతున్న కొద్దీ ఇందులో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. కొంతమంది ఆడంబరముగానూ , కొంతమంది వైదీకముగను , మరికొందరు లౌకికముగనూ ఎవరికి తోచినట్లు వారు చేయుచున్నారు. అంతే కాక, దీని చేయించే బ్రాహ్మణుడిపై ఇది ఆధారపడుతున్నది. 

            ఇక్కడ , షష్టి పూర్తి లోని అంగాలు , అతి ముఖ్యముగా చేయవలసిన తంతు , ఆ తర్వాత వనరులు ఎక్కువగా ఉన్నవారు చేసుకోవాలంటే చేయతగిన అదనపు తంతులు ఇవ్వడ మైనది. అయితే ఈ కాలము వారు చేస్తున్నట్టి ’ దండలు మార్చుకోవడము , మంగళ సూత్రము మరలా కట్టించడము , వివాహము వలెనే చేయు ఇతర తంతులు ఇందులో ఎంతమాత్రమూ భాగం కాదు. అవన్నీ అర్థము లేనివి.  అవి చేయాలనుకొనే వారు వాటికి షష్టి పూర్తి అనే పేరు పెట్టకుండా , ఇంకో పేరుతో చేసుకుంటే క్షేమము. 

షష్టి పూర్తిలో ముఖ్యమైన విశేషములు --

         మగవాడికి అరవైయవ సంవత్సరము రాగానే , దంపతులిద్దరూ కలిసి కూర్చొని ఈ షష్టి పూర్తిని ఆచరించవలెను. ఆడవారికి ప్రత్యేకముగా ఈ ప్రక్రియ లేదు. 

        ఇందులో భాగముగా  ముందురోజు పుణ్యాహవాచనము , లేదా ఉదకశాంతి మంత్రపూర్వకముగా భూభాండ , జల గృహ శుద్ధిని చేసుకోవలెను.  ఏకాదశ రుద్రులకు , ఇతర దేవతలకూ కలశములను  స్థాపించి ఆవాహన చేసి ,సాయంకాలము మహాన్యాస పూర్వకముగా రుద్ర క్రమార్చన , అభిషేకము చేయవలెను. నవగ్రహ మంత్ర జపము , మృత్యుంజయ మంత్ర జపము వంటి జపములు ముందే చేసి / చేయించి ఉండవలెను.  మరునాడు నవగ్రహ హోమము , ఆయుష్య హోమము , మహా మృత్యుంజయ హోమము చేయవలెను. 

కలశములను స్థాపించుటలో భిన్నమైన ఆచారములున్నవి. 

              రుద్రులకు పదకొండు కలశములు అని కొందరూ , అయిదే చాలని కొందరూ అంటారు. మరికొందరు , నవ గ్రహములకు తొమ్మిది , ఉదకశాంతి ప్రయోగమునకు ఒకటి , మృత్యుంజయునికి ఒకటి , మొత్తము పదహారు కలశములు  కావలెనంటారు. ( మరికొందరు ఇతర దేవతలను కలుపుకొని అరవై కలశములనీ , మరికొందరు , కాదు , నూట ఇరవై కలశములనీ అంటారు. ) కేవలము అయిదు కలశములతోనే ఈ శాంతి ప్రక్రియ చేసే పద్దతి ఆచరణలో ఉంది. ఇది శాస్త్రామోదమైనది కూడా !  ఇత్తడివి కానీ , దారుపాత్రలు ( చెక్క తో చేసిన కలశములు.)  కానీ వాడవలెను. ఇవి ముఖ్యముగా స్థాపించవలసిన కలశాల వివరాలు. 

            మరి కొందరు ,  ఏకాదశ రుద్రులకు పదకొండు , నవగ్రహాలకు తొమ్మిది , ద్వాదశాదిత్యులకు పన్నెండు , సంవత్సరానికి ఒకటి మొత్తం ముప్పై మూడు కలశాలు స్థాపిస్తారు. ఇంకా ఆసక్తి ఉన్నవారు అదనంగా మృత్యుంజయుడికి , ఆయుర్దేవతకూ , ఇంకా అనేక ఇతరదేవతలకు  మొత్తం అరవై కలశాలు స్థాపిస్తారు. ఎక్కువ కలశాలు స్థాపిస్తే , వాటిని చివరలో బ్రాహ్మణులకే దానము ఇవ్వవలెను కాబట్టి , ఎక్కువ మంది బ్రాహ్మణులను పిలవడము , వారికి వేరుగా దక్షిణలు కూడా ఇవ్వవలెను కాబట్టి అదనముగా ధనము ఖర్చు అగును. ఎవరి తాహతు , స్తోమత లను బట్టి వారు కలశములను స్థాపించవచ్చు. కేవలము అయిదే కలశములను స్థాపించి , వాటిలోనే అందరు దేవతలనూ ఆవాహన చేయు పద్దతి ఆమోదయోగ్యమైనది కనుక , కలశముల సంఖ్య కేవలము షష్టి పూర్తి జరిపించుకొను యజమాని ఆర్థిక స్తోమత పైన ఆధారపడును. తగిన పురోహితుడు దొరికితే ఇవన్నీ అతడే చెప్పగలడు. ఏదేమైనా , తమ శక్త్యానుసారము చేయుటకు పురోహితుడితో అన్నీ మాట్లాడుకుంటే మంచిది.  శక్తి గలవారు ఏ మాత్రమూ లోభము చేయక ఖర్చు పెట్టవలెను. " విత్త శాఠ్యం న కారయేత్ "  అని కదా ప్రమాణము ! శక్తి గలవారు లోభము చూపిన , వారికి కలుగు ఫలితములో కూడా లోభమే ఉంటుంది. 

          ఈ షష్టి పూర్తి యనేది , పిల్లలు తల్లిదండ్రులకు చేయు కార్యక్రమము ( పెళ్ళి వంటిది ) అని అనేకమంది కి ఒక అపోహ ఉన్నది. ఇది ఎంత మాత్రమూ నిజము కాదు.  కానీ ఆచరణలో , అప్పటికి పిల్లలు సంపాదనపరులై , తమ తల్లిదండ్రులకోసము ఇటువంటిది చేయాలనుకుంటే అందులో తప్పు లేదు. దానికి పిల్ల సహాయ సహకారాలు ఉంటే మంచిదే. 

విధానము

       షష్టి పూర్తి విధానము క్లుప్తముగా ఇవ్వడమైనది. దీనిని పురోహితుడే చేయించ వలెను గనక మంత్రముల వంటివి ఇవ్వడము లేదు. 

          దీనిని రెండురోజులు ఆచరించ వచ్చును. మొదటిరోజు ఉదయమే పుణ్యాహము చేసి , కలశములు స్థాపించి ఉదకశాంతి ప్రయోగము చేయించవలెను.  కొందరు " సర్వతో భద్ర మండలమును" నేలపైన వ్రాసి ,  రంగవల్లులతో అలంకరించి దానిపై కలశములను స్థాపించి సర్వదేవతలనూ ఆవాహన చేస్తారు.  ఆనాటి సాయంకాలము ఈశ్వరుడికి మహాన్యాస పూర్వకముగా ఏకవారమో , ఏకాదశ వారమో లేక అతిరుద్రమో చేయించ వలెను. వీలైన వారు క్రమార్చన చేయించవచ్చు. లేదా షోడశోపచార పూజ చేయవచ్చును. 

