Thursday, 24 July 2014

కేనోపనిషత్తు

జాజి శర్మ

కేనోపనిషత్తు

కేనోపనిషత్తు ఏ వేదంలో, ఎక్కడ ఉంది?

కేనోపనిషత్తు సామవేదంలోని తలవకార బ్రాహ్మణంలో అంతర్భాగంగా ఉంది. అందుచేత దానికి తలవకారోపనిషత్తనే నామాంతరం కూడా ఉంది.

కేనోపనిషత్తు అనే పేరు ఎందుకు వచ్చింది? ఇందులో ఎన్ని మంత్రాలు ఉన్నాయి?

"కేన" అనే పదంతో ఈ ఉపనిషత్తు ప్రారంభం అవడం చేత కేనోపనిషత్తు అనే పేరు వచ్చింది.
నాలుగు భాగాలలో విభజింపబడిన ఈ ఉపనిషత్తులో 35 మంత్రాలు ఉన్నాయి.
కేనోపనిషత్తులోని శాంతి వాక్యం దేనితో ప్రారంభమవుతుంది?
"ఆప్యాయంతు మమాంగాని" నా జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను ఆరోగ్యంగా ఉంచమని పరమాత్మను ప్రార్ధించడంతో ఈ ఉపనిషత్తు ప్రారంభం అవుతుంది.
మానవులలోనే గాక స్థావర జంగమాలన్నింటి లోనూ ఆత్మ ఉన్నదని వేదాంతం చెప్తుంది.

 అలాంటప్పుడు మోక్షం మానవునికొక్కనికే ఎందుకు సాధ్యం?

