Sunday 30 October 2011

మూడు మంత్రాలు అందిన క్రమం - గురు పరంపర

మనకు తెలియాల్సిన స్వరూపం, ఫలం, ఉపాయం ఈ మూడు మన శాస్త్రాలలో నిక్షిప్తమై ఉన్నాయి. అట్లా వాటిని వెతికి తీసుకొనే జ్ఞానం కూడా మనకు లేదు. అందుకు మనపై జాలితో పరమాత్మే ఒక్కో విషయాన్ని మనకు తెలియజేయడానికి ఒక్కో రూపంలో ఒక్కో ఉపకారం చేసాడు.
అష్టాక్షరీ మహా మంత్రం:
బదరికాశ్రమం అనే ప్రాంతం హిమాలయాలలో ఉంది, అక్కడ భగవంతుడు స్వయంగా ఈ లోకంలోకి దిగి వచ్చి తానే ఒక ఆచార్యుడిగా మరియూ తానే ఒక శిష్యుడిగా రూపాలని ధరించి ఒక మంత్రాన్ని ఇచ్చాడు. అది మన స్వరూపం ఏమిటి తెలియజేస్తుంది. దానికి అష్టాక్షరి అని పేరు. ఇది ఎనిమిది అక్షరాల నారాయణ మంత్రం. అష్టాక్షరి మంత్రాన్ని బదరికాశ్రమంలో నర నారాయణ రూపంలో ఉపదేశం చేసాడు. స్వరూపం అంటే మనకు తెలియాల్సినవి మూడు, మనకు కనిపించేది ఏది, మనం ఏవరు, మన వెనకాతల ఉండి నడిపేది ఎవరు అనేవి. ఈ మూడు తత్వాల స్వరూప వివేచన కల్గించగలిగేది నారాయణ మంత్రం లేక అష్టాక్షరీ.
ద్వయ మంత్రం:
పొందాల్సిన ఫలితం కూడా తెలుసుకోవాలి. అది ఏంటో తెలిస్తే మనం చేసే సాధన మనకు శ్రమ అనిపించదు. ఫలితం లేక ప్రాప్యం అయినది ఏది అనేది మన శాస్త్రాలు చెబుతున్నాయి, వాటిని వివరించడానికి భగవంతుడు మరొక చోట తాను మరొక మంత్రాన్ని ఉపదేశం చేసాడు. ఆ మంత్రాన్ని భగవంతుడే స్వయంగా లక్ష్మీ దేవికి పరమపదంలో ఉపదేశం చేసాడట. ఆ పరమ పదంలో లక్ష్మీదేవి విష్వక్సేనులకు ఉపదేశం చేసిందట. ఆ విష్వక్సేనులు క్రమంగా ఈ లోకంలో ఉన్న మహానుభావుల ద్వారా మనవరకు అందేట్టు చేసాడు. ఈ మంత్రం రెండు భాగాలుగా ఉంటుంది కనుక ద్వయ మంత్రం అని పేరు. ఫల స్వరూపాన్ని తెలుపడానికి పరమాత్మ చేసిన రెండో ఉపకారం.

చరమ శ్లోకం:
ఫలం తెలిసాక దానికి సాధన అవలంభించాలి, ఆ సాధన ఎట్లా అవలంభించాలి అనే సంశయం తీర్చడానికి ఆ భగవంతుడే స్వయంగా ఈ లోకంలోకి వచ్చి చేసాడు. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్దాన్ని సాకుగా పెట్టుకొని చరమ శ్లోకాన్ని ఉపదేశం చేసాడు, ఇది భగవద్గీత 18 వ అధ్యాయంలో 66 వ శ్లోకం. దీనికే చరమ ఉపాయం అని పేరు. మనం అవలంభించాల్సిన సాధనం ఇది అని తెలుపుతుంది.

ఈ మూడు మంత్రాలను రహస్య త్రయం అని అంటారు. పరమాత్మనే ఈ మూడింటిని మూడు చోట్ల ఉపదేశం చేసాడు కనక ఆయననే మొదటి గురువు అని అంటాం. పరంపరకి మొదటి వాడు పరమాత్మనే. అందుకే మన సంప్రదాయంలో గురుపరంపరను అనుసంధానం చేసేప్పుడు ఈ శ్లోకాన్ని చెబుతారు.
లక్ష్మీ నాథ సమారంభాం నాథ యామున మధ్యమాం
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం

అందుకే మన ఆచార్య పరంపరని "లక్ష్మీనాథ సమారంభాం" అని అనుసంధానం చేస్తాం.
పరంపర మొదలు అయ్యింది "లక్ష్మీ నాథ సమారంభాం" లక్ష్మీ నాథుడి నుండి ఆరంభం అయ్యి మనకు ఆచార్య పరంపర అందింది అని తలచుకుంటాం. పరంపర మద్యలో ఎందరో ఉన్నారు, "నాథ యామున మధ్యమాం" కానీ ఈ మద్య కాలంలో అందుకున్న మహనీయులు నాథమునులు. అది ఈ లోకానికి అందగలిగేట్టు దృడతరం చేసిన మహనీయులు నాథమునులు, ఈ కలియుగంలో మనకి అందించిన వారు. వారు 8 వ, 9వ శతాబ్దానికి చెందిన వారు. నాథమునులు తన మనువడు యామునమునులకు ఉపదేశం చేసారు నేరుగా కాక మరో ఇద్దరి ద్వారా. వారు ద్వారా భగవద్రామానుజుల వారికి ప్రసాదించి ఈ జగత్తుకి నలుదిక్కుల ప్రసరించేట్టు చేసినవారు కనుక "నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం" అని మనం ఆచార్య పరంపరని స్మరించుకుంటున్నాం. యామునమునులు 10 వ శతాబ్దానికి చెందినవారు. ఆ యామునాచార్యులు దేహాన్ని చాలించే సమయానికి రామానుజులవారు వారిని దర్శించారు, రామానుజులవారు 11 వ శతాబ్దానికి చెందినవారు. రామానుజులవారి నుండి మనకు ఈ నాటివరకు వారు ఏర్పరిచిన జీయర్ వ్యవస్థ ద్వారా అందుతోంది.

