Tuesday 10 April 2012

అనన్య భక్తి" యనునది పూర్వజన్మ సంచిత సుకృతవిశేషము చేతనే లభ్యము కావలసినది. ఐనను నిట్టి భక్తి భౌతికవిషయములను విడుచుటవలనను, దుస్సంగత్యాగము వలనను అల్వడ జేసికొనవచ్చుననియు, అఖండ నామసంకీర్తనము కూడా భక్తికి దోహదకారి యనియు నారదముని మతము.

ఇక శివానంలదహరిలో " భక్తి" నిర్వచన మిట్లు కలదు :
...
"అంకోలం నిజబీజసంతతి రయస్కాంతోఫలం సూచికా
సాధ్వీ నైజపతిం లతా క్షితిరుహం సింధు స్సరిద్వల్లభం!
ప్రాప్నోతీహ యధా తధా పశుపతే: పాదారవిందద్వయం
చేతోవృత్తి రుపేత్య తిష్ఠతి సదా సా "భక్తి" రిత్యుచ్యతే!!

ఊడుగు చెట్టు క్రింద బడిన తన గింజల నాకర్షించుట ఆ చెట్టునకు సహజము. కనుక నెండిన గింజ లన్నియు చెట్టు మొదటకు వచ్చిచేరును. ఇట్లే సూదంటురాయికి సూది నాకర్షించుట సహజముగాన, సూది సూదంటురాయిని జేరును. ఇదేవిధముగా పతివ్రత తన పతిని సహజముగా వచ్చి చేరినట్లును, లత తన కండగానున్న చెట్టుమీద కెగబ్రాకినట్లును, నది సహజముగనె సముద్రుని జేరుకొని యందు సంగమించినట్లును, సహజభక్తితో పరమేశ్వరుని పాదారవిందములను జేరిన మానసికవృత్తియే "భక్తి" యనిపించుకొనును.

ఇక పరమ భక్తుడు తన పూర్వకర్మ ననుసరించి లౌకికకృత్యములందు వ్యాపృతుడయ్యును, అతని మానసికవృత్తి మాత్రము పరమేశ్వ భజనమందే లగ్నమై యుండును.

ఉదాహరణగా ఈ క్రింది పద్యములో చక్కగా వివరణ యివ్వబడినది :

"పుంఖానుపుంఖ విషయేక్షణతత్పరోపి
బ్రహ్మావలోక నధియం న జహాతి యోగీ!
సంగీత తాళలయ వాద్యవశంగతాపి
మౌళిస్థకుంభ పరిరక్షణధీ ర్నటీవ !!

తన చుట్టూ వాద్యాదుల సరభసధ్వను లెన్నియో బుద్ధి నాకర్షించి తన మనస్సును చెదర జేయుచున్ననూ, తన శిరమునందు ఘటము నిలిపి నాట్యము సేయుచున్న యుత్తమనటి తన శిరమునందున్న ఘటమునందే తన బుద్ధిని కేంద్రీకరించి నటించినట్లు బ్రహ్మజ్ఞానసంపన్నుడైన యోగి (భక్తుడు) కర్మ వశమున లౌకిక కార్యములందు వర్తించుచున్నను తన మానసమును మాత్రము పరమేశ్వర భజనమునందే లగ్నము చేయును. ఇట్టిది పరమభక్తునికి సహజసిద్ధమైనది.

 కంచి పరమాచార్యులవారనుకుంటాను- ఈ శ్లోకానికి వ్యాఖ్యానిస్తు ఇలా అన్నారు.
అంకోలం…. సార్క్ష్య ముక్తి ( దగ్గర వరకు వెళ్ళుట)
అయస్కాంతో…. సామీప్య ముక్తి
సాధ్వీ నైజ…. సాలోక్య ముక్తి
లతా క్షితి….. సారూప్య ముక్తి
సింధు స్సరిద్వల్లభం… సాయుజ్య ముక్తి
అని. (చెట్టుకి లత అల్లుకుంటే చెట్టు ఆకారాన్నే పొందుతుంది) మిగతావి ఇలానే అన్వయం.