Thursday, 24 July 2014

ఈశావాస్యోపనిషత్తు

@.జాజి శర్మగారు.
ఈశావాస్యోపనిషత్తు
ఈశావాస్యోపనిషత్తు ఏ వేదంలో ఉంది?
ఈశావాస్యోపనిషత్తు శుక్ల యజుర్వేదంలో ఉంది.
ఈశావాస్యోపనిషత్తు అనే పేరు ఎందుకు వచ్చింది?
ఈ ఉపనిషత్తు 'ఈశావాస్య' అనే పదంతో ప్రారంభం అయ్యింది ఈశావాస్యోపనిషత్తు అనే పేరు వచ్చింది. దీనినే ఈశోపనిషత్తు అని కూడా అంటారు.
ఈ ఉపనిషత్తులో ఎన్ని మంత్రాలు ఉన్నాయి?
ఇందులో 18 మంత్రాలు ఉన్నాయి.
ఈశావాస్యోపనిషత్తు అందించిన ప్రధానమైన సందేశం ఏమిటి?
ఈ చరాచర ప్రపంచం అంతా ఈశ్వరుడి చేత ఆచ్చాదింపబడిందని, అందుచేత 'నేను', 'నాది' అనే భావాలు పరిత్యజించి, త్యాగబుద్ధితో, లోభరహితంగా, లభించిన దానితో సంతృప్తి చెంది అనుభవించడమే ఉత్తమ నైతిక జీవనమనే ఉదాత్త సందేశంతో ప్రారంభామవుతుందీ ఉపనిషత్తు.
పరమాత్మ 'విశ్వవ్యాపి' అని చెప్పే మంత్రం ఏది?
ఈశావాస్య మిదగ్ం సర్వం
యత్కించ జగత్యాం జగత్
ఈ సూక్తి ఈ ఉపనిషత్తులో మొదటి మంత్రంలో మొదటి పాదం. ఈ దృశ్యమాన విశ్వం ఈశ్వరుడి చేత కప్పబడి ఉంది - అంటే భగవంతుడు విశ్వవ్యాపకుడని అర్థం.
వివరణ: ఈ విషయం వేదంలో అనేక చోట్ల ప్రస్తావించ బడింది. ప్రసిద్ధమైన నారాయణ సూక్తంలో
"యచ్చ కించిజ్జగత్సర్వమ్ దృశ్యతే శ్రూయతే2పివా
అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః"
అని ఉంది.
ఈ ప్రపంచంలో కనిపించేది, వినిపించేది ఏది ఉందో, దాని లోపల, బయట ఉన్నవాడు నారాయణుడే (అంటే బ్రహ్మమే). ఇలా అంతా బ్రహ్మ మయమే అని గ్రహించి మానవుడు ఆయన మీదే మనస్సు లగ్నం చెయ్యాలని సందేశం.
త్యాగం చెయ్యవలసిందని, పరుల ద్రవ్యాన్ని అపహరించ వద్దని చెప్పిన వచనం ఏది?
లోభం గర్హించదగింది అని చెప్పే మంత్రం ఇది.
తేన త్యక్తేన భుంజీథా మా గృధః కస్య స్విద్ధనమ్
ఇది మొదటి మంత్రంలో రెండవ భాగం. ఈ చరాచర ప్రపంచమంతా భగవన్మయమే అయినప్పుడు, ఈ వస్తువు నాది, నేను సంపాదించాను అనుకోవడం అజ్ఞానం. భోగ్య వస్తువులను వేటినయినా తన ప్రయోజకత్వంతో సాధించాననే అహంకారంతో కాకుండా, భగవద్దత్తమైనవనే భావంతో, త్యాగ బుద్ధితో, అనాసక్తతతో అనుభవించుచూ ఎవరి ధనాన్ని ఆశించ వద్దు అని దీని అర్థం.
పరబ్రహ్మ పరిపూర్ణమూ లేక సంపూర్ణమూ అని చెప్పే శాంతి వచనం ఏమిటి?
బ్రహ్మ ఎప్పుడూ పూర్ణమే!
