Wednesday 30 July 2014

ప్రశ్నోపనిషత్తు

4. ప్రశ్నోపనిషత్తు
108 ఉపనిషత్తులలొ కఠోపనిషత్తు తరువాత నాలుగవ ఉపనిషత్తు ప్రశ్నోపనిషత్తు. ఈ ఉపనిషత్తు అంతా ప్రశ్నలతో నడుస్తుంది. ఈ ఉపనిషత్తులొ 6 ప్రశ్నలు వస్తాయి. ఆదిశంకరాచార్యులు ఈ ఉపనిషత్తు కి భాష్యం వ్రాశారు. పిప్పలాదుడు అనే బ్రహ్మవేత్తను ఆరుగు మహర్షులు వచ్చి ఆరు ప్రశ్నలు వేస్తారు. మెదటి నాలుగు ప్రశ్నలు ప్రాణానికి సంబధించినది. తరువాతి ప్రశ్నలు ప్రణవానికి సంబంధించినది.
ప్రశ్నోపనిషత్తు ఏ వేదానికి సంబంధించినది?
ప్రశ్నోపనిషత్తు అథర్వణ వేదానికి సంబంధించినది.
ప్రశ్నోపనిషత్తు అనే పేరు ఎందుకు వచ్చింది?
సుకేశుడు, సత్యకాముడు, సౌర్యాయణి, కౌసల్యుడు, భార్గవుడు, కబంధి అనే వారు ఆరుగురూ ఋషులు. వారు పిప్పలాద మహర్షి నాశ్రయించి, సృష్టి క్రమాన్ని గురించి, ఇతర గురించి మూడు ప్రశ్నలు, నిత్యమైన పరమాత్మ సంబంధమైన విషయాల మీద మూడు ప్రశ్నలు వేశారు. ఈ ఆరు ప్రశ్నలకు పిప్పలాదుడిచ్చిన సమాధానములే ఈ ఉపనిషత్తులోని విషయాలు. అందుచేత దీనికి ప్రశ్నోపనిషత్తు అని పేరు వచ్చింది.
ప్రశ్నోపనిశత్తులోని మంత్రాలు ఏ విధంగా విస్తరించి ఉన్నాయి?
ప్రశ్నోపనిషత్తు లోని మంత్రాలు 6 ప్రశ్నలకు అనుబంధంగా విస్తరించి ఉన్నాయి.
ప్రశ్నోపనిషత్తు లోని ప్రధాన పాత్రధారులెవరు?
పిప్పలాద మహర్షి, సుకేశుడు, సత్యకాముడు, సౌర్యాయణి, కౌసల్యుడు, భార్గవుడు, కబంధి - ఈ ఉపనిషత్తులో ప్రధాన పాత్రధారులు.
కబంధి అను ఋషి అడిగిన ప్రశ్న ద్వారా ఈ ఉపనిషత్తు ఏమి తెలియజేస్తోంది?
మొదట కబంధి ఈ ప్రాణి కోటి ఎక్కడ నుండి వచ్చింది? అంటే సృష్టి ఎలా జరిగిందని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా పిప్పలాదుడు, ప్రజాపతి తపస్సుచేసి 'రయి', 'ప్రాణం' అనే రెండింటిని సృష్టించాడని, 'రయి' అంటే చంద్రుడు, అన్నం అని (matter); 'ప్రాణం' అంటే సూర్యుడు, అగ్ని (life force) అని, ఇందులో 'ప్రాణం' భోక్త, 'రయి' భోజ్యమని వివరించాడు. మొదటిది స్థూలం, రెండవది సూక్ష్మం. వీటి సంయోగమే సృష్టి అని తాత్పర్యం. సూర్యచంద్రులు ఉండడానికి ఆకాశాన్ని కూడా సృష్టించాడని వేరే చెప్పనక్కర లేదు కదా!
భార్గవుడు అను ఋషి అడిగిన ప్రశ్న ఏమిటి? దానికి పిప్పలాద మహర్షి చెప్పిన సమాధానం ఏమిటి?