నాథమునులు వారికున్న యోగిక శక్తిచేత ఆళ్వార్ తిరునగరి అనే క్షేత్రం వద్ద నమ్మాళ్వార్ని ప్రత్యక్షం చేసుకొని మంత్ర మంత్రార్థ రహస్య జ్ఞానాన్ని పొందినట్లు చరిత్ర చెబుతోంది. నాథమునులకు ముందు పరంపర మనకు తెలియడంలేదు. అయితే అంతకు ముందు ఆళ్వార్లు కలియుగం ఆరంభం అయిన వెయ్యి లేక పదిహేను వందల సంవత్సరాల కాలానికి చెందినవారు. కలియుగం ఆరంభం అయిన 43 రోజులకు నమ్మాళ్వార్ అవతరించారు. కలియుగం ఆరంభం అయిన మొదటి శతాబ్దంలో గోదా దేవి, పెరియాళ్వార్ అవతరించారు. అట్లా సుమారు నలుగురు ఆళ్వార్లు కలియుగ ఆరంభానికి ముందు, మరొక ఎనిమిది మంది కలియుగం ఆరంభం అయ్యాక అని గురుపరంపరాది గ్రంథాలు తెలియజేస్తున్నాయి.

నాథమునులు, యామునాచార్యుల ద్వారా అందిన ఈ మంత్రాలని రామానుజాచార్యులు రుచి ఉన్నవారికి అందేట్టు వ్యవస్తను ఏర్పాటు చేసారు. రామానుజాచార్యుల వారికి ముందు కూడా ఆచార్యులు ఉన్నారు, కానీ వారు మంత్రాలని మరొకరికి తెలియజేయడం ఎంతో పరిక్షించిగానీ చేసేవారు కాదు. ఈ విషయం మనం రామానుజాచార్యుల చరిత్ర తెలుసుకుంటే అర్థం అవుతుంది. వారు సుమారు 40 సంవత్సరాలు దాటి, సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన జ్ఞాని అయి ఉన్నప్పటికీ చరమ శ్లోకలో ఉన్న గంభీరమైన తాత్పర్యాన్ని తెలుసుకోవడానికి 300 మైల్ల దూరంలో ఉన్న ఆచార్యుడి వద్దకి నడిచి 18 సార్లు వెళ్తే కానీ లభించలేదు. రామానుజాచార్యుల వారిలాంటికే అంత కష్టంగా లభిస్తే సామాన్యులకు మంత్ర ఉపదేశం జరిగే ప్రశ్నే ఉండేది కాదు. ఆడవారికి, బ్రాహ్మణేతరులకి ఉపదేశం అనేదే లేదు ఆకాలంలో. రామానుజాచార్యులవారు ఇంత విలువైన మంత్రాలను లభించకపోతే మనకు జరిగే నష్టం ఏంతో కదా, విలువైనవి మన వద్ద ఉండి కూడా నష్టం ఎందుకు పొందాలి అని జాలి కల్గి, రుచి ఉన్న వారికి, మేము కూడా బాగుపడతాం, నాకూ తెల్సుకోవాలని ఉంది అనే వారందరికీ అందించాలి అని ఆచార్య పరంపర ఏర్పాటు చేసారు.

అంతకు ముందు ఈ మూడు మంత్రాలు ఒకే సారి ఉపదేశం చేసేవారే కాదు. మంత్రం, మంత్ర అర్థం కూడా ఒకేసారి లభించేది కాదు. మరిలా అందరికీ చెబితే దాని విలువ పోదా అంటే, మనిషికి ఒకసారి అంటూ సంస్కారం ఏర్పడితే, లోన నిలిచి పోతుంది, క్రమేపి మనపై ప్రభావం చూపుతుంది. మానవ దేహం అనేది సులభంగా లభించలేదు. ఎన్నో జన్మల క్లేషాల తర్వాత వచ్చింది. ఈ మానవ శరీరం అనేది మెరుపు తీగ పాటి అంత కూడా లేదు అని చెబుతారు అళ్వార్లు. అందుకే సంస్కారం అంటూ ఎర్పడితే మానవ జన్మ కంటే క్రిందకి దిగజార కుండా ఉంటుంది. క్రమేపి బాగుపడే అవకాశం ఉంది. అట్లా అష్టాక్షరీ, ద్వయ మంత్రం మరియూ చరమ శ్లోకాన్ని ఒకేసారి ఉపదేశంగా అందేట్టు చేసారు రామానుజాచార్యులవారు. ఈ మూడింటికి ఆది గురువు శ్రీమన్నారాయణుడే.

ఈ మూడు మంత్రాల అర్థాన్ని పిళ్ళై లోకాచార్యులవారు సామాన్యులకు కూడా సులభంగా అర్థం అయ్యేలా సూత్రబద్దం చేసారు. వారి తర్వాత వారి శిష్యులైన మణవాళ మహామునులు అనే మహనీయులు వ్యాక్యాణాలు చేసారు.