Thursday 22 September 2011

శ్రీ వినాయక వ్రతకల్పము

శ్రీ వినాయక వ్రతకల్పము

మన దేశంలో మొదట పూజించేది గణేశుడినే. మొదట మనం స్మరించేది కూడా ఆయనన్నే. పూర్ణకుంభంలాంటి ఆ దేహం, బాన వంటి కడుపు, పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు. ఏనుగు తల, సన్నని కళ్ళు, మేధస్సుకు సంకేతాలు. వక్రతుండము ఓంకార ప్రణవనాదానికి ప్రతీక. ఏనుగు లాంటి ఆకారాన్ని మోస్తున్నది ఒక చిన్న ఎలుక. అదే ఆత్మలోని చమత్కారం. ఆ పొట్టను చుట్టి ఉండే నాగము (పాము) శక్తికి సంకేతం. నాలుగు చేతులు మానవాతీత సామర్ధ్యాలకు, తత్వానికి సంకేతం. చేతిలో ఉన్న పాశ, అంకుశములు బుద్ధి, మనసులను సన్మార్గంలో నడిపించు సాధనాలకు ప్రతీకలు. మరో చేతిలో కనిపించే దంతం ఆయనదే.

వ్యాస భగవానుడు మహాభారతం రాయ సంకల్పించినప్పుడు తన దంతాన్నే విరిచి ఘంటంగా మార్చాడు. ఇదంతా విజ్ఞానంకోసం చేయవలసిన కృషికి, త్యాగానికి సంకేతాలు. మరొక చేతిలో కనిపించే మోదకం-ఉండ్రాయి ఉంటుంది. కొందరి ప్రకారం అది వెలగ కాయ.

భక్తులు తక్కిన దేవతల ఎదుట తప్పులు చేసివుంటే క్షమించమని చెంపలు వేసుకోవడం ఉందికానీ, వినాయకుని వినాయకుని ఎదుట గుంజీలు తీయాలి. ఇలా ఎన్నో ప్రత్యేకతలు, నిగూఢ సంకేతలు కలిగిన అధినాయకుడే మన వినాయకుడు.

వినాయకుడు ఏకదంతుడు ఎలా అయ్యాడు?

కార్తవీర్యుని వధించిన అనంతరం పరశురాముడు తన గురువైన పరమశివుణ్ణి దర్శించుకోవాలని కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముడిని లోనికి వెళ్ళకుండా అడ్డగించాడు. దాంతో పరశురాముడు ధిక్కరించడంతో గణేశుడు తన తొండంతో పరశురాముణ్ణి పైకెత్తి పడేశాడు. ఆగ్రహించిన పరశురాముడు తన చేతిలోని గండ్రగొడ్డలిని గణపతిపై ప్రయోగించడంతో ఒక దంతం ఊడి పడింది. ఆ చప్పుడుకు ఉలిక్కిపడిన పార్వతీ పరమేశ్వరులు బయటకు వచ్చారు. నెత్తురోడుతున్న బాల గణపతిని పార్వతి ఎత్తుకొని పరశురాముడిని తీవ్రంగా మందలించింది. తన వల్ల జరిగిన అపరాధాన్ని మన్నించమని పరశురాముడు వేడుకున్నాడు. ఒక దంతం పోగొట్టుకున్న ఆ నాటినుంచి గణపతి ఏకదంతుడుగా పేరు పొందాడు.


పూజకు కావలసిన సామాగ్రి

1. లేవవలసిన సమయము : ఉదయం 5 గంటలు.

2. శుభ్రపరచవలసినవి : పూజామందిరము, ఇల్లు.

3. చేయవలసిన అలంకారములు : గడపకు పసుపు, కుంకుమ; గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు.

4. చేయవలసిన స్నానము : తలస్నానము

5. ధరించవలసిన పట్టుబట్టలు : ఆకుపచ్చరంగు పట్టు వస్త్రాలు

6. పూజామందిరంలో చేయవలసినవి : పూజకు ఉపయోగపడు వస్తువులు పటములకు గంధము, కుంకుమ అలంకరించాలి.

7. కలశముపై వస్త్రము రంగు : ఆకుపచ్చ రంగు

8. పూజించవలసిన ప్రతిమ : బంకమట్టితో చేసిన గణపతి

9. తయారు చేయవలసిన అక్షతలు : పసుపు రంగు

10. పూజకు కావలిసిన పువ్వులు : కలువపువ్వులు, బంతి పువ్వులు

11. అలంకరణకు వాడవలసిన పూలమాల : చామంతిమాల

12. నివేదన చేయవలసిన నైవేద్యం : ఉండ్రాళ్ళు

13. సమర్పించవలసిన పిండివంటలు : బూరెలు, గారెలు

14. నివేదించవలసిన పండ్లు : వెలక్కాయ

15. పారాయణ చేయవలసిన అష్టోత్తరం : గణపతి అష్టోత్తరము

16. పారాయణ చేయవలసిన స్తోత్రాలు : సంకటనాశన గణేశ స్తోత్రం

17. పారాయణ చేయవలసిన ఇతర స్తోత్రాలు : ఋణవిమోచక గణపతి స్తోత్రము

18. పారాయణ చేయవలసిన సహస్రాలు : గణపతి సహస్ర నామం

19. పారాయణ చేయవలసిన గ్రంధం : శ్రీ గణేశారాధన

20. పారాయణ చేయవలసిన అధ్యాయములు : గణపతి జననం

21. దర్శించవలసిన దేవాలయాలు : గణపతి

22. దర్శించవలసిన పుణ్యక్షేత్రాలు : కాణిపాకం, అయినవిల్లి

23. చేయవలసిన ధ్యానములు : గణపతి ధ్యాన శ్లోకం

24. చేయించవలసిన పూజలు : 108 ఉండ్రాళ్ళుతో పూజ

25. దేవాలయములో చేయించవలసిన పూజా కార్యక్రమములు : గరికెతో గణపతి గకార అష్టోత్తరం

26. ఆచరించవలసిన వ్రతము : వినాయక వ్రతము

27. సేకరించవలసిన పుస్తకములు : శ్రీగణేశారాధన, శ్రీగణేశోపాసన

28. సన్నిహితులకు శుభాకాంక్షలు : కాణిపాక క్షేత్ర మహత్యం

29. స్త్రీలకు తాంబూలములో ఇవ్వవలసినవి : గరికెతో గణపతి పూజలు

30. పర్వదిన నక్షత్రము : హస్త

31. పర్వదిన తిధి : భాద్రపద శుద్ధ చవితి

32. పర్వదినమున రోజు పూజ చేయవలసిన సమయం : ఉ||9 నుండి 12 గం|| లోపుగా

33. వెలిగించవలసిన దీపారాధన కుంది : కంచుదీపారాధనలు

34. వెలిగించవలసిన దీపారాధనలు : 2

35. వెలిగించవలసిన వత్తులసంఖ్య :7

36. వెలిగించవలసిన వత్తులు : జిల్లేడు వత్తులు

37. దీపారాధనకు వాడవలసిన నూనె : కొబ్బరి నూనె

38. వెలిగించవలసిన ఆవునేతితో హారతి : పంచహారతి

39. ధరించవలిసిన తోరము : పసుపురంగు తోరములో పువ్వులు+ఆకులు

40. నుదుటన ధరించవలసినది : విభూది

41. 108 మార్లు జపించవలసిన మంత్రం : ఓం గం గణపతయే నమః

42. జపమునకు వాడవలసిన మాల : రుద్రాక్ష మాల

43. మెడలో ధరించవలసిన మాల : స్పటిక మాల

44. మెడలో ధరించవలసిన మాలకు ప్రతిమ : గణపతి

45. చేయవలసిన అభిషేకము : పంచామృతములతో

46. ఏదిక్కుకు తిరిగి పూజించాలి : ఉత్తరం

శ్రీ వరసిద్ధి వినాయక పూజా విధానము

శ్లో|| శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |

ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాస్తయే ||

సముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః |

లంబోదరశ్చ వికటోవిఘ్న రాజో గణాధిపః ||

ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజానన |

వక్రతుండ శ్శూర్పకర్ణః హేరంబః స్కంద పూర్వజ ||

షోడశైతాని నామాని యః పఠేత్‌శృణుయాదపి |

విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమేతథా ||

సంగ్రమే సర్వ కార్యేషు విఘ్నస్తస్య నజాయతే |

అభీప్సితార్ధ సిధ్యర్ధం పూజితోయస్సురైరపి ||

సర్వవిఘ్నచ్చిదే తస్మైగణాధిపతయే నమః ||

ఓం కేశవాయ స్వాహా నారయణాస్వాహా మాధవాయ స్వాహా గోవింద విష్ణో మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషీకేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్చుత జనార్దన ఉపేంద్ర హరయే శ్రీకృష్ణాయ నమః

