Monday, 21 October 2013

దత్తావతార పరంపర

దత్తావతార పరంపర
Suneel Kumar Kota

శ్రీ విఘ్నేశ్వరాయ నమః శ్రీ వాణ్యై నమః శ్రీగురుభ్యోనమః

5.శ్రీ శిరిడీ సాయిబాబా అవతారం :
--------------------------------------

శ్రీమతి మేనేజర్ అనే పార్శీ భక్తురాలు సాయి గురించి చెప్తూ :
---------------------------------------------------------
నేనెందరినో ప్రఖ్యాత మహాత్ములను దర్శించాను, వారప్పుడప్పుడూ ఉత్తమ ధ్యానస్థితిలోకి వెళ్లి తిరిగి మామూలు స్థితిలోకి వచ్చాక భక్తుల హృదయాల్లోని సంశయాలకు సమాధానం చెప్పేవారు. కాని సాయికట్టి అవసరంలేదు, అదే ఆయనలోని ప్రత్యేకత. ప్రతి క్షణమూ అయన చైతన్యం రెండు స్థాయిలలో పనిచేసేది. ఒక స్థాయిలో శిరిడీలో సాయిగా వ్యవహరిస్తూ వాటి లౌకిక,పారలౌకిక వ్యవహారాలు చక్కదిద్దేవారు, మరొక స్థాయిలో అహంకార భేదాన్నతిక్రమించిన విశ్వాత్మస్థితిని అనుభవించేవారు. ఈ రెండు స్థితులకు సంబంధించిన చిహ్నాలు, సిద్ధులు ఆయనలో ప్రకటమయ్యేవి. ఆయన చూపులో ప్రకటమయ్యే శక్తికీ, తీవ్రతకూ తట్టుకోలేక భక్తులు తమ కళ్లను దించుకోవల్సి వచ్చేది. భక్తుని హృదయంలోని భావాన్ని ఆయన చదువుతున్నట్టుండేది. సాయి తమ హృదయంలోనేగాక, తమ శరీరంలో అణువణువునా వున్నట్లు భక్తులకు అనుభవయ్యేది. ఆయన మాట్లాడే కొద్ది మాటల్లో, ప్రతి చర్యలో భూత,భవిష్యత్తు, వర్తమానాలే కాక సర్వవిషయాలు ఆయనకు తేటతెల్లమనే విషయం ఋజువయ్యేది. సంపూర్ణ విశ్వాసంతో ఆయన్ను శరణు పొందడం తప్ప, వేరే చేయవలసిందేదీ లేదని భక్తులకు వారి సన్నిధికి రాగానే త్వరగా అర్ధమయ్యేది.

బాబాగారు తమ గురించి తాము చెప్పిన వివరాలు :
-------------------------------------------------
ఒకప్పుడు ధూలియా కోర్టులో దొంగ, తనవద్ద దొరికిన వస్తువులు తను దొంగిలించలేదని అవి సాయిబాబా తనకిచ్చారని చెప్పినప్పుడు, కోర్టువారు సాయిబాబాని విచారించారు. ఆ విచారణ ఇలా కొనసాగింది....

న్యాయవాది : మీ పేరేమిటి?
బాబాగారు : "వీరంతా నన్ను సాయిబాబా అంటారు."

న్యాయవాది : మీ తండ్రి పేరు?
బాబాగారు : "అదీ సాయిబాబానే."

న్యాయవాది : మీ గురువు పేరు?
బాబాగారు : "వెంకూసా."

న్యాయవాది : మతం?
బాబాగారు : "కబీరు."

న్యాయవాది : కులం?
బాబాగారు : "దైవం."

న్యాయవాది : మీ వయస్సు?
బాబాగారు :" లక్షల సంవత్సరాలు."

న్యాయవాది : సరిగ్గా చెప్పండి!
బాబాగారు :" నేనెప్పుడూ అబద్ధం చెప్పను."

