Friday, 31 January 2014

బ్రహ్మపాప్తికి ఆరుమార్గములు

Jaji Sarma
బ్రహ్మపాప్తికి ఆరుమార్గములు
శుక్లయ‌జుర్వేద‌యునంద‌లి సుబాల ఉప‌నిష‌త్తులో బ్రహ్మప్రాప్తికి ఆరు మార్గములు చెప్పబ‌డిన‌వి.

"త‌ద్యైస‌త్యేన దానేన త‌ప‌సానాశ‌కేన బ్రహ్మచ‌ర్యేణ‌
నిర్వేద‌నేనా నాశ‌కేన ష‌డంగేనైవ సాధ‌యేత్‌"

స‌త్యము

మ‌నోవాక్కాయ క‌ర్మల‌యందు స‌త్యవ్రత‌మాచ‌రింప‌వ‌ల‌యును. సామ‌వేదాంత‌ర్గత కేనోప‌నిష‌త్తునందు బ్రహ్మ విద్యకు స‌త్యమేస్థాన‌మ‌ని స్పష్టప‌రుప‌బ‌డిన‌ది.

"త‌స్యైత‌పోద‌మః క‌ర్మేతిప్రతిష్ఠా, వేదాస్సర్వాం గాని స‌త్యమాయ‌త‌నం" (చ‌తుర్ధఖండ‌ము .8)

శిష్యున‌కు వేద‌మును బోధించి ఆచార్యుడు శాసించుచు ప్రప్రధ‌మ‌ములో "స‌త్యంవ‌ద" అనిప‌లికెను. (స‌త్యమును ప‌లుకుము అని అర్ధము) పొర‌పాటుగానైన‌ను అస‌త్య వాక్యమును ప‌లుక వ‌ల‌ద‌ని తిరిగి బోధించెను.

"స‌త్యాన్న ప్రమ‌దిత‌వ్యం" (స‌త్యము నుండి ప్రమాద‌మును పొంద‌వ‌ల‌దు. కృష్ణయ‌జుర్వేద తైత్తిరీయోప‌నిష‌త్తు. శిక్షావ‌ల్లి 11 అనువాక‌ము) అనృత‌ము ప‌లికిన‌వాడు స‌మూల‌ముగా న‌శించున‌ని మ‌రియెక వేద‌వాక్యము క‌ల‌దు.

"యో నృతంవ‌ద‌తి స‌మూలోవా ఏష‌ప‌రిశుష్యతి"

ముండ‌కోప‌నిష‌త్తునందును, శ్వేతాశ్వత‌ర ఉప‌నిష‌త్తునందును, ఆత్మ, స‌త్యము, త‌ప‌స్సు, స‌మ్యగ్జ్ఞాన‌ము, బ్రహ్మ చ‌ర్యమువ‌ల‌న ప్రాప్తమ‌గున‌నియు, స‌త్యమే జ‌యించున‌నియు, అందువ‌ల‌న దేవ‌యాన‌ము ల‌భ్యమ‌గున‌నియు, చెప్పబ‌డిన‌ది.

దాన‌ము

దాన‌ముకంటె మిక్కిలి క‌ష్టముగా జేయ‌వ‌ల‌సిన ప‌ని లేదు. అది త్యాగ‌ముతో గూడుకొన్నదిగ‌దా !

"దానాన్నాతిదుశ్చరం" (నారాయ‌ణ‌ప్రశ్నము. 78 అనువాక‌ము)
దాన‌ముజేయున‌పుడు గ‌మ‌నింప‌వ‌ల‌సిన విష‌య‌ముల గురించి వేద‌మిట్లు శాసించుచున్నది.

"శ్రద్ధయాదేయం అశ్రద్ధయాదేయం ! శ్రియా
దేయం ! హ్రియా దేయం ! భియాదేయం ! సంవిదా దేయం" ! (తైత్తిరీయోప నిష‌త్తు) శిక్షావ‌ల్లి.

శ్రద్దతోనివ్వ వ‌ల‌యును. అశ్రద్ధ కూడ‌దు. సంప‌ద‌న‌నుస‌రించి చేయ‌వ‌ల‌యును. సిగ్గుతో నివ్వవ‌ల‌యును. భయ‌ము చేత నివ్వవ‌ల‌యును. ప్రతిజ్ఞచేత నివ్వత‌గిన‌ది.