శో || ఉత్తిష్ఠంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః |

ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||

ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓంతపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం | భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ||

ఓ మాపో జ్యోతీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్

మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభేశోభనే ముహూర్తే శ్రీ మహా విష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంభూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశెలస్య ఈశాన్య ప్రదేశే ( తాము పూజ చేయు ప్రాంతము ఏ దిక్కు న ఉన్నదో ఆ దిక్కును చెప్పుకొనవలెను ) కృష్ణా కావేర్యోః మధ్యదేశే స్వగృహే ( అద్దె ఇంటి యందున్నవారు ' వాసగృహే ' అని చెప్పవలెను) అస్మిన వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ( స్వభాను ) నామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతౌ భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథౌ ( ఇందు )వాసరే ( )నక్షత్రే శుభయౌగే శుభకరణే ఏవంగుణ విషేషణ విశిష్టాయాం అస్యాం శుభ తిధౌ శ్రీ మతః ( గోత్రము చేప్పవలేను ) గోత్రస్య ( పేరు ) నామధేయస్య మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్త్థెర్య విజయ అభయ ఆయురారోగ్య ఏఆశ్వర్యాభివృద్ధ్యర్థం కామ మౌక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధయర్థం సకల విద్యా ప్రాప్త్యర్ధం సకల సమస్త దురితోపశాస్త్యర్ధం సమస్త మంగళావాప్యర్ధం వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక దేవతాముద్దిశ్య వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్ధం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిషే|| (కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో ముంచవలెను.) తదంగ కలశ పూజాం కరిష్యేః (కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో ముంచవలెను.)

(కలశమును గంధము, పుష్పములు, అక్షతలతో పూజించి, కలశముపై కుడిచేతిని ఉంచి, ఈ క్రింది విధంగా చెప్పవలెను.)

శ్లో|| కలశస్యముఖే విష్ణుః కఠేరుద్ర సమాశ్రితః |

మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాత్సగణాః స్మృతాః ||

కుక్షౌతు సాగరాః సర్వే సప్త ద్వీపా వసుంధరా |

ఋగ్వేదోథ యజుర్వేద స్సామ వేదో హ్యధర్వణః ||

అంగైశ్చసహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః |

అయాంతు దేవాః పూజార్ధం దురితక్షయకారకాః ||

గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతిః |

నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ||

(కలశమునందలి నీటిని తలపై చల్లుకొని, పూజాద్రవ్యాలపై చల్లవలెను.)


పూజా ప్రారంభం :

ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్ధం గణపతి పూజాంకరిష్యే (పసుపుతో గణపతిని చేసి తమలపాకుపై నుంచవలెను)

మహా గణాధిపతయే నమః

ధ్యాయామి, ధ్యానం సమర్పయామి (నమస్కరించాలి) ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి (క్రింది భాగమున నీటిని చల్లవలెను)

హస్తయోః అర్ఫ్యం సమర్పయామి (నీటిని చల్లవలెను) పాదయోః పాద్యం సమర్పయామి (నీటిని చల్లవలెను)

స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి నీటిని చల్లవలెను)

వస్త్రం సమర్పయామి (దూదితో చేసిన వస్త్రము, లేదా పుష్పము నుంచవలెను)

గంధాన్ ధారయామి (గంధమును చల్లవలెను)

గంధస్యోపరి అలంకరణార్ధం అక్షతాన్ సమర్పయామి (అక్షతలు చల్లవలెను)

పుష్పైః పూజయామి

(ఈ క్రింది మంత్రములు చదువుతూ పుష్పములుంచవలెను)

ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః

ఓం మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి (పుష్పములతో పత్రితో అర్చించవలెను)

ధూపం ఆఘ్రాపయామి (అగరుబత్తి వెలిగించవలెను)

దీపం దర్శయాని (దీపమును చూపవలెను)

ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి| ధియోయోనః ప్రచోదయాత్|| సత్యం స్వర్తేన పరిషించామి, అమృతమస్తు! అమృతోపస్తరణమసి. ఓప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మణే స్వాహా, మహాగణాధిపతయేనమః యధాభాగం గుడం నివేదయామి (బెల్లం ముక్కను నివేదించవలెను) మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని చల్లవలెను) తాంబూలం సమర్పయామి (తాంబూలం ఉంచవలెను)

ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)

ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి (కర్పూరం వెలిగించాలి)

శ్లో|| వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ |

అవిఘ్నంకురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా ||

మహాగణాధిపతే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. గణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. మమ ఇష్టకామ్యార్ధ ఫలసిధ్యర్ధం గణాధిపతి ప్రసాదం శిరసాగృష్ణామి (గణపతి వద్ద నుండి అక్షతలు తీసి తలపై ఉంచుకోవలెను)

వరసిద్ధి వినాయక పూజా ప్రారంభః

శ్లో|| ఏకదంతం శూర్పకర్ణం గజవక్ర్తం చతుర్భుజం

పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ||

ఉత్తమం గణనాధస్య వ్రతం సంపత్కరం శుభం

భక్తాభిష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం ||

ధ్యాయేద్గజాననం దేవం తప్త కాంచన సన్నిభం |

చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం ||

శ్రీ వరసిద్ధి వినాయకం ధ్యాయామి (నమస్కరించవలెను)

అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వరః |

అనాధ నాధ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ ||

శ్రీ వరసిద్ధి వినాయకం ఆవాహయామి (విగ్రహమునకు క్రింది భాగమున తమలపాకుతో నీటిని చల్లవలెను)

మౌక్తికైః పుష్పరాగైశ్చ నానా రత్నైర్విరాజితం

రత్న సింహాసనం చారు ప్రీత్యర్ధం ప్రతి గృహ్యతాం ||

శ్రీవరసిద్ధి వినాయక ఆసనం సమర్పయామి (పుష్పములుంచాలి)

గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన |

గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం ||

శ్రీ వరసిద్ధి వినాయకాయ అర్ఘ్యం సమర్పయామి (విగ్రహము యొక్క చేతులపై నీటిని చల్లవలెను)

గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ఠ ప్రదాయక |

భక్త్యా పాద్యం మయాదత్తం గృహోణ ద్విరదానన ||

శ్రీ వరసిద్ధి వినాయకాయ పాద్యం సమర్పయామి (పాదముల వద్ద నీటిని చల్లవలెను)

అనాధ నాధ సర్వజ్ఞ గీర్వాణ గణపూజితః గృహోణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో ||

శ్రీ వరసిద్ధి వినాయకాయ ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)

