Saturday 9 November 2013

కార్తీక మాసం వనసమారాధనలకు ఆవాసం...

కార్తీక మాసం వనసమారాధనలకు ఆవాసం... 

యః కార్తికే సితే వనభోజన మాచరేత్ !
సయాతి వైష్ణవం ధామ సర్వపాపై: ప్రముచ్యతే !!

కార్తీకమాసం శుక్లపక్షంలో వనభోజనం చేసినవారు పాపవిముక్తులై విష్ణుధామాన్నిపొందుతారు. జప, హోమ, పూజా, భోజన, తర్పణ ఫలాలతో- పాపీ క్షుద్ర ఛండాలాది అసౌచవంతుల పాపం తుడిచిపెట్టుకుపోతుంది. కార్తీకమాసం శుక్లపక్షంలోఅన్నిరకాల వృక్షాలతోపాటుగా ఉసిరిచెట్టు కూడా ఉన్నతోటలోనే వనభోజనం ఏర్పాటు చేసుకోవాలి.

మామూలు రోజులలో గడపదాటి వెళ్ళని వారు సైతం కార్తీకమాసంలో వనసమారాధనలో ఉత్సాహంగా పాల్గొంటారు. వనసమారాధనలో ఉసిరిగ చెట్టు నీడన సాలగ్రామ రూపంలో శ్రీహరిని పూజించి శక్తి కొలది అన్న సమారాధన చేసిన వారిని యముడు కన్నెత్తి కూడా చూడలేడని, వనభోజనం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి విష్ణుసాయుజ్యం పొందుతారని కార్తీక పురాణం బోధిస్తుంది.
ఈ భోజనాల వేళ అన్నపూర్ణాదేవి శివునికి, వ్యాసునికి చేసిన విందు; దుర్వాస, అంబరీషుల విందు; భరద్వాజ రామ విందు, శబరి రామ ఆతిధ్యం; కృష్ణ కుచేలుల స్నేహాతిధ్యం; కృష్ణ విదురుల భక్త్యాదిత్యం గుర్తు చేసుకోవడం మంగళప్రదం..