దాన‌ము సాత్విక‌మ‌నియు, రాజ‌స‌మ‌నియు. తామ‌స‌మ‌నియు, మూడు విధ‌ములు. దాన‌ము జేయుట త‌న‌కు క‌ర్తవ్యమ‌ను బుద్ధితో యోగ్యమ‌గుస్తల‌మును, కాల‌మును, పాత్రమును, విచారించి ప్రత్యుప‌కార‌మును కోర‌క జేయుదాన‌ము సాత్విక‌మ‌ని చెప్పబ‌డిన‌ది. చేసిన ఉప‌కార‌మున‌కు బ‌దులుగాగాని, లేక ముందేదో ఆశ‌పెట్టుకొనిగాని, లేక త‌ప్పించుకొన లేక చేయున‌ట్టిగాని దాన‌ము రాజ‌స‌మ‌ని చెప్పబ‌డిన‌ది.

అయోగ్యస్థల‌మందును, అకాల‌మునందును, పాత్రత లేక‌ను స‌త్కార ర‌హిత‌ముగ‌ను, లేక అవ‌మాన పూర్వక‌ముగ‌ను, చేయుదాన‌ము తామ‌స‌మ‌ని చెప్పబ‌డుచున్నది. (గీత‌. 17-20 21,22)

త‌ప‌స్సు

ప్రతిమాన‌వుడు త‌ప‌స్సు జేయ‌వ‌ల‌యును. త‌ప‌స్సు చేత బ్రహ్మమును తెలుసుకొనుమ‌ని వేదము చెప్పచున్నది.

"త‌పసా బ్రహ్మవిజిజ్ఞాస‌స్వం" (తైత్తిరీయోప‌నిష‌త్తు. భృగువ‌ల్లి. 2 అనువాక‌ము)

ఉపాస‌క ధ‌ర్మముల‌లో త‌ప‌శ్చ స్వాధ్యాయ ప్రవ‌చ‌నేచ‌. (త‌ప‌స్సున్ను, స్వాధ్యాయ ప్రవ‌చ‌న‌ములు అనుష్టింప‌ద‌గిన‌వి అని చెప్పబ‌డిన‌ది.)

త‌ప‌స్సన‌నేమో శ్రీ‌కృష్ణభ‌గ‌వానుడు భ‌గ‌వ‌ద్గీత‌యందు స్పష్టప‌ర‌చి యున్నాడు. ఆత‌పోవ్రత‌మునే మ‌న‌మాచ‌రింప‌వ‌ల‌శిన‌ది.

1. "దేవ‌ద్విజ‌గురుప్రాజ్ఞ పూజనం శౌచ‌మార్జవం
బ్రమ్మచ‌ర్య మ‌హింసాచ శారీరంతఉచ్యతే"

దేవ‌త‌ల యొక్కయు, బ్రాహ్మణుల యొక్కయు, విద్వాంసుల యొక్కయు, పూజ‌న‌మును, శుచిత్వము స‌ర‌ళ‌త‌, బ్రహ్మచ‌ర్యము, అహింస యనున‌వి శారీర‌క‌త‌ప‌స్సని చెప్పబ‌డిన‌ది.

2. "అనుద్వేగ‌క‌రం వాక్యం స‌త్యం ప్రియ‌హితంచ‌య‌త్ !
స్వాధ్యాయాభ్యస‌నంచైవ వాజ్ఞ్మయంత‌పఉచ్యతే"

మ‌న‌స్సున‌కు ఉద్వేగ‌మునియ్యనిదియు, స‌త్యమును, ప్రియ‌మును, హిత‌క‌ర‌మును, అయిన‌భాష‌ణ‌మును, స్వాధ్యాయ‌మును, వాచ‌క‌మైన‌త‌ప‌స్సు అని చెప్పుచున్నారు.

