Saturday 9 November 2013

పాపాలు నశించడానికి యాగాలు చేయాలా ?

భక్తి సమాచారం
పాపాలు నశించడానికి యాగాలు చేయాలా ?

'రాజా కార్తీక మాసం గురించి, దాని మహత్యం గురించి ఎంత విన్నా తనివి తీరదు. ఈ మాసంలో శ్రీమహావిష్ణువును సహస్ర కమలాలతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరంగా నివాసముంటుంది. తులసీదళాలతో పూజించిన కాని, సహస్ర నామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యం కలుగుతుంది. ఉసిరిచెట్టు కింద సాలగ్రామముంచి పూజిస్తే కలిగే మోక్షమిం తింత కాదు. కార్తీక స్నానాలు, దీపారాధనలు చేయలేనివారు ఏ గుడికైనా వెళ్లి భక్తితో సాష్టాంగ నమస్కారం చేస్తే వారి పాపాలు నశిస్తాయి. సంపద కలిగినవారు శివకేశవుల ఆలయాలకు వెళ్లి దేవతార్చన, హోమాదులు, దానధర్మాలు చేస్తే అశ్వమేథయాగం చేసినంత ఫలం దక్కుతుంది. వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. శివాలయంలో కాని, విష్ణ్వాలయంలో కాని జండా రపతిష్టిస్తే యమకింకరులు దగ్గరకు రాలేరు. పెనుగాలికి ధూళిరాసులు ఎగిరిపోయినట్లు కోటిపాపాలైనా పటాపంచలవుతాయి. ఈ మాసంలో తులసికోట వద్ద ఆవుపేడతో అలికి వరిపిండితో శంలఖుచక్రాకారాల ముగ్గులు పెట్టి, నువ్వులు, ధాన్యము పోసి వాటిపై ప్రమిదనుంచి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేసి నైవేద్యం పెట్టి కార్తీక పురాణం చదువుతుంటే హరిహరులు సంతసించి కైవల్యం ప్రసాదిస్తారు. కార్తీక మాసంలో ఈశ్వరుడిని జిల్లేడు పూలతో అర్చిస్తే ఆయుర్‌వృద్ధి కలుగుతుంది. సాలగ్రామానికి రపతినిత్యం గంధం పట్టించి తులసిదళాలతో పూజించాలి. కార్తీక మాసంలో పూజాదులు నిర్వహించని మానవుడు మరుజన్మలో శునకమై తిండి దొరకక, ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచస్థితిలో మరణిస్తాడు. కనుక కార్తీక మాసం నెలరోజులూ పూజలు చేయలేనివారు ఒక్క సోమవారమైనా పూజ చేసి, శివకేశవులను పూజించిన మాస ఫలము కలుగుతుంది. కనుక రాజా! నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుము' అని వశిష్టుడు జనక రాజుకు చెప్పాడు.
నమ శివాభ్యాం నవ ¸°వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం
నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యం నమో నమ శంకర పార్వతీభ్యాం
కార్తీక మాసంలో చేయాల్సిన పూజల ప్రత్యేకతను ఏడవరోజు కథగా జనకుడికి చెప్పిన వశిష్టుడు ఎనిమిదవ రోజు కథను జనకుడి కోరిక మేరకు వివరించాడు.
వశిష్టుడు చెప్పినదంతా విన్న జనక రాజు 'మహానుభావా మీరు చెప్పినదంతా విన్నాను. నదీస్నానం, దీపదానం, ఫలదానం, అన్నదానం, వస్త్ర దానం వలన పుణ్యం కలుగుతుందని చెప్పారు. స్వల్ప దానాలతోనే మోక్షం లభిస్తుండగా, వేదోక్తంగా యజ్ఞయాగాదులు చేసిన కాని పాపాలు పోవని మీ వంటి మునిశ్రేష్టులు చెబుతుంటారు కదా! మీరు చెప్పినది సూక్ష్మంలో మోక్షంలా ఉన్నది. దుర్మార్గులు కొందరు సదాచారాలను పాటింపక, వర్ణసంకరులై రౌరవాది నరక హేతువులగు మహా పాపాలు చయువారు ఇంత తేలికగా మోక్షం పొందుట, వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది కనుక దీని మర్మాన్ని నాకు విపులీకరించండి' అని అడిగాడు.