తన చిత్రపటానికి తనకు బేధం లేదని, కుక్క, పిల్లి మొదలైన జంతువుల ఆకలి తీరితే తమ కడుపు నిండినట్లేనని- ఇలా అనుభవపూర్వకంగా భక్తులకు ఈ విశ్వమంతా తన రూపమే అని సాయి నిరూపించినంతగా మరొకరు నిరూపించలేదనే చెప్పవచ్చు. సాయి ఏ మతానికీ చెందక అన్ని మతాలకు చెందారు. సర్వ ధర్మాలకూ పరాకాష్ఠగా నిలిచారు. మతబేధం లేకుండా తననాశ్రయించిన ముముక్షువులందరికీ ఆధ్యాత్మికోన్నతి ప్రసాదించారు. అలాంటి సమర్ధ సద్గురువు శిరిడీ 1854వ సంవత్సరంలో 18 లేక 19 సంవత్సరాల బాలుడిగా కనిపించారు. వేపచెట్టు కింద తపస్సు చేసిన తర్వాత కొన్ని రోజుల ఎవరికీ కనిపించకుండా ఎటో వెళ్లారు. చాంద్పాటిల్ మేనల్లుడి పెళ్లికి రెండవసారి శిరిడీ చేరి దాదాపు 60 సంవత్సరాల పాటు తాము సమాధి చెందే వరకూ అక్కడే ఉండిపోయారు.

ప్రయాగ స్నానం :
-----------------
గంగా,యమునలు కలిసే సంగమ ప్రదేశానికి ప్రయాగ అని పేరు. ఈ సంగమంలో స్నానం చేసినట్లైతే గొప్ప పుణ్యం లభిస్తుందని తరతరాలుగా హిందువుల నమ్మకం. అందువల్ల సాయి ముఖ్యభక్తుల్లో ఒకరైన దాసగణు ఒకరోజు ప్రయాగలో సంగమస్నానానికి వెళ్లాలని నిశ్చయించుకొని బాబా అనుమతి కోరాడు. దానికి బాబా గణూ "శ్రమకోర్చి అంత దూరం పోవలసిన అవసరమేముంది, నా మాటలపై విశ్వాసముంచు - మన ప్రయాగ ఇక్కడే వుంది దోసిలి పట్టు అన్నారు." ఇంతలో అందరూ ఆశ్చర్యపోయేలా బాబాగారి రెండు పాదాల బొటన వేళ్ల మధ్య నుండి గంగా, యమున జలాలు ఉబికి వచ్చాయి. అప్పుడు దాసగణు ఆయన పాదాలపై శిరస్సు వుంచి ఆ చేతిని నీటిలోకి తీసుకుని ఒక్క క్షణం ఆలోచించి నెత్తిన జల్లుకున్నాడు. బాబా చిఱునవ్వుతో మౌనంగా చూచారు. సాయి సమాధి చెందిన తర్వాత దాసగణు మరొక యోగిని దర్శించినపుడు ఆ యోగి " మూర్ఖుడా! సాయి అంతటి మహనీయుని పాదాల నుండి వచ్చిన తీర్ధజలాన్ని, ఆయన ముస్లీమన్న సంకోచంతో శిరస్సున ధరించావేగానీ, నోటిలో పోసుకోలేదు కదా! నీకెన్ని జన్మలకైనా మరల అట్టి భాగ్యం లభిస్తుందా? అంతటి మహనీయుడు మరల దొరుకుతాడా? అని మందలించారు.

