అక్షరాభ్యాసం :
ఉత్తరాయణం శ్రేష్ఠము. హస్త పునర్వసు, స్వాతి, అనూరాధ, అర్ద్ర,రేవతి, అశ్వని, చిత్త, శ్రవణములయందు ఆది మంగళ శని వారములు కాకుండాను చరరాశి లగ్నమందు రిక్తతిధులు షష్ఠి, అష్టమి విడిచి అనధ్యయన దినములు కాకుండ అష్టమ శుద్ది కలిగియుండు లగ్నమునందు అక్షరాభ్యాసం చేయవలెను. కేవలం మధ్యాహ్నం లోపుగా వున్న లగ్నమునందు అక్షరాభ్యాసం చేయ వలెను.అన్నప్రాసన :
ఆరవమాసం లగాయతు మగపిల్లల విషయంలో సరిమాసములందును, అయిదవ మాసం మొదలు బేసి మాసముల యందు ఆడపిల్లల విషయములో అన్నప్రాసన చేయవలెను. ఆరవనెల ఆరవ రోజు అనేది కుసంస్కారము. అది దుష్టాచారము. అన్నప్రసనతోనే పిల్లల ఆరోగ్యవిషయాలు వుంటాయి. అందువలనే మంచిముహూర్తానికే అన్నప్రసన చేయాలి. అశ్వని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, ఉత్తరాషాడం, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్త్రాభాద్ర, రేవతి నక్షత్రములయందు చేయవలెను. ఆది, శని, మంగాళ వారములు నిషేధం. జన్మలగ్నం, అష్టమ లగ్నం కాకుండగను, దశమస్థానం శుద్ధి వున్న లగ్నమున అన్నప్రాసన చేయవలెను.ఉపనయన కర్తల నిర్ణయం :
"పితైవోపనయే త్పుత్రం తదభావే పితః పితా; తదభావే పితుర్భ్రాతా, తదభావేతు సోదర; తదభావే సగోత్ర సపిండా; తదభావేన నపిండ సగోత్రజా;"ఉపనయనము చేయుటకు తండ్రి ముఖ్యాధికారి వారులేని యెడల పితామహుడు (తాత) వారు లేని యెడల తండ్రిసోదరుడు (పిన తండ్రి పెద్జతండ్రి) వారు లేని యెడల సోదరుడు, వారు లేని యెడల ముగ్గురు పురుషులలో వున్న జ్ఞాతులు వారు లేనియెడల మేనమామ మొదలగు సపిండులు. వారు లేనిచో దూరపు జ్ఞాతులగు సగోత్రులు ఉపనయనము చేయుటకు అధికారులు వీరిలో ఎవరూ లేనియెడల శ్రాత్రీయుడైన వాని చేత బ్రహ్మోపస్దేశ సంస్కారము పూర్తి చేయవలెను ఉపనయన సంస్కారము చేయువారు తప్పని సరిగా వటువు కంటే పెద్దవారై ఉండాలి.
