Monday, 6 January 2014

: మన దేవాలయాలలో అర్చన నిమిత్తం వినియోగిస్తున్న వస్తువులు నిజంగా ఆగమ సంప్రదాయబద్ధంగా ఉంటున్నాయా?

samavedam Shanmukhasharma garu : మన దేవాలయాలలో అర్చన నిమిత్తం వినియోగిస్తున్న వస్తువులు నిజంగా ఆగమ సంప్రదాయబద్ధంగా ఉంటున్నాయా? ఆలయ నియమాలు అనూచాన పద్ధతిలో సాగుతున్నాయా? వీటిని పరిశీలించి తేల్చే వర్గాలు ఏవి? ఇవన్నీ బాధ్యతాయుతంగా గమనించాల్సిన అంశాలు. ఈమధ్య ఒక ’న్యూస్ చానెల్’ వారు పరిశోధించి బైటపెట్టిన అంశాలను నా దగ్గరకొచ్చి వివరించారు. వాటిని తెలుసుకున్నాక దిగ్భ్రాంతి కలిగింది. మనదేశంలో అనేక దేవాలయాలలో వాడే ఆవునేతిలో స్వచ్ఛమైన ఆవునెయ్యి ఉన్నదా? అంటే సందేహాస్పదమే. దానికి తోడు నేయి తయారీ కంపెనీలు చేస్తున్న అమానుష కృత్యాలు వర్ణనాతీతం. ఆవు మాంసపు కొవ్వుని కూడా నేతిలో కలిపి దేవాలయాలకు సరఫరా చేస్తున్నారు. దానిని స్వామి నివేదనల తయారీలో, దీపారాధనలో, యాగాలలో వినియోగిస్తున్నారు - అన్న వార్త ఎంత భయానకమో అనూహ్యం. ఇవి గృహాలలో దీపారాధనకు వాడే ద్రవ్యాలలో కూడా జరుగుతున్న అన్యాయం. ఈ నేతిలో నిజంగా అలాంటి అవాంచనీయ పదార్థాలున్నాయో లేవో ఆరా తీయడానికి సంబంధిత పరీక్షావిభాగానికి పంపించారట. ఆకంపెనీలిచ్చిన లంచాలకు లొంగి - "అవి కేవలం స్వచ్ఛమైన ఆవునేతులే"నని యోగ్యతా పత్రాలనిచ్చారు ఆ పరీక్షాధికారులు. కానీ పట్టువదలని ఈ సత్యశోధకులు వాటిని తిరిగి జర్మనీలోని నిపుణుల వద్దకు పరీక్షకి పంపారు. "వీటిలో నిస్సందేహంగా గోమాంసపు కొవ్వు కలిసి ఉంద"ని అవినీతి లేని విదేశీసంస్థలు తేల్చి చెప్పాయి. - ఇదీ మన దేశ దేవాలయాల పనితీరు. ఆలయానికి చేరే పదార్థాలన్నిటినీ తయారుచేసే వారు, కొనుగోలు చేసేవారు, సరఫరా చేసేవారు...అందరూ తిలాపాపం తలా పిడికెడు - అన్నట్లు అవినీతికి లోబడి ఉన్నవారే. ఇందులో హిందువుల సంఖ్యా ఎక్కువే. ఇది మాతృద్రోహం కూడా. ఇంత దారుణైన వార్త బయటపడ్డాక కూడా సహించితే మనం భగవంతుని ముందు నమస్కరించడానికి కూడా అర్హులం కాదు. భగవదపరాధం జరుగుతున్న ఈ సమయంలో మనం మేల్కొని ఈ దుర్మార్గుల వల్ల తగిన విధంగా ఉద్యమించవలసిన బాధ్యత ఉంది. దేశాన్ని కాపాడే దేవాలయాలను మనం కాపాడుకోవాలి. అక్కడ జరిగే అర్చనాదికాలు సక్రమంగా ఉంటే దేశానికే క్షేమం. అలాకాక, విపరీతంగా జరిగితే దేశక్షేమానికే ప్రమాదం. ఇప్పటికే అనేక వైపరీత్యాలను ఎదుర్కొంటున్నాం. వీటి వెనుక - పాపభీతి లేని దేవాలయ యంత్రాంగాల దుర్మార్గాల ప్రభావం లేదని అనలేం. గోహింసనీ, గోమాంస భక్షణనీ పరమ పాపంగా భావించే ధర్మంలోనే ఇంతటి పాపం జరుగుతోంది. ముఖ్యంగా విజయవాడలాంటి చోట్ల జరిగే నేతి తయారీ వ్యాపార సంస్థలు లంచాలతో అవినీతిపరుల్ని కొని, తమ పాపాలను కొనసాగిస్తున్నారు. మరికొన్ని ప్రసిద్ధ దేవాలయాలలో దేశవాళీ గోవుల్ని కాక, ’జెర్సీ’లనే గోవులుగా కొనేసి, వాటి పాలతో మహాభిషేకాలు చేస్తున్నారు. జర్సీలతోనే గోపూజ, గోదానాలు జరుగుతున్నాయి. ఇది శాస్త్ర విరుద్ధమని అనేకమంది