             మరునాడు మరలా పుణ్యాహము చేసి , కలశముల పైన ఆయాదేవతా ప్రతిమలను ఉంచి , ( ప్రతిమలు లేకుండా కూడా కలశ పూజ చేయవచ్చును )  నవగ్రహ పూజ , సప్త చిరంజీవుల పూజ , సంవత్సర పూజ , నక్షత్ర పూజ ,  నవగ్రహ హోమము , ఆయుష్య హోమము , మృతుంజయ హోమము , చేయవలెను. ఇవి కనీసము చేయవలసిన పూజలు. ఇంకా అదనముగా చేయాలంటే , 
 కొందరు అరవై సంవత్సరాలకూ ఆవాహన , పూజ , ఉత్తర దక్షిణాయనాలు , ఋతువులు , మాసములు , పక్షములు , వారములు , నక్షత్రములు , యోగములు , పన్నెండు రాశులు , భూమి , ఆకాశము , అశ్వినీ దేవతలు , ధన్వంతరి  --ఇలాగ తమకు తోచిన అందరు దేవుళ్ళకూ పూజలు చేస్తారు. వీటి ఆవాహనలో వేద మంత్రాలు లేవు. కేవలము పౌరాణికముగా , అంటే శ్లోకములతో ఆవాహన , పూజ జరిపిస్తారు. ఇవన్నీ శక్తి ఉన్న వారి విషయము.  ఇంకా వీలున్నవారు సప్తశతీ పారాయణము , చండీ హోమము  , శ్రీరామ పట్టాభిషేకము , భాగవత సప్తాహము , హరికథలు వంటి అనేకమైనవి కూడా చేయిస్తారు. అవి చేయుటలో పుణ్యమే గానీ , తప్పేమీ లేదు. అయితే షష్టి పూర్తికి అవన్నీ అనవసరము.   

            పూజలు , హోమములు అయిపోయినతరువాత , ఆ కలశములకు , ప్రతిమలకు పునః పూజ చేసి , ఆయా దేవతలను ఉద్వాసన చేయవలెను. హోమకుండముల ( అగ్నికి ) ఉత్తరాన కానీ , ఈశాన్యాన కానీ , స్నానార్థము కల్పించబడిన మంటపములో పుత్ర పౌత్రాదులతోను , భార్యతోను యజమానుని, అలంకరించబడిన  పీటలపైన కూర్చోబెట్టవలెను.  

            తరువాత  ,  స్థాపింపబడిన ఆ కలశములలోని నీటితోనే కర్తకు, అతడి భార్యకు ,  అవభృథ స్నానము పురోహితులు , బ్రాహ్మణులు చేయించెదరు. ఈ స్నానములో భాగముగా ,  వంద చిల్లులు కల ఒక పెద్ద ఘటమును ( కుంభమును ) కానీ , చిల్లులు కల జల్లెడ వంటి ఒక పళ్ళెములో కానీ నవరత్నములు వేసి కానీ , లేక , నవరత్నములు తాపడము చేసియున్న పళ్ళెములో గానీ కలశముల నీరు పోస్తూ , యజమానుడి తలపైన పడునట్లు స్నానము చేయించవలెను. నవరత్నములు లేకున్ననూ , కలశముల నీటితో అవభృథ స్నానము చేయించుట ముఖ్యము.  ఇది అభిషేకము కాదు. అభిషేక మంత్రములు పఠించరు. కేవలము పౌరాణిక మంత్రాలతో స్నానము చేయిస్తారు. అయితే , మరి కొందరి ప్రకారము , మార్జన మంత్రములు , పవమాన మంత్రములు , నవగ్రహ / లేక దిక్పాలక మంత్రములు , వరుణ మంత్రములు మొదలగు అనేక వేద మంత్రములతో స్నానము చేయిస్తారు. ముఖ్య గమనిక : ఈ స్నానములో రుద్రాధ్యాయము పఠించకూడదు.  దీనినే అవభృథ స్నానము అంటారు. తర్వాత కంచు పాత్రలో ఉంచిన దీపములతో నీరాజనం ఇస్తారు. తరువాత మంటపానికి నాలుగు దిక్కులా చిత్రాన్నముతో ( పసుపు కలిపిన అన్నం ) బలి ఇస్తారు. తాము ధరించిన వస్త్రములను ఆచార్యునికి కానీ , మరి ఎవరికైనా కానీ దానము చేయవలెను.  తాము కొత్త వస్త్రములు ధరించి , గంధము , కుంకుమ ధరించి , పూలమాల ధరించి , రక్ష స్వీకరించి , ఒక కంచుతో చేసిన నేతి పాత్రలో అలక్ష్మీ పరిహారము కోసము తన ముఖపు ప్రతిబింబమును చూసుకోవలెను. దక్షిణ తామ్బూలాలతో ఆ నేతి పాత్రను బ్రాహ్మణుడికి దానము ఇవ్వవలెను. 

             వీటితో కలిపి , బ్రాహ్మణులకు , మొత్తం పదిరకాల దానాలు ఇవ్వవలెను ( దశ దానములు) . ఈ దానాల ఉద్దేశము , తనకు శేషజీవితములో కష్టనష్టాలు రాకూడదని , అంతేకాక ,  ఈ ప్రపంచములో మనిషికి ఏదీ తనది కాదు , ఏదీ మిగలదు, ఏదీ వెంటరాదు కాబట్టి తనవంతుగా , తనకు బ్రతుకునిచ్చిన ఈ ప్రపంచానికి ప్రతిగా ఇచ్చుటయే !  అది వానప్రస్థాశ్రమమునకు చేరు వయసు కాబట్టి , ధనలోభము వదలి , తమ సంతతి అభ్యున్నతి  కొరకై వీలైనంతగా ఎన్ని దానాలు ఎక్కువగా ఇస్తే , అంత సంపద తన సంతతికీ , తన వారసులకూ వచ్చి చేరుతుంది. దాచిపెట్టుకుంటే దొంగలపాలే కాక, తనకు పుణ్యము రాదు కూడా ! తమ శక్తి సామర్థ్యములను బట్టి  కొందరు అతి తక్కువ ఖర్చుతోను , కొందరు ఆడంబరముగానూ జరుపుకుంటారు. ఈ శాంతి వలన అందరికీ సమాన ఫలమే వచ్చును. కానీ లోభము చేస్తే , వచ్చు ఫలము కూడా లోభముగా వస్తుంది. షష్టిపూర్తి వైశిష్ట్యాన్ని నమ్మిన వారు దీన్ని కూడా నమ్మి తీరవలెను. 

 ముఖ్య ఆచార్యుడికి , గోదానమును ప్రత్యేకముగా , ఈ విధముగా ఇవ్వ వలెను. 

               ఆచార్యుడిని ఒక పీఠముపైన కూర్చోబెట్టి , గంధపుష్ప తామ్బూల వస్త్రములిచ్చి ,  వేదబ్రాహ్మణులు మంత్రములు చెప్పుచుండగా , గోవును , దూడను , పాలుపితుకుటకు ఒక కంచుపాత్రనూ దానమివ్వవలెను. ( వీటికి బదులుగా కొంత ధనమునిచ్చుట ఇప్పుడు పరిపాటియైఉన్నది. ) 

తర్వాత కలశములను దానమీయవలెను.

మొదటగా , ప్రధాన ప్రతిమ , అనగా మృత్యుదేవతా ప్రతిమను , తర్వాత మృత్యుంజయ ప్రతిమను , కలశవస్త్రములతో పాటు ఇవ్వవలెను. 

           ఆ తరువాత , ఇతర బ్రాహ్మణులను ఒక్కొక్కరిని అదే విధముగా కూర్చోబెట్టి , ఇతర కలశ వస్త్ర ప్రతిమలను దానము చేయవలెను. బ్రాహ్మణులెందరు , కలశములెన్ని , ఎవరికి యే దానము వంటి విషయములను ముందే నిర్ణయించుకోవలెను. ఒకవేళ అనుకున్న వారికన్నా ఎక్కువ మంది బ్రాహ్మణులు వస్తే మిగిలిన వారికి దక్షిణ తాంబూలముల నివ్వవలెను. అనుకున్న వారికన్నా తక్కువ మంది వస్తే , ధనము మిగిలించుకోక , దానినే అందరికీ ఇవ్వవలెను. లోభము పనికి రాదు. ఈ దానములు ఇచ్చునపుడు , తీసుకొనే బ్రాహ్మణుడు కాక మిగిలిన వారు ఆయా మంత్రాలను పలుకుతుంటారు. 

ఇది అయిన తర్వాత , పదిరకాల దానములను ( దశ దానములు ) ఇవ్వవలెను.