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే
ఓం శాంతిః శాంతిః శాంతిః
భగవంతుడు పూర్ణం (అదః పూర్ణం), ఈ విశ్వమూ పూర్ణమే (ఇదం పూర్ణం), పూర్ణమైన ఆ భగవంతుని నుండే ఈ పూర్ణమైన విశ్వం కూడా ఆవిర్భవించింది. పూర్ణం నుండి పూర్ణమును పరిహరిస్తే మిగిలేదీ పూర్ణమే.
వివరణ: బ్రహ్మం నుండి నామ రూపాలుగా విశ్వం ఆవిర్భవించి నప్పుడు, మళ్ళీ ప్రళయం వచ్చినప్పుడు, విశ్వం బ్రహ్మంలో లీనమైనప్పుడు - అంటే అన్ని స్థితులలోనూ బ్రహ్మం పూర్ణమే. విశ్వం అశాశ్వతం. బ్రహ్మం శాశ్వతం. విశ్వం శాశ్వతం అనుకోవడమే అవిద్య. విశ్వం శాశ్వతం కాదని ఆధునిక సృష్టి సిద్ధాంతం కూడా చెపుతుంది. ఆ విషయాన్ని వేల సంవత్సరాల నాడు వేదం ఈ మంత్రం ద్వారా సూచించింది. సృష్టికి కావలసిన ద్రవ్యం ఏది అనే ప్రశ్నకు ఆధునిక శాస్త్రజ్ఞుల వద్ద సమాధానం లేదు. బ్రహ్మమే - శుద్ధ చైతన్యమే ద్రవ్యంగా విశ్వావిర్భావం జరిగిందని ఈ మంత్రం ద్వారా సూచించి ఆధునిక శాస్త్రజ్ఞుల కంటే ఒకడుగు ముందరే ఉంది వేద విజ్ఞానం.
ఈ మంత్రం పిల్లలతో సహా అందరికి రావలసిన శుభకర మంత్రం.
పరమాత్మ యొక్క విశిష్ట లక్షణాలను వర్ణించే వచనం ఏమిటి?
ఆ వాక్యం ఇది:
తదేజతి తన్నైజతి
తద్దూరే తద్వంతికే
త దంతరస్య సర్వస్య
తదు సర్వస్యాస్య బాహ్యతః
ఇది ఈ ఉపనిషత్తులో ఐదవ మంత్రం. దీని అర్థం - ఆత్మతత్వం చలిస్తుంది, చలించదు, దూరంగానూ ఉంటుంది. జగత్తు లోపలా బయటా కూడా ఉంటుంది. అలాగే పాండిత్యానికి పరిమితమైన వారికి అది దూరమే, యోగులకు దగ్గరే.
వివరణ:
ఆత్మ సర్వ వ్యాప్తం - తనలో నున్న ఆత్మతత్వం ఇతరులలో నున్న ఆత్మతత్వం ఒకటే అనే జ్ఞానం లోపించినపుడు గుడికి ఎంత దగ్గరగా నున్నా - అంటే ఎన్ని దేవాలయాలు సందర్శించినా, ఎంత పాండిత్యం సంపాదించినా దైవానికి దూరమే. గుడికి దగ్గిర - దైవానికి దూరం అనే అర్థం వచ్చే ఆంగ్ల సామెత ఉద్భవించక ముందే ఈ విషయాన్ని ఉపనిషత్తు బోధించింది. ఆత్మావలోకనం చేసిన యోగులకు మాత్రమే ఆత్మతత్వం దగ్గరగా ఉంటుంది.
సర్వ వ్యాప్తమైన ఆత్మతత్వానికి అచంచలత్వం స్వాభావికం. కాని మన ఇంద్రియాలు చలించేవి గనుక ఆ చలనం ఆత్మతత్వం మీద ఆరోపించి అది చలిస్తుందని మనం భ్రమలో ఉన్నాం. అది పొరపాటని ఈ మంత్రం మొదట వివరించింది.
సకల జీవుల యెడల సౌభ్రాతృత్వాన్ని కలిగి ఉండాలని సందేశాన్ని అందించిన వచనం ఏది?