** సద్గురువు సాక్షాత్తూ భగవంతుడు, సర్వ పుణ్యతీర్ధాలూ వారి పాదాలలో వుంటాయని గురుగీత చెబుతుంది. గంగ విష్ణువు పాదాల నుండి ఉద్భవిస్తుందంటారు. సద్గురువు విష్ణుమూర్తే. గంగలాంటి పుణ్యనదులు పాపాత్ములెందరో స్నానమాచరించడం వల్ల కలుషితమౌతాయి, అట్టి పుణ్యనదులు కూడా మహనీయులు స్నానం చెయ్యడం వల్లనే తిరిగి పునీతమవుతాయి. సద్గురువే సాక్షాత్తూ భగవంతుడని తలచి సేవించాలని, సంశయాలు తగవని ఈ లీల ద్వారా తెలియజేసారు.

నీటితో దీపాలు :
---------------
సాయికి దీపారాధన అంటే చాలా ఇష్టం. శిరిడీలో నూనె వ్యాపారుల దగ్గర నూనె అడిగి తెచ్చి మసీదులో రాత్రంతా దీపాలు వెలిగించేవారు. ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత ప్రతిరోజూ నూనె ఇవ్వడం దండగని తలచిన వ్యాపారస్తులు తమలో తాము కూడా బలుక్కుని ఫకీర్‌కి నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకున్నారు. బాబా వారిని నూనె కోసం ఎప్పటిలా వెళ్లి అడగ్గా, నూనె నిండుకుందని చెప్పారు. బాబా వినయంగా భగవంతుడి నామాన్ని ఉచ్ఛరించి మౌనంగా మసీదుకు వచ్చేసారు. మసీదుకు వచ్చాక, ప్రమిదల్లో ఒత్తులు వేసారు. నూనె పోసే రేకు డబ్బాలో అడుగున మిగిలిన రెండు మూడు నూనె చుక్కలను చూచి ఆ డబ్బా నిండుగా నీరు పోసి బాగా కలియబెట్టి, ఆ నీటిని తాగేసారు. మళ్లీ ఆ రేకు డబ్బాతో 'నీరు నిండుగా తీసుకుని ప్రమిదల్లో పోసి దీపాలు వెలిగించారు'. ఈ తతంగాన్నంతా రహస్యంగా గమనిస్తున్న వ్యాపారస్తులు విస్మయం చెందేలాగా తెల్లవారి వరకూ దీపాలు వెలుగుతూనే వున్నాయి. ఫకీర్ తాము అంచనా వేసినట్టు సామాన్యుడు కాదని తలచిన వ్యాపారస్తులు భయపడి క్షమార్పణ వేడుకున్నారు. బాబా వారిని క్షమించి, ఇకపైనైనా సత్యాన్ని అంటిపెట్టుకుని వుండమని హితవు చెప్పారు.

** నిన్నెవరైనా ఏదైనా అడిగినప్పుడు ఇవ్వడం ఇష్టమైతే ఇవ్వు, ఇవ్వడం ఇష్టం లేనట్లయితే ఆ విషయం వినయంగా చెప్పు. అబద్ధం మాత్రం ఆడకు అనేది బాబాగారి సూక్తి. అబద్ధం, మొహమాటం రెంటినీ జయించమన్నది బాబా గారి ఉపదేశం. లేదు అని చెప్పేటప్పుడు బలంగా వచ్చే కోపేద్రేకాల వంటి భావోద్వేగాలని నియత్రించడం కూడా అవసరమని ఇక్కడ ఉద్దేశ్యం. సత్యం చెప్పడమనేది కూడా సాధనే.

