Tuesday 28 January 2014

సూర్యభగవానుడే వాస్తు పురుషుడు............

Nerella Raja Sekhar
సూర్యభగవానుడే వాస్తు పురుషుడు...............

‘రుద్రుడు’ అంధకాసురునితో యుద్ధం చేస్తూ ఉండగా స్వేదబిందువు జారి అదే వాస్తు పురుషునిగా ఉద్భవించాడని కథ. రుద్రుడు అగ్నితత్వానికి ప్రతీక. అంతేకాదు జలకారకాత్వమునకు ప్రతీక. ‘ద్రావయతీతి రుద్రః’ అని వ్యుత్పత్తి. అగ్ని నుండే నీరు జనించినదని, నీటి నుండి పృథ్వి జనించినదని ఉపనిషత్తులు సృష్టి రహస్యాన్ని విప్పి చెప్పాయి.

‘ఆకాశాద్వాయుః నామోరగ్నిః
అగ్నేరాపః ఆద్భ్యః పృథివీ- పృథివ్యా
ఓషధయః - ఓషధీభ్యో అన్నః
అన్నాద్భూతాని జాయంతే’ ఉపనిషత్తు వాక్యాలు.

అంధకాసురుడు అంటే సృష్టికి పూర్వం ఉన్న కాళరాత్రి - యుద్ధం అంటే ఘర్షణ రాపిడి - చీకటికి, రుద్మాత్మయైన అగ్ని తేజస్తత్వానికి రాపిడి జరిగి తద్వారా జలము - ఆ జలము నుండి భూమి. ఆ భూమి నుండి వస్తుజాలము - అదే వాస్తు పురుషుడు ఉద్భవించాడని. ఆ కథలోని శాస్త్ర రహస్యం- అందుకే భూమికి, ‘వసుంధారయతీ వసుంధరా’ అని పేరు. ఇవి అన్ని కూడా అష్టదిక్పాలకులు - అష్టవిధ వస్తువులకూ ఆధారమైన ‘ఇంద్ర, అగ్ని, యమ (నియమ) నిర్రుతి - వరుణ- వాయు, కుబేర, ఈశానులు అధిదేవతలుగా నిర్వచించారు.
వారే వాస్తుకు అధిపతులు.

వాస్తుకు అష్టదిక్పతులూ అధిదేవతలు. - ఆగ్నేయంలో అగ్ని (వంటిల్లు),

తూర్పు వైపు ముఖము - దక్షిణమున శయన మందిరము - పఠనాలయం.

నైరుతి - ఆయుధ మందిరము (క్షత్రియోచిత వృత్తుల వారికి) సామాన్యులకు ఉపకరణాలు రోలు, రోకలి - తదితర సాధనాలు.ఆరుబయట కాలకృత్య గృహాలు - ఉండాలన్నారు.

నైరుతి దిశ గురించి మంత్రశాస్త్రంలోనైతే గృహాంతర్భాగ నైరుతిలో (బంధాలు కాదు) నైరుతి దిశగా దిశోన్ముఖుడై జపతపాదులు చేస్తే ఇష్టదేవతా సాక్షాత్కారంగా చెప్పారు. అంతేకాదు గృహాంతర్భాగంలో నైరుతి దిశ ఆధిపత్య స్థానం కనుక గృహ యజమాని శయ్యామందిరం ఉండాలని చెప్పారు.

ఇక పూర్తి పశ్చిమం వరుణ దిశ - జలభాండాలు ఉండవచ్చు. భోజనశాల ఉండవచ్చునన్నారు.

వాయవ్యం - అంతర్భాగంలోనైతే ధాన్యాగారం - ఆరుబయట ఐతే పశువులు పెంపుడు జంతువులకూ నిర్దేశించారు. ఉత్తరం కుబేర స్థానం ధనాగారం.

ఈశాన్యం - గృహాంతర్భాగంలోనైతే దేవపూజా మందిరం - ఆరుబయటనైతే నూతులు - జలాధార వసతులు నిర్దేశించారు. ఇదే స్థూలంగా వాస్తు శాస్త్ర శాస్ర్తియత ఏ పనినైనా శాస్ర్తియంగా చేస్తే శ్రేయస్సు కలుగుతుందని ‘తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యవ్యవస్థితౌ’ అని గీతావాక్యము. ‘లోకులకు అక్షి శాస్తమ్రు’ అని పండితసూక్తి. అంటే లోకులకు శాస్తమ్రు కన్ను వంటిది అని చెప్పారు. వస్తు నిర్మాణంలో వాస్తు శాస్త్రం ప్రధానం. వస్తువు అంటే - ఇల్లు, భవనం, నగరం, ప్రతిమ, శిల్పం మొదలైనవి.