తరువాత భార్గవుడు ఈ శరీరాన్ని చైతన్యపరచే దేవత ఎవరు? అని ప్రశ్నించాడు. దానికి పిప్పలాదుడు - ఈ శరీరం కర్మ కారణంగా పంచభూతాత్మకమై ఏర్పడుతుందని, శరీరం, ఇంద్రియాలు అన్ని జడమైనవని, వీటన్నిటిలోనూ అంతర్వాహినిగా ప్రాణం ఉండి వాటిని నడిపిస్తూ ఉందని వివరించాడు. పరమాత్మ ఉత్క్రుష్టుడని, ఆయన మొదటి సృష్టి సమిష్టి రూపమైన హిరణ్యగర్భుడు, ప్రజాపతి లేక ఈశ్వరుడు. ఆయనే ఈ వ్యష్టిరూపమైన సృష్టిని చేశాడని, ఆయన ప్రాణంగా అన్నింటిలోను ఉంటున్నాడని వివరించాడు.
అశ్వలాయనుడు అడిగిన ప్రశ్న ఏమిటి? దానికి సమాధానం ఏమిటి?
తరువాత అశ్వలాయనుడు మూడవ ప్రశ్నగా 'ప్రాణం' ఎక్కడ నుండి వచ్చింది? అది ఈ శరీరంలో ఎలా పనిచేస్తుంది? అని ప్రశ్నించాడు. దానికి పిప్పలాదుడు - పరమాత్మ ఛాయా రూపమే ప్రాణం అని, అది ప్రాణం, సమానం, అపానం, వ్యానం, ఉదానాలనే ఐదుగా విభజించుకుని శరీరంలో ఆయా స్థానాలలో ఉండి పనిచేస్తుందని శరీర విజ్ఞాన శాస్త్రాన్ని వివరించాడు.
సౌర్యాయణి అడిగిన ప్రశ్న ఏమిటి? దానికి సమాధానంగా పిప్పలాద మహర్షి ఏమిటి వివరించాడు?
నాల్గవ వాడైన సౌర్యాయణి, శరీరంలో ఏ అవయవాలు నిద్రిస్తున్నాయి? ఏవి నిరంతరం పనిచేస్తున్నాయి? స్వప్నానుభావం ఎవరిదీ? అనే ప్రశ్నలు వేస్తే పిప్పలాదుడు - జాగ్రత్ స్థితి, స్వప్న స్థితి, శుశుప్తి స్థితి అనే అవస్థాత్రయాన్ని, వాటిలోని విశేషాలను వివరించాడు.
సత్యకాముడు ప్రణవోపాసన గురించి అడిగిన ప్రశ్న ఏమిటి? దానికి పిప్పలాద మహర్షి చెప్పిన సమాధానం ఏమిటి?
జీవితాంతం నిశ్చలంగా నిర్విరామంగా ప్రనవోపాసన చేస్తె ఏ లోకాలు లభిస్తాయి? అనే ప్రశ్నను సత్యకాముడు అడిగాడు.
సత్యకాముడు వేసిన అయిదవ ప్రశ్నకు సమాధానంగా పిప్పలాదుడు ప్రణవోపాసనకు సంబంధించిన విషయాలు వివరించాడు.
ఓంకారం అనేది అకార, ఉకార, మకారాల మేళవింపు. అందులో అకారం మీద మాత్రమే దృష్టి ఉంచి ఉపాసన చేస్తే, సదాచార సంపన్నుల గృహంలో జన్మించి, లౌకిక సుఖాలు అనుభవిస్తాడు. ఓంకారంలోని ఉకారాన్ని ఉపాసన చేస్తే, చంద్రలోకం చేరి అక్కడ సుఖాలు అనుభవిస్తాడు. ఓంకారాన్ని ఉపాసించిన సాధకుడు సూర్యలోకాన్ని చేరుకొని మోక్షాన్ని పొందుతాడు.
సుకేశుడు అడిగిన ప్రశ్న ఏమిటి? దానికి సమాధానంగా పిప్పలాద మహర్షి చెప్పినదేమిటి?
తరువాత ఆరవ ప్రశ్నగా సుకేశుడు 'పదహారు కళలతో వెలుగొందే ఆ పరమపురుషుడు ఎవరు?' అని ప్రశ్నించాడు. దానికి పిప్పలాదుడు ఆ పదహారు కళలను వివరించి, అవి పరమాత్మ వ్యక్త స్వరూపమని, అశాశ్వతాలని, పరమాత్మ వీటన్నిటికి అతీతుడని చెప్పి పరమాత్మ అమృతత్వాన్ని వివరించాడు.
