Thursday 22 September 2011

శ్రావణ మాసం అన్ని దేవతలకు ప్రీతికరము అని అంటారు కదా !


శ్రావణ మాసం చాలా విశేషమైన మాసము. ఈ మాసం విష్ణుమూర్తులవారికి చాలా ప్రీతికరము. అట్లాగే వరలక్ష్మీ, గౌరీ, సంతోషీమాత, హయగ్రీవ, సదాశివ, సుబ్రహ్మణ్య, కృష్ణ, రాఘవేంద్ర, వృషభాది దేవతలకు కూడా ప్రీతికరమగు మాసము. అందుకని శ్రావణ మాసాన్ని సకలదేవతా మాసము అని కూడా అనవచ్చును.

శ్రీ రమా సహిత సత్యనారాయణ వ్రతం
శ్రవణా నక్షత్రం విష్ణుమూర్తుల వారి జన్మ నక్షత్రం. కనుక, శ్రావణ మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున శ్రీ సత్యనారాయణ వ్రతం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది.

శ్రీ రుద్రాభిషేకం
ఉత్తరాదిన ఈ మాసంలో శివ ఆరాధనలు కూడా ఎక్కువగా జరుగుతూ వుంటాయి. సంవత్సరం మొత్తంలో శ్రావణ మాసంలో కాశీ క్షేత్రం భక్తులతో చాలా కోలాహలంగా వుంటుంది. ఈ మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజున రుద్రాభిషేకం విశేషము.

శ్రీ మంగళ గౌరీ వ్రతం
కొత్తగా పెళ్లి అయిన మహిళలు శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళ వారం మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవాలి. ఈ వ్రతాన్ని ఆచరించటం వలన సుమంగళీ దేవి అనుగ్రహం కలుగుతుంది.

శ్రీ వరలక్ష్మీ వ్రతం
పెళ్ళైన స్త్రీలు పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం శ్రీ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించటం వలన సకల సౌభాగ్యాలు చేకురుతాయి.

శ్రీ నాగుల చవితి
పూర్ణిమకు ముందు వచ్చే చతుర్ధి, అనగా శుద్ధ చతుర్ధి రోజున సుబ్రహ్మణ్య లేక నాగ దేవత అభిషేకములు విశేషము. ఈ రోజున నాగ అభిషేకం చేసినవారికి సంతాన సంబంధ దోషములు కొంతవరకు నివృత్తి అవుతాయి.

శ్రీ పుత్రదా ఏకాదశీ వ్రతం
పూర్ణిమకు ముందు వచ్చే ఏకాదశి, అనగా శుద్ధ ఏకాదశికి పుత్రదా ఏకాదశి అని పేరు. ఈ రోజుని లలితా ఏకాదశీ అని కూడా అంటారు. పుత్ర సంతానం కలగటానికి ఈ రోజున పుత్రదా ఏకాదశీ వ్రతాన్ని ఆచరిస్తే మంచిది.

శ్రీ సంతోషీమాతా వ్రతం మరియు రక్షా బంధనం
శ్రావణ పూర్ణిమ శ్రీ సంతోషీమాతా జయంతి. ఈ రోజున శ్రీ సంతోషీమాతా వ్రతము చాలా విశేషము. శ్రావణ పూర్ణిమని రాఖీ పూర్ణిమ అని కూడా అంటారు. స్త్రీలు అన్నదమ్ములకు, సోదర సమానులకు రక్షను (రాఖీని) కట్టటం వలన శుభ ఫలితములు చేకూరుతాయి.

ఉపాకర్మ మరియు నూతన యజ్ఞోపవీత ధారణ
నూతనంగా ఉపనయనం అయిన వటువు ఈ రోజున కృష్ణాజిన విసర్జన చేసి యజ్ఞోపవీతము మార్చుకోవాలి. అట్లాగే విధిగా ఉపనయన సంస్కారం అయిన వారందరూ యజ్ఞోపవీతాన్ని (జంధ్యాన్ని) మార్చుకొని గాయత్రీ జపం చేసుకోవాలి.

శ్రీ లలితా సహస్రనామ పారాయణ
శ్రావణ పూర్ణిమ రోజున హయగ్రీవ జయంతి అని పురాణ వచనము. ఈ రోజు విష్ణు ప్రీతిగా చేసే అర్చన, ఆరాధన, వ్రతములు విశేష ఫలితాన్ని ఇస్తాయి. అట్లాగే, ఈ రోజున హయగ్రీవుల వారి ద్వారా ఉపదేశించబడిన శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం పారాయణ చేసి గుగ్గిళ్ళు నైవేద్యం పెట్టటం మంచిది. తద్వారా మనుషులలో వుండే ఆహాకారం తొలగిపోయి అందరితో సమ భావన కలిగి వుంటారు.

శ్రీ గురు రాఘవేంద్ర జయంతి
పూర్ణిమ తర్వాత వచ్చే విదియ, అనగా బహుళ విదియ రోజున శ్రీ గురు రాఘవేన్ద్రుల వారు సజీవంగా సమాధిలోకి వెళ్ళిన రోజు. ఈ రోజున శ్రీ రాఘవేంద్ర అర్చన, అభిషేకములు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి. గురునాధ పొంగళ్ళు వున్నవారు ఈ రోజున శ్రీ రాఘవేంద్ర అర్చన ఖచ్చితంగా చేసుకోవాలి.

శ్రీ సంకట హరణ చతుర్ధి
బహుళ చతుర్ధి రోజున శ్రీ గణపతుల వారికి అభిషేక, అర్చన, వ్రతాదులు చేయటం వలన అన్ని కష్టములు తొలగి మంచి ఫలితములు కలుగుతాయి.

శ్రీ కృష్ణా అష్టమి
బహుళ అష్టమి రోజున శ్రీ కృష్ణ జయంతి కనుక, ఆ రోజున పిల్లలతో శ్రీ కృష్ణ పూజ చేయించి వెన్న, అటుకులు నైవేద్యం పెట్టించటం మంచిది. తద్వారా ఆ పిల్లలకి అన్ని విధాల కష్టాలను తేలికగా ఎదుర్కునే సామర్ధ్యం కలుగుతుంది. ఈ రోజునే జన్మాష్టమి అని కూడా అంటారు.

శ్రీ ఏకాదశీ వ్రతం
బహుళ ఏకాదశి రోజున ఏకాదశీ వ్రతాన్ని ఆచరించటం వల్ల మనస్సులో వుండే కోరికలు శీఘ్రంగా నెరవేరతాయి. ఈ రోజునవెన్న నైవేద్యం పెట్టటము మంచిది.

శ్రీ వృషభ అమావాస్య
శ్రావణ అమావాస్య రోజున వృషభ పూజా చాలా విశేషము. ఈ రోజున వృషభ పూజ చేయటం వలన అకాల మృత్యువు తొలగి పోయి దీర్ఘ ఆయుస్సు చేకూరుతుంది.

వేదములను కాపాడటానికి శ్రీ మహా విష్ణుమూర్తుల వారు శ్రావణ పూర్ణిమ రోజున శ్రీ హయగ్రీవుల వారిగా జన్మించటం జరిగింది. అందువలన, ప్రత్యేకముగా ఈ మాసంలో వేద గ్రంథముల ముద్రణకు సహకరించటం చాలా మంచిది. తద్వారా శ్రీ మహావిష్ణు కటాక్షం కలుగుతుంది