దధిక్షీర సమాయుక్తం మధ్యాజ్యేన సమన్వితం |

మధుపర్కం గృహణేదం గజవక్త్ర నమోస్తుతే ||

శ్రీ వరసిద్ధి వినాయకాయ మధుపర్కం సమర్పయామి (ఆవుపాలు పెరుగు, నెయ్యిలతో కూడిన మధుపర్కము నుంచవలెను)

స్నానం పంచామృతైర్దేవ గృహోన గణనాయక |

అనాధనాధ సర్వజ్ఞా గీర్వాణ గణపూజిత ||

శ్రీ వరసిద్ధి వినాయకాయ పంచామృత స్నానం సమర్పయామి (పంచామృతాలనగా - 1. ఆవుపాలు 2. ఆవుపెరుగు 3. ఆవునెయ్యి 4. తేనే, లేక చెరకు రసము, లేదా పంచదార 5. ఫలోదకము, లేక పండ్ల రసము - వీటన్నిటితో వేరువేరుగా కాని, ఒకేసారిగా కాని స్నానము చేయించవలెను)

శో|| రక్తవస్త్ర ద్వయం చారు దేవయోగ్యంచ మంగళం |

శుభప్రద గృహోణ త్వం లంబోదర హరాత్మజ ||

శ్రీ వరసిద్ధి వినాయకాయ వస్త్రయుగ్మం సమర్పయామి (ఎర్రని పుష్పము, లేదా ఎర్రని అంచు గల రెండు వస్త్రములను సమర్పించవలెను)

రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనంచోత్తరీయకం |

గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక ||

శ్రీ వరసిద్ధి వినాయకాయ యజ్ఞోపవీతం సమర్పయామి (వెండి తీగతో చేసిన యజ్ఞోపవీతము, బంగారు తీగతో చేసిన ఉత్తరీయము సమర్పించవలెను. లేదా రెండు పుష్పములుంచవలెను)

చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం |

విలేపనం సురశ్రేష్ఠ త్వదర్ధం ప్రతిగృహ్యతాం ||

శ్రీ వరసిద్ధి వినాయకం గంధాన్ ధారయామి (చందనము పూయాలి)

అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్

గృహొణ పరమానంధ శంభుపుత్ర సమోస్తుతే ||

శ్రీ వరసిద్ధి వినాయకాయ అలంకరణార్ధం అక్షతాన్ సమర్పయామి (అక్షతలు చల్లవలెను)

శ్లో|| సుగందీని చ పుష్పాణి వాతకుంద ముఖానిచ |

ఏక వింశతి పత్రాణి గృహొన్ గణనాయక ||

అథాంగ పూజా

(మంత్రమును చదువుతూ దాని కెదురుగా తెల్పిన చోట పూజింపవలెను)

ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి (పాదములు)

ఓం ఏకదంతాయ నమః గుల్భౌ పూజయామి (మడిమలు)

ఓం శూర్పకర్ణాయ నమః జానునీ పూజయామి (మోకాళ్లు)

ఓం విఘ్న రాజాయ నమః జంఘే పూజయామి (పిక్కలు)

ఓం అఖువాహనాయ నమః ఊరూ పూజయామి (తొడలు)

ఓం హేరంభాయ నమః కటిం పూజయామి (పిరుదు)

ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి (బొజ్జ)

ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి (బొడ్డు)

ఓం గణేశాయ నమః హృదయం పూజయామి (రొమ్ము)

ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి (కంఠం)

ఓం స్కందాగ్రజాయ నమః స్కంథౌ పూజయామి (భుజములు)

ఓం పాషస్తాయ నమః హస్తౌ పూజయామి (చేతులు)

ఓం గజ వక్త్రాయ నమః వక్త్రం పూజయామి (ముఖము)

ఓం విఘ్నహంత్రే నమః నేత్రౌ పూజయామి (కన్నులు)

ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి (చెవులు)

ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి (నుదురు)

ఓం సర్వేశ్వరాయ నమః (తల)

ఓం విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి (శరీరం)

అథ ఏకవింశతి పత్ర పూజా

(21 ఆకులతో పూజ చేయవలెను. పూజించవలసిన ఆకులు బ్రకెట్లలో తెలియజేయబడునవి)

ఓం సముఖా య నమః మాచీపత్రం పూజయామి (మాచిపత్రి)

ఓం గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి (వాకుడాకు)

ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి (మారేడు)

ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మమ పూజయామి (గరిక)

ఓం హరసూనవే నమః డత్తూర పత్రం పూజయామి (ఉమ్మెత్త)

ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి (రేగు ఆకు)

ఓం గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి (ఉత్తరేణి)

ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి (తులసి దళములు)

ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి (మామిడి ఆకు)

ఓం వికటాయ నమః కరవీర పత్రం పూజయామి (గన్నేరు)

ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి (విష్ణుక్రాంత)

ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి (దానిమ్మ)

ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి (దేవదారు)

ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి (మరువం)

ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి (జాజి ఆకు)

ఓం సురాగ్రజాయ నమః గండకీ పత్రం పూజయామి (గండకి ఆకు)

ఓం ఇభవక్త్రాయ నమః శమీ పత్రం పూజయామి (జమ్మి ఆకు)

ఓం వినాయకాయ నమః అశ్వత్థ పత్రం పూజయామి (రావి ఆకు)

ఓం సురసేవితాయ నమః అర్జున పత్రం పూజయామి (మద్ది ఆకు)

ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి (జిల్లేడు)

శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాణి సమర్పయామి (పూజచేయగా మిగిలిన ఆకులన్నియు

అథాష్టోత్తర శతనామ పూజా

(ప్రతి మంత్రమును చదువుతూ ఒక్కొక్క పూవు, లేదా అక్షతలు వేయవలెను)