దశదానాలు ఏవనగా , 

నల్ల నువ్వులు / లేక నువ్వుల నూనె , 
గోఘృతము ( ఆవు నెయ్యి )
భూదానము ( దానికి బదులుగా కొంత ధనము )
గోదానము ( దానికి బదులుగా కొంత ధనము )--( ఇది ముందే ఇచ్చాము ) 
హిరణ్య ( బంగారం ) దానము ( దానికి బదులుగా కొంత ధనము )
రజత ( వెండి ) దానము ( దానికి బదులుగా కొంత ధనము )
గుడ దానము ( బెల్లము )
వస్త్ర దానము 
లవణ దానము
కంబళి దానము 
ప్రత్తి దానము

పై పదీ కాక , అయః ఖండదానము ( ఇనప గుండు ) దానము ఇస్తారు. 

నువ్వుల నూనెను ఒక కుండలోను , ఉప్పు , ప్రత్తి , బెల్లము వంటివి దోసిలి పట్టే అంత ఇస్తారు. ఇనప గుండు , కనీసము ఇరవైనాలుగు పలముల బరువు ఉండవలెను. ఈ దానాలన్నీ కూడా మంత్ర పూర్వకముగా ఇవ్వవలెను.  

దానముల తరువాత మరలా స్నానము చేసి , వేరే వస్త్రములు ధరించవలెను. 

                      ఆ తరువాత వీలైనంతమంది ఎక్కువ బ్రాహ్మణులకు , బంధువులకు భోజనాలు , మిగిలిన బ్రాహ్మణులకు దక్షిణలు ,తర్వాత కానుకలు ఇచ్చుట , వగైరాలు చేయవచ్చును. తరువాత  , బ్రాహ్మణాశీర్వాదము పొందవలెను. ఆ తరువాత దగ్గరి బంధువులతో కలసి తాను భోజనము చేయవలెను. 

                                                                     

                                                    || శుభం భూయాత్ ||

కొన్ని విశిష్టమైన శివ క్షేత్రాలు:

Vinjamuri Venkata Apparao
కొన్ని విశిష్టమైన శివ క్షేత్రాలు:
భైరవకోన ::
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోగల 'ప్రకాశం' జిల్లా కొత్తపల్లి గ్రామానికి 5 కి.మీ. నడక దూరంలో ఈ క్షేత్రము కలదు. ఎక్కడ చూసినా కోనేరులు, శివ లింగాలు కనిపించే ఈ కొనలో ఒకే రాతిలో చెక్కబడిన 8 శివాలయాలు క్రీ.శ. 7, 8 శతాభ్దాలలో నిర్మించబడినట్లు చరిత్ర. పురాణాలలో వర్ణించిన శివుడు తన 8 రూపాలకు సంకేతంగా శశినాగ, రుద్ర, విశ్వేశ్వర, నగరికేశ్వర, భర్గేశ్వర, రామేశ్వర, మల్లిఖార్జున, పక్షఘాతక లింగాల రూపంలో దర్శనమిస్తాడు.
ధర్మస్థల ::
కర్నాటక రాష్ట్రంలో గల 'ఉడిపి' నుండి 120 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం కలదు. ఇది మంగుళూరు నుండి 75 కి.మీ. దూరంలో ఉన్నది. నేత్రావతి నదీ తీరంలోనున్న ఇచ్చటి ఆలయం పేరు 'మంజునాథేశ్వరాలయం'. క్రీ.పూ. 10వ సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించబడింది.ఈ ఆలయంలో అసత్యం పలికే విపత్తు కలుగుతుందనే నమ్మకం వలన కోర్టులో తెగని కేసులు స్వామి ఎదుట పరిష్కారం పొందుతారు. ఆలయంలో మూలవిరాట్ ను జైనులు ప్రతిష్ఠించారు. 800 సంవత్సరాల నుండి నిత్యాన్నదానం ఇచ్చట జరుగుతుంది.
తంజావూరు ::
తమిళనాడు రాష్ట్రంలో గల 'చెన్నై' నుండి 335 కి.మీ. దూరంలో గల 'తంజావూరు' అద్భుత క్షేత్రం. ఇచ్చటి ఆలయం పేరు బృహదీశ్వరాలయం. ఇది 10వ శతాబ్దంలో రాజరాజచోళుడు అనే చక్రవర్తిచే నిర్మించబడినది. ప్రపంచంలోని ఏ ఆలయానికి ఇంత ఎత్తయిన ప్రాకారాలు లేవని అంటారు. ఈ ప్రాకారం పొడవు 793 అడుగులు, వెడల్పు 393 అడుగులు, 13 అంతస్తులుగా నిర్మించిన 216 అడుగుల ఎత్తుగల ఆలయ గోపురం పై 80 టన్నుల రాయిని శిఖరాగ్రంగా ఆ రోజుల్లో 4 మైళ్ళ దూరం నుండి ఏటవాలు రాళ్ల వంతెనపై దొర్లించుకొచ్చి నిలిపారట. ఆలయం లోపల ఎత్తయిన వేదికపై 13 అడుగుల ఎత్తుగల శివలింగం ఉంటుంది. ఆలయానికి కొంచెం దూరంలో రాజరాజచోళుని కుమారుడు నిర్మించిన గంగైకొండ చోళపురంలో శివాలయం అద్భుత శిల్పకళతో ఈ ఆలయంతో పోటీ పడుతుంది. ఈ ఆలయం 'యునెస్కో' వారిచే ప్రపంచ సంస్కృతీ చిహ్నంగా గుర్తింపు పొందినది.
దుగ్ధేశ్వరనాథ్ ::
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గల 'గోరఖ్ పూర్-బటని' మార్గంలోనున్న 'గౌరీబజార్' స్టేషన్ నుండి 15 కి.మీ. దూరంలో గల ఈ క్షేత్రం రుద్రపురం అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయంలోని శివలింగము 12 జ్యోతిర్లింగాలలో ఒకటయిన ఉన్నయినిలోని మహాకాళేశ్వర లింగానికి ఉపజ్యోతిర్లింగం. ఆలయంలోని శివలింగం అప్పుడప్పుదు తనకు తానుగా కదులుతుంది. ఒక్కక్కసారి రోజంతా కదులుతుంది. హఠాత్తుగా ఆగిపోతుంది. అప్పుడు లింగాన్ని గట్టిగా పట్టీ ఉంచినప్పటికీ కదలిక లేకపోవటం ఆశ్చర్యం.
తలకాడు ::
(1)
కర్నాటక రాష్ట్రంలో గల 'మైసూర్' నుండి 60 కి.మీ. దూరంలో గల క్షేత్రం ఇది. కావేరీ నదీ తీరంలోనున్న ఇచ్చటి ఆలయం పేరు 'వైద్యేశ్వరాలయం'. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఇసుకతో కప్పబడి 1978, 1999, 2002 సంవత్సరాలలో కార్తీకమాసం 5 సోమవారాలలో దర్శనం ఇచ్చింది. మరలా పునర్దర్శనం క్రీ.శ. 2014లో అంటున్నారు. ఈ విధంగా ఇచ్చటి లింగాకారం 12 సంవత్సరాల కొకసారి కార్తిక మాసంలో 5 సోమవారాలు పడినపుడు మాత్రమే దర్శనం ఇస్తుంది. అప్పుడు జరిగే 'పంచలింగ దర్శనం' అనే మహోత్సవానికి లక్షల కొలదీ జనం వస్తారు.
(2)
కర్ణాటక రాష్ట్రంలోని 'మైసూర్' నుండి 600 కి.మీ. దూరంలో గల క్షేత్రం 'తలకాడు'. ఈ ఆలయం పేరు 'పాతాళేశ్వరాలయం'. క్రీ.శ. 1004 వరకు పాలించిన గంగవంశ రాజుల కాలం నుండి ఈ ఆలయ ఉంది. కాల ప్రవాహంలో ఇసుకతో కప్పబడింది. పురావస్తు శాఖవారి దయ వలన బయటపడింది. నేల మట్టంకన్నా చాలా లోతుగా ఉన్న ఆలయంలోని శివలింగం ఉదయం ఎరుపు, మధ్యాహ్నం నలుపు, సాయంకాలానికి తెలుపు రంగులోకి మారుతూ కనిపిస్తుంది.
మహేశ్వర్ ::
మధ్యప్రదేశ్ రాష్త్రంలో 'ఇండోర్' నుండి 100 కి.మీ. దూరంలో గలదు ఈ క్షేత్రం. ఇచ్చటి ఆలయంపేరు 'రాజరాజేశ్వరాలయం'. పురాణాలలో 'మాహిష్మతి'గా పిలువబడే ఈ క్షేత్రం అనడు కార్తవీర్యార్జునుని రాజధాని. అయన సహస్ర బాహువులకు ప్రతీకలుగా 'సహస్రధార'గా నర్మదానది ప్రవహిస్తుంది. ఇండోర్ రాణి అహల్యాబాయి నిర్మించిన ఏకశిలా నిర్మిత ఆలయాల సముదాయం 'అహల్యేశ్వరాలయం' చూడవలసినది. అనేకమైన ప్రాచీన మందిరాలు విభిన్న దేవతలకు ఉన్నాయి. 108 దేవీ పీఠాలలఓ ఒకటైన 'స్వాహాదేవి' మందిరం ఉంది. రాజరాజేశ్వరాలయంలో పెద్ద శివలింగంతో పాటు 8 లోహాలతో నిర్మించబడిన శివపార్వతుల విగ్రహం ఉంది. వాటికీ ఎదురుగా 1000 సంవత్సరాల క్రిందటి అఖండదీపం దర్శనం ఇస్తుంది.
కోటప్పకొండ ::
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'గుంటూరు' నిల్లాలోని నరసరావుపేట నుండి 11 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం కలదు. శివుని దక్షిణామూర్తి రూపానికి గల ఏకైక ఆలయం. కనుక ఇచ్చట అమ్మవారు ఉండరు. స్వామికి ఉత్సవాలు ఉండవు. త్రికూట క్షేత్రంలో స్వయంభూ శివలింగం. కొండమీద ఆలయం ఉంది. ఆలయం వరకు బస్సు సౌకర్యం కలదు. బ్రహ్మ, విష్ణు, రుద్ర శిఖరాలు మూడింటిమీద 3 శివాలయాలు ఉన్నాయి. వేలకొలది ప్రభలు మొక్కుబడిగా శివరాత్రికి వస్తాయి.
సురుటుపల్లి ::
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా నందు గల 'సత్యవేడు'కు దగ్గరలో గల క్షేత్రం ఇది. అరుణానదీ తీరంలో గల ఈ క్షేత్రంలోని ఆలయం పేరు 'పల్లికొండేశ్వరాలయం'. శివశైవ క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రంలో గరళం త్రాగిన శివుడు పరుండి యుంటే బయట ఏకాంతంగా నంది ఉంటుంది. స్వయంభూ శివలింగంతో పాటు స్వయంభూ గణపతి విగ్రహం కలదు. స్కాంద పురాణ శివరహస్య ఖండంలో శివుడు హాలాహలం మ్రింగి విశ్రమించి నందున 'కాలకూటానన'క్షేత్రంగా ఇది వర్ణించబడింది. నిదురించే శివుని చుట్టూ బ్రహ్మాది దేవతలు అందరూ ఉన్నారు.
పోండా ::