ఉపనయనం :
గర్భాష్టమంలోను, 11 ,13వ సంవత్సరంలోను కాల ప్రాధాన్యం, కాలతీతం దృష్ట్యా ముహూర్తం బలం లేకపోయినను ఉపనయనం చేయవచ్చును. 16 దాటిన బ్రాహ్మణునికి ఉపనయనం శ్రేష్టం కాదు. 22 దాటిన క్షత్రియులకు 24 దాటిన వైశ్యులకు ఉపనయనం వివాహం కోసమే గానీ సంస్కారం కోసం కాదు.ఉపనయనమునకు కాలములు :
" వసంతే బ్రాహ్మణ ముపనయిత గ్రేష్మేరాజన్యం శరదివైశ్యం మాఘాధి శుక్రాంతం పంచమాసావా సాధారణా సకలద్విజనాం" అనగా వసంతఋతువు బ్రాహ్మణులకును, గ్రీష్మ ఋతువు క్షత్రియులకును, శరదృతువు వైశ్యులకును ఉపనయనమునకు విశేషము. అయితే వసంతఋతువు అని వాడిన కారణంగాఉత్తరాయణమునందు ఉపనయనము చేయుటకు సంకోచము లేదు. అయితే మాఘాది పంచమాసములు విశేషంగా చెప్పిన కారణంగా మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసములందు ఉపనయనము చేయు విషయమై ఆక్షేపణ అనవసరం. అయితే ప్రత్యేకించి మాఘాది పంచమాసాః అని విధించిన కారణంగా పుష్య మాసం, ఆషాఢ మాసం, ఉత్తరాయణంలో కూడుకున్నవి అయినప్పటికి ఆమాసంలో ఉపనయన వ్రతం చేయరాదు.తదియ, పంచమి, షష్ఠి, సప్తమి తిధులు విశేషము బుధ, గురు, శుక్ర వారములు విశేషము. అనూరాధ, హస్త, చిత్త, స్వాతి, శ్రవణం, ధనిష్ట, శతభిషం, రేవతి, ఉత్తర, ఉత్త్రాభాద్ర,రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, అశ్వని నక్షత్రములు విశేషములు అష్టమంలోను కేంద్రస్థానములైన 1,4,7,10 స్థానము లందును, పాపగరహములు లేకుండా చూచి ఉపనయనం చేయవలెను. రవి వ్యయం నందు వుండగా ఉపనయనం చేయకూడదు.
ఊయలలో వేయుట :
మంగళ, శని వారములు పనికి రావు. అష్టమి ద్వాదశి, నవమి, అమావాస్య తిధులు పనికిరావు. భారసాల రోజునాయితే ఆరోజు సాయంత్రం వర్జ దుర్ముహర్తములు లేకుండా ఊయలల్లో నూతనముగా శిశువును వుంచవచ్చును. భరణి, కృత్తిక, ఆర్ద్ర, ఆశ్రేష, మఘ, పుబ్బ, విశాఖ, జ్యేష్ట, పు.షా, పుభా, నక్షత్రములు పనికి రావు.క్షౌరం + పుట్టు వెంట్రుకలు :
షష్ఠి, అష్టమి, నవమి, చవతి, చతుర్దశి, అమావాస్య, ద్వాదశి, పాడ్యమి తిధులు పనికి రావు. శుక్ర, మంగళ శని వారములు కూడదు. పుష్య, పునర్వసు, రేవతి, హస్త, శ్రవణ, ధనిష్ఠ, మృగశిర, అశ్వని, చిత్ర, శతభిషం, స్వాతి ఇవి ప్రసస్తములు ఉత్తర తూర్పు దిక్కుగా కూర్చొని క్షౌరం చేయించుకోవాలి. నిత్యంలో సోమ, బుధ వార విషయములలో తిధి, నక్షత్రం పట్టింపు లేదు.గర్భధానం :
అశ్వని, భరణి, ఆశ్రేష, మఘ,మూల, జ్యేష్ఠ, రేవతి నక్షత్రముల పూర్తి నిషేధము. జన్మ, నైధన, తారలు కాకూడదు. ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభద్ర, మృగశిర, హస్త అనూరాధ,శ్రవణం, ధనిష్టం, శతభిషం, రోహిణి స్వాతీ నక్షత్రములు విశేషములు. రెండు పక్షములలోని షష్ఠి అనధ్యయన దినములు ఏకాదశులు , ఆది మంగళ వారములు సంక్రమణ దినములు శ్రాద్ధ దినములు గర్భదానమునకు నిషేధదినములు వివాహం అయిన 16 రోజులలోపు గర్భదానమునకు ముహూర్తమును చూడనవసరం లేదు అనునది అశాస్త్రీయ విషయము. భార్య భర్తల భవిష్య ఆరోగ్య విషయములో గర్భాధాన ముహూర్తం ముఖ్య భూమిక వహిస్తుంది. వ్రతములు ఆచరించు దినములలో సంగమం నిషేధం.గర్భిణీపతి ధర్మాలు :