1. ఓం వినాయకాయ నమ:
55. ఓం గదినే నమ:
2. ఓం విఘ్నురాజాయ నమ:
56. ఓం చక్రినే నమ:
3. ఓం గౌరీపుత్రాయ నమ:
57. ఓం ఇక్షుచాపధృతే నమ:
4. ఓం గణేశ్వరాయ నమ:
58. ఓం శ్రీదాయినే నమ:
5. ఓం స్కందాగ్రజాయ నమ:
59. ఓం అజాయ నమ:
6. ఓం అవ్యయాయ నమ:
60. ఓం ఉత్పలకరాయ నమ:
7. ఓం పూషాయ నమ:
61. ఓం శ్రీపతయే నమ:
8. ఓం దక్షాయ నమ:
62. ఓం స్తుతిహర్షితాయ నమ:
9. ఓం అధ్యక్షాయ నమ:
63. ఓం కులాద్రిభేదినే నమ:
10. ఓం ద్విజప్రియాయ నమ:
64. ఓం జటిలాయ నమ:
11. ఓం అగ్నిగర్భచ్ఛిదే నమ:
65. ఓం కలికల్మషనాశనాయ నమ:
12. ఓం ఇంద్ర శ్రీప్రదాయ నమ:
66. ఓం చంద్రచూడామణయే నమ:
13. ఓం వాణీ ప్రదాయ నమ:
67. ఓం కాంతాయ నమ:
14. ఓం అవ్యయాయ నమ:
68. ఓం పాపహారిణే నమ:
15. ఓం సర్వసిద్ధిప్రదాయ నమ:
69. ఓం సమాహితాయ నమ:
16. ఓం శర్వతనయాయ నమ:
70. ఓం ఆశ్రితశ్శ్రీకరాయ నమ:
17. ఓం శర్వరీ ప్రియాయ నమ:
71. ఓం సౌమ్యాయ నమ:
18. ఓం సర్వాత్మకాయ నమ:
72. ఓం భక్తవాంఛితదాయకాయ నమ:
19. ఓం సృష్టికర్తాయ నమ:
73. ఓం శాంతాయ నమ:
20. ఓం దేవానేకార్చితాయ నమ:
74. ఓం కైవల్యసుఖదాయ నమ:
21. ఓం శివాయ నమ:
75. ఓం సచ్చిదానందవిగ్రహాయ నమ:
22. ఓం శుద్ధాయ నమ:
76. ఓం జ్ఞానినే నమ:
23. ఓం బుద్ధి ప్రదాయ నమ:
77. ఓం దయాయుతాయ నమ:
24. ఓం శంతాయ నమ:
78. ఓం దాంతాయ నమ:
25. ఓం బ్రహ్మచారిణే నమ:
79. ఓం బ్రహ్మణ్యే నమ:
26. ఓం గజాననాయ నమ:
80. ఓం ద్వేషవివర్జితాయ నమ:
27. ఓం ద్వైమాతురాయ నమ:
81. ఓం ప్రమత్తదైత్యభయదాయ నమ:
28. ఓం మునిస్యుత్త్యాయ నమ:
82. ఓం శ్రీకంఠాయ నమ:
29. ఓం భక్తవిఘ్నువినాశయ నమ:
83. ఓం విబుధేశ్వరాయ నమ:
30. ఓం ఏకదంతాయ నమ:
84. ఓం రమార్చితాయ నమ:
31. ఓం చతుర్బాహవే నమ:
85. ఓం విధినే నమ:
32. ఓం చతురాయ నమ:
86. ఓం నాగరాజయజ్ఞోపవీతినే నమ:
33. ఓం శక్తిసంయుతాయ నమ:
87. ఓం స్థూలకంఠాయ నమ:
34. ఓం లంబోదరాయ నమ:
88. ఓం స్వయంకర్తాయ నమ:
35. ఓం శూర్పకర్ణాయ నమ:
89. ఓం సామ ఘోషప్రియాయ నమ:
36. ఓం హరిర్ర్బహ్మవిదే నమ:
90. ఓం పరాయ నమ:
37. ఓం ఉత్తమాయ నమ:
91. ఓం స్థూలతుండాయ నమ:
38. ఓం కాలాయ నమ:
92. ఓం అగ్రణినే నమ:
39. ఓం గ్రహపతయే నమ:
93. ఓం ధీరాయ నమ:
40. ఓం కామినే నమ:
94. ఓం వాగీశాయ నమ:
41. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమ:
95. ఓం సిద్ధిదాయాయ నమ:
42. ఓం పాశాంకుశధరాయ నమ:
96. ఓం దూర్వాబిల్వప్రియాయ నమ:
43. ఓం చండాయ నమ:
97. ఓం అవ్యక్తమూర్తయే నమ:
44. ఓం గుణాతీతాయ నమ:
98. ఓం అద్భుతమూర్తయే నమ:
45. ఓం నిరంజనాయ నమ:
99. ఓం శైలేంద్రతనుజోత్సంగాయ నమ:
46. ఓం అకల్మషాయ నమ:
100. ఓం ఖేలనోత్సుకమానసాయ నమ:
47. ఓం స్వయంసద్ధాయ నమ:
101. ఓం స్వలావణ్య సుధాసార జితమన్మథ విగ్రహాయ నమ:
48. ఓం సిద్ధార్చిత పదాంబుజాయ నమ:
102. ఓం సంస్తజగదాధారాయ నమ:
49. ఓం బీజాపూర ఫలాసక్తాయ నమ:
103. ఓం మాయావినే నమ:
50. ఓం వరదాయ నమ:
104. ఓం మూషకవాహనాయ నమ:
51. ఓం శాశ్వతాయ నమ:
105. ఓం హృష్టాయ నమ:
52. ఓం కృతినే నమ:
106. ఓం తుష్టాయ నమ:
53. ఓం ద్విజప్రియాయ నమ:
107. ఓం ప్రసన్నాత్మనే నమ:
54. ఓం వీతభయాయ నమ:
108. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమ:

ఓం శ్రీ వరసిద్ది వినాయకాయ నమః అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి.

శ్లో || దశాంజ్గం గుగ్గులోపేతం సుగన్ధిం సుమనోహరం |

ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ ||

శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః ధూపమాగ్రాపయామి

(దశాంజ్గము, గుగ్గులము నిప్పులపై వేసి పొగ చూపవలెను. లేదా, అగరువత్తి వెలిగించవలెను)

శ్లో || సాజ్యం త్రివర్తి సమ్యుక్తం వహ్నినా ద్యోతితం మయా |

గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే ||

శ్రీవరసిద్ధి వినాయకాయ దీపం దర్శయామి (దీపమును చూపాలి)

శ్లో || సుగంధాన్ సుకృతాన్ చైవ మోదకాన్ ఘృతపాచితాన్ |

నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గైః ప్రకల్పితాన్ ||

శ్లో || భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోప్యం పానీయమేవచ |

ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక ||

శ్రీ వరసిద్ధి వినాయకాయ మహానైవేద్యం సమర్పయామి (పిండి వంటలు మొదలైన వానితో కూడిన మహా నివేదన చేయవలెను)

శ్లో || పూగీ ఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం |

కర్పూర చూర్ణ సమ్యుక్తం తాంబూరం ప్రతిగృహ్యతాం ||

శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః తాంబూలం సమర్పయామి (వక్క, పచ్చకర్పూరము ఉంచి తాంబూలం సమర్పించవలెను)

శ్లో|| సదానందద విఘ్నేశ పుష్కలాని ధనాని చ |

భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుప్య వినాయక ||

శ్రీ వరసిద్ధి వినాయకాయ సువర్ణ పుష్పం సమర్పయామి (పుష్పములు సమర్పించవలెను.)

శ్లో || ఘృతవర్తిసహస్త్రైశ్చ కర్పూర శకలైస్తథా |

నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ ||

శ్రీ వరసిద్ధి వినాయకాయ నీరాజనం దర్శయామి (కర్పూరము వెలిగించవలెను) నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి (నీటిని సమర్పించవలెను)

ఆథ దూర్వాయుగ్మ పూజా

(ఒక్కొక్క మంత్రమునకు ఒక్కొక్క జత గరిక వేయవలెను)

ఓం గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి

ఓం ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి

ఓం లఖు వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి

ఓం వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి

ఓం ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి

ఓం సర్వసిద్ధిప్రదాయ నమః దూర్వాయుగ్మం పూజయామి

ఓం ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి

ఓం ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి

ఓం మూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి

ఓం కుమార గురవే నమః దూర్వాయుగ్మం పూజయామి

(దోసలియందు పుష్పమునుంచుకొని క్రింది మంత్రమును చెప్పాలి)

శ్లో|| గణాధిప నమస్త్రేస్తు ఉమాపుత్రాఘనాశన

వినాయకేశతనయ సర్వసిద్ధి ప్రదాయక |

ఏకదంతైక వదన తథా మూషిక వాహన

కుమార గురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం ||

శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః మంత్రపుష్పం సమర్పయామి (పుష్పములను ఉంచవలెను)

శ్లో || ప్రదిక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ |

నమస్తే విఘ్నరాజాయ నమస్త్రే విఘ్న నాశన ||

శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి (ఆత్మ ప్రదక్షిణ చేయవలెను)

శ్లో || ఆర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్ర ప్రదాయక |

గందపుష్పాక్షతైర్ముక్తం పాత్రస్థం పాపనాశన ||

శ్రీ వరసిద్ధి వినాయకాయ పునరర్ఘ్యం సమర్పయామి (పై శ్లోకము చెప్పుచూ 3 మారులు నీటిని విడువవలెను)

