Thursday, 23 January 2014

అతలం నుండి… పాతాళలోకం దాకా...

Bharath Kumar Journalist
అతలం నుండి… పాతాళలోకం దాకా...

భారతీయ సనాతన సంప్రదాయంలోని పురాణ సాహిత్యంలో భూమండలానికి సంబంధించిన భౌగోళిక విషయాలతోపాటు భూమికింద కూడా మరికొన్ని లోకాలు ఉన్నాయని అనేక సందర్భాలలో కనిపిస్తూ ఉంటుంది. ఈ కింది లోకాలు ఏమిటి? అనే విషయాన్ని దేవీభాగవతంలో చూడవచ్చు. రాహుమండలం కింద సిద్ధులు, చారణులు, విద్యాధరులు, ఉండే పుణ్యలోకాలున్నాయి. వాటి విస్తీర్ణం పదివేల యోజనాలు, ఈ లోకాల కింద యక్షులు, రాక్షసులు, భూతప్రేత పిశాచాలు విహరించే ఉత్తమ విహార ప్రదేశాలున్నాయి. వాటి కింద గాలి, మేఘాలు, ఉన్నంతవరకూ అంతరిక్షం ఉంది. అంతరిక్షానికి వంద యోజనాల కింద గరుడ పక్షులు, డేగలు, సారస పక్షులు, హంసలు, ఎగిరే భూమండలం వుంది. భూమి కింద అతలము, వితలము, సుతలము, తలాతలము, మహాతలము, రసాతలము, పాతాళము అని ఏడు లోకాలున్నాయి. ఇవి ఒక్కొక్కటి వెయ్యి యోజనాల పరిధిలో ఉంటాయి. ఒక్కొక్క లోకానికి మధ్య పది యోజనాల దూరం వుంటుంది. ఈ లోకాలన్నీ అన్ని రుతువులలోనూ అందంగా వుంటాయి. ఇక్కడ స్వర్గం కంటే సుఖప్రదమైనవి లభిస్తాయి. విషయ భోగాలకు, ఐశ్వర్య సుఖాలకు ఆటపట్టు అయిన ఉద్యానవనాలు, విహారభూములు ఇక్కడ వుంటాయి. బలవంతులైన దేవతలు, రాక్షసులు కూడా భార్యాబిడ్డలతో ఇక్కడ ఆనందం అనుభవిస్తుంటారు. ఇక్కడుండే వారికి ఎన్నెన్నో మాయలు తెలిసుంటాయి. మాయాబలంతో మంచి పట్టణాలు, నగరాలు ఎంతో సుందరంగా ఇక్కడి వారు నిర్మించుకుంటుంటారు. నాగులు, అసురులు తమతమ ప్రియురాళ్ళతో ఇక్కడ విహరిస్తుంటారు. ఇక్కడుండే వారికి భయమంటే ఏమిటో తెలియదు. ఇక్కడ సంచరించే నాగుల తలల మీద ఉండే మణుల కాంతితో ఆ ప్రదేశాలన్నీ పట్టపగలులా ప్రకాశిస్తుంటాయి. ఓషధులు, రసాయన పదార్ధాలు, రసాలు అన్నపానాలు, స్నానాధికాలు, వీరికి అవసరమే ఉండవు. ముసలితనం కానీ, మరణం కానీ వీరికి వుండదు. వీరి శరీరాలు చమట పట్టవు. అలసట కూడా ఉండదు. వీరికి శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో తప్ప వేరే ఇతరమైన వాటితో మృత్యు భయమనేది వుండదు. కిందిలోకాలలో మొదటిది అతలము. ఇది ఎంతో మనోహరంగా ఉంటుంది. మాయ అనే దానవుడి కుమారుడైన బలుడు ఇక్కడ నివసిస్తాడు. అన్ని కోర్కెలు తీర్చగల 96 మాయలను బలుడు సృష్టించాడు. ఇంకా విచిత్రమేమిటంటే ఈ బలుడు ఆవలిస్తే అందమైన స్త్రీలు అక్కడ అవతరిస్తుంటారు. ఆ స్త్రీలు తమతమ ప్రియులను తమవెంట బిలాలలోకి తీసుకువెళ్ళి బంగారం రసం తాగిస్తారట. అతలలోకం కింద వుండే లోకం వితలం. ఆటకేశ్వరుడు అనే పేరుతో పరమేశ్వరుడు ఇక్కడ నివసిస్తాడు. తన పరివారంతో బ్రహ్మచేస్తున్న సృష్టిని ఆటకేశ్వరుడు వృద్ధి చేస్తుంటారు. పార్వతీ, ఆటకేశ్వరుల ప్రభావంతో ఆటకీనది ఇక్కడ ప్రవహిస్తుంటుంది. గాలి సహాయంతో అగ్నిదేవుడు ఆ నదిలోని నీటిని తాగుతుంటాడు. అలా నీరు తాగిన అనంతరం అగ్నిదేవుడి నోటి నుండి బంగారం వెలువడుతుందట. ఆ బంగారమంటే ఆలోకంలో వుండే రాక్షసులకు మహా ఇష్టం. వితలం అనే ఈలోకం కింద సుతలం అనే లోకముంటుంది. ఇది అన్నింటికంటే శ్రేష్టమైనది. ఇక్కడ బలి చక్రవర్తి ఉంటాడు. ఇంద్రుడికి