చక్కెరలేని తేనీరు :
------------------
నానా చందోర్కర్ ఉపన్యాసాల తోనూ, దాసగణు హరికథలతోనూ ఎంతోమందిని బాబాగారికి పరిచయం చేసారు.దాసగణుగారు ఒకరోజు ఠాణాలో వున్న కౌపీనేశ్వరలాయంలో హరికథని నిర్వహించారు. ఆ కథను వినడానికి వచ్చిన వారిలో చోల్కర్ కూడా ఒకడు.అతనో కోర్టు గుమస్తా, బాగా పేదవాడు. అతడు దాసగణు కీర్తనలని అత్యంత శ్రద్ధగా వినడంతో, బాబాగారిపై అతనికి ఇష్టం ఏర్పడింది. మనసుకి దగ్గరయిన బాబాగారితో తన బాధని ఇలా చెప్పుకున్నాడు, "బాబా నేను పేదవాడ్ని, కుటుంబాన్నే పోషించుకోలేని దీనస్థితిలో వున్నాను. నీ అనుగ్రహంతో ఇప్పుడు రాయబోయే పరిక్షలో ఉత్తీర్ణత సాధించి, స్థిరమైన ఉద్యోగం లభిస్తే నేను శిరిడీ వచ్చి నీ పాదాలకి సాష్టాంగ నమస్కారం చేసి, నీ పేరున కలకండ పంచుతాను." అని మొక్కుకున్నాడు. "నీ భారములన్నీ నాపై వేసి నిశ్చింతగా వుండు" అన్న బాబాగారు తన మాట నిలబెట్టుకున్నారు.

చోల్కర్‌కి స్థిరమైన ఉద్యోగం దొరికింది. మొక్కు తీర్చుకోవాలనే ఆతృత అతనిలో ఎక్కువగావుంది, కానీ కుటుంబం పెద్దది. తను పేదవాడు ఇప్పుడొచ్చే జీతం కుటుంబాన్ని గౌరవంగా పోషించుకోడానికి మాత్రమే సరిపోతుంది. శిరిడీ యాత్ర చెయ్యడానికి కూడా డబ్బు మిగిలే అవకాశమే లేదు. మొక్కు చెల్లించాల్సిందే అనే కృతనిశ్చయంతో వుండటంతో అతను కుటుంబపోషణకయ్యే ఖర్చులో కొంత తగ్గించుకుందామనుకున్నాడు. కుటుంబపోషణకయ్యే ఖర్చులో ప్రతిదీ అవసరమయ్యేదే కాబట్టి తను రోజూ తాగే టీలో వేసే చక్కెరని త్యాగం చెస్తే ఎవరికీ ఇబ్బంది కలుగదని నిశ్చయించుకుని, ఆ రోజు నుండి చక్కెరకయ్యే ఖర్చుని దేవుడి కోసం తియ్యడం మొదలుపెట్టాడు. చాలినంత డబ్బు సమకూరిన తర్వాత శిరిడీ యాత్ర చేసి, బాబా గార్ని దర్శించి వారికి సాష్టాంగ నమస్కారం చేసి వారి పేరు మీద కలకండ పంచిపెట్టి, దేవా ఈ రోజుకి నా మనసులో వున్న కోరికలన్నీ తీరాయి, నాకెంతో తృప్తిగా వుంది అని జోగ్తో కలిసి వెళ్లడానికి సెలవు తీసుకున్నాడు. వారు బయలుదేరగానే బాబాగారు జోగ్తో - " ఒరే జోగ్, నీ అతిధికి టీ కప్పులలో విరివిగా చక్కెరవేసివ్వు" అన్నారు. ఆయన అన్న మాట అర్ధమైంది చోల్కర్ ఒక్కడికే....అది విన్న వెంటనే చోల్కర్ మనసు కరిగి బాబా పాదాలపై పడ్డాడు.

భగవంతుడి కోసం భక్తుడు ఏదైనా త్యాగం చెయ్యడమనేది మహా అరుదుగా జరుగుతుంది. త్యాగం అంటే - మనకెంతో ఇష్టమైనదాన్ని మనమెంతో ఇష్టపడ్డ వారికి అర్పించడం. మరి ఇలా అర్పిస్తున్నప్పుడు ఎదుట వ్యక్తి మన త్యాగాన్ని గుర్తిస్తున్నాడో, లేదోనన్న సంశయం ఏ మూలో వుంటుంది. ఈ సంశయం ఎక్కడ వెదికినా కనిపించని భగవంతుని గురించైతే ఇంకా ఎక్కువగా వుంటుంది. బాబా వుండేది ఎక్కడో శిరిడీలో, చోల్కరున్నది ఠాణాలో సాయి కోసం తనేంచేసాడో ఆయనకెలా తెలుస్తుంది??? అందుకే బాబా తన భక్తులకి సూటిగా ఒక విషయం చెప్పాలనుకున్నారు. నా కోసం ఎవడైతే చిన్న త్యాగం చేస్తాడో వాడ్ని నేను పెద్ద మనసుతో చూస్తూ వుంటాను అని నిరూపించడానికే ఈ లీల.

