Thursday 21 November 2013

 Nerella Raja Sekhar'




మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో రత్నధారణ అనాదిగా ప్రాచుర్యంలో ఉంది. రత్నధారణ అనేది పూర్వ కాలంలోనే కాదు ఇప్పుడు జాతకాల రిత్యా కూడా తప్పని సరిగా చాలా మంది ధరిస్తున్నారు. ఆయా రత్నాల కుండే దైవిక శక్తుల్ని బట్టి పూజాదికాలు నిర్వహించే వారు వెనుకట, భారతీయులే కాదు ప్రపంచ దేశాలలోని ప్రజలందరూ రత్నాలను వాటి దైవ గుణాలనూ నమ్మేవారు. ఆయుర్వేద వైద్య విధానంలో స్వర్ణ భస్మాలను, రత్న భస్మాలను తయారు చేసే విధానం వుంది. బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన డా||భట్టాచార్య హోమియో వైద్య విధానాన్ని అనుసరించి జాతి రత్నాలు ధ్వంసం కాకుండా మందులు తయారు చేసే ప్రక్రియను చేపట్టారు. రత్నాలు అతీంద్రియ కిరణ జాలాన్ని కలిగి వుంటాయని, వాటికి వున్న శక్తి అపారమని, సర్వ వ్యాపకమనీ ఆయన బుజువులతో సహా నిర్ధారణ చేసారు. ఈ జాతి రత్నాలను ఔషధాలుగా శరీరంలోపలికి తీసుకోవచ్చు, లేదా ఉంగరాలలో ధరించి వాటి శక్తి గ్రహించవచ్చు. కూర్మ పురాణం నలభై మూడవ అద్యాయంలోని విషయం ప్రకారం సూర్యుని సప్త వర్ణాల దైవ కిరణ శక్తి అన్ని గ్రహాలలో వున్నాయి. అలాంటి కిరణాలు శక్తిని గ్రహించడం జాతి రత్నాలకీ వుందని చెప్పబడింది. రత్నాలు వెలువరించే కిరణాలు రెండు రకాలు. బాహ్యంగా వెలువరించేవి, అంతర్గతంగా ప్రసరించేవి. వీటిని దివ్య కిరణాలు అంటారు. హిందూ పురాణ సంప్రదాయం ప్రకారం జాతి రత్నాలను స్వర్గలోక మణులనీ, పాతాళలోక మణులనీ, మర్త్యలోక మణులనీ పేర్కొన్నారు. పురుష గ్రహాలైన రవి, కుజ గురువుల దివ్య కిరణాలైన ఎరుపు పసుపు నీలం రంగులు వేడితత్వం కలిగి వుంటాయి. స్త్రీ గ్రహాలైన చంద్ర, బుధ, శుక్ర, శనుల కిరణాలైన ఆరంజ్‌, ఆకుపచ్చ, ఇండిగో వైలట్‌ రంగులు శీతలతత్వం కలవి. ఈలాంటి కిరణాలు ఎక్కువగా జాతి,రత్నాల్లో కావలసినన్ని వుంటాయి. అత్యంత శక్తిని కలిగి వుంటాయి. వీటిని ఆల్కాహాల్లో నానబెట్టి మందులా వాడవచ్చు. భస్మాలుగా చేసి మందుల్లో వాడవచ్చు. భారతదేశ రత్న నిపుణులు 84రకాల జాతి, ఉపజాతి రత్నాలను ఎంపిక చేసారు. వాటిల్లో కెంపు, ముత్యం, పగడం పచ్చ పుష్యరాగం వజ్రం నీలం గోమేధకం వైఢూర్యం ప్రముఖంగా పేరుగాంచాయి. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రత్నం నిర్ధేశించించబడింది. అందుకు భిన్నంగా దరించడం జరిగితే మాత్రం విపరీత పరిస్థితులు ఏర్పడటం, విపరీతాలు జరగడం చాలా మందికి అనుభవంలోనికి వచ్చిన విషయం. ప్రపంచం మొత్తంమ్మీద వివిధ వ్యాధులనూ, బాధలనూ తగ్గించడానికి ఈ రత్నాలు వాడతారనేది మాత్రం నిర్వవివాదం.