ఉపకారం చెయ్యటం కోసం శ్రీ మహావిష్ణువు వామనుడై బలిని ఈ లోకానికి పంపాడు. బలి దగ్గర ఉన్నంత సంపద దేవేంద్రుడి దగ్గర కూడా వుండదట. బలివామనుల కథలో వామనుడు బలి చక్రవర్తిని భూలోకంలో లేకుండా చేశాడని పైపైకి అనిపించినా అంతరార్ధాన్ని పరిశీలిస్తే మాత్రం ఎంతో శ్రేష్టమైన సుతల లోకానకి అధిపతిని చేశాడని తెలుస్తుంది. సుతలం కింద తలాతల లోకం ఉంది. అక్కడ రాక్షసరాజైన మయుడు నివసిస్తుంటాడు. ఈశ్వరానుగ్రహం వల్లే మయుడు ఈలోకంలో స్థిరపడ్డాడు. తలాతలం క్రింద మహాతలముంది. కద్రువుడు జన్మించిన నాగులలో క్రోధివశుడు తదితర నాగులు ఈలోకంలోనే ఉన్నారు. అనేక తలలు కలిగిన నాగులుంటాయిక్కడ. కుహకుడు, తక్షకుడు, సుషేణుడు, కాళీయుడు లాంటి ప్రధానమైన నాగులకు ఈ లోకమే ఆవాసం. పెద్దపెద్ద పడగలతో ఈ నాగులన్నీ ఎంతో భయం గొలుపుతుంటాయి. గరుత్మంతుడు ఒక్కడే వీరికి ప్రాణహరుడు. ఎన్నెన్నో క్రీడలలో ఈ నాగులంతా విశారదులు. మహాతలం కింద రసాతలముంది. ఇక్కడ ఎంతోమంది రాక్షసులుంటారు. ఫణి దానవులు నివాస నగరం ఇక్కడే వుంది. ఫణిదానవులనే నివాతకవచులని, హిరణ్మయ పురవాసులనీ, కాలేయులని కూడా పిలుస్తుంటారు. వీరికి దేవతలకు నిత్యం శత్రుత్వముంటుంది. ఒక్క శ్రీమహావిష్ణువు తేజస్సే వీరికి ప్రాణగండం. వీరిని దేవేంద్రుడి దూతిక అయిన సరమ కూడా మంత్రాలవల్ల అష్టకష్టాలు పెట్టింది. రసాతలం కింద పాతాళలోకముంది. నాగలోక రాజులిక్కడే వుంటారు. వీరందరిలో వాసుకి అనే వాడు ముఖ్యుడు. శంఖుడు, కులికుడు, శ్వేతుడు, ధనుంజయుడు, మహాశంఖుడు, దృతరాష్ట్రుడు, శంఖచూడుడు, కంబలుడు, అశ్వతరుడు, దేవదత్తుడు, అనే గొప్ప గొప్ప నాగరాజులుంటారిక్కడ. వీరిలో అయిదు పది, వంద, వెయ్యి, తలలుండే నాగులు కూడా వున్నాయి. వీరి పెద్ద పెద్ద తలలమీద వుండే మణుల వెలుగుతోనే పాతాళలోకం లోని చీకటంతా మాయమవుతుంటుంది. ఎప్పుడూ క్రోధాగ్నితో వీరి శరీరాలు జ్వలిస్తుంటాయి. పాతాళం కింద ముఫ్పై వేల యోజనాల దూరంలో విష్ణుదేవుడి తామసీకళ ఉంది. దీనినే అనంతుడు అని అంటారు. దేవతలు పూజించే నిత్యకళ ఈ అనంతుడు. ఈ అనంతుడికి వెయ్యితలలు ఉంటాయి. ఈయననే శేషుడు అని అంటారు. ఈ శేషుడి తలమీదే భూగోళముంది. సృష్టిసంహారం జరిగేటప్పుడు ఈ శేషుడి కనుబొమ్మల ముడినుండి సంకర్షనుడు అనే రుద్రుడు ఆవిర్భవిస్తాడు. ఏకాదశ రుద్రులలో ఇతడొకడు మూడు కన్నులతోనూ, మూడు మొనలుగల శూలంతోనూ ఈయన వుంటాడు. అనంత సంహార శక్తి ఈయన దగ్గర వుంటుంది. శేషుడి పాదాల గోళ్ళు కెంపుల్లాగా ముచ్చటగా వుంటాయి. అతడికి పాదాభివందనం చేసే నాగ ప్రముఖులు తమముఖాలను అద్దంలా స్వచ్ఛంగా వుండే ఆ గోళ్ళల్లో చూసుకుంటుంటారు. ఎంతోమంది నాగకన్యలు, సుందరాంగులు శేషుడిని కొలుస్తుంటారు. ప్రేమతో ఉన్నత్తులై ఆ దేవుడి ఆశీస్సులకోసం ఎదురు చూస్తుంటారు. శేషుడి మాటలు అమృత తుల్యంగా వుంటాయి. దేవతలందరినీ సంతృప్తి పరుస్తుంటాడు. అతడు మెడలో వైజయంతి మాల, ఎప్పుడూ వాడిపోని తులసీదళహారం వుంటాయి. నల్లటి వస్త్రాలతో ఒక చెవికి వేలాడే కుండలంతో శేషుడు ఈ లోకంలో దర్శనమిస్తుంటాడు. ఇలా కిందిలోకాలు ఆలోకాలలో వుండే వారి విశేషాలు దేవీ భాగవతంలో మనకు కనిపిస్తుంటాయి.