భార్య గర్భవతిగా వున్నప్పుడు "గర్భిణీ వాంఛితం ధర్మం తస్యైదద్యాత్ యధోచితం" భార్య కోరిన ఉచితమైన కోరికలు తీర్చవలెను. విదేశీ ప్రయాణము, చెట్ల నరుకుట, ఏడవ మాసం నుండి క్షౌరము, మైధునము, తీర్ధయాత్ర, శ్రాద్ధ భోజనము, నావప్రయాణము, వాస్తుకర్మలు, ప్రేతకర్మలునిషేధము గర్భిణీపతి స్వపితృకర్మలు చేయవచ్చును.చెవులు కుట్టుట :
పుట్టిన పన్నెండవ లేదా పదహారవ రోజును లేక ఆరు, ఏడవ, ఎనిమిది నెలలయందైననూ పూర్వాహ్న, మద్యాహ్న కాలములలో సోమ, బుధ, గురు, శుక్ర వారములలో శ్రవణం, అర్ద్ర, హస్త, చిత్త, మృగశిర,రేవతి, ఉత్తర ఉత్తరాషాఢ, ఉత్తరాభాధ్ర, పుష్యమి, పునర్వసు, ధనిష్టయందు కుంభ, వృశ్చిక, సింహ లగ్నములు కాకుండా, అష్టమ శుద్దితో కూడిన లగ్నమునందు చెవులు కుట్టుట శ్రేష్ఠము.జలపూజ :
బుధ, గురు, శుక్ర, సోమ వారములయందును శ్రవణం పుష్యమి పునర్వసు, మృగశిర, హస్త, మూలా, అనూరాధలలో ఒక నక్షత్రము నందును శుభతిధుల యందును ప్రసవించిన స్త్రీ జలసమీపమునకు వెళ్ళి జలపూజ చేయవలెను. దీనిని ప్రస్తుతం అందరూ ఆచరిస్తూనే వున్నారు. అయితే వీటికి చైత్ర, పుష్య మాసములు, మూఢమి, అధిక మాసములు వర్జ్యములు.జాతకర్మ :
ప్రసవం అయిన 11 వరోజునుండి బేసి రోజులలో మెదటి నెలలో జాతకర్మ చేయు విషయంలో ఏవిధమైన ముహూర్తం చూడనవసరం లేదని ఆంద్రాలో బాగా ప్రచారంలో ఉన్నది. అష్టమి, చవితి, చతుర్దశి, అమావాస్య, షష్టి వంటి తిధులు కాకుండగను మంగళ, శని వారములు కాకుండగను అశ్వనీ రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి అనూరాధ, ఉషా, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉ.భా, రేవతి ఈ నక్షత్రముల యందు జాతకర్మ ఆచరించ వలెను. జాతకర్మ మధ్యాహ్నం 12.00 లోపల చేయ వలెను.దత్తతస్వీకారము :
దత్తతునకు దత్తకుని యందు గ్రాహ్య విచారము సోదరులలో ఒకరికి పుత్రులు కలిగినను, ఆ సోదరులందరు పుత్రవంతలు అనబడును. ఇదిమన వచనము. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణముల వారికి మేనల్లుడును దౌహిత్రుని దత్తత తీసుకొనుట నిషేధము.సోదర పుత్రులు, దత్త పుత్ర స్వీకార్ధము ముఖ్యులు. వారులేనిచో సవతి సోదరుని పుత్రులు, వారు లేనిచో మేనమామ మేనత్త కులమందు పుట్టిన వారు, వారు లేనిచో స్వగోత్ర పిండులు, గ్రాహ్యులు ఆడపిల్లల కు దత్తత తీసుకొనుట శాస్త్రం కాదు. అయితే దత్తత సమాన వర్ణమునందు జనియించిన వారినే తీసుకోవలెను.