శ్లో || వినాయక నమస్తుభ్యం సతతం - మోదకప్రియ |

నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా || (గణపతికి నమస్కరించవలెను)

(వాయన దానము)

శ్లో || గణేశః ప్రతిగృహ్ణాతు గణేశో వై దదాతి చ |

గణేశః తారకోభాభ్యాం గణేశాయ నమో నమః ||

(ఈ శ్లోకము వాయన మిచ్చువారు చెప్పవలెను)

మంత్రము-

దేవస్యత్వాసవితుః ప్రసవేశ్వినోర్భాహుభ్యాం పూష్ణోహస్తాభ్యామా దదే

(ఈ మంత్రము వాయనము పుచ్చుకొనువారు చెప్పవలెను)

(పూజచేసినవారు ఈ క్రింది శ్లోకములను చెప్పుచూ ఆత్మ ప్రదక్షిణ నమస్కారములను చేయవలెను)

శ్లో || యానికానిచ పాపాని జన్మాంతర కృతాని చ |

తానితాని ప్రనశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||

శ్లో || పాపోహం పాప కర్మాణాం పాపాత్మా పాప సంభవః |

త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల ||

శ్లో || అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |

తస్మాత్కారుణ్య భావేన రక్షరక్ష వినాయక ||

ప్రార్ధన

ఉ|| తొండము నేకదంతమును దోరపు బొజ్జయు వామహస్తమున్

మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్

కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై

యుండెడి పార్వతీతనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్ ||

చ|| తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మ్రొక్కెదన్

ఫలితము సేయుమయ్య నిను ప్రార్ధన చేసెద నేకదంత మా

వలపటి చేతి ఘంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ

తలపున నిన్ను వేడెదను దైవగణాధిప! లోకనాయకా!

క || తలచితినే గణనాధుని తలచితినే విఘ్నపతిని దలచిన పనిగా

దలచితినే హేరంబుని దలచిన నా విఘ్నములను తొలగుట కొఱకున్

క || అటుకులు కొబ్బరి పలుకులు చిట్టిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్

నిటలాక్షు నగ్రసుతునకు పటుతరముగ విందుచేతు ప్రార్ధింతు మదిన్

వినాయకుని దండకము

శ్రీ పార్వతీపుత్ర లెకత్రయీస్తోత్ర, సత్పుణ్యచార్తిత్ర, భద్రేభవక్త్రా మహాకాయ, కాత్యాయనీ నాథ సంజాత స్వామీ శివాసిద్ధివిఘ్నేశ, నీ పాద పద్మంబులన్, నీదు కంఠంబు నీ బొజ్జ నీ మోము నీ మౌళి బాలేందు ఖండంబు నీ నాల్గు హస్తంబులు న్నీకరాళంబు నీ పెద్ద వక్త్రంబు దంతంబు నీ పాద హస్తంబు లంబోదరంబున్ సదామూషికాశ్వంబు మందహాసంబు నీ చిన్న తొండంబు నీ గుజ్జు రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీ గంధమున్ గుంకుమం బఖతల్జాజులున్ పంకజంబుల్ తగన్ మల్లెలున్నొల్లలున్మంచి చేమంతులున్ దెల్లగన్నేరులున్ మకెలన్ పొన్నలున్ పువ్వులున్మంచి దూర్వంబులుందెచ్చి శాస్త్రోక్త రీతిన్ సమర్పించి పూజించి సాష్టాంగముంజేసి విఘ్నేశ్వరా నీకు టెంకాయ పొన్నంటిపండ్లున్ మరిన్మంచివౌ నిఖుఖండంబులు న్రేగుబం డ్లప్పడంబుల్ వడల్ నేతి బూరెల్ మరిన్ గోధుమప్పంబులున్ పుంగులు న్బూరెలు న్గారెలున్ చొక్కమౌ చల్మిడిని బెల్లమున్ తేనెయుం జున్నుబాలాజ్యము న్నానుబియ్యంబు నామ్రంబు బిల్వంబు మేల్ బంగరుం బళ్ళె ముందుంచి నైవేద్యముం బంచనీరాజనంబున్ నమస్కారముల్‌చేసి విఘ్నేశ్వరా నిన్ను బూజింపకే యన్యదైవంబులం బ్రార్ధనల్ సేయుటల్ కాంచనంబొల్లకే ఇన్ముదా గోరు చందంబుగాదే మహాదేవ యోభక్తమందార యో సుందరాకారా యో భాగ్యగంభీర యో దేవచూడామణి లోకరక్షామణి బంధుచింతామణీ స్వామి నిన్నెంచ నేనెంత నీ దాసదాసాను దాసుండ శ్రీ దాంతరాజాన్వవాయుండ రామాభి దాసుండ నన్నైప్డు చేబట్టి సుశ్రేయునింజేసి శ్రీమంతుగాచూచి హృత్వద్మ సింహాసనారూఢత న్నిల్చి కాపాడుతేకాదు నింగొల్చి ప్రార్ధించు భక్తాళికిన్ కొంగుబంగారమై కంటికిన్ ఱెప్పవై బుద్ధియు న్విద్యయు న్పాడియున్ పంటయున్ బుత్రపౌత్రాది వృద్ధిన్ దగన్‌కల్గగాజేసి పోషింపుమంటిన్ గృపన్ గావుమంటిన్ మహాత్మాయివే వందనంబుల్ శ్రీగణేశా నమస్తే నమస్తే నమస్తే నమః

