Thursday 6 June 2013

ఆత్మ-పరమాత్మ కలుస్తాయా?

భక్తి సమాచారం
ఆత్మ-పరమాత్మ కలుస్తాయా?

నిద్రపోతున్నపుడు మన ఆత్మ పరమాత్మతో కలుస్తుందని మన వేదాంత శాస్త్రాలు పేర్కొంటున్నాయి. కానీ, నిజంగానే ఈ రెండు ఒక్కటిగా కలుస్తాయా అనే ధర్మ సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. నిజంగానే ఈ రెండు కలుస్తాయట. ఇదెలాగంటారా... అయితే ఈ కథనం చదవండి.

సాధారణంగా మన శరీరాల్లో ఐదు కోశాలుంటాయని వేదాంత శాస్త్రం చెపుతోంది. అన్నమయ కోశం, మనోమయ కోశం, ప్రాణమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఇవి పొరపొరలుగా ఉంటాయి. అన్నింటికన్నా పై పొర అన్నమయ కోశం. అన్నిటికన్నా లోపలి పొర ఆనందమయ కోశం. ఒక దానిలో ఒకటి ఇమిడిపోయే లక్క పిడతల్లాగా ఉంటాయట.

వీటిలో నాలుగోది విజ్ఞానమయ కోశం. అంటే ఆత్మ. ఐదోది ఆనందమయ కోశం. అంటే పరమాత్మ. ఇందులో ముందు మూడు కోశాలు దేహం, మనస్సు, ప్రాణం అంటారు. అంటే దేహం, మనస్సు, ప్రాణం, ఆత్మ , పరమాత్మ వరుసలో ఉంటాయి. దీనికితోడు ఇంద్రియాలన్నింటినీ కలిగి వుండేదే దేహం. నాలుగో తొడుగు అయిన ఆత్మ మనం మెలకువగా ఉన్నపుడు దేహం, మనస్సుల వైపు అంటే విషయాల వైపు తిరిగి ఉంటుందట.

అదే గాఢ నిద్రలో ఉన్నపుడు దేహం, ఇంద్రియాలు, మనస్సు విశ్రాంతి తీసుకుంటాయి. ఆ సమయంలో ఆత్మ పరమాత్మ వైపు అంటే విజ్ఞానమయ కోశం అయనందున ఆనందమయ కోశానికి అభిముఖం అవుతుంది. మన రెండు అరచేతులు కలిపి నమస్కరించినట్టన్నమాట. అదే ఆత్మ పరమాత్మను కలత లేని, నిలకడ గల గాఢ సుఘుప్తిలో చేరుకోవడం. అంటే ఆత్మ పరమాత్మలు గాఢ నిద్రలో కలుస్తాయన్నటమాట.