Tuesday 8 July 2014

"తొలి ఏకాదశి"...

"తొలేకాశి"....."తొలి ఏకాదశి"....
సంవత్సరంలో ఇన్ని ఏకాదశులుండగా, ఈ ఏకాదశినే పెద్ద పండగలా చేసుకోటం ఏంటీ! అందునా సంవత్సరం మధ్యలో వచ్చే ఏకాదశిని "తొలి" ఏకాదశి అనటమేంటీ! ఒక సామెత ఉంది.
"ఉగాదితో పండగలు ఊడ్చుకుపోతయ్యి, తొలేకాశితో తొలకరిస్తయ్యి".అందుకని దీన్ని తొలేకాశి అంటారు. మనకి తొలకరి వర్షాలు పడేది ఆషాఢమాసంలో మనం వ్యవసాయదారులం. తొలకరి అంటే మనకి పెద్ద పండగ. అందుకని ఆషాఢ శుద్ధఏకాదశిని "తొలి ఏకాదశి" పండగ్గా చేసుకుంటామన్నమాట!"...."చాతుర్మాస్య వ్రతం" అని ఒక వ్రతం ఉంది....అది ఆషాఢ శుద్ధ ఏకాదశితో మొదలయ్యి, కార్తీక శుద్ధ ఏకాదశితో ముగుస్తుంది.
ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు విష్ణుమూర్తి నిద్రపోతాడు.విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళతాడని పెద్దలు చెప్పగానే, నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కలుగుతుంది. విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థం. అంటే విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం అన్నమాట. ఇప్పటివరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు, ఈ రోజు నుంచి దక్షిణదిక్కుకు వాలుతాడు. అంటే ఈ రోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు. దానినే సాధారణ పరిభాషలో నిద్రపోవడం అని అభివర్ణించారు.అందుకని ఆ రోజుని "శయనైకాదశి" అనీ, "తొలి ఏకాదశి" అనీ పిలుస్తారు.
కార్తీకశుద్ధ ఏకాదశినాడు మళ్ళా నిద్రలేస్తాడు,కాబట్టి దాన్ని "ఉత్థాన ఏకాదశి" అనీ, " చిల్కు ఏకాదశి" అనీ పిలుస్తారు. ఈ నాలుగు నెలలూ యోగులు,సన్యాసులు ఎక్కడికీ కదలకుండా ఒక్కచోటనే ఉండి, ఆ విష్ణువుని అర్చిస్తారు. దీన్నే చాతుర్మాస్య వ్రతం అంటారు.చతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగునెలలపాటు ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను విసర్జిస్తారు. కాబట్టి మనం ఆషాఢ శుద్ధఏకాదశిని పండగలా చేసుకుంటాం.సంవత్సరమంతా ఏకాదాశి ఉపవాసాలుంటారు. ఆ ఉపవాసాలని ఇవ్వాళ మొదలెడతారన్నమాట! ఇవ్వాళ మొదలెట్టి ఇరవైనాలుగేకాదశులూ చేస్తారు.కాబట్టి దీన్ని "తొలి ఏకాదశి" అన్నారు...
"పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు. వానకారు మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం. శరదృతువు యమ దంష్ట్రిక (యముడి కోర). ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలు ఎక్కువ. "లంఖణం పరమ ఔషధం" అనే ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి. ఈ నెలలోనే ప్రకృతిలో, పర్యావరణంలో మార్పులు వస్తాయి. తద్వారా మన శరీరానికి జడత్వం వచ్చి, అనేక రోగాలు చుట్టుముడతాయి. ఉపవాసం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమై, దేహం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. ఇంద్రియనిగ్రహాన్ని కలిగిస్తుంది. ఇంతేకాక కష్టపరిస్థితుల్లోను, భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు, ఆచారాలు ఏర్పడ్డాయి.ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు. రైతులు ఆరోజున ఖచ్చితంగా పేలపిండి తింటారు.