దత్తతకు వెళ్ళిన వారు జనక స్థాన గోత్రమును, దత్తస్థానగోత్రమును విడచి మిగిలిన వారి గోత్రములందు పిల్లలను వివాహము చేసుకోవలెను. వీరి సంతతికి కూడా అదేనియమము. ఈ నియమం అయిదు తరాలవరకని ఏడు తరాల వరకని విభిన్నాభిప్రాయాలున్నాయి.
ధాన్యము నిల్వచేయుటకు :
సాధారణ, ఉగ్ర, ఆర్ద్ర, ఆశ్రేషలను విడచి తక్కిన నక్షత్రముల యందు తుల, మేష, కర్కాటక లగ్నములుగా కాకుండా శుభదినమందు ఆహారము కొరకు ధాన్యము నిల్వచేయుట మంచిది. అట్లుగాక వ్యాపారార్ధము ధాన్యము నిల్వచేయుటకు దృవ, పుష్య, విశాఖ, జ్యేష్ఠ, అశ్వనీ, చర నక్షత్రముల యందు నిల్వచేయుట మంచిది. దిమికా శ్రవన, ధనిష్ఠ, శతభిష, విశాఖ, రోహిణి, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభద్ర, పుష్య, పునర్వసు, స్వాతి, అశ్వనీ, జ్యేష్ఠల యందు ధనధాన్యములు నిల్వవుంచుటకు ప్రశస్తము.నామకరణం :
జాతకర్మకు వాడు నక్షత్రములు, తిధులు, వారములన్నియు నామకరణమునకు కూడా ఉపయోగించవచ్చును. మగపిల్లలకు సరి సంఖ్య అక్షరములతోను, ఆడపిల్లలకు బేసిసంఖ్య అక్షరములతోను నామకరణం చేయవలెను. నామకరణ జాతకర్మ రెండును మధ్యహనం 12 గం లోపల చేయవలేను లగ్నం నుండి వ్యయస్ధానంలో ఏగ్రహం లేని ముహూర్తం నిర్ణయించవలెను. అలాగే అష్టమ శుద్ది విశేష నామము, దైవసంభంధము మాస సంభంధము వుండునట్లు వచ్చుట మంచిది. అర్ధం లేని పేర్లు పెట్టుట వలన దోషము.నిష్క్రమణం :
నిష్క్రమణం అనగా శిశువును భూమి మీద యందు కూర్చొండబెట్టుట అనికొందరు - గృహాంతరమునకు గానీ గ్రామాంతరమునకు గానీ అని మరికొందరు చెప్పియున్నారు. శుభతిదులయందు బుధ, గురు, శుక్ర వారముల యందును చేయ వలెను. దీనిని అశ్వనీ, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తరాత్రయం, శ్రవణం, ధనిష్ఠ, శతబిషం, హస్త, అనూరాధ, రేవతి నక్షత్రములు ప్రసస్తములు.నూతన వస్త్రధారణ :
ఆది, మంగళ, శని వారములు నూతన వస్త్రధారణ చేయ కూడదు. అలాగే షష్టి, ద్వాదశి, నవమి, అమావాస్య తిధులయందు నూతన వస్త్రధారణ పనికి రాదు. భరణి, కృత్తిక, ఆర్ద్ర, ఆశ్రేష, మఘ, పుబ్బ, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, పూర్వాభద్రలలో నూతన వస్త్ర ధారణ చేయుట మంచిది కాదు. అయితే నిత్యంలో పండుగ రోజులలోనూ వస్త్రధారణ చేయుటకు వర్జ్య దుర్ముహర్తములు లేని సమయంలో చేయ వచ్చును. అంతే కాకుండా నూతనవస్త్రములకు మంగళకరమైన పసుపునకు పెట్టిధరించవలెను.పశురక్షాముహూర్తం :