ఆరుగురు జిజ్ఞాసువులు సంతృప్తి చెంది, పిప్పలాద మహర్షికి నమోవాక్కాలర్పించి నిష్క్రమించారు.
ప్రాణి కోటి విస్తరణ ఎలా జరిగింది?
ప్రాణం, దానికి కావలసిన ఆహారంతో ప్రాణికోటి విస్తరణ జరిగిందని ఈ విధంగా ఉపనిషత్తు వివరించింది.
ఆదిత్యో హ వై ప్రాణో రయిరేవ చంద్రమాః
ఈ ప్రాణికోటి ఎక్కడినుండి ఉద్భవించింది? అన్న ప్రశ్నకు సమాధానంగా, ముందుగా ప్రాణ రూపమైన సూర్యుడు; ఆ ప్రాణం యొక్క కార్యకలాపానికి కావలసిన అన్నం (రయి) రూపంగా చంద్రుడు సృష్టించ బడ్డారని చెప్తుంది ఈ ఉపనిషత్తు. సృష్టి క్రమంలో మొదటి ఘట్టం ఇది. ప్రాణం, దానికి కావలసిన ఆహారం ఉంటే సృష్టి విస్తరిస్తుందని భావం.
ఉపనిషత్తు సంవత్సరాన్ని ఎలా అభివర్ణించింది?
సంవత్సరో వై ప్రజాపతిః తస్యాయనే దక్షిణం చోత్తరం చ (1.9)
సంవత్సరం అంటే ప్రజాపతే! ఆయనకు ఉత్తరాయణ, దక్షిణాయన మార్గాలుంటాయి. సూర్యచంద్రులు కాలానికి ప్రతినిధులు. చంద్రుని వృద్ధి క్షయాల వల్ల తిథులు ఏర్పడుతున్నాయి. సూర్యుని ఉదయాస్తమయాల వల్ల అహోరాత్రాలు, ఉత్తర, దక్షిణ గమనాల వల్ల అయనాలు ఏర్పడుతున్నాయి. మరి వీరిద్దరిని సృష్టించిందెవరు! ప్రజాపతి. అందుచేత సంవత్సరం అంటే ప్రజాపతే అంటుందీ ఉపనిషత్తు. ఆయనే కాలకారకుడు. భారతీయ సంప్రదాయంలో కాలం పరబ్రహ్మ స్వరూపం.
శరీరానికి ఏది ఆధారం?
శరీరానికి ఆధారం ప్రాణం అని ఉపనిషత్తు నుదివింది.
అరా ఇవ రథనాభౌ ప్రానే సర్వం ప్రతిష్ఠితం (2.6)
రథచక్రానికి నాభి ఉంటుంది. దీన్ని కుంచం అని కూడా అంటారు. ఈ నాభి మీదే చక్రం యొక్క ఆకులు ఆధారపడి చక్రాన్ని శిథిలం కాకుండా చూస్తాయి. ప్రాణం శరీరానికి నాభి వంటిది. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు, మనస్సు కూడా ప్రాణం మీదే ఆధారపడి ఉన్నాయి. ప్రాణం ఉన్నప్పుడే కదా వేదోఛ్చారణ జరిగేది.
ప్రాణం ఎక్కడ నుండి వచ్చింది?
ఆత్మ నుండి ప్రాణం వచ్చిందని ఈ ఉపనిషత్తు చెబుతోంది.
ఆత్మన ఏష ప్రాణో జాయతే (3.2)
ప్రాణం ఆత్మ నుండే జనిస్తుంది.
పునర్జన్మ దేని మీద ఆధారపడుతుంది?
యచ్చిత్తస్తేనైష ప్రాణమాయాతి, ప్రాణస్తేజసా యుక్తః
సహాత్మనా యథా సంకల్పితం లోకం నయతి (3.10)
మరణ సమయంలో ఎటువంటి ఆలోచన వస్తుందో ఆ ఆలోచనతోనే ముఖ్య ప్రాణం సూక్ష్మ శరీరంలో ప్రవేశిస్తుంది. ఆ ఆలోచనకు అనుగుణమైన జన్మ లభిస్తుంది. అందుచేత మన జీవితాన్ని సన్మార్గంలో నడుపుకోవాలి . మంచి వానికి చెడ్డ ఆలోచనలు, చెడ్డవానికి మంచి ఆలోచనలూ రావు.