3." మ‌నఃప్రసాద‌స్సౌమ్యత్వం మౌన‌మాత్మవినిగ్రహః !
భావ‌సంశుద్ధి రిత్యేత‌త్తపోమాన‌స‌ముచ్చతే"

మ‌న‌స్సును ప్రసన్నముగ‌నుంచుట‌, సౌమ్యత‌, మౌన‌ము. మ‌నో నిగ్రహ‌ము, శుద్ధభావ‌న యనున‌వి మాన‌స‌త‌ప‌స్సని చెప్పుచున్నారు. ఈ మూడు విధ‌ముల‌గు త‌ప‌స్సులును తిరిగి సాత్విక‌, రాజ‌స‌, తామ‌సిక‌ త‌పస్సులుగా విభ‌జింప‌బ‌డిన‌వి.

1." శ్రద్ధయా ప‌ర‌యాత‌ప్తం త‌ప‌స్తత్త్రి విధంన‌రైః
అఫ‌లాకాంక్షిభిర్యుక్తైస్సాత్వికం ప‌రిచ‌క్షతే"

ఫ‌లాశ‌నువ‌దలి అధిక‌మ‌గుశ్రద్ధతో యోగ‌యుక్తమ‌గు బుద్ధితోడ‌ను చేయ‌బ‌డిన‌చో అది స్వాతిక‌ము.

2. "స‌త్కార మాన‌పూజార్ధంత‌పోదంభేన‌చైవ‌య‌త్‌!
క్రియ‌తే త‌దిహ‌ప్రోక్తం రాజ‌సం చ‌ల‌మ‌ధృవం"

త‌న‌కు స‌త్కార‌ము మాన‌ము పూజ కావ‌ల‌యున‌ని డంబ‌ముకొర‌కు చేయ‌బ‌డిన త‌ప‌స్సు అస్థిర‌మైన‌ది. అది రాజ‌స‌మ‌న‌బ‌డును.

3. "మూఢ‌గ్రాహేణాత్మనో య‌త్పీడ‌యాక్రియ‌తేత‌పః
ప‌ర‌స్యోత్సాద నార్ధంవాత్తామ స‌ముదాహృతం"!!

వెఱ్ఱిప‌ట్టుద‌ల‌చే త‌న్ను పీడించున‌దియు లేక లోకుల‌ను పీడించుట‌కు చేయ‌బ‌డున‌దియు, తామ‌సిక త‌ప‌స్సన‌బ‌డును.
(భ‌గ‌వ‌ద్గీత 17-14-19)

భూత‌హిత‌ము

4. మాన‌వుడు స‌ర్వభూత‌ముల యొక్క హిత‌మునందు త‌త్పరుడు కావ‌ల‌యును. ధ‌ర్మము (Religion) స‌ర్వ‌భూత‌ముల‌యోక్క హిత‌ముకొర‌కు యేర్పడియున్నది.
విష్ణుపురాణ‌మునందు (1-19-9) ఆత్మ స‌ర్వభూత‌ముల‌యందు వ్యాపించియుండుట‌చే అంద‌రియెడ‌ల‌ను శ్రేష్ఠులు ద‌య‌జూపుదుర‌ని చెప్పబ‌డిన‌ది.
జ‌గత్తున‌కంతకును ప‌ర‌మేశ్వరుడు తండ్రియ‌నియు, సృష్టిలోని మాన‌వులంద‌రు సోద‌రుల‌నియు, అల్పబుద్ధిక‌ల‌వారు వీరు నా బంధువులు వీరుకారు అను భేద‌బుద్ధితో వ‌ర్తింతుర‌నియు, ఉదార‌చ‌రితుల‌కు వ‌సుధ‌యావ‌త్తు ఒక కుటుంబ‌మ‌నియు, వేద‌ముచాటుచున్నది.

"అయంబంధుర‌యంనేతి గ‌ణ‌నాలఘ‌చేత‌సాం
ఉదార‌చ‌రితానాంతు వ‌సుధైవ కుటుంబ‌కం" (సామ‌వేదము. మ‌హొప‌నిష‌త్తు)

స‌ర్వభూత‌ముల‌యొక్క హిత‌మునందు త‌త్పరులైన‌వారు త‌న్నుత‌ప్పక పొందుదుర‌ని శ్రీ‌కృష్ణుడభ‌య‌మిచ్చియున్నాడు.

