Saturday, 15 June 2013

Uppaluri Sesha Srinivasa Rao
మొదటి జ్యోతిర్లింగం 
గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలో ఉన్న సోమనాథ లింగం. త్రేతాయుగంలో పరమ శివభక్తుడైన రావణాసురుడు ఈ క్షేత్రంలో తపస్సు చేశాడు. శివుడు మెచ్చి ప్రత్యక్షం కావడానికి తన పది తలలను నరుక్కుని సమర్పించాడు. ఆయన అనుగ్రహాన్ని పొందాడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు శ్రీసోమనాథ జ్యోతిర్లింగాన్ని ఆరాధించి సంతానాన్ని పొందాడు. ఈ లింగంలో అంతర్లీనంగా అమ్మవారు దర్శనమిస్తుంది. చంద్రకళ కనిపిస్తుంది. ఈ లింగదర్...శనం భక్తిని పెంచుతుంది.
సౌరాష్ట్రదేశే విశదేతిరమ్యే జ్యోతిర్మయీ చంద్రకళావతంసమ్
భక్తి ప్రదానాయ కృపావతీర్ణం తం
సోమనాథం శరణం ప్రపద్యే.
రెండవ జ్యోతిర్లింగం 
మన రాష్ట్రంలోని కర్నూలు జిల్లా శ్రీశైలంలో ఉంది. శ్రీశైలం భూమికి కేంద్రబిందువుగా సంకల్పం చెప్పుకుంటాం. మల్లికార్జున మహాలింగ దర్శనం, స్పర్శ పాపాలను పోగొడతాయి. శ్రీశైల శిఖరాన్ని చూస్తే పునర్జన్మ ఉండదు. చంద్రావతి అనే భక్తురాలు శ్రీపర్వతంపై తపస్సు చేసింది. పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. తాను అల్లిన మల్లెపూలదండను శిరస్సున గంగలాగ ధరించమని కోరింది. శివుడు అంగీకరించి మల్లికార్జునుడు అయినాడు. భ్రమరాంబ సమేతుడై లోకరక్షణ చేస్తున్నాడు. 
‘నమామి సంసారసముద్ర సేతుమ్’.
మూడో జ్యోతిర్లింగం
ఉజ్జయినిలో మహాకాలేశ్వరలింగంగా ప్రసిద్ధమైంది. ఈనాటి ఉజ్జయిని ప్రాచీన నామం అవంతి. మహాభక్తుడైన మార్కండేయుణ్ణి రక్షించడానికి కాలుడైన యముణ్ణి సంహరించిన శివుడు ఇక్కడ మహాకాలుడు అయినాడు. కాళిదాసాది మహాకవులు, ఆదిశంకరుల వంటి ఆచార్యులు స్వామి అనుగ్రహాన్ని పొందిన ఈ క్షేత్రం మధ్యప్రదేశ్లో ఉంది. ఈ క్షేత్రంలో స్వామి ముక్తిప్రదుడు. అకాలమృత్యువు నుండి రక్షిస్తాడు.
‘వందే మహాకాలమహాసురేశమ్’.
నాలుగో జ్యోతిర్లింగం
ఓంకారేశ్వర క్షేత్రం. మధ్యప్రదేశ్లో ఉంది. ఇది వింధ్య పర్వతశ్రేణుల్లో నర్మదా కావేరీ నదుల మధ్య ఉంది. సూర్యవంశరాజు మాంధాత అడవికి వెళ్లినప్పుడు ధూపదీపనైవేద్యాలు లేని శివలింగం కనబడింది. దానిలో నుంచి ఓంకారం వినబడుతోంది. ఆయన పెద్దలను తీసుకువచ్చి చూపించాడు. వారు ఓంకారేశ్వరుడని పేరు పెట్టారు. అన్ని మంత్రాలకు, శబ్దాలకు మూలం ఓంకారం. అది నిత్యనూతనం. ప్రణవం. ఈ క్షేత్రంలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం వల్ల ప్రవణనాద అనుసంధానంలో ఏకాగ్రత లభిస్తుంది. ‘ఓంకారమీశం శివమేక మీడే’.
