Thursday, 22 September 2011

అష్టాదశ పురాణముల పేర్లు, వాటిలో వుండే ప్రధాన అంశాలు ఏమిటి ?

అష్టాదశ పురాణముల పేర్లు, వాటిలో వుండే ప్రధాన అంశాలు ఏమిటి ?

 
అష్టాదశ పురాణముల పేర్లు :మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వ చుతష్టయం |అనాపలింగ కూస్కాని పురాణాని ప్రచక్షత ||

మ ద్వయం - మత్స్య పురాణం. మార్కండేయ పురాణం.
భ ద్వయం- భాగవత పురాణం. భవిష్యత్ పురాణం.
బ్ర త్రయం- బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం.
వ చుతష్టయం- వాయుపురాణం, వరహా పురాణం, వామన పురాణం, విష్ణు పురాణం.
అ - అగ్ని పురాణం,
నా - నారద పురాణం,
ప - పద్మ పురాణం,
లి - లింగ పురాణం,
గ - గరుడ పురాణం,
కూ - కూర్మ పురాణం
స్క - స్కంద పురాణం

అష్టాదశ పురాణములందలి కొన్ని ప్రధాన అంశములు :

౧. మత్స్య పురాణం (శ్లోక సంఖ్య - ౧౪౦౦౦)
మ త్స్య నారాయణునిచే మనువుకు ఉపదేశించబడినది.
కార్తికేయ, యయాతి, సవిత్ర చరిత్రలు. ధర్మాచరణ విషయములు,
ప్రయాగ, వారణాసి మొ || లగు పుణ్యక్షేత్ర మహత్మ్యములను కలిగి ఉండును.

౨. మార్కండేయ పురాణము (శ్లోక సంఖ్య - ౯౦౦౦)
మార్కండేయ మహర్షిచే ఉపదేశించబడినది.
శివ విష్ణు, ఇంద్ర, అగ్ని, సూర్య, మహత్మ్యములు మరియు
చండీ హోమమునకు ఆధారమైన సప్తశతి మాహాత్యమును ఈ పురాణము కలిగి ఉండును.

౩. భాగవత పురాణము (శ్లోక సంఖ్య - ౧౮,౦౦౦)
వేద వ్యాసుని ద్వారా శుకునకు ఉపదేశించబడినది.
మహావిష్ణు అవతారములు, ప్రత్యేకముగా శ్రీ కృష్ణ జనన, లీలా చరితములను కలిగి ఉండును.

౪. భవిష్య పురాణము (శ్లోక సంఖ్య - ౧౪,౫౦౦)
సూర్య భగవానునిచే మనువునకు ఉపదేశించబడినది.
సూర్యోపాసన, అగ్ని ఆరాధన, వర్ణాశ్రమ ధర్మములు, భవిష్యత్ విషయములను కలిగివుండును.

౫. బ్రహ్మ పురాణము (శ్లోక సంఖ్య - ౧౦,౦౦౦)
బ్రహ్మ దేవునిచే దక్షునకు ఉపదేశించబడినది.
శ్రీ కృష్ణ, మార్కండేయ, కశ్యప చరిత్రలు, వర్ణ ధర్మములు,
ధర్మాచరణములు, స్వర్గ, నరక వివరణ మొ || లగు కలిగివుండును.
దీనినే ఆది పురాణం లేక సూర్య పురాణం అంటారు.

౬. బ్రహ్మాండ పురాణము (శ్లోక సంఖ్య - ౧౨,౦౦౦)
బ్రహ్మదేవునిచే మరీచికి ఉపదేశించబడినది.
శ్రీ కృష్ణ, రాధాదేవి, పరశురామ, శ్రీరామచంద్ర చరిత్రలు.
శ్రీ లలితా సహస్ర నామస్తోత్రము, శివ కృష్ణ సోత్రములు,
ఖగోళ శాస్త్ర, స్వర్గ, నరక వివరణ కలిగివుండును.

౭. బ్రహ్మవైవర్త పురాణము (శ్లోక సంఖ్య - ౧౮,౦౦౦)
సావర్ణునిచే నారదునకు ఉపదేశించబడినది.
స్కంద, గణేశ, రుద్ర శ్రీ కృష్ణ, బ్రహ్మ, ప్రకృతి, దుర్గా, లక్ష్మి, సరస్వతి, సావిత్రి, రాధ
మొ || లగు దేవతా మహత్యములను కలిగివుండును.

౮. వరాహ పురాణము (శ్లోక సంఖ్య - ౨౪,౦౦౦)
వరాహ నారాయణునిచే భూదేవికి ఉపదేశించబడినది.
విష్ణు ఉపాసనా విధానము, పరమేశ్వరీ, పరమేశ్వర చరిత్రలు,
ధర్మశాస్త్రము, వ్రత కల్పములు, పుణ్య క్షేత్ర వర్ణనలు మొ || లగునవి కలిగివుండును.

౯. వామన పురాణము (శ్లోక సంఖ్య - ౧౦,౦౦౦)
పులస్త్య ౠషిచే నారదునకు ఉపదేశించబడినది.
శివలింగ ఉపాసన, శివపార్వతుల కళ్యాణ వైభవము, శివ, గణేశ, కార్తికేయ చరిత్రలు,
భూగోళ, ఋతు వర్ణనలు మొ || లగునవి కలిగివుండును.