ఆ వచనం ఇది:
యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి
సర్వభూతేషుచాత్మానం తతో న విజుగుప్సతే
యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః
తత్ర కో మోహః కః శోకః ఏకత్వమనుపశ్యతః
ఈ రెండు మంత్రాలు (6, 7) ఈ ఉపనిషత్తుకి గుండెకాయ వంటివి. వీటి అర్థం ఇది:
"ఎవ్వడైతే ప్రపంచంలోని అన్ని ప్రాణులను ఆత్మస్వరూపుడగు తనలో చూచుచున్నాడో, అలాగే అన్ని ప్రాణులలోను ఆత్మ స్వరూపుడగు తనను చూచుచున్నాడో అతడు ఎవ్వరినీ ద్వేషించడు. అలాగే బ్రహ్మజ్ఞాని అయినవాడు, సర్వాంతరాత్మగా ఉన్నది ఆ పరమేశ్వరుడే అని గుర్తెరిగి తనకు ఇతరులకు మధ్య భేద భావం పరిత్యజిస్తాడు. అలాంటి వానికి శోకం గాని, మొహం గాని ఉండవు"
వివరణ:
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నది భేద భావమే. ఇది తొలగినపుడు వివాదాలకు, యుద్ధాలకు, ఉగ్రవాదానికి తావెక్కడుంటుంది? మత ఛాందస వాదం ఎక్కడ ఉంటుంది? సర్వ మానవ సమానత్వం అన్నది అందరిలో నున్న పరమాత్మ ఒక్కడే అన్న ఉపనిషత్సూక్తిని గ్రహించిన వాళ్లలోనే కలుగుతుంది.
ఉపనిషత్సారం హిందువుల రక్తంలో ఉంది గనుక ఎన్నడూ మనం ఇతర దేశాల మీదకి దండయాత్ర చెయ్యలేదు. అంటే కాక ఇతర దేశాల నుండి వచ్చిన అన్యమతస్తులకు ఆశ్రయం కూడా భారతదేశం కలిగించింది.
ఈశావాస్యోపనిషత్తు అందించిన సమన్వయ సిద్ధాంతం ఏమిటి?
ఏకాగ్రత సంపాదించి దేవతాజ్ఞానాన్ని అభ్యసించాలని పతిపాదించింది. అలాగే భక్తీ, జ్ఞాన మార్గాలను విడివిడిగా కాక సమన్వయము చేసి ఆచరించాలని భోధించింది. భార్య, పుత్రులు, సంపద - వీటి మీద వ్యామోహం వదలాలని ఉపదేశించింది. దీనిని ఏషణాత్రయ పరిత్యాగం అంటారు, అలాగే సమాజ ప్రగతికి ప్రవ్రుత్తి మార్గంలోనూ, ఆత్మోధరణకు నివృత్తి మార్గంలో నిస్సంగంగాను ఉంటూ, ప్రవ్రుత్తి, నివృత్తి మార్గాల సమన్వయం పాటించాలి అని ఉపదేశించింది.
ఇలా ఆధ్యాత్మిక జీవనం, లౌకిక జీవనం పరస్పర విరుద్ధాలు కావని, వీటిని చక్కగా సమన్వయము చేసి పరిపూర్ణమైన జీవనం సాగించవచ్చుననే సమన్వయ దృక్పథాన్ని ఈ ఉపనిషత్తు ఆవిష్కరిస్తుంది.
ఈశావాస్యోపనిషత్తులోని చివరి ప్రార్థన ఏమిటి?
ఈ ఉపనిషత్తులోని చివరి ప్రార్థనా మంత్రము -
అగ్నే నయ సుపథా రాయే అస్మాన్
విశ్వాని దేవ వయునాని విద్వాన్
యుయోధ్యస్మజ్జుహురాణమేనో
భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమ
అగ్నిదేవా! మమ్ము సరైన మార్గంలో, భాగ్యవంతులమగునట్లుగా నడిపింపుము. నీవు అన్ని మార్గములను తెలిసినవాడవు. పాపము మమ్ములను చేరకుండునట్లుగా చేయుము. నీకు అనేక ప్రార్థనా నమస్కారములను సమర్పించుచున్నాము.