అష్టమ శుద్ధితో కూడిన శుభలగ్నము నందును, చరనక్షత్రములందును పశుయోని నక్షత్రములందును పశువులను దొడ్డియందు కట్టి వేయవలెను. మంగళవారం పశు సంభంధ విషయములుకు మంచిది .పుంసవనం :
గర్భం నిర్దిష్టంగా తెలిసిన తర్వాత రెండవ మాసంలో కానీ, మూడవ మాసంలో కానీ చేయవలెను. యిది ప్రతి గర్భధారణ యందు గర్భశుద్ది కొరకు చేయుదురు. చవితి, నవమి, చతుర్దశి తిధులు కాకుండాను; సోమ, బుధ, గురు, శుక్ర వారముల యందును; అశ్వని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుషయమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతీ, అనూరాధ, మూల, ఉత్తరాషాడ, శ్రవణం, ధనిష్ఠ, శతబిషం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రముల యందు పుంసవన కార్యము చేయవలెను.పైరుకోయుటకు :
మూల, ఆర్ద్ర, జ్యేష్ఠ, ఆశ్రేష, పూర్వాభద్ర, హస్త, కృత్తిక, ధనిష్ఠ, మృగశిర, స్వాతి, మఘ, ఉత్తర, ఉత్తరాభాద్ర, ఉత్తరాషాఢ, భరణి, చిత్త, పుష్యమి, నక్షత్రమందును ఆది, సోమ, బుధ, గురు, శుక్రవారములందు రిక్తతిధులు కాకుండాను స్థిరలగ్నము లందు పైరు కోయుట మంచిది.బాలారిష్టములు :
చంద్రాష్టమంచ ధరణీసుత స్సప్తమంచ రాహు ర్నవంచ శని జన్మ గురు స్తృతీయే అర్కస్తు పంచ భృగుషట్క బుధ శ్చతుర్ధే కేతోవ్యయో స్తు బాలారిష్టానాంచంద్రుడు జన్మలగ్నమునందు ఎనిమిదవ యింట వున్నా, కుజుడు ఏడవ ఇంట వున్నా, రాహువు తొమ్మిదవ ఇంట వున్నా, శని లగ్నములో వున్నా, గురువు తృతీయం లో వున్నా, రవి పంచమంలో వున్నా, శుక్రుడు ఆరవ ఇంట వున్నా, బుధుడు నాల్గవ ఇంటవున్నా కేతువు నాల్గవ ఇంట వున్నా బాలారిష్టములు, ఆయా గ్రహములకు జపధాన హోమములు మొదటి నెలలోనే జరిపించాలి.
జనకాలమునకు అష్టమాధిపతి దశ అయినచో బాలారిష్టము అగును. జన్మ లగ్నములో షష్ఠాధిపతి వున్నా, భాగ్యాధి పతి అష్టమ వ్యయంలో వున్నా, జన్మ లగ్నాత్ చతుర్ధాతి పతి వ్యయంలో వున్నా అరిష్టమే. జనన కాల దశానాధుడు షష్ఠాధిపతి కలసి వున్నా జననకాల దశనాధుడు వ్యయాధిపతిలో వున్నా బాలారిష్టం అగును. కావున వీటికి శాంతి చేయవలెను. జనకాలమునకు షష్ఠాధిపతి దశకానీ అంతర్ధశ కానీ అయినచో ఆరోగ్య ప్రాప్తి అధికంగా వుండును. అష్టమంలో వ్యయాధిపతి వుండి ఆ వ్యయాధిపతి అంతర్దశ కానీ మహాదశకానీ వున్న ఎడల ఆ గ్రహమునకు శాంతి చేయ వలెను.
తల్లి, తండ్రుల, సోదరుల నక్షత్ర జన్మంలో జననం అయినచో ఏకనక్షత్ర జనన శాంతి చేయవలెను. కవలలు పుట్టిన యమళ జనన శాంతి, పేగు మెడలో వేసుకొని పుట్టిన నాళవేష్టన జనన శాంతి, విషఘడియ మరియు దుష్ట తిధి వార నక్షత్రములో పుట్టిన గ్రహణంలో పుట్టిన గోముఖప్రసవ శాంతి చేయవలెను.
