Monday, 28 July 2014

కఠోపనిషత్తు

జాజి శర్మ

3. కఠోపనిషత్తు
కఠోపనిషత్తు ఏ వేదానికి చెందినది?
కఠోపనిషత్తు కృష్ణయజుర్వేదానికి చెందినది.
కఠోపనిషత్తు అనే పేరు ఎందుకు వచ్చింది?
కృష్ణయజుర్వేదానికి చెందిన వేదశాఖలలో ఒక వేద శాఖ పేరు 'కఠ'. ఆ కఠ శాఖకు చెందిన బ్రాహాణములో లభిస్తున్న ఉపనిషత్తు గనుక దీనికి కఠోపనిషత్తు అనే పేరు వచ్చింది.
కఠోపనిషత్తు లోని మంత్రాలు ఏ విధంగా విస్తరించి ఉన్నాయి?
కఠోపనిషత్తులోని మంత్రాలు 2 అధ్యాయాలలొ, ఒక్కొక్క అధ్యాయంలో 3 విస్తరించి ఉన్నాయి.
ఈ ఉపనిషత్తులోని ప్రధాన పాత్రధారులెవరు?
నచికేతుడు, యమధర్మ రాజు ప్రధాన పాత్రధారులు.
కఠోపనిషత్తు లోని ప్రధాన ప్రశ్న ఏమిటి? దాని ద్వారా ఈ ఉపనిషత్తు అందించిన విషయమేమిటి?
నచికేతుడనే స్నాతకుడు యముణ్ణి 'మనిషి మరణించిన తరువాత ఏమీ మిగలదని కొందరు, మిగులుతుందని మరి కొందరు అంటారు; ఇందులో ఏది నిజమో నాకు ఉపదేశించండి' అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నతో ప్రారంభం అయిన ఉపనిషత్తు సత్య స్వరూపాన్ని అద్భుతంగా ఆవిష్కరించి, దాన్ని దర్శించేటట్టు చేసే సాధన క్రమాన్ని కూడా వివరించింది.
ప్రేయోమార్గం, శ్రేయోమార్గం అంటే ఏమిటి?
భౌతిక స్థాయిలో సుఖంగా జీవించడం 'ప్రేయోమార్గం' అని, జీవిత సాఫల్యానికి (మోక్షానికి) కృషి చెయ్యడం 'శ్రేయోమార్గం' అని ఈ ఉపనిషత్తు పేర్కొంది. భోగలాలసత్వానికి పెద్ద పీట వేసే ప్రస్తుత సమాజానికి మార్గనిర్దేశం చేసే విధంగా ఈ మార్గాల వివరణ జరిగింది.
ఆత్మతత్త్వాన్ని గూర్చి యమధర్మరాజు చేసిన బోధ ఏమిటి?
శాశ్వతమైనది ఆత్మేనని, అది అణువుకన్నా చిన్నదని, అతి పెద్దదానికన్నా పెద్దదని, సూర్యచంద్రాదులు కూడా దాన్ని ప్రకాశింపజేయజాలరని, అది స్వయం ప్రకాశమైనదని, జీవి శరీరంలో ఉన్నప్పుడు అంగుష్టమాత్రంగా హృదయకుహరంలో జ్యోతి వలె ఉంటూ శరీరాన్ని చైతన్య పరుస్తుందని యముడు ఆత్మస్వరూపాన్ని (అది మాటలకందనిదే అయినా) వివరించాడు. అక్కడితో ఆగలేదు.
లక్ష్య సాధన కొరకు యమధర్మరాజు ఇచ్చిన సందేశం ఏమిటి?
నైతిక విలువలను పాటిస్తూ, శ్రేయోమార్గంలో పయనిస్తూ ఉంటే ఇంద్రియ నిగ్రహం సాధ్యమవుతుంది. అప్పుడు ఇంద్రియాలను బాహ్య విషయాల నుండి మరలించి అంతర్ముఖం చేసి సాధన చేస్తే ఆత్మావలోకనం సాధ్యమవుతుంది. అయితే ఇది అంత సులభమైనది కాదు. కత్తిమీద సాము లాంటిది. అందుచేత, 'మేలుకో! ఉద్యుక్తుడవు కమ్ము! లక్ష్య సిద్ధి అయ్యే వరకు ఆగకు!' అని ప్రబోధించి యముడు ముగిస్తాడు.
మనోబుద్ద్యహంకారాల మీద, నైతిక విలువల మీద ఇంకా అనేక మౌలిక విషయాల మీద చర్చించి సదుపదేశాన్నిచ్చిన సమగ్రమైన ఉపనిషత్తు ఇది.
