Monday 25 November 2013

'క్షీరాబ్ది ద్వాదశి'

'క్షీరాబ్ది ద్వాదశి'

కార్తీక శుద్ధ ద్వాదశిని 'క్షీరాబ్ది ద్వాదశి' అని అంటారు. పూర్వం దేవతలు - దానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథించడం ఈ రోజునే ఆరంభించారు. ఈ కారణంగానే దీనికి క్షీరాబ్ధి ద్వాదశి అనే పేరు వచ్చింది. ఇక ఈ రోజున క్షీరసాగరం చిలకబడింది కనుక దీనిని 'చిలుకు ద్వాదశి'గా .. 'మథన ద్వాదశి'గా పిలుస్తుంటారు. ఇంతటి విశేషాన్ని సంతరించుకున్న ఈ రోజున తులసి పూజ చేసే ఆచారం వుంది కనుక ఈ రోజుని 'తులసి ద్వాదశి' అని కూడా అంటూ వుంటారు.

శ్రీ మహావిష్ణువు .. లక్ష్మీదేవితో కలిసి ఈ రోజున తులసి కోటలోకి ప్రవేశిస్తాడు. అందువల్లనే ఈ రోజున తులసిని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయని చెప్పబడింది. ఇక ఈ రోజు తెల్లవారు జామునే పుణ్యస్త్రీలు తలంటు స్నానం చేయాలి. తులసికోట దగ్గర దీపం పెట్టి దాని చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఆ తరువాత పూజా మందిరం చెంత యధావిధిగా నిత్య పూజను జరపాలి. మరలా సాయంత్రం తులసి పూజ అయ్యేంత వరకూ ఉపవాసం వుండాలి.

తులసి కోట లక్ష్మీ నారాయణుల నివాసంగా వుంటుంది కనుక, దానిని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించాలి. తులసికోట చుట్టూ దీపాలను వెలిగించాలి. తులసిని లక్ష్మీనారాయణుల స్వరూపంగా భావించి పూజించాలి. భక్తి శ్రద్ధలతో తులసిని పూజించి, దీపదానాలు చేయడం వలన సమస్త దోషాలు నశిస్తాయనీ, అపమృత్యు భయాలు తొలగిపోతాయని చెప్పబడుతోంది.