Sunday, 16 June 2013

భగవంతుని అవతారాలు ఎన్ని విధాలు ?

భగవంతుని అవతారాలు ఎన్ని విధాలు ?

అవతారాహ్య సంఖ్యాతా హరే స్సత్వ నిధేర్ద్విజాః |
యథా విదాసినః కుల్యాః సరసః స్యుః సహస్రశః ||

భక్తుల సంరక్షణకై భగవంతుడు తన సహజ స్వరూపాన్ని, స్థితిని మార్చుకొని దిగిరావడమే అవతారమంటే! ఆయా సందర్భాలలో ఆయా భక్తుల అవసరాలకి తగినట్లుగా ఆర్తిని తీర్చగలిగేట్టుగా తన వ్యూహం నుండి మనకోసం అనేక సార్లు అవతరించాడు స్వామి. శ్రీమద్భాగవతం భగవంతుని అవతారములు పది మాత్రమే కాదు అని, అవి 22 అని మూడవ అధ్యాయంలో, ఆపై అధ్యాయంలో 24 అని చెప్పి, ఆపై భగవంతుడి అవతారాలు అసంఖ్యాకములు అని తెలిపింది. నిరంతరం ప్రవహించే సరస్సు నుండి అనేక కాలువలు ఏర్పడుతున్నట్లుగానే అనంతమైన భగవత్తత్త్వము నుండి అనేకావతారములు ఆవిర్భవించుచున్నవి. అనగా భగవదవతారములు అపరిమితములు, అసంఖ్యేయములు అని తాత్పర్యం. అసలీ అవతారాలు ఎన్ని విధాలు ?

శ్రీమద్భాగవతంలో తాను నేరుగా వచ్చే అవతారములే కాక అనుప్రవేశ అవతారాన్ని చెబుతుంది. అంటే ప్రతిజీవిలోనూ భగవంతుడు తాను అనుప్రవేశించి ఉంటాడు. అలా ఉంటేనే ఆ జీవికి పేరు ఆకృతి ఏర్పడుతాయి. ఈ రూపంతోనే సురనరతిర్యక్ స్థావరాది సృష్టి అంతా జరిగింది. అలా కొందరు జీవుల ద్వారా కొన్ని కొన్ని కార్యాలు చేయిస్తుంటాడు. ఇది తెలుసుకొనిన జీవి తనని భగవంతుని పరికరమని భావించి ధర్మ సంస్థాపనాది భగవత్కార్యంలో అతిశయించి ప్రవర్తించగలుగుతారు. అట్లాంటి వారి గ్రంథాదులవలన, వారి చేష్టితముల వలన మహానుభావులని గుర్తించి దైవ స్వరూపులుగా ఆరాధిస్తున్నాం.

ఈ అవతారాలన్నింటినీ సూక్ష్మంగా ఆరు విధానాలుగా విభజించింది శ్రీగర్గ సంహిత.

1. పరిపూర్ణావతారము
2. పూర్ణావతారము
3. ఆవేశావతారము
4. కలావతారము
5. అంశావతారము
6. అంశాంశావతారము.

అంశాంశావతారము అంటే భగవదంశలో ఏకాస్తనో కలిగి ఉండేవి. పృథివిని గోవుగా మార్చి ఆయా జీవులకి కావల్సిన వాటిని ఇవ్వగలిగేట్టు చేసిన మహాప్రభువు పృథుచక్రవర్తి, నాభి అనే మనువు యొక్క కుమారుడైన ఋషభుడు మొదలగువారు ఈ అంశాంశావతారములే.

అంశావతారం అంటే భగవానునిలో ఉండే జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సుల్లో ఏదో ఒక గుణ తీసుకొని ఏదో ఒక జీవి ద్వారా అనుప్రవేశించి కార్యాలు చేయడం. మంత్ర ద్రష్టలగు ఋషులు, ఇంద్రాది దేవతలు, ప్రజాపతులు మొదలగువారు అంశావతారములే.

కలావతారము అంటే తనలో ఉన్న కొన్ని కళలు తీసుకొని సాక్షాత్తుగ అవతరించి కార్యాలు చేయటం. ఆటంకాలు తొలగించటం కోసం క్షణంలోనే ఆవిర్భవించే అవతారం కలావతారం. మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన అవతారాలన్నీ కలావతారాలే.

ఆవేశావతారం అంటే స్వరూపాన్ని లేదా శక్తిని ఆవహింపజేసి ఒక జీవుని ద్వారా కార్యాన్ని నెరవేర్చడం. దుష్ట క్షత్రియులని ఏరిపారేయటానికి ఏర్పడిన పరశురామ అవతారం, వేదములని, వైదిక ధర్మాలను గ్రంథ రూపంలో భావితరాలకి అందించడానికి వ్యాస నారదాది ఋషులలో తన శక్తిని ఆవహింపజేసి ఆ పని పూర్తి అవగానే శక్తిని ఉపసంహరించుకున్నవి అన్నీ అవేశావతారాలే. బలరామ, కపిల అవతారాలు ఈ కోవలోకే వస్తాయి.

పూర్ణావతారము అంటే మానవునిగా ఉండటానికి అవసరమైన రసాలన్నింటినీ పోషించి కార్యాలు నెరవేర్చేది. నవరసభరితమైన శ్రీరామావతారము పూర్ణావతారము, ఇది సాక్షాత్తు భగవంతుడే అవతరించి లోక రక్షణ కావించిన అవతారం.

పరిపూర్ణావతారము పై అవతారాల లక్షణములే కాక భగవదసాధారణమైన జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులనే షడ్గుణ్య పూర్తి కలిగి ఉండేది. ఆయా సందర్భాల్లో ఆయా గుణములని ప్రకటించిన శ్రీకృష్ణావతారం పరిపూర్ణావతారం. షడ్గుణ్య పూర్తితో పాటు సౌలభ్య శౌశీల్య వాత్సల్యాది గుణములని పుండరీకాక్షత్వము మొదలైన దివ్య మంగళ విగ్రహ గుణములు పరిపూర్ణముగా ప్రకాశించిన అవతారమిది.