చివరకు మిగిలేదేమిటి?
మరణానంతరం మిగిలేది ఆత్మ అని ఈ విధంగా ఉపనిషత్తు వివరించింది.
యేయం ప్రేతే విచికిత్సా మనుష్యే
అస్తీత్యేకే నాయమస్తీతి చైకే
ఏతద్విద్యామనుశిష్టస్త్వయాహం
వరాణామేష వరస్త్రుతీయః (1.1.20)
"మనిషి మరణించిన తరువాత 'జీవి' ఉంటాడని కొందరు, ఉండడని కొందరు అంటారు. ఏది నిజమో నీవే నాకు ఉపదేశించాలి" అని నచికేతుడనే బాల బ్రహ్మచారి, స్నాతకుడు యముణ్ణి వరంగా అడుగుతాడు. ఈ ప్రశ్నతోనే అత్యాసక్తికరమైన విషయ వివేచనకు ఈ ఉపనిషత్తు తెరలేపుతుంది.
ఈ ప్రశ్నకు ఇప్పటికి కూడా అందరికి ఆమోదయోగ్యమైన సమాధానం దొరకలేదు. చార్వాకుని వారసులైన ఆధునిక హేతువాదులు మరణించిన వ్యక్తిని దహనం చేసిన తరువాత బూడిద మిగుల్తుంది తప్ప జీవుడనే వాడు లేడంటారు. తద్విరుద్ధంగా, వేదాంతం శరీరం నశ్వరమైనదని, శరీరి అంటే ఆత్మ శాశ్వతమైనదని, శిథిలమైన శరీరం వదలి సంచిత కర్మానుభావానికి వేరొక శరీరంలోకి ప్రవేశిస్తుందని అంటారు. కొంచెం ఇంచుమించుగా ఈ వాదాన్ని అన్ని మతాలూ అంగీకరిస్తున్నాయి.
భోగాల స్వభావం ఏమిటి?
భోగములు అశాశ్వతం అని ఉపనిషత్తు వర్ణించింది.
శ్వోభావా మర్త్యస్య యదంత కైతత్
సర్వేంద్రియాణాం జరయంతి తేజః
(నీవు ఇస్తానన్న) భోగాలు శాశ్వతము కాదు. మరుసటి రోజునే నశించవచ్చు. అంతేకాక ఇవన్నీ ఇంద్రియాల సత్తువను నాశనం చేస్తాయి. నచికేతుని ద్వారా ఈ ఉపనిషత్తు భోగలాలసత్వాన్ని నిరసించింది.
సంపదలతో తృప్తి లభిస్తుందా?
సంపదలతో తృప్తి లభించదని ఉపనిషత్తు ఈ విధంగా వివరించింది.
న విత్తేన తర్పణీయో మనుష్యో
లప్స్యామహే విత్త మద్రాక్ష్మ చేత్వా! (1.1.27)
ఆత్మతత్త్వాన్ని గూర్చిన విచారణ విరమిమ్చుకుంటే అనేక సంపదలు, భోగ్య వస్తువులు ఇస్తానని యమధర్మరాజు నచికేతుణ్ణి మభ్య పెడతాడు. దానికి సమాధానంగా నచికేతుడు "సంపదతో మానవుడికి తృప్తికలుగదు. ఒక సంపద సమకూరితే మరొక సంపద కావాలనిపిస్తుంది. నీ దర్శనం సకల సంపదలూ కలుగజేసేదే కనుక నాకు సంపదల మీద ఆశలేదు" అని తన నిశ్చితాభిప్రాయాన్ని తెలియజేస్తాడు.
గమ్యాన్ని చేర్చే మార్గాలేమిటి?
శ్రేయోమార్గం - ప్రేయో మార్గం అనే రెండు మార్గాలను ఉపనిషత్తు వివరించింది.
శ్రేయస్చ ప్రేయస్చ మనుష్యమేతః
తౌ సంపరీత్య వివినక్తి ధీరః (1.2.2)
జీవన యానంలో మానవుని ముందు రెండు మార్గాలున్నాయి. మొదటిది శ్రేయోమార్గం - ఇది జ్ఞాన సముపార్జన ద్వారా శ్రేయస్సు వైపుకు నడిపించి శాశ్వతానందాన్ని, పరిపూర్ణతను చేకూరుస్తుంది. రెండవది ప్రేయో మార్గం - ఇది ప్రియం కలుగజేసేది. కర్మానుష్టానం ద్వారా కొంత అభ్యుదయం కలిగించినా అది అశాశ్వతము, దుఃఖ హేతువు అవుతుంది.
