Thursday 10 July 2014

నమస్తే !

జాజి శర్మ

నమస్తే !
నమస్తే కు చాలా లోతైన అర్ధము ఉంది . సంస్కృతములో నమః+తే = నమస్తే. దీని అర్ధము - నేను నీకు నమస్కరిస్తున్నాను అని. నమః అనే పదాన్ని "న", "మః" గా విడదీయవచ్చు - నాది కాదు అనే అర్ధము వస్తుంది. ఇతరుల సన్నిధిలో మన అహంకారాన్ని వదిలించుకొనే లేక తగ్గించుకొనే ఆధ్యాత్మిక సాధనను తెలియ జేసే ఆచారమిది.
వ్యక్తుల మధ్య నిజమైన కలయిక అంటే వారి మనస్సులు కలవడమే. అందుకే మనము ఇతరులను కలిసినప్పుడు నమస్తే అంటాము. అనగా 'మన మనసులు కలియుగాక' అని అర్ధము. హృదయం ముందర రెండు అరచేతులు కలపడము ఈ అర్థాన్నే సూచిస్తుంది. తల వంచడము అనేది ప్రేమతో వినయముగా మర్యాదని, స్నేహాన్ని అందించడాన్ని తెలియచేస్తుంది.
నమస్కారమనేది ఆధ్యాత్మ పరంగా ఇంకా లోతైన అర్ధాన్ని సూచిస్తుంది . ప్రాణ శక్తి, దివ్యత్వము; ఆత్మ లేక పరమాత్మ అందరిలో ఒకేలాగా ఉన్నది. ఈ ఏకత్వాన్ని గుర్తించి రెండు చేతులు కలిపి తల వంచి ఇతరులను కలిసినప్పుడు వారిలో ఉన్న దివ్యత్వానికి నమస్కరిస్తాము. మహాత్ములకు, భగవంతుడికి నమస్కారము చేసేటప్పుడు అందుకనే ఒక్కోసారి మనలోనున్న దివ్యత్వాన్ని చూసుకోవడానికా అన్నట్లు కనులు మూసుకొంటాము. దివ్యత్వాన్ని సూచించే విధముగా నమస్కారము ఒక్కోసారి భగవన్నామములతో ద్వారా కూడా చేయ బడుతుంది. ఈ ప్రాముఖ్యత తెలిసికొన్నప్పుడు నమస్కారము చేసేటప్పుడు పైపైకే నమస్తే అనడము గాక సరైనటువంటి స్నేహానికి దోహదము చేసే లాగున ప్రేమతోను గౌరవముతోను కూడిన వాతావరణాన్ని కలుగ చేయ గలము.