గోవా రాష్ట్ర రాజధాని 'పానాజీ' నుండి 22 కి.మీ. దూరంలో గల ఈ క్షేత్రంలో ఆలయం పేరు మంగేష్ ఆలయం. ఈ ఆలయం 16వ శతాబ్దంలో పునఃప్రతిష్ఠ చేయబడింది. అందమైన సరస్సు తీరానున్న ఈ ఆలయం బంగారు కలశంతో ధర్శనమిస్తుంది. ఇండో-పోర్చుగీసు-ఇస్లాం నిర్మాణ శైలీ విన్యాసాలు ఈ ఆలయంలో గోచరిస్తాయి. ప్రతి సభా మంటపం, దీప స్తంభం ఆలయ శోభను ఇనుమడింపజేస్తాయి. గర్భాలయంలో రజత తోరణం మధ్య మంగేష్ స్వర్ణ ప్రతిమ కిరీటంపై నరసింహ స్వామి ఉగ్రరూపం దర్శనమిస్తుంది. శాలువాలతో, ఆభరణాలతో, పుష్పాలతో, స్వర్ణ ప్రతిమను నిత్యం అలంకరిస్తారు. ఆలయంలోని ఈ ప్రాచీన శివలింగం క్రీ.శ. 1560 వరకు 'కుశస్థలి'లో గల ఆలయంలో పూజలందుకునేది.
ఖాట్మండు ::
(1)
నేపాల్ దేశ రాజధాని అయిన 'ఖాట్మండు' క్షేత్రంలోని ఒక ఆలయం పేరు 'విశ్వరూప మందిరం'. ఇది ప్రసిద్ధి చెందిన పశుపతినాథ దేవాలయానికి దగ్గరలో ఉంది. ఈ మందిరానికి వెళ్ళే దారిలో ఎడమవైపున 11 శివాలయాలు ఉన్నాయి. అతి ప్రాచీనమైన ఈ ఆలయం విశాలమైన ప్రాంగణం కలిగి, గర్భాలయ, అంతరాలయాలను కలిగి ఉంది. అంతరాలయం చుట్టూ ఎత్తైన గోడ కలిగి ప్రదక్షిణానికి అనుకూలంగా ఉంది. ప్రధానాలయంలో శివుడు వేయి చేతులతో పార్వతిని ఆలింగనం చేస్తున్నట్లు సుమారు 50 అడుగు విగ్రహం ఉంది. ఈ ఆలయాన్ని ఉ. 5.00 గం.లకు, సాయంకాలం 7.00 గం.లకు మాత్రమే తెరుస్తారు. ఆ సమయంలో సుమారు అరగంట మాత్రమే దర్శనం ఉంటుంది.
(2)
శివుని అష్టమూర్తి క్షేత్రాలలో యాజమాన లింగంగా ప్రసిద్ధినొందినది పశుపతినాథలింగం నేపాల్ లోని ఖాట్మండులో కలదు. నేపాల్ లోని అత్యంత పవిత్రమైన 'ఖాట్మండు' ప్రదేశం;హిందూధర్మానికి, సంస్కృతికి పట్టుకొమ్మగా నిల్చింది. ఇచ్చటి దేవత పశుపతినాథ్, అమ్మవారు గుహ్యేశ్వరి (పార్వతి). ఖట్మాడులో విరాజిల్లుతున్న ఈ జ్యోతిర్లింగం 'పశుపతి' అనే నామంతో ప్రసిద్ధి పొందినది. ఇది శివుని అష్టమూర్తులలో 'యాజమాన' మూర్తిగా కూడా కొలువబడుతున్నది. మహేశ్వరునకు ఉన్న అనేక నామములలో పశుపతి ఒకటి.
తిరువల్లం ::
తమిళనాడు రాష్ట్రంలో 'రాణిపేట'కు మరియు చిత్తూరుకు దగ్గరలో ఉంది. ఈ క్షేత్రంలోని ఆలయం పేరు 'బిల్వనాథేశ్వరాలయం'. దీనిని 5వ శతాబ్దంలో పల్లవరాజులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. 1500 ఏళ్ళనాటిదిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలోని విగ్రహం క్రీ.పూ. 794లో రూపొందించబడినదని శాసనం. పల్లవ రాజులు 850 బి.సి. లో గర్భగుడిపై విమాన గోపురాన్ని నిర్మించారు. చోళుల కాలంలో 1000 స్తంభాల మండపం నిర్మించబడింది. ఇక్కడ ఉన్న బిల్వవృక్షంలోని ఆకులతో శివుని విగ్రహానికి నిత్యపూజలు చేస్తారు. ఆ ఆకులను తింటే రోగాలు నయమవుతాయని స్థానికుల నమ్మకం.
నత్తరామేశ్వరం ::
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా 'అత్తిలి' నుంది 6 కి.మీ. దూరంలో గల క్షేత్రమిది. గొనని నదీ తీరాన ఉన్న ఈ క్షేత్రంలోని ఆలయం పేరు 'రామలింగేశ్వరాలయం'. ఆలయంలోని శివలింగాన్ని పరుశురాముడు ప్రతిష్టించినట్లు చరిత్ర. ఈ ఆలయంలోని లింగం ఎప్పుడూ నీటిలో మునిగి నత్తల సంపుటితో కుడి ఉంటుంది. లింగంపై వ్రేలి ముద్రలుగా నిలువు చారలు ఉంటాయి.
కాళేశ్వరం ::
అంధ్రప్రదేశ్ రాష్త్రంలో 'కరీంనగర్' జిల్లా కేంద్రం నుండి 130 కి.మీ. దూరంలో గల క్షేత్రం ఇది. గోదావరి, ప్రణీత, సరస్వతుల త్రివేణీ సంగమంలో ఉన్న ఈ క్షేత్రంలోని ఆలయం పేరు 'కాళేశ్వరాలయం'. వేంగి రాజైన విష్ణువర్ధనుడు నిర్మించినట్లు చరిత్ర. ఇచ్చటి ఆలయంలో ఒక స్వయంభూ లింగం ముక్తీశ్వరుడు, రెండవది శివుని ఆదేశం ప్రకారం యమధర్మరాజే లింగంగా వెలిసిన కాళేశ్వరుడు అనే రెండు లింగములు ఒకే పానవట్టంపై ఉండటం విశేషం. ఈ ఆలయంలో ప్రాకారం క్రింద వివిధ దిక్కులలో వివిధమైన ఆలయాలుంటాయి. ఆలయం పరిసరాలలో ఉన్న 'యమకోణం' చూచి తీరవలసింది.
పృధుదక్ ::
హర్యానా రాష్త్రంలో కురుక్షేత్రం నుండి 50 కి.మీ. దూరంలో గణ పిహోవా స్టేషను నుండి 4 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం కలదు. ఇక్కడి ఆలయం పేరు 'సంగమేశ్వరాలయం'. దీనిని 'అరుణాయి మందిరం' అని కూడా పిలుస్తారు. భూగర్భంలో ఎంతలోతు వరకుందో తెలియని స్వయంభూ లింగం గల ఈ ఆలయం అరుణ, సరస్వతి నదుల సంగమ స్థలంలో ఉంది. ఈ ఆలయంలోని శివలింగంను చుట్టుకొని ఎప్పుడూ ఒక సర్పం ఉంటుంది. శివశక్తే అలా సర్పరూపంలో ధర్శనమిస్తుందని భక్తుల విశ్వాసం. ఆ సర్పం ఇప్పటి వరకు ఎవరికీ హాని చేహలేదని చెబుతారు.
గార్హముక్తేశ్వర్ ::
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 'ఢిల్లీ-మొరాదాబాద్' లైనులో గల 'బ్రజ్ ఘాట్' నుండి 6 కి.మీ. దూరంలో గల క్షేత్రం ఇది. ఒక సిద్ధుని ద్వారా ఇచ్చటి ఆలయానికి చేరిన శివలింగం తెల్లని స్ఫటికంతో నిర్మితమై సప్త వర్ణాలను వెదజల్లుతుంది. ఏడాదికొకసారి పెద్ద శివలింగం నుండి చిన్న శివలింగం పుడుతుంది. బహు ముఖాలతో కూడిన శివలింగం నుండి అనేక భాగాలు విడివడిన సంగతి బాగా పరిశీలిస్తే తెలుస్తుంది. ఇంతకు పూర్వం చిన్న లింగం వెలువడిన స్థానంలో నుండి మరొకటి బయటపడుతోంది.
శివగంగ ::
కర్ణాటక రాష్ట్రంలోని 'బెంగళూరు' నుండి 60 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఇచ్చటి ఆలయం పేరు 'గంగాధరేశ్వరాలయం'. గుహలోపల ఉన్న 2-1/2 అడుగుల ఎత్తుగల శివలింగానికి పసుపుగా ఉన్న నెయ్యిని మర్దిస్తే అది చూస్తుండగానే తెల్లటి వెన్నగా మారుతుంది. కాదని తొలచి చేసిన ఓ విశాలమైన గుహలో ఉన్న ఈ శివలింగాన్ని చేరుకోవాలంటే దాదాపు 200 మెట్లు ఎక్కి వెళ్ళాలి. అర్చన టికెట్ తో పాటే నెయ్యి కూడా ఇస్తారు. యూరోపియన్ హేతువాదులు తపదేశం నుండి (మనల్ని నమ్మక) నెయ్యిని తెచ్చి లింగానికి రుద్ది వెన్నగా మారే వాస్తవాన్ని అంగీకరించారు. ఈ వెన్నని బాధా నివారణ మందుగా వాడుతుంటారు.
కాంచీపురం ::