ఈ రెండు మార్గాల గుణ దోషాలను వివేచనాత్మకంగా పరిశీలించి వివేకవంతులు శ్రేయోమార్గాన్ని, మంద బుద్ధులు ప్రేయో మార్గాన్ని ఎంచుకుంటారు.
అజ్ఞానుల లక్షణం ఏమిటి?
ఆత్మ ప్రశంసకు పాల్పడడం అజ్ఞానుల లక్షణం.
అవిద్యయామన్తరే వర్తమానాః
స్వయం ధీరాః పండితంమన్యమానాః (1.2.5)
అవిద్యారూపమైన ప్రేయోమార్గాన్ని ఎంచుకున్న అజ్ఞానులు తామే ప్రజ్ఞావంతులమని ఆత్మ ప్రశంసకు పాల్పడతారు. వారి జీవితం ఒక గ్రుడ్డివాడిని మరొక గ్రుడ్డివాడు నడిపించినట్టుంటుంది.
'ఆత్మ విద్య' ఎలా లభిస్తుంది?
ఆత్మ విద్య తర్కానికి అతీతం గనుక గురువు అనుగ్రహంతోనే లభిస్తుంది.
నైషా తర్కేణ మతిరాపనేయా (1.2.9)
ఆత్మ విద్య తర్కంతో పొందరానిది. బ్రహ్మ సాక్షాత్కారం పొందిన గురువు మాత్రమే ఉపదేశించగలడు.
ఆత్మ యొక్క ప్రధాన లక్షణం ఏమిటి?
నాశం లేకపోవడం ఆత్మా యొక్క ప్రధాన లక్షణం.
న హన్యతే హన్యమానే శరీరే (1.2.18)
శరీరం నశ్వరం. ఆత్మ శాశ్వతం, శరీరం హతమైనా ఆత్మ హతం కాదు.
ఉపనిషత్తు ఆత్మను ఎలా వర్ణించింది?
చాలా చిన్న దాని కంటే చిన్నది - చాలా పెద్ద దాని కంటే పెద్దది - అని వర్ణిస్తుంది.
అణోరణీయాన్మహతో మహీయాన్ (1.2.20) - అని వర్ణించింది. ఆత్మ సర్వవ్యాపకమైన తత్త్వం అని దీని అర్థం.
వేదాధ్యయనం తో ఆత్మ లభిస్తుందా?
వేదాధ్యయనంతో ఆత్మ లభించదు.
నాయమాత్మా ప్రవచనేన లభ్యో
న మేధయా న బహూనా శ్రుతేన (1.2.23)
వేదాధ్యయనం వలన గాని, వేదాంత గ్రంథ పఠనం వలన గాని ఆత్మ లభించదు. సాధన ద్వారా మాత్రమే లభిస్తుంది.
ఆత్మను, శరీరాన్ని, ఇంద్రియాలను ఉపనిషత్తు వేటితో పోల్చింది?
రథం యొక్క ఉపమానంతో ఈ క్రింది విధంగా వర్ణిస్తుంది.
ఆత్మానం రథినం విద్ధి, శరీరం రథమేవ తు
బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ
ఇన్ద్రియాణి హయానాహుర్విషయాంస్తేషు గోచరాన్
ఆత్మేన్ద్రియమనోయుక్తమ్ భోక్తేత్యాహుర్మనీశిణః (1.3.3,4)
ఆత్మ రథికుడని తెలుసుకో. శరీరం రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గాలు, ఇంద్రియాలు గుర్రాలు, ఆ గుర్రాలు విషయాల వైపుకు పరుగులు తీస్తాయి. ఇటువంటి శరీరేంద్రియ మనస్సులతో కూడిన జీవుడు భోక్త అని పెద్దలు అంటారు.
శరీరస్థుడైన ఆత్మ మనోబుద్దుల ద్వారా ఇంద్రియాలను నియంత్రించి, అవి విషయాల వైపుకు వెళ్ళకుండా చూచుకుంటేనే గమ్యం చేరతామని - అంటే ఆ విధంగా జాగ్రత్త పడినప్పుడే ఇంద్రియాలను అంతర్ముఖం చేసి ఆత్మవైపుకు మరలించడం సాధ్యం అని ఈ ఉపనిషత్తు చెబుతోంది! వేదాంత ప్రవచనాలలో తరచుగా ఉదాహరించే మంత్రం ఇది.
మానవునిలోని స్థూల, సూక్ష్మాలు ఏవి?
ఇంద్రియాలు స్థూలం, ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మం. స్థూలం నుండి సూక్ష్మాతి సూక్ష్మానికి ఆరోహణ క్రమం ఈ ఉపనిషత్తు ఇలా హృద్యంగా వర్ణించింది.