"తేప్రాప్నువంతి మామేవ స‌ర్వభూత హితేర‌తాః"

ఎవ‌రికి ద్వంద‌బుద్ధివ‌ద‌లిన‌దో యెవ‌రిపాప‌ములు న‌శించిన‌వో, యెవ‌రు స‌ర్వభూత‌ముల‌కు హిత‌ముచేయుట‌యందు త‌త్పరులైరో, వారికి బ్రహ్మనిర్వాణ రూప‌క‌మ‌గు మోక్షము ల‌భించున‌ని గీత చెప్పుచున్నది.

"ల‌భంతే బ్రహ్మనిర్వాణ‌మృష‌యః క్షీణ‌క‌ల్మషాః
ఛిన్నద్వైధాయ‌తాత్మాన‌స్సర్వభూత హితేర‌తాః "(గీత‌. 5-25)

జీవ‌కారుణ్యము (non-injury to any creature) క‌లిగియుండ‌వ‌లెను. అన‌గా ఎట్టిహింస‌యు ప‌నికిరాదు. జీహింస‌నుగురించి వేద‌మేమి చెప్పుచున్నదో విచారింత‌ము.

"ఏవాజినం ప‌రిప‌శ్యన్తి ప‌క్వంయ ఈమాహుః
సుర‌భ‌ర్రిర్హరేతి! యేచార్వతో మాంస‌భిక్షా
ముపాస‌త ఉతోతేషా మ‌భిగూర్తిర్న ఇన్వత్తు." (ఋగ్వేద‌ము, 1 మండ‌ల‌ము, 2 అష్టకం. సూక్తం 162, మంత్రము 12)

అన్నమును జ‌ల‌మును శుద్ధిప‌ర‌చి ప‌క్వము చేసి భుజించుట‌ను ఏమ‌నుష్యులు క‌నిపెట్టుదురో, ఎవ‌రు మాంస‌ముల‌ను విస‌ర్జించి శుద్ధాన్నమును భుజింతురో, అట్టివారు శ్రేష్టుల‌గుదురు.

"ఘృతం దుహ‌నామ‌దితం జ‌నాయాగ్నేమాహింసీః" (య‌జుర్వేద‌ము, 17 అధ్యాయం 49 మంత్రము)

నెయ్యినిచ్చున‌వియు, ర‌క్షాయోగ్యమ‌గు ప‌శువుల‌ను హింస‌చేయ‌కుడు.

"ఇమ‌మూర్ణాయుం వ‌రుణ‌స్య నాభింత్వచం
ప‌శూనాం ద్విప‌దాం చ‌తుష్పదాంత్వష్ణుః ప్రజా
నాం ప్రథ‌మంజ‌నిత్ర మ‌గ్నేమాహింసీః" (య‌జుర్వేద‌ము. 17 అధ్యాయ‌ము 50 మంత్రము)

రెండు కాళ్లుగ‌ల మ‌నుష్య ప‌క్ష్యాదులును, నాలుగుకాళ్లుగ‌ల గ‌వాదిప‌శువుల‌ను, మేక‌లుచ గొఱ్ఱెలు, మొద‌ల‌గువానిని హింసింప‌కుడు.

ప‌శూపాహి (య‌జుర్వేద‌ము. 1 అధ్యాయం ) జంతువుల‌ను ర‌క్షంపుడు.

"యఆమం మాంస‌మ‌ద‌న్తి పౌరుషేయంచ యేక్ర
విః ! గ‌ర్భా ఖాద‌న్తి కేశ‌వ‌స్తానితో నాశ‌యామ‌సి" (అధ‌ర్వణ వేద‌ము. 8 కాండ అను సూ 6 మం 27)

ఎవ‌డు మాంస‌ముతినునో, ఎవ‌డు గ్రుడ్లనుతినునో వానిని రాజు నాశ ప‌రుచుకోద‌గును. ఈ విధ‌ముగా జీవ‌హింస ప‌నికిరాద‌ని వేద‌ముల‌నేక విధ‌ముల ఘోషిల్లుచున్నవి. ఈ వేద‌ధ‌ర్మమునే స్మృతులును భార‌త‌మును చాటుచున్నవి. బ్రహ్మచ‌ర్యమునుగురించి వెనుక‌నేచెప్పబ‌డెను. ప్రాపంచ‌క‌విష‌య‌ముల‌యందు లంప‌టత్వము లేకుండుట‌నుగూర్చి ముందుప్రక‌ర‌ణ‌మున విచారింప‌బ‌డును.