ఏకామ్రేశ్వరుడుగా (క్షితిలింగం) పరమశివుడు పృథ్వీలింగంగా వెలసి అనంత మహిమలతో భక్తులను తరింపజేసేదే ఈ కాంచీ క్షేత్రం. 'ఏక' అంటే ఒక, 'అమ్ర' అంటే మామిడి. ఈశ్వరుడు అంటే శివుడు. (ఏక+అమ్ర+ఈశ్వరుడు) అంటే మామిడి చెట్టు క్రింద వెలసిన స్వామి వారు గనుక ఈ స్వామికి ఏకామ్రేశ్వరుడు అనే పేరు ఏర్పడినట్లు చెప్పబడింది. ఈ ఆలయాన్ని 'పెద్దపడి' అని పిలుస్తారు. దీనినే 'తిరువేంకంబం' అని 'తిరుకుచ్చి ఏకంబం' అని 'తిరు ఆలయం' అని తమిళులు పిలుస్తారు. శివకంచి ఏకమ్రేశ్వరస్వామి ఆలయం విశాలమైన మూడు ప్రాకారాలతో, ఎత్తైన గోపురంతో అద్భుతమైన శిల్పకళావైభవోపేతంగా ఉంటుంది.
పంచరామాలు ::
ఈ పంచారామ క్షేత్రాలు ఆంధ్రరాష్ట్రంలో మూడు జిల్లాలలో వెలసినవి. అవి - గుంటూరు జిల్లాలోని అమరావతిలోను, పశ్చిమ గోదావరి జిల్లాలోని గునుపూడి భీమవరంలో ఒకటి, పాలకొల్లులో ఒకటి, తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామంలోని ఒకటి, సామర్లకోట కుమారారామ భీమేశ్వరంలో ఒకటి వెలసి భక్తుల పూజలందుకొంటున్నాయి. ఇక ఆలయ విశేషాలు పరిశీలిస్తే శివుని లింగాకృతిలో విచిత్రమైన విభేదాలు - అమరారామంలో 36 అడుగుల ఎత్తులో 9 అడుగులు మాత్రమే దర్శిస్తాము. ద్రాక్షారామంలో 14 అడుగులు, సామర్లకోటలో 12 అడుగులు ఎత్తుగల శిలింగం. భీమవరం, పాలకొల్లులో రెండడుగుల ఎత్తు ప్రమాణం గల శివలింగం దర్శిస్తాము. అమరారామంలో బాలరాముండేశ్వరి సహిత అమరేశ్వరస్వామిగాను, ద్రాక్షారామంలో మాణిక్యాంబ సహిత భీమశ్వరునిగాను, కుమారారామంలో బాలాత్రిపుర సుందరి సమేత సోమేశ్వరునిగాను, సోమారామంలో పార్వతి, అన్నపూర్ణసమేత సోమేశ్వరునిగానూ, క్షీరామంలో పార్వతి సహిత శ్రీరామలింగేశ్వరునిగాను పూజింపబడుతున్నారు. ఈ పంచారామ క్షేత్రాలైదింటిలోను ద్రాక్షారామానికి ప్రత్యేక విశిష్టత కలదు. ఇక్కడి అమ్మవారు మాణిక్యాంబదేవి అష్టాదశపీఠాలలో 12వ శక్తిపీఠంగాను, భీమేస్శ్వర స్వామి ద్వాదశ జ్యోతిర్లింగ ఉపలింగంగాను ప్రసిద్ధి చెందినది.
చిదంబరం ::
పరమశివుని పంచభూతాల్లో అయిదవది, శివుని అష్టమూర్తి స్వరూపాల్లో ఒకటైనది -- ఆకాశరూపంలో కొలువుతీరిన చిదంబరం క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలో చెన్నై నగరానికి సుమారు 250 కి.మీ. దూరంలో దక్షిణ ఆర్కాట్ జిల్లాలో ఉంది. నటరాజస్వామి ఆనంద తాండవం చేసే చిదంబరాన్ని ప్రాచీనకాలంలో తిల్లయ్-వనం, వ్యాఘ్రపురం, పొన్నాంబళం, పురియార్, పుండరీకపురం, భూలోక కైలాస్ అనే పేర్లు ఉండేవి. కాలక్రమంలో ఈ స్థలానికి చిదంబరం అనే పేరు వ్యాప్తిలోకి వచ్చి స్థిరపడింది. చిదంబరం అంటే చిత్ + అంబరం, చిత్ అంటే జ్ఞానము, అంబరం అంటే అనంతమైన ఆకాశం. చిదంబరంలో (చిత్ సభ, కనుక సభ, దేవసభ, నృత్యసభ, రాజసభ) పంచ సభలకి ప్రాధాన్యం ఉంది గనుక ఆ పేరు వచ్చింది. 'తిల్లయ్' అనే వృక్షాలు అధికంగా ఉండడం వాళ్ళ ఈ క్షేత్రానికి 'తిల్లయ్' వనం అనే పేరు వచ్చింది. ఇక్కడి అమ్మవారి పేరు "శివకామసుందరి'.
తిరువణ్ణామలై ::
'తిరు' అంటే పెద్దది, 'అణ్ణా' అంటే అగ్ని 'మలై' అంటే కొండ అని అర్థం. ఎత్తైన కొండపై వెలసిన స్వామి అరుణగిరి రూపంలో అవతరించిన శివమహాదేవుని మహిమాన్వితమైన జ్యోతిస్వరూపమే అణ్ణామలయ్యార్ స్వామి. ఇక్కడ పర్వతమే శివ స్వరూపం. ఇదికాక లింగరూపంగా ఆలయంలో కొలువున్నారు. అమ్మవారి పేరు 'అపీతకుచాంబ'. తిరువణ్ణామలై క్షేత్రం తమిళనాడులోని (ఉత్తర ఆర్కాట్ జిల్లా) ప్రస్తుతం సంబురాయర్ జిల్లాలో ఉంది. ఈ పట్టణం తాలూకా కేంద్రం విల్లిపురం. కాత్పాడి రైలు మార్గంలో చెన్నైకి 226 కి.మీ. దూరంలో ఉంది.
శ్రీకాళహస్తి ::
శ్రీకాళహస్తీశ్వర స్వామి స్వయంభువుగా బిల్వకావనములో సువర్ణముఖీ నదీ తీరంలో వెలిశాడు. 'శ్రీ' అంగ సాలెపురుగు, 'కాళీ' అనగా పాము, 'హస్తి' అనగా ఏనుగు, ఈ మూడు జంతువులు శివభక్తి వలన సాయుజ్యమంది శివునిలో లీనమైపోయాయి. అందువలన ఇచ్చటి స్వామివారికి శ్రీకాళహస్తీశ్వరుడని, ఈ పురమునకు శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. ఇచ్చట అమ్మవారు జ్ఞానప్రసూనాంబ. క్షేత్రపాలకుడు కాలభైరవుడు. కృతయుగంలో ఇక్కడ స్వామి వాయురూపంలో ఉండి మహాయోగులను స్పర్శ మాత్రమునే గ్రహింపదగియుండేవారట. త్రేతాయుగంలో స్వర్ణ రూపంగా, ద్వాపరయుగంలో రజిత రూపంగా, ప్రస్తుత కలియుగంలో శ్వేతశిలా రూపం పొంది తన సహజ వాయుతత్వ నిదర్శనంగా గర్భాలయంలో స్వామికి కుడి ప్రక్కనున్న దీపములను రెండింటిని ఎల్లప్పుడూ చలింపజేస్తూండటం గమనించదగినది. ఇక్కడి జగదంబ 'జ్ఞానప్రసూనాంబ'.
శీర్కాళి :: వైదీశ్వరన్ కోయిల్ ::
చిదంబరానికి, కుంభకోణానికి మధ్యలో ఉన్న వైదీశ్వరన్ కోయిల్, శీర్కాళ్ గొప్ప క్షేత్రాలు. వైదీశ్వరన్ కోయిల్, శీర్కాలి రెందు, కేవలం 8 కి.మీ. దూరం ఉన్న ప్రక్క ప్రక్క ఊళ్ళు. వైదీశ్వరన్ కోయిల్ ఉత్తర తమిళనాడు వారికి చాలా ముఖ్యమైన పవిత్రస్థలం. ఒకానొక ముని తనకు గొప్ప జబ్బు చేయగా పరమేశ్వరుని గూర్చి ఎంతో భక్తితో తపస్సు చేయగా శంకరుడు ఒక వైద్యుని రూపంలో ప్రత్యక్షమై, అతని జబ్బు నయం చేశాడమొ స్థల పురాణం. ఈ ప్రాంతం వారు ఇంట్లో ఎవరికీ ఏ జబ్బు చేసినా, ఈ వైదీశ్వరునికి మొక్కుకుంటారు. ఊరు మాత్రం అతిచిన్న పల్లెటూరు. అయినా దేవాలయం మాత్రం ఎన్నడూ భక్తులతో నిండి ఉంటుంది. ఈ మధ్య ఈ ఊరికి చెందిన 'నాడీగ్రంథ' జ్యోతిష్కులు అన్నిచోట్ల వెలియడంతో ఈ ఊరికి జ్యోతిషం చెప్పించుకుంటానికి వచ్చేవారు ఎక్కువ అయ్యారు. వైదీశ్వరన్ కోయిల్ కు శీర్కాలి మధ్యదూరం కేవలం ఐదు మైళ్ళు. తమిళులందరికి శిర్కాలి చాలా పవిత్రమైన యాత్రాస్థలం. తమిళులకు ఈ దేవాలయం సంస్కృతిక కేంద్రం లాంటిది. ఈ ఊరిని గూర్చి వారందరూ ఎంతో పవిత్రంగా భావిస్తారు. గొప్ప శివభక్తాచార్యుడు 'జ్ఞాన సంబంధర్' ఈ శిర్కాలిలోనే జన్మించారు. ఈ సంబందర్ పసికూనగా ఉన్నప్పుడు పార్వతీదేవి స్వయంగా తన స్తన్యమిచ్చి ఆ పిల్లవాని ఆకలి తీర్చింది. ఆ తరువాత నుంచి ఆ పిల్లవాడు అమిత జ్ఞానవంతుదై చిన్నతనం నుండే గొప్ప శివభక్తుడై శివతత్వాన్ని అందరకూ ప్రభోదిస్తూ కేవలం పదహారు సంత్సరాలు మాత్రమే జీవించి, తనువూ చాలించారు. అయితే, ఆ పదహారు సంవత్సరాల లోపునే అయన అనేక వేల కీర్తనలు రచించారు. అందులో దాదాపు నాలుగు వందల కృతులు.

