వినాయక వ్రత కల్పంలో వాడే పత్రి
వినాయక చవితి వచ్చిందంటే, మా వీధిలో (అంటే ఎవరి వీధిలోనైనా) ఉన్న మొక్కల మీద కొందరికి ఎక్కడలేని ఆసక్తి పుట్టుకొస్తుంటుంది. అలా ఒకతను చక్కగా ఒకరింటి బయట పెరుగుతున్న ఒక క్రోటాన్ మొక్క ఆకులు తెంపుతుంటే ఉండలేక అడిగా…ఏం చేస్తున్నాడని. ఠక్కున సమాధానం. “పత్రి కోస్తన్నా సార్…” అని. ఓరి నీ అసాధ్యం కూల…ఇది పత్రికి వాడే మొక్క కాదురా అంటే మళ్ళీ అంతే వేగంగా సమాధానం. “కొన్కునేటోడికి తెల్వద్ గదా సార్!” అని. ఎక్కడో తగిలింది. మీక్కుడానా?
పత్రి పేరిట బజారులో దొరికే ఆకులు, పళ్ళు, కాయలూ, పిందెలు తెచ్చి ఏం పెట్టినా కోపం తెచ్చుకోని ఆ “వికటుడికి” సమర్పిస్తుంటాము. ఇక్కడింకో ఛమక్కు. “ఏంటి పది రూపాయలకింతే పత్రా? వెయ్యి ఇంకొంచెం” అని. ఏం తెస్తున్నామో తెలీదు. ఏ పేరు చదివినప్పుడు ఏం వేయాలో తెలీదు. కానీ ఎక్కువ కావాలి.
అప్పుడనిపించింది. ఏక వింశతి పత్ర పూజలో వాడే ఆకులేంటి, అవి ఎలా ఉంటాయి అని. ముందే చెబుతున్నా… ఒకవేళ మీకేమన్నా తప్పులు కనిపిస్తే, నిర్మొహమాటంగా వేలెత్తి చూపండేఁ?అపామార్గ అంటే వుత్తరేణిమొక్క ఆకులు .శమి అంటే జమ్మి ఆకులు
- 1.మాచీ పత్రం
- 2.బృహతీ పత్రం
- 3.బిల్వ పత్రం – శివారాధనలో ఎక్కువగా వాడే బిల్వ పత్రం
- 4.దూర్వాయుగ్మ పత్రం – గడ్డి
- 5.దుత్తూర పత్రం – పిచ్చి మొక్కలాగా నీళ్ళ దగ్గిర పెరుగుతూ కనిపిస్తుంటుంది
- 6.బదరీ పత్రం – అబ్బే మరేం కాదు…రేగు పళ్ళ మొక్క ఆకులు…అంతే!
- 7.అపామార్గ పత్రం – ఇది కూడా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటుంది
- 8.తులసీ పత్రం – కృష్ణ తులసా లేక లక్ష్మీ తులసా అని అడక్కండేఁ? మీ యింట్లో ఏదుంటే అదే! మరో చిత్రమేమంటే…వినాయకుడికి తులసికి పడదు. ఒక్క వినాయక చవితి తప్పిస్తే, అసలు వినాయకుడి పూజలో తులసి వాడకూడదు.
- 9.చూత పత్రం – మామిడాకులు
- 10.కరవీర పత్రం – గన్నేరు
- 11.విష్ణుక్రాంత పత్రం
- 12.దాడిమీ పత్రం – దానిమ్మ చెట్టు ఆకుల్లెండి
- 13.దేవదారు పత్రం
- 14.మరువక పత్రం
- 15.సింధువార పత్రం
- 16.జాజీ పత్రం – మల్లే మొక్క ఆకులు
- 17.గణకీ పత్రం
- 18.శమీ పత్రం
- 19.అశ్వత్ధ పత్రం – రావి చెట్టు ఆకులు
- 20.అర్జున పత్రం – వాడుక పేరు మరిచాను. చిన్నప్పుడు మా స్నేహితుడి ఇంట్లో ఈ చెట్టు కాయలు తెగ కోసుకోని తినేవాళ్ళం. పుల్లగా భలే నచ్చేవి.
- 21.అర్క పత్రం – జిల్లేడు