Friday 30 September 2011



* వాల్మీకి రామాయణంలో అహల్య తన పతి గౌతముడు వచ్చాడని భ్రమించి ఆ తరువాత చలించిందని చెప్పారు. ఆమె వయు చక్షకులాలని, శిలాకృతి దాల్చిందని చెప్తారు. దీనిలో రహస్యం ఏమిటి?

అహల్య విషయంలో వాల్మీకి రామాయణం చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పింది. అయితే అహల్య చరిత్ర వేదంలో కూడా వుంది. ఇతర పురాణాలలో అనేకచోట్ల ఆ ప్రసక్తి వచ్చింది. అహల్య చరిత్రయొక్క తత్వం సమగ్రంగా తెలియాలి అంటే కొన్ని సాంకేతిక అర్ధాల్లోకి కూడా వెళ్లాలి. మానవ జీవితాలు కేవలం వీళ్ల ఇచ్ఛల చేత కాకుండా గ్రహగతుల యొక్క ప్రభావంచేత కూడా నడుస్తుంటాయి. అయితే ఈ గ్రహగతులు ఎలా నడుస్తాయి అంటే గ్రహాలకంటే పైనున్న దివ్యలోక వాసులైన దేవతల ప్రవర్తన ద్వారా!గ్రహాలు ప్రభావితాలు కావడం అంటే గ్రహములయందు అధిష్టించినటువంటి దేవతలు ప్రభావితులై వాళ్ల ద్వారా వాళ్ల అంశలతోజన్మించిన వాళ్ల యొక్క ప్రభావంలో వున్న జీవుల మీద కూడా ప్రభావం చూపుతాయి. అలాంటి ప్రభావం మామూలుగా మనందరి మీదా పడుతూ వుంటుంది. కానీ మనం అందరమూ సామాన్య జీవులం కనుక చెప్పుకోదగ్గ కథ వుండదు. ఒకానొక సృష్టి క్రమంలో యుగ సంధి కాలంలో ఒక మహత్తరమైనటువంటి సృష్టి కార్యం చేయడంకోసం ఏ జీవులు అవతరిస్తారో, వాళ్ల జీవిత చరిత్రలు సామాన్యరీతికి భిన్నంగా ఉంటాయి. అహల్య అనేటువంటి జీవి స్ర్తి జీవిగా, బ్రహ్మ మానస పుత్రిగా జన్మించింది. ఆమెను గౌతమ మహర్షికి ఇచ్చి వివాహం చేసారు. మామూలుగా అందరి లాగా నడుచుకోవడం కోసం ఆ జీవి సృష్టించబడలేదు.
ఆ జీవివల్ల ప్రపంచానికి ఒక సందేశం అందాల్సి వుంది. అది ఉపాసనారీతి గురించిన సందేశం. ఆ ఉపాసనా రీతిలో మొదట ఆవిడ ఇంద్రుడ్ని ఉపాసన చేసింది. కానీ తండ్రి ఆమెను గౌతముడికి ఇచ్చి వివాహం చేసాడు. అప్పటినుంచీ ఆమె భర్తని ఉపాసన చేయాల్సి వచ్చింది. మొదట చేసిన ఉపాసన ఒకటి, తరువాత చేసిన ఉపాసన ఒకటి ఆవిడ భేద భావనలో మొదట్లో చేసిన ఉపాసనను వదిలేసింది. అది ఏమవుతుంది. దాని ఫలితం ఇస్తుంది. అటువంటప్పుడు దాన్ని ఎలా తట్టుకోవాలి? అనే సాధక సందేహాన్ని నివారించదలుచుకున్నారు. ఉపాసనలో ఎక్కడా పొరపాటు పడకూడదు అనే విషయం స్పష్టంగా చెప్పడం కోసం వాల్మీకి ఆ విషయంలో అహల్యను నిందిస్తునే శ్లోకాలు రాసేసాడు. దానితో వాల్మీకి చెప్పదలచుకున్న విషయం పూర్తి అయింది.