అయిదో జ్యోతిర్లింగం
కేదారేశ్వరలింగం. భూమికి పదకొండువేల అయిదు వందల అడుగుల ఎత్తులో ఉన్న కేదారేశ్వరలింగం హిమాలయపర్వతంపై ఉంది. ఈ ఆలయాన్ని ద్వాపరయుగంలో పాండవులు నిర్మించారు. ఉత్తరదిక్కున ఎత్తై మంచుకొండల్లో ప్రత్యేక జ్యోతిర్లింగ క్షేత్రం ఇది. ఇక్కడ ఋషులందరూ స్వామిని దర్శిస్తూ ఉంటారు. దేవతలు, రాక్షసులు, యక్షులు, మొదలైన వారు సేవిస్తూ ఉంటారు. (మహాసర్పాలు కూడా)
‘కేదార మీశం శివమేక మీడే’.
ఆరో జ్యోతిర్లింగం
భీమశంకరం. మహారాష్ట్రంలో సహ్యాద్రిపై ఉంది. భీమానది సమీపంలో ఉండడం వల్ల భీమశంకరుడు అయినాడు. దక్షప్రజాపతి కుమార్తె దాక్షాయణిని డాకిని అంటారు. ఆమె ఇక్కడ పరమేశ్వరునికై తపస్సు చేయడం వల్ల ఈ ప్రాంతాన్ని డాకిని అని కూడా పిలుస్తారు. అలాగే డాకిని, శాకిని మొదలైన భూతప్రేత పిశాచాలు ఇక్కడ స్వామిని సేవిస్తూ ఉంటాయి. ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి వాటి భయం పోతుంది. ‘తం శంకరం భూతహితం నమామి’.
ఏడో జ్యోతిర్లింగం
కాశీవిశ్వేశ్వరుడు. సుప్రసిద్ధుడైన ఈ స్వామి వరుణ, అసి అనే రెండు నదుల సంగమం అయినా వారణాసిలో కొలువై ఉన్నాడు. అమ్మవారు విశాలాక్షిగా, అన్నపూర్ణగా భక్తులను కాపాడుతోంది. కాశి ఆనందవనం. దర్శనం వల్ల పాపాలన్నీ పోతాయి. ఆ అనాథనాథుడు విశ్వనాథుడు. ప్రళయకాలంలో ప్రపంచం మొత్తం నీటిలో మునిగినా కాశీక్షేత్రం అలాగే ఉంటుందని స్కాందపురాణం చెబుతోంది. ఇక్కడ మరణించినవారికి ముక్తి లభిస్తుంది. 
‘శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే’.
ఎనిమిదో జ్యోతిర్లింగం
త్య్రంబకేశ్వరం. ఇది మహారాష్ట్రలో గోదావరి పుట్టిన సహ్యాద్రిపై ఉంది. ఇక్కడ శివలింగంలో స్వామి మూడుకనులతో కనిపిస్తాడు. శ్రీరాముడు అరణ్యవాసంలో సీతాలక్ష్మణులతో కలిసి ఇక్కడ అయిదు మర్రి చెట్ల మధ్య పంచవటిలో నివసించాడు. పవిత్ర గోదావరీ తీరంలో కొలువైన త్య్రంబకేశ్వరుని దర్శనం వల్ల పాతకాలు అన్నీ నశిస్తాయి. 
‘తం త్య్రంబక మీశ మీడే’.
తొమ్మిదో జ్యోతిర్లింగం
వైద్యనాథేశ్వరం. మహారాష్ట్రలో ఉంది. తూర్పు, ఉత్తర దిక్కుల మధ్య హోమాగ్ని మధ్యలో గిరిజాసమేతుడై వైద్యనాథేశ్వ రుడు ఇక్కడ దర్శనమిస్తాడు. ఈ జ్యోతిర్లింగాన్ని తాకితే దీర్ఘవ్యాధులు కూడా నయమవుతాయి. క్షీరసాగర మథనంలో పుట్టిన దేవవైద్యుడు ధన్వంతరి ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడు. అందుకే ఈ స్వామి వైద్యనాథేశ్వరుడు అయ్యాడు. 
‘శ్రీవైద్యనాథం తమహం నమామి’.