౧౦. వాయు పురాణము (శ్లోక సంఖ్య - ౨౪,౦౦౦)
వాయుదేవునిచే ఉపదేశించబడినది.
శివ మహాత్మ్యము, కాలమాన, భూగోళ, సౌరమండల వర్ణన
మొ || లగునవి కలిగివుండును.

౧౧. విష్ణు పురాణము (శ్లోక సంఖ్య - ౨౩,౦౦౦)
పరాశరునిచే మైత్రేయునికి ఉపదేశించబడినది.
విష్ణు మహాత్మ్యము, శ్రీ కృష్ణ, ధ్రువ, ప్రహ్లాద, భరత చరిత్రలు
మొ ||లగునవి కలిగివుండును.

౧౨. అగ్ని పురాణము (శ్లోక సంఖ్య - ౧౫,౪౦౦)
అగ్ని భగవానునిచే వశిష్ణునకు ఉపదేశించబడినది.
శివ, గణేశ, దుర్గా ఉపాసన, వ్యాకరణము, చంధస్సు, వైద్యము,
లౌకిక - రాజకీయ ధర్మములు, భూగోళ, ఖగోళ, జ్యొతిష శాస్త్రములు
మొ || లగునవి కలిగివుండును.

౧౩. నారద పురాణము (౨౫,౦౦౦)
నారదునిచే సనక, సనందన, సనత్కుమార, సనాతన
అను నలుగురు బ్రహ్మా మానసపుత్రులకు ఉపదేశించబడినది.
వేదపాద స్తవము, వేదాంగములు, వ్రతములు, బదరీ - ప్రయాగ - వారణాశి క్షేత్ర వర్ణన
మొ || లగునవి కలిగివుండును.

౧౪. స్కంద పురాణము (శ్లోక సంఖ్య - ౮౧,౦౦౦)
స్కందునిచే ఉపదేశించబడినది.
శివ చరిత్ర వర్ణన, స్కంద మహాత్యము, ప్రదోష స్తోత్రములు, కాశీ ఖండ, కేదార ఖండ,
రేవా ఖండ (సత్యనారాయణ వ్రతము), వైష్ణవ ఖండ (వేంకటాచల క్షేత్రము),
ఉత్కళ ఖండ (జగన్నాధ క్షేత్రము), కుమారికా ఖండ (అరుణాచల క్షేత్రము),
బ్రహ్మ ఖండ (రామేశ్వర క్షేత్రము) బ్రహోత్తర ఖండ (గోకర్ణ క్షేత్రము, ప్రదోష పూజ),
అవంతికా ఖండ (క్షీప్రా నదీ, మహాకాల మహాత్మ్యము)
మొ || లగునవి కలిగివుండును.

౧౫. లింగ పురాణము (శ్లోక సంఖ్య - ౧౧,౦౦౦)
శివునిచే నందీశ్వరునకు ఉపదేశించబడినది.
లింగ మహత్యము, శివ మహిమ, దేవాలయ ఆరాధన,
వ్రతములు, ఖగోళ - జ్యోతిష - భూగోళ శాస్త్రములు
మొ || లగునవి కలిగివుండును.

౧౬. గరుడ పురాణము (శ్లోక సంఖ్య - ౧౯,౦౦౦)
విష్ణువుచే గరుత్మంతునకు ఉపదేశించబడినది.
మహావిష్ణు ఉపాసన, గరుత్మంత ఆవిర్భావము, జనన - మరణ విషయములు,
స్వర్గ – నరక ప్రయాణములు మొ ||లగునవి కలిగివుండును.

౧౭. కూర్మ పురాణము (శ్లోక సంఖ్య - ౧౭,౦౦౦)
కూర్మ నారాయణునిచే ఉపదేశించబడినది.
వరాహ, నృసింహ అవతారములు, లింగ రూప మహత్యము, శివారాధన,
ఖగోళ - భూగోళ, వారణాసి - ప్రయాగ క్షేత్ర వర్ణన
మొ || లగునవి కలిగివుండును.

౧౮. పద్మపురాణము (శ్లోక సంఖ్య - ౮౫,౦౦౦)
బ్రహ్మదేవునిచే ఉపదేశించబడినది.
జన్మాంతర పాప నివృత్తి, మదు కైటభ వధ, బ్రహ్మ సృష్టికార్యము, గీతార్థసారము,
గంగా, గాయత్రీ మహత్యములు, అశ్వత్థ వృక్ష మహిమ, విభూతి మహాత్మ్యము,
పూజా విధీ – విధానములు, సత్ప్రవర్తన, మొ || లగునవి కలిగివుండును.

వేదవ్యాస విరచితములైన, నైమిశారణ్య ప్రసిద్ధములైన
ఈ అష్టాదశ పురాణముల గురించి తెలుసుకొనుట పూర్వ జన్మ సుకృతము.
ఎవరైతే, ఈ అష్టాదశ పురాణములను పారాయణ చేస్తారో,
వారు మంచి బుద్ది కలిగినవారై చెడు మార్గాములకు దూరంగా వుంటారు.
అంతే కాకుండా, అందరి పట్ల సమ భావన కలిగి వుంటారు.
వేదవ్యాస స్వరూపములుగా అవతరిస్తూ, లోకమును రక్షిస్తున్న
సకల దేవతల అనుగ్రహము లోకమునకు చేకూరు గాక !

|| విశ్వస్య కళ్యాణమస్తు ||