ఇంద్రియేభ్యః పరాహ్యర్థా అర్థేభ్యశ్చ పరం మనః
మనసస్తు పరా బుద్ధిః బుద్ధే రాత్మా మహాన్ పరః (1.3.10)
ఇంద్రియాల కంటే వాటికి గోచరించే పదార్థాలు ఉత్కృష్టమైనవి; వీటికంటే మనస్సు, దాని కంటే బుద్ధి, దాని కంటే ఆత్మ సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమ మైనవి; ఒక దాని కంటే ఒకటి ఉత్కృష్టమైనవి.
అలాగే మహాత్తత్త్వం కంటే (మొదట వ్యక్తమైన హిరణ్య గర్భుని కంటే) అవ్యక్తం (భీజరూపంలో నున్న అవ్యక్త విశ్వం) అంటే ప్రక్రుతి (Matter) ఉత్కృష్టమైనది, దాని కంటే పురుషుడు, అంటే ఆత్మ ఉత్కృష్టమైనది. దాని కంటే ఉత్కృష్టమైనది ఇంకేదీ లేదని ఉపనిషత్తు ఈ విధంగా వర్ణించింది.
మహతః పరమవ్యక్తం, అవ్యక్తాత్ పురుషః పరః
పురుషాన్న పరం కించిత్ సా కాష్ఠా సా పరా గతిః (1.3.11)
లక్ష్య సాధన విషయంలో ఏమి బోధించింది?
ప్రతి మానవునకు ఒక లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్యసాధనకు అలుపెరగని ప్రయత్నంతో ముందుకు సాగాలి. ఆ లక్ష్యం ఆత్మావలోకనమే, అయితే అది కత్తి మీద సాము వంటిది అని పెద్దలు చెప్తారు. అందుచేత మానవులారా! అవిద్య నుండి మేల్కొనండి, లేచి ఎన్ని కష్టాలెదురైనా, మహానుభావుల శిక్షణలో లక్ష్య సాధన చేసేటంత వరకు ఆగవద్దు. ముందుకు పదండి అని ఈ ఉపనిషత్తు ఈ మాదిరిగా ఎలుగెత్తి ఉత్తేజ పరుస్తుంది.
ఉత్తిష్ఠత! జాగ్రత! ప్రాప్య వరాన్నిబోధత!
క్షురస్య ధారా నిశితా దురత్యయా
దుర్గం పథస్తత్కవయో వదంతి
'Arise! Awake! And stop not till the goal is reached' అని వివేకానంద స్వామి ఈ మంత్రం వల్ల ప్రభావితమై విశ్వమానవ లోకానికి ఎలుగెత్తి ప్రవచించాడు.
ఆత్మకు ప్రకృతి లక్షణాలు ఉంటాయా?
ఆత్మకు ప్రకృతి లక్షణాలైన రూప రస గంధాలుండవని ఉపనిషత్తు ఈ విధంగా వివరించింది .
ఆశబ్దమస్పర్శమరూపమవ్యయం
తథా 2 రసం నిత్యం, అగన్ధవచ్చయత్ (1.3.15)
ఆత్మకు రూప, రస గంధాలు గాని, శబ్ద స్పర్శలు గాని ఉండవు. అది శాశ్వతమైనది.
అంతరాత్మను దర్శించడానికి ఏమి చెయ్యాలి?
ఇంద్రియాలను అంతర్ముఖం చెయ్యాలి.
పరాంఛి ఖాని వ్యయత్రుణత్స్వయంభూః
తస్మాత్పరాజ్ పశ్యతి నాంతరాత్మన్
కశ్చిద్దీరః ప్రత్యగాత్మానమైక్ష
దావృత్తచక్షురమృతత్వమిచ్చన్ (2.1.1)
ఇంద్రియాలను బాహ్య ప్రపంచంలో ప్రవర్తించే విధంగా భగవంతుడు సృష్టించాడు. అందువలన అవి అంతరాత్మను చూడలేక పోతున్నాయి. ధీరుడైన వాడు వాటిని నియంత్రించి అంతర్ముఖం చేసి అంతరాత్మను దర్శించుకుంటున్నాడు.
ఆత్మ పరిమాణం ఎంత?
పురుషుడు (ఆత్మ) అంగుష్ఠ మాత్రుడు.