Sunday, 22 June 2014

"నవగ్రహ స్తోత్రం"

"నవగ్రహ స్తోత్రం"

గ్రహాల ప్రభావం మన నిత్య కర్మలపై, దైనందిన జీవితం లోని ఫలితాలపై ఉంటుందని చాలామంది నమ్మకం. మన జ్యోతిష శాస్త్రము ప్రకారం గ్రహాలు తొమ్మిది. అవి సూర్య, చంద్ర, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు గ్రహాలు. ఇందులో రాహువు, కేతువు ఛాయా గ్రహాలు.

సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్ |
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||

శ్వేతాశ్వ రథమారూఢం కేయూర మకుటోజ్వలమ్ |
జటాధర శిరోరత్నం తం చంద్రం ప్రణమామ్యహమ్ ||

ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభమ్ |
కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహమ్ ||

ప్రియాంగుకలికా శ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ |
సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ||

దేవనామ్ చ ఋషీనామ్ చ గురు కాంచన సన్నిభమ్ |
బుద్ధిభూతం త్రిలోకేశం తం గురుం ప్రణమామ్యహమ్ ||

హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుమ్ |
సర్వశాస్త్ర ప్రవక్తారం తం శుక్రం ప్రణమామ్యహమ్ ||

నీలాంజన సమాభాసం రవి పుత్రం యమాగ్రజమ్ |
ఛాయా మర్తాండ సంభూతం తం శనిం ప్రణమామ్యహమ్ ||

అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనమ్ |
సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ||

ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహ మస్తకమ్ |
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ || Nerella Raja Sekhar

Tuesday, 17 June 2014

http://www.indiadivine.org/news/articles-on-hinduism/christian-vatican-originally-a-shiva-temple-r740

http://www.indiadivine.org/news/articles-on-hinduism/christian-vatican-originally-a-shiva-temple-r740
భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు( Indian Culture)
శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి,రాఖీ పౌర్ణమి.
On 21st August 2013

భారతీయ సంప్రదాయంలో తరతరాలుగా శ్రావణ పూర్ణిమకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. శ్రీమహావిష్ణువును స్మరిస్తూ ఆయన శక్తి అందరినీ రక్షిస్తోందని భావించుకుంటూ ఈ పండుగను జరుపుకోవడం కనిపిస్తుంది.

భవిష్యోత్తర పురాణంలోనూ, మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణుడిని రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మేలును ఆయనకు వివరించాడు. రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరమంతా దుష్ట, ప్రేత, పిశాచ బాధ ఉండదని, అనారోగ్యాన్ని, అశుభాన్ని పోగొడుతుందని కృష్ణుడు చెప్పాడు. ఈ సందర్భంగా పూర్వం జరిగిన ఓ సంఘటనను కూడా ఆయన వివరించాడు.
పూర్వకాలంలో దేవతలకు, రాక్షసులకు విపరీతంగా యుద్ధం జరుగుతుండేది. ఆ యుద్ధంలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేక బాధపడుతుండేవారు. ఆ పరిస్థితి చూసి ఎలాగైనా దేవేంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి భార్య శచీదేవి అతడికి రక్ష కట్టింది. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళిన ఇంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడాడు. రక్షాబంధనానికి అంత గొప్ప శక్తి ఉంది. ఈ రక్షాబంధనం సందర్భంలో చదివే శ్లోకం

'యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః,
తేనత్వామభిబధ్నామి రక్షే మా చల మా చల'

దీనిలో రక్షాబంధనం అంటే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణు శక్తేనని తెలియచెప్పే భావం ఇమిడి ఉంది.

దేవేంద్రుడు, శచీదేవి వృత్తాంతం ఇలా ప్రాచీనంగా ఉన్న కథలో కనిపిస్తుంటే చరిత్ర గతిలో మొగలాయి చక్రవర్తుల ఏలుబడిలో ఈ రక్షాబంధనానికి మరికొంత కొత్త విశిష్టత సమకూరింది. రాఖీ కట్టే ఆచారం తమ స్త్రీల రక్షణ కోసం రాజపుత్రులు చేసిన ఏర్పాటని పండితులు పేర్కొంటున్నారు. చిత్తూరు మహారాణి కర్ణావతి గుజరాత్‌ నవాబైన బహదూర్‌షా తమ కోటను ముట్టడించబోతున్నప్పుడు తనను రక్షించమని ఢిల్లీ చక్రవర్తిగా ఉన్న హుమయూన్‌కు రక్షాబంధనాన్ని పంపి ప్రార్థించిందట. ఆ రక్షాబంధనాన్ని స్వీకరించిన హుమయూన్‌ ఆ రాణిని తన సోదరిగా భావించి బహదూర్‌షాను తరిమి వేశాడని ఆనాటి నుంచి సోదరీసోదర బంధానికి గుర్తుగా ఈ రక్షాబంధనం ప్రచారంలోకి వచ్చిందని పండితులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో శ్రావణ పూర్ణిమను నార్ణీపూర్ణిమ అని అంటారు. ఆ రోజున ప్రజలు సముద్రపు ఒడ్డుకు వెళ్ళి పూజలు చేసి నారి కేళాలను (కొబ్బరి కాయలను) కొడతారు. అందుకే ఇది నారికేళ పూర్ణిమగా (నార్ల పూర్ణిమ) వ్యవహారంలోకి వచ్చింది. పాల్కురికి సోమనాధకవి తన పండితారాధ్య చరిత్రలో ఈ పండుగను నూలిపున్నమ అని వర్ణించాడు. నూల్‌ అంటే యజ్ఞోపవీతం అని అర్థం. శ్రావణ పూర్ణిమ నాడు నూతన యజ్ఞోపవీతాలను ధరించే ఆచారాన్ననుసరించి ఇలా ఈ పండుగ పేరు వ్యవహారంలోకి వచ్చింది.

ఇక శ్రీ మహావిష్ణువు విజయగాధా పరంపరలలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు. పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం (గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. దేవీ శక్తి మహిమను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది.

యజ్ఞోపవీతం పరమపవిత్రం
ప్రజాపతే ర్యత్స హజం వురస్తాదా
యుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజః !!

బ్రాహ్మణులు యజ్ఞోపవీతం కు పూజ చేసి నూతన యజ్ఞోపవీతం ధరిస్తారు.
ఇలా శ్రావణ పూర్ణిమను ఎన్నెన్నో రకాలుగా పండుగగా, ఉత్సవంగా జరుపుకోవడం తరతరాలుగా వస్తోంది.