దానికి వశిష్టుడు 'రాజా నీవు సహేతుకమైన ప్రశ్నే వేసినావు. నేను కూడా వేదవేదాంగాలు పఠించాను. వాటిలో కూడా సూక్ష్మ మార్గాలున్నాయి. అవి ఏమిటంటే సాత్విక, రాజస, తామసములను ధర్మములు మూడు రకాలు. సాత్వికమంటే దేశ కాల పాత్రలు మూడు సమకూడిన సమయమున సత్వమను గుణము జనించినది. ఫలమంతయును పరమేశ్వరర్పితము కావించి, మనో వాక్కాయ కర్మలతో చేసే ధర్మము. ఆ ధర్మంలో అంతటా ఆధిక్యత ఉంటుంది. సాత్విక ధర్మము సమస్త పాపాలను నావనమొనరుస్తుంది. దేవలోక, భూలోక సుఖాలను చేకూరుస్తుంది.
తామస ధర్మమంటే శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయంలో డాంబి కాచరణార్ధం చేసే ధర్మం. ఆ ధర్మం ఫలమీ యదు.
దేశకాల పాత్రము సమకూడినపుడు తెలిసి కాని, తెలియకాని ఏ స్వల్ప ధర్మం చేసినాగొప్ప ఫలం ఇస్తుంది. దీనికి ఒక ఇతిహాసమున్నది చెపుతాను. పూర్వం కన్యాకుబ్జమను నగరంలో నాలుగు వేదాలు చదివిన సత్యవ్రతుడనే విప్రుడు ఉండేవాడు. అతని భార్యపేరు హేమవతి. వారిద్దరూ అన్యోన్యంగా జీవిస్తూ అపూర్వదంపతులనే పేరు పొందారు. వారికి లేకలేక కుమారుడు పుట్టాడు. అతడికి అజామీళుడని పేరుపెట్టారు. అతడు అతి గారాబంగా పెరిగి, పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూసేవాడు. దుష్ట సహవాసాలు చేసి, బ్రాహ్మణ ధర్మాలు పాటించక సంచరించేవాడు. యవ్వనప్రాయుడైన తరువాత యజ్ఞోపవీతం తెంచివే
శాడు.న ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి, నిరంతరం ఆమెతో కామక్రీడలలో తేలియాడుతూ, మద్యం సేవిస్తూ గడపసాగాడు. ఇంటికి రావడం మానేశాడు. కులభ్రష్టుడైన అజామీళుడిని బంధువులందరూ కూడా విడిచిపెట్టారు. దానితో అతడు పక్షులను, జంతువులను వేటాడుతూ, కిరాత వృత్తిలో జీవించసాగాడు. ఒకరోజు ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టునెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోయెను. కొంతసేపు ఆమె దగ్గర కూర్చుని విలపించిన అజామీళుడు ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చెను. మరణించిన స్త్రీకి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను. ఆ బాలికకు యుక్త వయస్సు రాగానే అజామీళుడు ఆమెను కూడా చేపట్టాడు. వారిద్దరికీ ఒక కుమారుడు కలిగా డు. అతడికి నారాయణ అని పేరు పెట్టారు. ఎక్కడకు వెళ్లినా ఆ బాలుడిని వెంట తీసుకుని వెళ్లేవారు. నారాయణా నారాయణా అని పిలుస్తూ తమకు తెలియ కుండానే నారాయణుడిని స్మరించే వారు. ఇలా నారాయణుడిని స్మరిస్తే మోక్షం వస్తుందని అజామీళుడికి తెలియదు. కొంతకాలానికి అజామీళుడు శరీరపటుత్వం తగ్గి, రోగగ్రస్తుడై, మంచం పట్టి, చావునకు దగ్గరయ్యెను. ఒకనాడు భయంకరాకారంతో, పాశాది ఆయుధాలతో యమభటులు ప్రత్యక్షమయ్యారు. వారిని చూసి అజామీళుడు భయపడి కుమారునిపై ఉనన వాత్సల్యంతో నారాయణా,నారాయణా అంటూ ప్రాణాలు విడిచెను. నారాయణ శబ్దం వినగానే యమభటులు వణకసాగిరి. అదే వేళకు శ్రీమన్నారాయణుని దూతలు అక్కడకు వచ్చారు. 'యమ భటులారా! వీడు మా వాడు. మేము వీనిని వైకుంఠానికి తీసుకుపోవడానికి వచ్చాము.' అని చెప్పి అజామీళుని విమానమెక్కించి తీసుకునిపోసాగిరి. యమదూతలు 'అయ్యా! మీరెవ్వరు? వీడు అతి దుర్మార్గుడు. వీనిని నరకానికి తీసుకునిపోవుటకు మేము ఇక్కడకు వచ్చాము. కనుక వాడిని మాకు విడిచిపెట్టండి' అన్నారు.
ఇంతవరకు వశిష్టుడు కథ చెప్పి, రాజా ఇది కార్తీక మహత్యంలోని ఎనిమిదవ రోజు పారాయణమని చెప్పి ముగించాడు.