విఘ్నేశ్వరుని మంగళహారతులు

శ్రీ శంభుతనయునకు సిద్దిగణనాధునకు వాసిగల దేవతావంద్యునకును అపరసవిద్యలకు అది గురువైనట్టి భూసురోత్తమ లోక పూజ్యునకును జయమంగళం || నేరేడు మారేడు నెలవంకమామిడి దూర్వారచెంగల్వ ఉత్తరేణు | వేఱువేఱుగదెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవగణపతికి నిపుడు ||జయ|| సురు చిరముగ భాద్రపద శుద్ధ చవితియందు పొసగ సజ్జనులచే పూజ గొల్తు | శశిచూడరాకున్న జేకొంటి నొక వ్రతము పర్వమున దేవ గణపతికి నిపుడు ||జయ|| పానకము వడపప్పు పనస మామిడిపండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్షపండ్లు | తేనెతో మాగిన తియ్యమామిడిపండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికి నిపుడు ||జయ|| ఓబొజ్జ గణపయ్య నీబంటు నేనయ్య ఉండ్రాళ్ళమీదికి దండుపంపు కమ్మని నెయ్యియు కడుముద్దపప్పును బొజ్జ విరుగగ దినుచు పొరలుకొనుచు ||జయ|| వెండి పళ్ళెరములో వెయివేల ముత్యాలు కొండలుగ నెలములు కలియబోసి, మెండుగను హారములు మెడనిండ వేసికొని దండిగా నీకిత్తు ధవళారతి ||జయ|| పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరినీ ఎప్పుడూ నినిగొల్తు ఏకచిత్తంబున పర్వమున దేవగణపతికి నిపుడు ||జయ|| ఏకదంతంబును ఎల్ల గజ వనంబు బాగయిన తొండంబు వలపు కడుపు, జోకయిన మూషికముజోకయిన మూషికము సొరిది నెక్కాడుచును భవ్యుడగు దేవగణపతికి నిపుడు ||జయ|| మంగళము మార్తాండ తేజునకు మంగళము సర్వజ్ఞనందితునకు మంగళము ముల్లోక మహిత సంచారునకు మంగళము దేవగణపతికి నిపుడు ||జయ|| సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు ఒనరంగ నిరువది యొక్క ప్రతి దానిమ్మ మరువమ్ము విష్ణుక్రాంత యుమ్మెత్త దుర్వార యుత్తరేణి కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు జాజీబలురక్కసి జమ్మి దాసనిపువ్వు గరిక మాచిపత్రి మంచి మొలక అగరు గంధాక్షత ధూప దీప నైవేద్య తాంబూల పుష్పోపహారములును భాద్రపద శుద్ధ చవితిని కుడుములు నానుబ్రాలు ఉండ్రాళ్లు పప్పు పాయసము జున్ను తేనెయు భక్తిమీర కోరి పూజింతు నిన్నైపుడు కోర్కెలలర ||జయ|| బంగురుచెంబుతో గంగోదకము తెచ్చి సంగతిగ శివునకు జలకమార్చి, మల్లెపువ్వుదెచ్చి మురహరుని పూజింతు నిన్నైపుడు కోర్కెలలర ||జయ|| బంగురుచెంబుతో గంగోదకము తెచ్చి సంగతిగ శివునకు జలకమార్చి, మల్లెపువ్వుదెచ్చి మురహరుని పూజింతు రంగైన నా ప్రాణలింగమునకు ||జయ|| పట్టుచీరలు మంచి పాడిపంటలుగల్గి ఘనముగా కనకములు కరులు హరులు యిష్టసంపదలిచ్చి యేలిన స్వామికి పట్టభద్రుని దేవగణపతికి నిపుడు ||జయ|| ముక్కంటి తనయుడని ముదముతో నేనును చక్కనైన వస్తుసమితిగూర్చి నిక్కముగ మనమును నీయందె నేనిల్చి ఎక్కుడగు పూజ లాలింపజేతు ||జయ|| మల్లెలా మొల్లలా మంచి సంపెంగలా చల్లనైనా గంధసారములను ఉల్లమలరగ మంచి ఉత్తమపు పూజలు కొల్లలుగ నేజేతు కోరి విఘ్నేశ ||జయ|| దేవాది దేవునకు దేవతారాధ్యునకు దేవేంద్రవంద్యునకు దేవునకును దేవతలు మిముగొల్చి తెలిసి పూజింతురు భవ్యుడగు దేవగణపతికి నిపుడు ||జయ|| చెంగల్వ చేమంతి చేలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజింతు, నేనెపుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను ||జయ|| మారేడు మామిడి మాదీఫలంబులు ఖర్జూర పనసలును కదళికములు | నేరేడు నెలవంది టెంకాయ తేనెయు చాలగా నిచ్చెదరు చనువుతోను ||జయ|| ఓ బొజ్జగణపతి ఓర్పుతో రక్షించి కాచి మమ్మేలు మీ కరుణతోను మాసాలగలవని మహిమీద నెల్లపుడు కొనియాడుచుందుము కోర్కెదీర ||జయ||

విఘ్నేశ్వరుని కథా ప్రారంభము

సూతమహాముని శౌనకాది మునులకు విఘ్నేశ్వరోత్పత్తియు, చంద్రదర్శన దోషకారణంబును తన్నివారణమును చెప్పదొడంగెను.

పూర్వము గజ రూపముగల రాక్షసేశ్వరుండు శివునిగూర్చి ఘోర తపంబొనర్చెను. అతని తపమునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమే వరంబుకోరుకోమనెను. అంత గజాసురుండు పరమేశ్వరుని స్తుతించి, స్వామీ! నీ వెల్లప్పుడు నా యుదరమందే వసించియుండుమని కోరెను. భక్తసులభుండగు నా పరమేశ్వరుండాతని కోర్కెదీర్చ గజాసురుని యుదరమందు ప్రవేశించి సుఖంబున నుండెను.

కైలాసమున పార్వతీదేవి భర్త జాడ తెలియక పలుతెరంగుల నన్వేషించుచు కొంత కాలమునకు గజాసుర గర్భస్థుడగుట తెలిసికొని రప్పించుకొను మార్గము గానక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్ధించి తన పతి వృత్తంతము తెలిపి, 'మహాత్మా! నీవు పూర్వము భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకు యొసంగితివి. ఇప్పుడుకూడ నుపాయాంతరముచే నా పతిని రక్షింపుము ' అని విలపింప, శ్రీహరియా పార్వతి నూరడించి పంపె. అంత నా హరి బ్రహ్మాది దేవతలను పిలిపించి, గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే యుక్తమని నిశ్చయించి, నందిని గంగిరెద్దుగా నలంకరించి, బ్రహ్మాది దేవతల చేతను తలకొక వాద్యమును ధరింపజేసి, తానును చిరుగంటలు, సన్నాయిలు దాల్చి గజాసుర పురంబు జొచ్చి జగన్మోహనంబుగా నాడించుచుండగా, గజాసురుండు విని, వారలను తన చెంతకు పిలిపించి తన భవనమందు నాడింప నియోగించెను. బ్రహ్మాది దేవతలు వాద్య విషేషంబుల బొరు సలుప జగన్నాటక సూత్రధారియగు నా హరి చిత్ర విచిత్ర కరంబుగ గంగిరెద్దును ఆడించగా, గజాసురుండు పరమానందభరితుడై 'మీకేమి కావలయునో కోరుడొసంగెద ' ననిన, హరి వానిని సమీపించి, 'ఇది శివుని వాహనమును నంది ', శివుని కనుగొనుటకై వచ్చే. కావున శివునొసంగు ' మనెను. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి, అతనిని రాక్షసాంతకుడగు శ్రీహరిగా నెరింగి, తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్థుండగు పరమేశ్వరుని 'నా శిరస్సుత్రిలోక పూజ్యముగా జేసి, నా చర్మము నీవు ధరింపు 'మని ప్రార్ధించి విష్ణుమూర్తికి అంగీకారము దెలుప నాతడు నందిని ప్రేరేపించెను. నందియు తన శృంగములచే గజాసురుని చీల్చి సంహరించెను. అంత శివుడు గజాసుర గర్భము నుండి బహిర్గతుడై విష్ణుమూర్తిని స్తుతించెను. అంత నా హరి 'దుష్టాత్ముల కిట్టి వరంబు లీయరాదు. ఇచ్చినచో పామునకు పాలు పోసి నట్లగు ' నని ఉపదేశించి బ్రహ్మాది దేవతలను వీడ్కొలిపి తాము వైకుంఠమున కేగెను. శివుడు నంది నెక్కికైలాసంబున కతివేగంబున జనియె.

వినాయకోత్పత్తి

కైలాసంబున పార్వతీదేవి భర్త రాకను దేవాదుల వలన విని ముదమంది అభ్యంగన స్నానమాచరించును నలుగుబిండి నొక బాలునిగ జేసి, ప్రాణం బొసగి, వాకిలి ద్వారమున కాపుగా ఉంచెను. స్నానానంతరము పార్వతి సర్వాభరణముల నలంకరించుకొనుచు పత్యాగమనమును నిరీక్షించుచుండె. అపుడు పరమేశ్వరుడు నందినారోహించి వచ్చి లోపలికి పోబోవ వాకిలి ద్వారముననున్న బాలుడడ్డగించెను. శివుడు కోపించి త్రిశూలముతో బాలుని కంఠంబు దునిమిలోని కేగెను.

అంత పార్వతీదేవి భర్తంగాంచి, ఎదురేగి, అర్ఘ్య పాద్యాదులచే పూజించె. వా రిరువురును పరమానందమున ప్రియభాషణములు ముచ్చటించుచుండు తానొనరించిన పనికి చింతించి, తాను తెచ్చిన గజాసుర శిరంబు నా బాలుని కతికించి ప్రాణంబు నొసంగి 'గజాననుడు ' అని నామం బొసగె. అతనిని పుత్రప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొనుచుండిరి. గజాననుడు తల్లిదండ్రులను పరమ భక్తితో సేవించుచుండెను. ఇతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింద్యుడను నొక ఎలుక రాజును వాహనముగా జేసికొనియెను.

కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జనియించెను. అతడు మహా బలశాలి. అతని వాహనరాజము నెమలి. అతడు దేవతల సేనా నాయకుడై ప్రఖ్యాతిగాంచియుండెను.

విఘ్నేశాధిపత్యము

ఒకనాడు దేవతలు, మునులు పరమేశ్వరుని సేవించుచు విఘ్నముల కొక్కని అధిపతిగా తమ కొసంగుమని కోరిరి. గజాననుడు తాను జ్యేష్ఠుడను గనుక ఆ యాధిపత్యము తన కొసంగుమనియు, 'గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్ధుడు గనుక ఇయ్యాధిపత్యము తన కొసంగు 'మని కుమారస్వామియు తండ్రిని వేడుకొనిరి.

శివుడక్కుమారులను జూచి, 'మీలో నెవ్వరు ముల్లోకములందలి పుణ్య నదులలో స్నానమాడి ముందుగా నా యొద్దకు వచ్చెదరో, వారికీ యాధిపత్యం బొసంగుదు 'నని మహేశ్వరుండు పలుక, వల్లె యని సమ్మతించి కుమారస్వామి నెమలి వాహహనంబు నెక్కి వాయు వెగంబున నేగె. అంత గజాననుడు ఖిన్నుడై, తండ్రిని సమీపించి, ప్రణమిల్లి 'అయ్యా! నా అసమర్ధత తామెరింగియు నిట్లానతీయదగునే! మీ పాద సేవకుడను. నా యందు కటాక్ష ముంచి తగునుపాయంబు దెల్పి రక్షింపవే ' యని ప్రార్ధింప, మహేశ్వరుడు దయాళుడై, 'సకృత్ నారాయణేత్యుక్త్వా పుమాన్ కల్ప శతత్రయం గంగాది సర్వ తీర్దేషు స్నాతో భవతి పుత్రక ' - కుమారా! ఒకసారి 'నారాయణ మంత్రంబు పటించు ' మనగా, గజాననుడు సంతసించి, అత్యంతభక్తితో నమ్మంత్రంబు జపించుచు కైలాసంబున నుండె.

అమ్మంత్ర ప్రభావంబున అంతకు పూర్వము గంగానదికి స్నానమాడ నేగిన కుమారస్వామికి గజాననుండా నదిలో స్నానమాడి తన కెదురుగా వచ్చుచున్నట్లు గాంపింగ, నతండును మూడుకోట్ల ఏబదిలక్షల నదులలోకూడ అటులనే చూచి ఆశ్చర్యపడుచు, కైలాసంబున కేగి తండ్రి సమీపమందున్న గజాననుని గాంచి, నమస్కరించి, తన బలమును నిందించుకుని, 'తండ్రీ! అన్నగారి మహిమ తెలియక నట్లంటిని, క్షమింపుము. ఈ ఆధిపత్యంబు అన్నగారికే యొసంగు ' మని ప్రార్ధించెను.

అంత నప్పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధ చతుర్ధినాడు గజాననునికి విఘ్నాధిపత్యం బొసంగబడియె. ఆనాడు సర్వ దేశస్థులు విఘ్నేశ్వరునికి తమ విభవము కొలది కుడుములు, అపూపములు మున్నగు పిండివంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పానకము, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజింప, విఘ్నేశ్వరుండు సంతుష్టుడై కుడుములు మున్నగునవి భక్షించియు, కొన్ని వాహనమున కొసంగియు, కొన్ని చేత ధరించియు మంద గమనంబున సూర్యాస్తమయ వేళకు కైలాసంబున కరిగి తల్లిదండ్రులకు ప్రణామంబు సేయబోవ ఉదరము భూమికానిన చేతులు భూమి కందవయ్యె. బలవంతంబుగ చేతు లాలిన చరణంబు లాకాశంబు జూచె. ఇట్లు దండ ప్రణామంబు సేయ గడు శ్రమనొందు చుండ, శివుని శిరంబున వెలయు చంద్రుడు జూచి వికటంబుగ నవ్వె, అంత రాజ దృష్టి సోకి రాలు కుడ నుగ్గగునను సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి, అందున్న కుడుములు తత్ర్పదేశం బెల్లడల దొర్లెను. అతండును మృతుండయ్యె. పార్వతి శోకించుచు చంద్రుని జూచి, 'పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించెను గాన, నిన్ను జూచిన వారు పాపాత్ములై నీలాపనిందల నొందుదురుగాక ' అని శపించెను.

ఋషిపత్నులకు నీలాపనిందలు

ఆ సమయంబున సప్త మహర్షులు యజ్ఞంబు చేయుచు తమ భార్యలతో ప్రదక్షిణము చేయుచుండిరి. అగ్నిదేవుడు ఋషిపత్నులను చూచి మోహించి, శాప భయంబున అశక్తుడై క్షీణించుచుండగా, నయ్యది అగ్ని భార్య యగు స్వాహాదేవి గ్రహించి, అరుంధతీ రూపము దక్క తక్కిన ఋషిపత్నుల రూపంబు తానే దాల్చి పతికి ప్రియంబు చేసె. ఋషు లద్దానింగనుగొని అగ్నిదేవునితోనున్న వారు తమ భార్యలేయని శంకించి తమ భార్యలను విడనాడిరి. పార్వతీ శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వారి కట్టి నీలాప నింద కలిగినది.

దేవతలును, మునులును ఋషిపత్నుల యాపద పరమేష్ఠికి దెల్ప నాతండు సర్వజ్ఞుండగుటచే అగ్నిహొత్రుని భార్యయే ఋషి పత్నుల రూపంబు దాల్చి వచ్చుటం దెల్పి సప్తఋషులను సమాధానపరచె. వారితో కూడ బ్రహ్మకైలాసంబున కేతెంచి, ఉమామహేశ్వరుల సేవించి మృతుడై పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబు గూర్చె.

అంత దేవాదులు, 'ఓ పార్వతీ దేవీ! నీ శాపంబున లోకంబులకేల్ల కీడు వాటిల్లుచున్నది. దాని నుపసంహరింపు 'మని ప్రార్ధింప, పార్వతి సంతసించి, 'ఏ దినంబున ' విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో నా దినంబున చంద్రుని జూడరాదాని శాపావ కాశంబు నొసగె అంత బ్రహ్మాదులు సంతసించి తమ గృహంబుల కేగి, భాద్ర పద శుద్ధ చతుర్ధి యందు మాత్రము చంద్రుని జూడక జాగరూకులై సుఖంబుగ నుండిరి.

శమంతకోపాఖ్యానము

ద్వాపరయుగంబున ద్వారకావాసియగు శ్రీకృష్ణుని నారదుడు దర్శించి, స్తుతించి ప్రియసంభాషణములు జరుపుచు, 'స్వామీ! సాయంసమయమయ్యె. ఈనాడు వినాయక చతుర్ధి. పార్వతీదేవి శాపంబుచే చంద్రుని జూడరాదు గాన నిజ గృహంబున కేగెద శెలవిండు!' అని పూర్వ వృత్తంత మంతయు శ్రీకృష్ణునికి తెల్పి, నారదుడు స్వర్గలోకమున కేగెను.