Thursday, 5 June 2014

ప్రయత్నంతోనే విజయం


Jaji Sarma

ప్రయత్నంతోనే విజయం
అదొక గోపాలకుని ఇల్లు. ఆ ఇంట అన్ని కుండలతో పాటు చిక్కని మీగడతో ఉన్న పెరుగుకుండ. ఎలా వచ్చిపడ్డాయోగాని రెండు కప్పలు ప్రమాదవశాత్తు ఆ పెరుగు కుండలో పడ్డాయి. ఆ కుండ చాల లోతైనది కూడా. బైటపడటానికి ఆ రెండు కప్పలూ ప్రయత్నించసాగాయి. పైకెగబాకాయి. కాని ఆ మీగడకున్న జిడ్డు వలన ఆ ప్రయత్నం సాగక మరల అందులోనే పడిపోయేవి. అలా ప్రయత్నం చేసి చేసి అలసిపోయిన ఒక కప్ప నిరాశతో ''మిత్రమా! ఇక శలవ్‌! మనం బయటపడే అవకాశంలేదు. మన జీవితాలిలా పరిసమాప్తం కావలసిందే. మన నుదిటిన ఆ భగవంతుడదే రాశాడు'' అంటూ ఆ పెరుగు కుండలో మునిగిపోయింది. ఆ దృశ్యం చూసినా రెండవ కప్ప మాత్రం నిరాశపడలేదు. ప్రయత్నం వీడలేదు. మరల మరల ప్రయత్నించింది. మామూలుగా కాదు. మరింత పట్టుదలతో. దానిదొకటే నిశ్చయం. ''మరణమైనా రావాలి. ప్రయత్నమైనా ఫలించాలి. అంతేకాని చేతకాక చచ్చిపోకూడదు''. అందుకే అలాగే ప్రయత్నించింది. కొంతసేపటికి దాని వెనక కాళ్ళకు గట్టిగా ఏదో తగిలింది. అది పెరుగులో తేలియాడుతోంది. ఇప్పుడు దాని కాళ్ళకు జిడ్డు కూడా పోయింది. దాంతో ఆ కప్ప ఆ గట్టిగా ఉన్న పదార్థంపై కాస్సేపు కూర్చుని విశ్రాంతి తీసుకుంది. అలా కాసేపు విశ్రాంతి తీసుకుని శక్తిని కూడదీసుకుని ఒక్క ఉదుటున కుండ అంచుపైకెగిరి బయటపడింది. ఇంతకీ ఆ పదార్థమేమిటంటే- ఆ కప్ప అటూ ఇటూ కదలడంవలన పెరుగు చిలికినట్లయింది. వెన్న ఒకచోట చేరింది. అదే ఆ కప్ప ప్రాణాలను కాపాడింది.
యథా కందుక పాతేనోత్పతత్యార్యః పతన్నపి
తథాదనార్యః పతతి మృత్పిండ పతనంయథా!!
బంతి కింద పడ్డా పైకిలేస్తుంది. అలాగే ప్రయత్నశీలుడు ఒక సమయంలో కష్టాలు వచ్చి పతనమైనా మరల అంతలోనే అంతే వేగంతో లేచి ప్రయత్నించి విజయం సాధిస్తాడు. మట్టిముద్ద ఉందే, అది కిందపడితే మరి లేవలేదు. అధముడు కూడా అంతే. అందుకే ప్రయత్నించాలి. మళ్ళీ ప్రయత్నించాలి. విజయం సాధించేవరకు ప్రయత్నించాలి. ఆ ప్రయత్నంలో లోపంవద్దు. అపజయాలు, ఆటంకాలు వస్తే బెదిరిపోవద్దు. ఆగిపోవద్దు. కడదాకా ప్రయత్నిస్తేనే విజయం తప్పక సిద్ధిస్తుంది.
ప్రారభ్యతే న ఖలు విఘ్నభయేననీచైః ప్రాంభ్మవిఘ్ననిహతా విరమన్తిమధ్మాః
విఘ్నైః పునః పునరపి ప్రతిహన్యమానాః ప్రారబ్ధముత్తమజనాః నపరిత్యజన్తి
విఘ్నాలు కలుగుతాయేమోననే భయంతో పనిని ప్రారంభించనే ప్రారంభించరు నీచులు. ప్రారంభించి విఘ్నాలు ఎదురైతే ఆ పనిని అక్కడితో విడిచిపెట్టేస్తారు మధ్యములు. ఉత్తములైనవారు మాత్రం ఎన్ని ఆటంకాలు, విఘ్నాలు కలిగినా తలపెట్టిన కార్యాన్ని నెరవేర్చి తీరుతారు. కాబట్టి ప్రయత్నించు, ప్రయత్నించు. మరల మరల ప్రయత్నించు. విజయం తథ్యం.

Wednesday, 4 June 2014

కుమార”తత్వానికి ప్రతీక


Bramhasri Samavedam Shanmukha Sarmaవైదిక వాగ్మయంలో కుమార అనే నామం వినగానేగుర్తుకు వచ్చేది కేవలం బుజ్జి విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్యగణపతులు పరబ్రహ్మ స్వరూపులేకాక, “కుమార”తత్వానికి ప్రతీక. జగత్తులో మాతాపితృతత్వానికి ప్రతీక పార్వతీ పరమేశ్వరులు. (లేదా లక్ష్మీ నారాయణులు, ఎలా పిలిచినాఒకటే). అవ్యక్తం, వ్యక్తం, మహత్, అహంకారం ఈ నాలుగు పంచభూతాత్మక జగత్తుకి ఆధారం.ఇందులో అవ్యక్తానికి ప్రతీకగా అమ్మవారిని పేర్రొంటే, వ్యక్త స్వరూపాలకు సంకేతంగా అయ్యవారిని స్మరించుకోవటం ఆనవాయితి అయితే, మహత్తత్వానికి ప్రతీకగా గణపతిని,అహంకారానికి ప్రతీకగా కుమారస్వామిని చెప్పడం జరిగింది. అహంకార తత్త్వం ఉండడం వల్లనే ఈ సకల జగత్తు సృష్టింపబడినదిఅని చెప్తారు పెద్దలు. నిజానికి ఒకే పరతత్వం యొక్క నాలుగు భూమికలివి.
ఇక్కడ అహంకారం అంటే లోకంలో అనుకునే గర్వం అనేభావం కాదు. నేను అనే స్పృహను అహంకారం అంటారు. ఈశ్వరుని పరంగా ఈ బావం ఉంటుంది.ఇక్కడి నుంచే సృష్టి విస్తృతి ప్రారంభం అవుతుంది. చైతన్యం యొక్క లక్షణం అహంకారం. ఈసృష్టిలో కృత్రిమంగా, యాంత్రికంగా, వైజ్ఞానిక సాంకేతికంగా మానవుని మెదడు వంటిజ్ఞాపక శక్తి కల యంత్రాన్ని తయారు చేయవచ్చునేమో కానీ, దానికి “నేను చేస్తున్నాను” అనే అహంభావం, స్పందన ఇవ్వలేము. అది కేవలం స్వాభావికమైనసృష్టి లక్షణం. అనుభూతులకీ, ఆలోచనలకీ, స్పందనలకీ కేంద్రం ఈ అహం తత్వమే.
ఈ అహంతత్వానికి ప్రతీక సుబ్రహ్మణ్యుడు.రహస్యంగా అందరిలోనూ ప్రకాశించే పరమాత్మ చైతన్యమిది కనుక ‘గుహ’ అన్నారు స్వామిని. శివతేజస్సు నుండి ఉద్భవించినవాడు కనుక జ్ఞానతత్త్వం కలిగి ‘గురుగుహ’ అని స్వామికి నామం. అసలు స్వామి అనే మాట అమరకోశం ప్రకారం ఒక్క సుబ్రహ్మణ్యుడిదే. ఎందుచేతనంటే “దేవసేనాపతీ, శూరః, స్వామీ, గజముఖానుజః “ అని అర్ధంగా ఇవ్వబడినది.
పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః
అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా
తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః
పరమ పురుషుడు శివుడు లేక విష్ణువు. అవ్యక్తశక్తి ఉమాదేవి లేక లక్ష్మీదేవి. వీరిరువురి సమైక్య సమన్వయ తత్వమూర్తి కుమారస్వామిఅని స్కాంద పురాణం చెబుతోంది.
అంటే కుమారస్వామిని పూజిస్తే శివశక్తుల్నీ,లక్ష్మీనారాయణులనీ కలిపి అర్చించినట్లే. ప్రకృతీ పురుషుల ఏకత్వం కుమార స్వామితత్త్వం.
కుమార జననంలోనే అనేక తాత్త్విక మర్మాలుఉన్నాయి. పరతత్వం అవ్యక్తం నుండి జగద్రూపం తీసుకొనే పరిమాణ క్రమం కుమార జననంలోకనబడుతుంది. అమోఘమైన శివతేజాన్ని పృథ్వి, అగ్ని, జలం (గంగ), నక్షత్ర శక్తి (షట్కృత్తికలు) ధరించి చివరకు బ్రహ్మతపోనిర్మితమైన శరవణం (రెల్లు తుప్ప) లోంచిఉద్భవించినవాడు కనుక శరవణభవుడు అయ్యాడు.
వేదాలలో షణ్ముఖీయమైన సంవత్సర స్వరూపంగాస్వామిని వర్ణించారు. కాలాగ్ని స్వరూపమే ఇది. కాలాగ్నిరుద్రుడైన శివుని తేజమే ఈసంవత్సరాగ్ని. ఆరు ముఖాలను ఆరు ఋతువులకు ప్రతీకగా, పన్నెండు చేతులను పన్నెండు మాసాలకు ప్రతీకలుగా చెప్పుకోవచ్చు. ఇదీసంవత్సరాగ్ని రూపం. ఈ రూపం చిత్రాగ్ని అనే నెమలిపై ఆసీనమయ్యింది. వివిధ వర్ణాలనువెదజల్లే కాంతి పుంజమే ఈ నెమలి.