మొరపెట్టుకుంటున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఇంకొక ఆలయంలో గోవుని మెట్లమీంచి ఈడ్చిపట్టుకెళుతుంటే, అడ్డుకున్న సామాన్య యాత్రీకులకు పరాభవం ఎదురయ్యిందని మరొక వార్త. విశ్వాస కేంద్రాలైన ఆలయాలలో పనిచేస్తున్న వారెవ్వరికీ విశ్వాసం లేకపోవడం ఈ అక్రమాలకు ప్రధాన కారణం. కేవలం నేతి విషయమే కాదు. ప్రసాద పదార్థాల సరఫరాలోనూ ప్రచురణ విభాగాలలోనూ, క్రయవిక్రయాలలోనూ ప్రతి అంశంలోనూ అవినీతి సాగుతోంది. దేవుడి సొమ్మును అక్రమంగా తింటున్నామన పాపభీతి ఇసుమంత కూడా లేని సర్వవిధాధికారులు - రాయించే ప్రతి బిల్లులో ఎవరి వంతులు వారివి. దేవ ద్రవ్యాన్ని అక్రమంగా స్వీకరించే వారి జీవితాల్లో భయంకరమైన వైపరీత్యాలు వారికో, వారి కుటుంబ సభ్యులకో రోగాదుల, ప్రమాదాదుల రూపంలో ఎదురవుతూనే ఉన్నాయి. మన నమ్మకాలతో, అపనమ్మకాలతో పనిలేకుండా శాస్త్రం చెప్పిన అధర్మ ఫలాలూ ఎలాగూ అనుభవిస్తున్నారు. అయినా వినాశకాలంలో పుట్టే విపరీత బుద్ధులు వారికి కలుగుతూనే ఉన్నాయి. కాస్త తొంగి చూస్తే మన దేవాలయ నిర్వహణ వ్యవస్థలోని పాపకూపాలు దుర్భరమైన ఆశ్చర్యంతో కూడిన బాధను రగుల్చుతాయి. ’అవినీతి’ అంటే కేవలం ’నాయకులే’ అనే ధోరణి సమాజంలో ఉంది. కానీ సమాజంలోనే ప్రతి విభాగంలోనూ అవినీతి వ్యాపించి ఉందన్నది ప్రత్యక్షవిషయం. అవినీతి మరగిన ప్రజలు - పరమ అవినీతి పరులనే పాలకులుగా ఎంచుకునే పాపానికి కూడా వెనుకాడరు. ఆ ధైర్యంతోనే భయంకర నేరారోపణలుండి కూడా నేతలుగా దర్పంగా దేశమంతా తిరుగుతూ, వివిధ రాష్ట్రాల నేతలతో ఇచ్ఛాగోష్ఠి చేస్తూ పాపాత్ములు సంచరిస్తున్నారు. ఈ నేపథ్యంలో -’ఇన్ని జరుగుతున్నా భగవంతుడు ఎందుకు ఉపేక్షిస్తున్నాడు?’ - అని కొందరి అమాయకపు సందేహం. మనమిచ్చే ద్రవ్యాల కోసం మహాతేజస్వులైన ఈశ్వర స్వరూపాలు ఆశపడవు - ఎదురుచూడవు. అవి సమర్పించి పుణ్యకర్మ మనల్ని కాపాడుతుంటుంది. ఆ సమర్పణలో చేసిన అపచారాలే మనల్ని శిక్షిస్తాయి. ఈ కర్మలకు ఫలప్రదాత ఈశ్వరుడు. అవినీతి పరులకు ఎలాగూ శిక్ష అనివార్యం. నేడు కాకున్నా మరొకనాడు ఈశ్వరాజ్ఞతో దుష్ఫలితం అనుభవించక తప్పదు. ఈలోగా దేశానికి వారివల్ల ప్రమాదం రాకుండా ఆలయాలను దర్శించే భక్తజనులే వివిధ రకాలుగా ఎదుర్కొనాలి. తప్పుని సహిస్తూ ఉండడం కూడా తప్పు చేయడమే. ఈ పాపం ఎవరిది? అనేది తేల్చే ముందు- ఇందులో నా భాగమెంత? అని తర్కించాలి. అంటే - అలాంటి వాటిని అంగీకరించడమా? ఉదారంగా వదలిపెట్టడమా? - రెండూ పాపకార్యాలే కదా! ఆలయ యంత్రాంగాలన్నిటినీ బాగా ప్రక్షాళన చేసి ఉదాత్తమైన దైవభక్తితో కూడిన నిపుణుల నిర్వహణలో ఉంచాలి. ఆలయ వ్యవస్థపై అవగాన ఉన్న నిర్మల చరిత్రుల అధీనంలో ఉంచాలి. ప్రజలకు పారదర్శకంగా ఉండే పాలనాంగాలను స్థిరపరచాలి. ధార్మికులైన వివిధ శాఖల నిపుణుల ద్వారా ఆలయ కైంకర్యాల నిర్వహణలను పరిశీలింపజేయాలి. ఈ విధంగా మన బుద్ధుల్ని సవరించవలసినదిగా మన అపచారాలను ఆ కరుణా సముద్రుడు మన్నించవలసినదిగా త్రికరణ శుద్ధిగా ప్రార్థిద్దాము - శాంతిరస్తు.