* విశ్వనాధవారి కల్పవృక్షంలో అహల్యకు ఇంద్రుడిపైన వ్యామోహం అణువంతైనా లేదన్నారేమిటి?అహల్య కథ వేదాదుల్లో కూడా ఉంది. అందులో కొన్ని సాంకేతికార్ధ రహస్యాలున్నాయని చెప్పుకున్నాం గదా. విశ్వనాధ సత్యనారాయణగారు వేదాలవరకు, పురాణాలవరకు వెళ్లిపోయి అహల్యా పదానికి ‘దున్నడానికి వీలుపడని క్షేత్రం’ అని అర్ధం. ఇంద్రుడు అంటే వర్షం అని సంకేతం. ఈ అర్ధాలను మనసులో పెట్టుకుని, అహల్యకి మోహం లేకపోయినా ఆమె సృష్టికి విరుద్ధంగా ప్రవర్తించింది అని చెప్పాడు. అయితే శిలారూపం దగ్గరికి వచ్చేటప్పటికి శిలా పదాన్ని కేలం రాయి అనే అర్ధంలో తీసుకున్నట్టయితే అర్ధం కుదరదు.
రామాయణంలో ఆ రాయికి ఆకలి దప్పులు వుంటాయి. ‘కేవలం వాయుభక్షణం చేస్తావు కాని కదలడానికి వీల్లేదు. అయినా ఆలోచనలు ఉంటాయి. అటువంటి నికృష్ట జీవితం నీకు కొన్ని వేల సంవత్సరాలు’’ అని గౌతముడు శిక్ష వేస్తాడు. అంటే ఏ సాధకుడు అయినా ఉపాసనలో పొరపాటుచేస్తే వాడికి ఇది శిక్ష. కాని నిజమైన ఉత్తమ తపస్వికి ఇది శిక్ష కాదు. ఇది సమాధికి అత్యంత అనుకూలం. వాడికి ప్రపంచంతో సంబంధం లేదు. ఆకలి దప్పులను పరిత్యాగం చేస్తే మనుస్సును పరమాత్మతో అనసంధానం చేయవచ్చు అని అహల్య భావించింది కనుక విశ్వనాధ సత్యనారాయణ ఇలా చెప్పారు. కేవలం సాధన మార్గాన్ని మాత్రమే వాల్మీకి చెప్పారు. ఇవి రెండూ రెండు దృక్కోణాలు!

*మన మతంలో ధర్మశాస్త్రానికి మరీ అంత ప్రాముఖ్యం ఎందుకు?మనది మతం కాదు. మనది ధర్మం. వేద ధర్మం మతం అనేది ఆ తర్వాత చాలా లక్షల సంవత్సరాల తరువాత పుట్టింది. ప్రకృతిలో సహజ సిద్ధమైన ఏ లక్షణం వుంటుందో అది ప్రకృతి ధర్మం. వైదేసికంగా వికాసం చెందిన మానవుడు క్రమంగా ప్రకృతికి దూరంగా జరుగుతాడు. దానివల్ల కొన్ని విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటాడు. అలాంటి విపత్తుల నివారణ కోసం మహాత్ములు కొన్ని నిబంధనలు ఏర్పరిచారు.ఈ నిబంధనలు గ్రంథంగా ఏర్పడ్డాయి. అవే ధర్మశాస్త్రాలు. అందుకే అవి ముఖ్యమైనవి.

* మన వివాహ సంప్రదాయం ప్రకారం స్ర్తిలు నల్లపూసలు ధరిస్తారు. ఇప్పుడు ఆర్భాటాలకు పోతున్నారు కదా! ఇవి ఎందుకు ధరించాలి?
స్ర్తి జీవి సంతానోత్పత్తికి అనుకూలంగా చేయబడిన శరీరం కలది. సంతానాన్ని పురుషుడు కూడా కొద్ది కాలం తన గర్భంలో మోస్తాడు. కాని స్ర్తి ఒక సంవత్సర కాలం తన గర్భంలో మోసి, వేరొక ప్రాణికి జన్మ నిస్తుంది. అందువల్ల స్ర్తి నాడులకు అనుకూలమైన పదార్ధాలను ఆమెకు ఆభరణాలుగా ఏర్పాటు చేసారు. వాటిల్లో ఒకటి నల్లపూసలు. దీన్నిబట్టి ఆర్భాటాలకుపోయి ఏవేవో పూసలు ధరిస్తే రావాల్సిన ప్రయోజనం రాదు.