అంగుష్ఠమాత్రః పురుషో మధ్య ఆత్మని తిష్ఠతి (2.1.12)
ఆత్మా బొతనవ్రేలన్త పరిమానమ్తో శరీర మధ్యంలో ఉంటుంది. అంటే కాకుండా 'జ్యోతిరివ అధూమకః' పొగలేని జ్యోతిలాగ వెలుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రస్తావించినది జీవాత్మ (embodied soul).
ఉపనిషత్తు శరీరాన్ని దేనితో పోల్చింది?
పదకొండు ద్వారాలు గల కోట వంటిది శరీరం అని ఈ విధంగా వర్ణించింది ఉపనిషత్తు.
పురమేకాదశ ద్వారం, అజస్యావక్రచేతసః
అనుష్ఠాయ న శోచతి విముక్తశ్చ విముచ్యతే (2.2.1)
శరీరానికి పదకొండు ద్వారాలున్నాయి. ఇది కూడా ఒక కోట లాంటిదే. కోటలో రాజుగారిని దర్శించడానికి ఎంత ప్రయత్నం చేస్తారో, ఎంత తహతహ లాడుతారో అలాగే శరీరంలో అంతర్నిహితంగా ఉన్న ఆత్మను పొందడానికి కూడా అంతే ప్రయత్నం, ఆసక్తి ఉండాలని, ధ్యానం చేసి ఆత్మను తెలుసుకున్న వానికి పునర్జన్మ ఉండదని, వర్ణనా రూపకంగా వివరిస్తుంది ఉపనిషత్తు.
నేత్రాలు రెండు, కర్ణేంద్రియాలు రెండు, ముక్కు రంధ్రాలు రెండు, నోరు, నడినెత్తిన గల బ్రహ్మ రంధ్రం, నాభి, మల మూత్ర విసర్జన ద్వారాలు రెండు - మొత్తం పదకొండు ద్వారాలు శరీరానికున్నాయి. మరణ సమయంలో ఈ ద్వారాల్లో దేని నుండైనా ఆత్మ నిష్క్రమించవచ్చును. అయితే బ్రహ్మరంధ్రం గుండా నిష్క్రమిస్తే ముక్తి లభిస్తుందని అంటారు.
ఏది నిష్క్రమిస్తే మరణం సంభవిస్తుంది?
ప్రాణం పోవడం వల్ల మరణం సంభవించదు. ఆత్మ నిష్క్రమిస్తే మరణం సంభవిస్తుంది.
న ప్రాణేన నాపానేన మర్త్యో జీవతి కశ్చన
ఇతరేణ తు జీవంతి యస్మి న్నేతావుపాశ్రితౌ (2.1.5)
ప్రాణాపానాదులకు కూడా ఆశ్రయమైనది ఆత్మ. దాని ప్రభావం వల్లే ప్రాణ వాయువు మొదలైనవి పనిచేస్తున్నాయి. ఆత్మ నిష్క్రమిస్తే మరణం సంభవిస్తుంది. మనిషి జీవించేది ఆత్మ వలన కాని ప్రాణాపానాదుల వలన కాదు, వాటి కంటే వేరైన ఆత్మ తత్త్వం ఉందని తాత్పర్యం.
అవ్యక్తాన్ని, వ్యక్తాన్ని ఉపనిషత్తు ఏ ఉపమానంతో వర్ణించింది?
వ్రేళ్ళు ఆకాశంలో, కొమ్మలు భూమిలో గల రావి చెట్టుతో పోలుస్తుంది.
ఊర్ధ్వమూలో అవాక్శాఖః
ఏషో 2 శ్వత్థః సనాతనః (2.3.1)
జనన మరణాలతో కూడుకున్న జీవితమే సంసారం. ఇది ఒక రావి చెట్టు లాంటిది. మరి దీనికి మూలం ఎక్కడ? ఆకాశంలో. అంటే అవ్యక్త పరబ్రహ్మంలో. అందుచేత సంసారానికి వేళ్ళు ఆకాశంలో ఉన్నాయని అభివర్ణించింది. అయితే ఈ సంసార జీవితం గడపటానికి కావలసిన విశ్వం క్రింద ఉంది. అంటే సంసారానికి మూలమైన పరబ్రహ్మం పైన ఉండగా, కార్య రూపమైన విశ్వం, దానిలోని మానవులు మొదలైన జీవజాలం శాఖోపశాఖలుగా వ్యాపించి ఉంటాయి. వేదాంత పరిభాషలో కారణమైన బ్రహ్మం పైన, కార్యరూపమైన జగత్తు క్రింద అని అభివర్ణించబడింది. భగవద్గీత 15వ అధ్యాయంలో మొదటి మూడు శ్లోకాలలో ఈ మంత్రం కొంచెం మార్పుతో కనిపిస్తుంది.