వినసొంపైన మాటే నిజమైన ఆభరణం. సహజంగా మనం ఎదుటివారితో సంభాషించేటప్పుడు మన మాట ద్వారా వ్యక్తమైన భావాలు ఎదుటివారిలో ఆనందాన్ని కాని, ఆవేదనను కానీ, జుగుప్సను కానీ, భయాన్ని కానీ,సందేహాన్ని కానీ కలిగిస్తాయి. కాని వాస్తవంగా పరిశీలిస్తే మనం పలికేమాట ఎదుటివారికి సత్యాన్ని, హితాన్ని, ప్రియాన్ని, ఆచరణను కలిగించేదైతే ఆ మాటలలోని మాధుర్యాన్ని గ్రహించి అనుభవించిన వారు సన్మార్గాన్ని పొంది, సమాజంలో గౌరవింపబడతారు. ఒక మహాకవి "మానవునికి నిజమైన ఆభరణం మాటే" అని ఒక అందమైన శ్లోకం ద్వారా తెలియజేసాడు.


"కేయూరాణి న భూషయంతి పురుషన్ హారా న చంద్రోజ్జ్వలా
న స్నానం న విలేపనం న కుసుమం నాలజ్కృతామూర్ధజాః
వాణ్యేకా సమలజ్కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయన్తే ఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం


మానవునికి కీరితిప్రతిష్టల చిహ్నములైన భుజకీర్తులు కానీ, సూర్యహారము, చంద్రహారము మొదలైన సువర్ణ ఆభరణములు కానీ, స్నానం, చందనలేపనము,పుష్పమాలను ధరించుట, చక్కగా అలంకరింపబడిన తలవెంట్రుకలచేతను, వీటిలో ఏదియును అలంకారము కాదని, శాస్త్ర సంస్కారము కల మాట ఒక్కటే నిజమైన అలంకారము కలుగజేస్తుందని మిగిలినవి నశిస్తాయని సూచించారు.

నిజానికి మన ప్రవర్తన, మన మాట చాలా వరకు మనము నేర్చిన విద్యపైనే ఆధారపడి ఉంటుంది. అందుచేతనే మనం చూస్తున్న వారిలో కొందరు పెద్ద పెద్ద చదువులు చదివి విశేష శాస్త్రజ్ఞానాన్ని ఆర్జించినా, చాలా సాధారణంగా ఎంతో వినయంగా మంచి ప్రవర్తనతో మనకు కనిపిస్తుంటారు. మరికొందరు మిడిమిడి జ్ఞానంతో పండితులమని భావించి, గర్వంతో,ఇతరులు ఏమీ తెలియని వారైనట్ట్లుగా చాలా చులకనగా చూస్తారు.


"బాగా పండిన ఫలములతో కూడిన వృక్షము ఎంతో వినయముతో క్రిందికి వంగి తన విధేయతను ప్రదర్శిస్తుంది" అలాగే వినయంగా ఉండటం, వినయంగా మాట్లాడటం అదే మానవునికి నిజమైన అభరణం. ఎవ్వరినీ నిందించకుండా మాట్లాడటం, అవసరమైనంతవరకే మాట్లాడటం, ఇవన్నీ మనం నేర్చుకోతగినవి, సత్యాన్ని పలకటంవలన ధర్మరాజు, హరిశ్చంద్రుడు మొదలైన వారు తాత్కాలికంగా కష్టాలు అనుభవించినా, శాశ్వతమైన కీర్తి ప్రతిష్టలను ఆర్జించారు.

అలాగే సమయస్ఫూర్తితో మాట్లాడిన హనుమ వాక్కు శ్రీరామ, సుగ్రీవుల మైత్రిని, అలాగే అశోకవనములో రామవియోగంతో మృత్యోన్ముఖురాలైన సీతమ్మకు తన మంచిమాటలతో ఉపశమనాన్ని కలిగించి, రాముని కొరకు ఎదురుచూసేలా చేసింది. అలాగే సీతమ్మ కొరకు ఎదురుచూస్తున్న శ్రీరామచంద్రునికి హనుమ మాట ద్వారా ఆనందాన్ని కలుగచేస్తాడు. కనుకనే 'చక్కని నోటితో చదవని చదువు, తల్లితండ్రులను, సోదరులను, మిత్రులను వాత్సల్యంతో పలకరించని నోరును, ఇతరులకు సహకారం అందించటానికి సహకరించని మాట నిరుపయోగము".

ప్రేమతో వాత్సల్యముతో సంస్కారంతో, సత్ప్రవర్తనతో కూడిన మాట మానవునికి నిజమైన భూషణమే అని భర్తృహరి మహాకవి"వాగ్భూషణం భూషణం" అన్న సూక్లితోని సౌందర్యాన్ని మనకందించాడు. మనమూ ఆ ఆభరణాన్ని ధరిద్దాం.