బీజావాపనం :
అశ్వని, హస్త, పుష్యమి, చిత్త,రేవతి, మృగశిర, అనూరాధల యందును, రోహిణి, ఉత్తర, ఉత్తరాషాడ, ఉత్తరాభాద్ర, స్వాతి, మూల, మఘ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషంలందు విత్తనం చల్లిన ఎడల ఫలప్రదము. మంగళవారము, శని వారము, ఆదివారము రిక్తతిధులు, పంచపర్వములు, వర్జ్యఘడియలు, ప్రదోషకాలమును విడచి వృషభ, మిధున, కర్కాటక, కన్య, వృశ్చిక, ధనుర్మీన లగ్నములందు విత్తనము వేయవలెను. అనగా రవిచే విడువబడు నక్షత్రము మొదలు మూడు నక్షత్రములు హానిని కలుగచేయును. తర్వాత ఎనిమిది వృద్ధిని కలుగచేయును. ఆతర్వాత తొమ్మిది నక్షత్రములు కర్తకు మృత్యువును, ఆ తర్వాత ఏడు నక్షత్రములు లక్ష్మీప్రధమును కలుగచేయును. ఆశ్రేష నక్షత్రమందును సోమవారమందును, చంద్రుడు లగ్నమందు బలవంతుడై వున్నచో చెఱకు, అరటి, పోక చెట్లను వేయవలెను. అశ్వనీ యందు, సూర్యుడు లగ్నమునందుండగా కొబ్బరిచెట్లు పాతించవలెను. బృహస్పతి లగ్నమందును చంద్రుడు లగ్నాంశమందు వుండగా తమలపాకులతోటలు వేయుట మంచిది.కృషికర్మ :
అనగా మృదు, స్థిర, క్షిప్ర, చర, మూల, మఘ నక్షత్రముల యందు మొదటిసారిగా కృషికర్మ ప్రారంభించవలెను. ఆది మంగళవారములు విడచి చవితి, షష్ఠి, నవమి, చతుర్ధశి తిధులను దగ్ధతిధుల నుండి విడచి మిగిలిన తిధి, వార యోగకరణ దినములందు కృషి కర్మ ప్రారంభించవలెను. కృషి కర్మ మేష, సింహం కుంభ కర్కట, మకర, తుల యందు ప్రారంభించకూడదు. చంద్ర శుక్రులు బలవంతులై వుండాలి లగ్నమందు గురువు వుండగా కృషికర్మలకు యోగ్యము.వ్యాపారముహూర్త విషయం :
అశ్వని, హస్త, పుష్యమి, చిత్త రేవతి, అనూరాధ, మృగశిర నక్షత్రములు వ్యాపారమునకు రోహిణి, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర నక్షత్రములోయందు మంచిది. రిక్తతిధులు, మంగళ వారము విడచి వ్యాపారం ప్రారంభించుట విశేషము.వ్యాపార నిమిత్తము వస్తువులు కొనుగోలు చేయుటకు అశ్వనీ, స్వాతి, శ్రవణం, చిత్త, శతభిషం, రేవతి నక్షత్రములు విశేషము. భరణి, పుబ్బ, పూర్వాషాఢ, పూర్వాభద్ర, విశాఖ, ఆశ్రేష, కృత్తిక నక్షత్రములందు వస్తు విక్రయం ప్రారంభించుట విశేషము.
లగ్నద్వితీయ, చతుర్ధ, పంచమ, సప్తమ, నవమ, దశమ, ఏకాదశములందు శుభగ్రహములుండగాను కుంభేతర లగ్నమందు వ్యాపారారంభమునకు లగ్నము నిర్ణయించవలెను. వ్యాపారారంభమునకు రిక్త తిధులు, మంగళవారము పనికిరాదు. అలాగే అష్టమ ద్వాదశ శుద్ధి అవసరము. వ్యాపారమునకు లగ్నమందు చంద్ర శుక్రులు విశేషము. చంద్ర బుధ గురువుల బలము వున్న ముహూర్తము చూడవలెను.