మానవునిలో మాత్రమె మనో బుద్ధ్యహంకారాలున్నాయి. వాటి ద్వారానే మోక్షం సాధ్యం. అవి ప్రకాశించాలంటే ఆరోగ్యమైన, దృఢమైన శరీరం అవసరం గనుక ఈ ప్రార్థన. వేదాంతం శరీరాన్ని ఉపేక్ష చేయమని చెప్పదు; శరీరమే అంతా అనుకోకూడదని అంటుందంతే.
కేనోపనిషత్తులోని మొదటి మంత్రం ఏమిటి? అందులో ప్రస్తావించబడిన ప్రశ్నలేమిటి?
కేనోపనిషత్తు లోని మొదటి మంత్రం -
కేనేషితం పతతి ప్రేషితం మనః
కేన ప్రాణః ప్రథమః ప్రైతి యుక్తః
కేనేషితాం వాచమిమాం వదన్తి
చక్షుః శ్రోత్రం క ఉ దేవోయునక్తి
మనస్సు అనేక విషయాలను గురించి ఆలోచిస్తుంది. ఎవ్వని చేత ప్రేరేపింపబడి మనస్సు ఆయా విషయాలలో ప్రవర్తిస్తుంది? అన్నింటి కంటే శ్రేష్టమైనది ప్రాణం. అది ఎవని చేత ఆజ్ఞాపింపబడి తన పనిని తాను చేసుకుపోతుంది? అలాగే మానవులు ఎవరిచేత ప్రేరేపింపబడి మాట్లాడుతున్నారు? కన్ను, చెవి, ఏ శక్తి చే నియంత్రించబడి వాటి పనులు చేసుకుపోతున్నాయి?
పైన ప్రస్తావించబడిన ప్రశ్నలకు సమాధానంగా ఈ ఉపనిషత్తు ఏమి చెప్తుంది?
జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు జడమైనవి. అందుచేత వాటికి క్రియాశక్తి ఉండదు. కేవలం పనిముట్లు వంటివి. పనివాడు వెనకాల ఉండి పనిముట్ల చేత పని చేయిస్తాడు. పనివాడు చైతన్యవంతుడు. అలాంటి చైతన్య శక్తి వల్లే ఈ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ఆ చైతన్య శక్తి ఏది అన్నది వేదాంతంలో మౌళికమైన ప్రశ్న. ఆ చైతన్య శక్తే ఆత్మ అని ఈ ఉపనిషత్తు చెప్తుంది.
ఆత్మ చేతనంగా ఉండి ఇంద్రియాల చేత తన శక్తితో పనిచేయిస్తుందంటే, ఇవన్నీ ఇలా పనిచెయ్యాలనే ఇచ్ఛ ఆత్మకు ఉందా?
లేదంటుందీ ఉపనిషత్తు. వాటికి దగ్గరగా ఉండడం వల్ల శక్తినిస్తుంది తప్ప అవి ఎలా పని చెయ్యాలి, ఒక మానవుని ప్రవర్తన ఎలా ఉండాలనేది ఆ మానవుని పూర్వజన్మ వాసనల మీద ఆధారపడి ఉంటుందని, ఆత్మ 'సాక్షి' మాత్రమేనని ఈ ఉపనిషత్తు ప్రతిపాదిస్తుంది.
ఇంద్రియాలకు అగోచరమైన ఆత్మను మనో బుద్ధులతో తెలుసుకోగలమా?
అసాధ్యం అంటుందీ ఉపనిషత్తు. శాస్త్ర జ్ఞానంతో కూడా అసాధ్యం అంటుంది. ఏకాగ్రతతో ధ్యానం చేసి బ్రహ్మసాక్షాత్కారం చేసుకోవాలని బోధిస్తుంది.
సరియైన జ్ఞాని ఎవరు?
తనకు ఏమీ తెలియదనుకున్న వాడే జ్ఞాని.
యస్యామతం తస్య మతం
మతం యస్య న వేద సః
అవిజ్ఞాతం విజానతాం
విజ్ఞాతమవిజానతామ్ (2,3)
ఎవరైతే తనకు తెలియదని అనుకుంటాడో అతనికి బ్రహ్మము తెలియును. కారణం అతనికి బ్రహ్మము ఇంద్రియ గోచరం కాదు, దానిని సమాధి నిష్ఠలో మాత్రమె తెలుసుకోగలమనే జ్ఞానం ఉంది గనుక. ఎవరైతే తనకు బ్రహ్మము తెలుసుననుకుంటాడో అతనికి బ్రహ్మము తెలియదు. దానికి కారణం బ్రహ్మము ఇంద్రియగోచరమనే భ్రమలో అతడు ఉన్నాడు గనుక.
పరమాత్మ సాక్షాత్కారానికి ఏమేమి సాధనాలు కావాలి?
తపస్సు, శమదమాది సద్గుణాలు సాధనాలుగా ఉండాలి.
తస్యై తపో దమః కర్మేతి ప్రతిష్ఠా వేదాః
సర్వాంగాని సత్యమాయతనం (4,8)
బ్రహ్మ సాక్షాత్కారానికి తపస్సు, శమ, దమాది సద్గుణ సంపత్తి, సత్యవ్రతం ముఖ్యమని వేదం ప్రతిపాదిస్తుంది. తపస్సు శరీరానికి క్రమ శిక్షణ నిస్తుంది. మనస్సుకు, ఇంద్రియాలకు ఏకాగ్రతను చేకూరుస్తుంది. శమదమాలు అంతరింద్రియ బాహ్యేంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తాయి. ఇవన్నీ సత్య శోధనకు కావలసిన శారీరక, మానసిక, ఇంద్రియ నియంత్రణాలు.
చివరగా మనందరికీ జ్ఞానోదయం కలగడానికి ఈ ఉపనిషత్తులో చెప్పిన కథ ఏమిటి?
చివరగా మనందరికీ జ్ఞానోదయం కలగడానికి చెప్పిన కథ ఒకటుంది. రాక్షసులను జయించాం, మనకంటే గొప్పవాళ్ళు ఇంకెవ్వరు లేరని ఇంద్రుడు, అగ్ని, వాయువు మొదలైన దేవతలు అహంకరించారు. వారికొక పాఠం చెప్పడానికి వారి ముందర ఒక యక్షుడు నిలబడతాడు. అతని ముందర వీరి శక్తులేవీ పనిచెయ్యక భంగపడతారు. చివరకు ఆ వచ్చిన యక్షుడే పరబ్రహ్మమని, ఆయనే తమకున్న శక్తునలనన్నింటినీ ప్రకాశింప జేస్తున్నాడని జ్ఞానోదయం అవుతుంది.
ఈ దేవతలందరూ మన ఇంద్రియాలకు ప్రతీకలు. మన ఇంద్రియాలను పనిచేయించే శక్తి బ్రహ్మమని, అదే బ్రహ్మం మనలో జీవాత్మగా ప్రవేశిస్తుందని, అందుచేత మనకేదో స్వతంత్రమైన శక్తి ఉందని అహంకరించ కూడదనే సందేశంతో ఈ ఉపనిషత్తు ముగుస్తుంది.