పదో జ్యోతిర్లింగం
నాగేశ్వర లింగం. పడమటి సముద్రతీరాన గుజరాత్లో ద్వారకా పట్టణ సమీపంలోని దారుకావనంలో ఈ క్షేత్రం ఉంది. దారుకాసుర సంహారం చేసి లోకాలను శివుడు కాపాడిన ఘటన ఇక్కడే జరిగింది. సుప్రియుడు అనే భక్తుని ప్రార్థనతో స్వామి ఇక్కడ నాగేశ్వర లింగంగా అవతరించాడు. పడగలతో సర్పరూపంగా దర్శనమిచ్చే ఈ జ్యోతిర్లింగం ఇతర ప్రాంతాలలో సహజీవనాన్ని జీవ వైవిధ్యాన్ని ప్రబోధిస్తుంది. 
‘శ్రీనాగనాథం శరణం ప్రపద్యే’.
పదకొండో జ్యోతిర్లింగం
దక్షిణ దిక్కున ఉన్న రామేశ్వరలింగం. తామ్రపర్ణీనదీ సాగర సంగమ తీరంలో శ్రీరాముడు సాగరానికి సేతువు నిర్మించిన చోట శ్రీరామునిచే ప్రతిష్ఠింపబడిన ఈ జ్యోతిర్లింగం భరతఖండ సమగ్రతకు సమైక్యతకు ప్రతినిధి. ప్రత్యక్షసాక్షి. కాశీరామేశ్వరక్షేత్రాలు రెండిటినీ దర్శించాలి. రామేశ్వంలోని ఇసుకను కాశీగంగలో, కాశీగంగను రామేశ్వర సాగరంలో కలపాలి. శివకేశవాద్వైతానికి ఈ క్షేత్రం సంకేతం. రామేశ్వరం తీర్థయాత్రల సంపూర్ణతకు నిదర్శనం. 
‘రామేశ్వరాఖ్యం నియతం నమామి’.
పన్నెండో జ్యోతిర్లింగం
ఘృష్ణేశ్వరం. ఇది మహారాష్ట్రలో ఎల్లోరా గుహల సమీపంలో ఉంది. ఎల్లోరా పురాణనామం ఇలాపురం. ఇలాపురం భూమిపై చాలా అందమైన ప్రదేశం కావడం వల్ల పార్వతీ పరమేశ్వరులు కొంతకాలం ఇక్కడ నివసించారు. పార్వతీదేవి ఒకనాడు తన ఎడమ అరచేతిలోని కుంకుమను కుడిచేతి ఉంగరపు వేలితో చాదుతుండగా ఆ ఘర్షణతో ఒక జ్యోతి ఉద్భవించింది. మిగిలిన జ్యోతిర్లింగాలలో పరమేశ్వరుని ఆవిర్భావానికి వేరే కథలు ఉన్నాయి. ఇక్కడ మాత్రం అమ్మవారి చేతి రాపిడితో ఏర్పడిన జ్యోతి లింగరూపాన్ని ధరించింది. ఇది పార్వతీ పరమేశ్వరుల అన్యోన్యతను, దంపతుల మధ్య ఉండవలసిన అవగాహనను, ఆప్యాయతను తెలుపుతుంది. ఎదురుగా ఉన్న వేడిమినైనా, విషాన్ని అయినా తనలోకి తీసుకుని ఎదుటివారికి, తనను నమ్మిన వారికి కష్టాలను, దుఃఖాలను తొలగించడమే పరమేశ్వరతత్త్వం అనే రహస్యం పతాకస్థాయిగా ఘృష్ణేశ్వర దర్శనంతో అవగతమౌతుంది. ఘర్షణలో ఆవిర్భవించడం చేత ఈ జ్యోతిర్లింగానికి ఘృష్ణేశ్వరనామం ఏర్పడింది. 
‘ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే’.
పంచ భూతాలకు ప్రతీకలైన అయిదు మందిరాలున్నాయి. ‘త్రిచి’లోని జంబుకేశ్వర మందిరం జల తత్వానికి, కంచిలోని ఏకాంబరేశ్వర మందిరం పృథ్వి తత్వానికి, అరుణా చలంలోని అరుణా చలేశ్వరుడు అగ్ని తత్వానికి, కాళహస్తిలోని కాళహస్తీశ్వరుడు వాయు తత్వానికి ప్రతీకలు. ‘చిదంబరం’ ఆకాశ తత్వానికి ప్రతీక.