అంత శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని నెవ్వరూ చూడరాదని పురంబున చాటింపించెను. నాటి రాత్రి శ్రీకృష్ణుడు క్షీర ప్రియుండుగాన, తాను మింటివంక చూడక గోష్టమునకు బోయి పాలు పితుకుచు, పాలలో చంద్రుని ప్రతిబింబమును జూచి, 'ఆహా! ఇక నా కెట్టి యపనింద రానున్నదో' యని సంశయమున నుండెను. కొన్నాళ్లకు సత్రాజిత్తను రాజు సూర్య వరముచే శమంతక మణిని సంపాదించి, ద్వారకా పట్టణమునకు శ్రీకృష్ణదర్శనార్ధమై వచ్చెను. శ్రీకృష్ణుడాతనిని మర్యాద చేసి, 'ఆ మణిని మన రాజునకి ' మ్మనెను. అత 'డది ఎనిమిది బారువుల బంగారము దినంబున కొసగునట్టిది. ఇట్టి మణిని ఏ మందమతియైన నివ్వ 'డనిన, పోనిమ్మని శ్రీకృష్ణుదూరకొనెను.

అంత నొకనాడు సత్తాజిత్తు తమ్ముడు ప్రసేను డా మణిని కంఠమున ధరించి వేటాడ నడవికి జనిన నొక సింహ మా మణిని మాంసఖండ మని భ్రమించి, వాని జంపి ఆ మణిని గొని పోవుచుండగా, నొక భల్లూక మా సింగమును దునిమి యా మణిని గొని తమ కుమార్తె కాటవస్తువుగ నొపంగెను. మఱునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి నాలించి, 'కృష్ణుడు మణి ఇవ్వలేదని నా సోదరుని జంపి, రత్నమపహరించె, నని నగరము చాటె. శ్రీకృష్ణుడది విని నాడు క్షీరమున చంద్రబింబమును జూచిన దోష ఫలంబని ఎంచి దాని బాపుకొన బంధుసమేతుండై యరణ్యమునకు బోయి వెదకగా, నొక్క చోట ప్రసేన కళేబరంబును, సింగపు కాలి జాడలును పిదప భల్లూక చరణ విన్యాసంబును గాంపించెను.

ఆ దారి పట్టి బోవుచుండ నొక పర్వత గుహ ద్వారంబు జూసి, పరివారము నచట విడిచి కృష్ణుండు గుహ లోపలి కేగి అచట బాలిక ఉయ్యాలపై కట్టబడి యున్న మణిని జూచి అచ్చటికిబోయి, ఆ మణి చేతపుచ్చుకుని వచ్చుచున్నంట ఉయ్యాలలోని బాలిక యేడ్వదొడంగెను. అంత దాదియును వింత మానిసి వచ్చేననుచు కేకలు వేసెను.

అంతట జాంబవంతుడు రోషావేశుండై చనుదెంచి శ్రీకృష్ణునిపై బడి అరచుచు, నఖంబుల గ్రుచ్చుచు, కోరల గొఱకుచు, ఘోరముగా యుద్ధము చేయ శ్రీకృష్ణుడు వానింబడద్రోసి, వృక్షముల చేతను రాళ్ల చేతను, తుదకు ముష్టిఘాతముల చేతను రాత్రింబవళ్లు ఎడతెగక ఇరువదెనిమిది దినంబుల యుద్ధ మొనర్పజాంబవంతుడు క్షీణబలుండై దేహం బెల్ల నొచ్చి భీతి జెందుచు తన బలంబును హరింపజేసిన పురుషుండు రావణ సంహారి యగు శ్రీరామచంద్రునిగా తలంచి, అంజలి ఘటించి, 'దేవాది దేవా! ఆర్తజన పోషా! భక్తజన రక్షా! నిన్ను శ్రీరామచంద్రునిగా నెఱింగితి. ఆ కాలంబున నా యందలి వాత్సల్యముచే నన్ను వరంబు కొరుమని ఆజ్ఞనయెసంగ నా బుద్ధిమాంద్యంబున మీతో ద్వంద్వ యుద్ధంబు చేయవలెనని కోరు కొంటిని. కాలాంతరమున నది జరుగగలదని సెలవిచ్చితురి.

ఇప్పుడు నా కోరిక నెరవేర్చితిరి. నాశరీరమంతయు శిథిలమయ్యెను. ప్రాణములు కడబట్టె, జీవితేచ్చ నశించె. నా అపరాధములు క్షమించి కాపాడుమని ప్రార్ధింప, శ్రీకృష్ణుడు దయాళుడై, జాంబవంతుని శరీర మంతయు తన హస్తంబున నిమిరి భయంబు బాపి, 'భల్లూకేశ్వరా! శమంతకమణి నపహరించినట్లు నాపై నారోపించిన అపనింద బాపుగొన నిటువచ్చితిని గాన మణి నొసంగుము. నే నెగెదా ననిన జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణిసహితముగా తమ కుమార్తెయగు జాంబవతిని కానుకగా నొసంగెను. అంత తన ఆలస్యమునకు పరితపించు బంధుమిత్ర సైన్యముల కానందంబు కలిగించి, కన్యారత్నముతోను, మణితోను శ్రీకృష్ణుడు పురంబుచేరి సత్రాజిత్తును రావించి, పిన్న పెద్దలను జేర్చి యావ ద్వఋత్తంతమును చెప్పి శమంతకమణి నొసంగిన నా సత్రాజిత్తు 'అయ్యో! లేనిపోని నింద మోపి దోషంబునకు పాల్పడితి ' నని విచారించి మణిసహహితముగా తన కూతురగు సత్యభామను భార్యగా సమర్పించి, తప్పు క్షమింపు మని వేడుకొనెను. శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని మణి వలదని మరల నొసంగెను. శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవతీ సత్యభామలను పరిణయంబాడ నచటికి వచ్చిన దేవాదులు, మునులు స్తుతించి, 'మీరు సమర్ధులు గనుక నీలాపనింద బాపుకొంటిరి. మాకేమి గతి 'యని ప్రార్ధింప శ్రీకృష్ణుడు దయాళుడై, 'భాద్రపద శుద్ధ చతుర్ధిని ప్రమాదంబున చంద్రదర్శ మయ్యెనేని ఆనాడు గణపతిని యథావిధి పూజించి, ఈ శమంతక మణి కథను విని అక్షంతలు శిరంబున దాల్చువారు నీలాపనింద నొందకుండెదరు గాక! అని ఆనతీయ, దేవాదులు సంతసించి తమ నివాసంబుల కరిగిరి. ఇట్లు సూత మునీంద్రుడు గణాధిపతి శాపమోక్ష ప్రకారంబు శౌనకాది మునులకు వినిపించి వారిని వీడ్కొని నిజాశ్రమంబున కరిగెను.

నిమజ్జనం చేసే విధానం

దసరా పండుగలా వినాయకచవితికి కూడా నవరాత్రులు నిర్వహించడం సంప్రదాయం. తొమ్మిది రోజులపాటు పూజలు నిర్వహించి, ఆ తర్వాత దేవాతా మూర్తులను నిమజ్జనం చేయడం అనాదిగా వస్తున్నది. నిమజ్జనాన్ని పండుగ రోజుగానీ, లేదా 3, 5, 7, 9వ రోజు గానీ నిర్వహించాలి. అంటే బేసి సంఖ్య విన్న ఏ రోజైనా స్వామిని నిమజ్జనం చేయవచు. నిమజ్జనం చేసే ముందు గణపతికి భక్తితో ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. తీర్ధ ప్రసాదాలను అందరూభుజించి ఆ తరువాత సంప్రదాయబద్ధంగా నిమజ్జనం ఊరేగింపు నిర్వహించాలి. గణనాధుడిని నీటిలోకి విడిచే ముందు "శ్రీ గణేశం ఉద్వాసయామి.....శోభనార్ధం పునరాగమనాయచ"అని పఠించడం సంప్రదాయం