** "నా ముందర భక్తితో మీ చేతులు చాపితే, రాత్రింబవళ్లు నేను మీ వెంటే వుంటాను. నేను ఇక్కడుండి, మీరు సప్తసముద్రముల అవతల వున్నప్పటికీ, మీరు చేస్తున్న పనులన్నీ నాకు తెలుసు. ఈ ప్రపంచంలో ఏ మూలకైనా నీవెళ్లు, నేను నీ చెంతనే వుంటాను. నీ హృదయంలోనే నా నివాసస్థలం వుంది. నీ హృదయంలోనూ, సర్వజనుల హృదయాల్లోనూ నివశిస్తున్న నన్ను పూజించు. ఇది ఎవరైతే అర్ధం చేసుకుని ఆచరిస్తారో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు."

72 గంటలు :
------------
1886 వ సంవత్సరం ఒక మార్గశిర పౌర్ణమి రోజు ఉబ్బసంతో బాధపడుతూ బాబా తన భక్తుడైన మహల్సాపతితో "మహల్సా నా శరీరాన్ని మూడు రోజుల వరకూ కాపాడు. నేను తిరిగి వస్తే సరే, లేకపోతే ఎదురుగా వున్న ఆ ఖాళీ స్థలంలో ఈ శరీరాన్ని పాతిపెట్టి గుర్తుగా రెండు జండాలు పాతు" అన్నారు. ఇలా చెప్పి రాత్రి 10 గంటలకి బాబాగారు శరీరం విడిచారు. శిరిడీలో జనాలందరూ న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలంలో ఆయన శరీరాన్ని పాతిపెట్టడానికి సిద్ధమయ్యారు. గ్రామాధికారి దిక్కుతోచక పోలీసుపటేల్ ద్వారా జిల్లా కలెక్టరుకి కబురుచేసాడు.అప్పుడు కలెక్టర్ విదేశీయులమైన మేమేం చేసినా ప్రజలు ఉద్రిక్తులవుతారు, గ్రామ పెద్దలే ఎలాగో చక్కబెట్టండి. కానీ సాయి బ్రతికితే నాకు తెలియజేయండి, ఆయన్ను దర్శించుకుంటాను. క్రీస్తు తప్ప మరణించాక ఎవరూ జీవించలేదు అన్నారు. జనాలు సమాధి చెయ్యాల్సిందే అని పట్టుబట్టారు. మహల్సాపతి వారికి అడ్డుతగిలాడు. మా సాయి ఆడిన మాట తప్పడు, ఆయన మూడు రోజుల తర్వాత తిరిగి అని మొండికేసి ఆ శరీరాన్ని ఒడిలో పెట్టుకుని మూడు రోజులూ అలాగే కూర్చుండిపోయాడు. మూడు రోజుల తర్వాత అగష్టు 16,1886 తెల్లవారుఝామున 3 గంటలకు శరీరంలో కదలిక ప్రారంభమై, బాబాగారు నిద్రనుండి లేచినట్లు లేచారు.

ఈ విషయం గురించి శ్యామా బాబా గార్ని దేవా ఈ మూడు రోజులు ఎక్కడికి పోయావు, ఏమైపోయావు? మమ్మల్నెందుకు ఇంత కలతపెట్టావు అని అడిగాడు. అప్పుడు బాబా గారు " అల్లాహ్ వద్దకు వెళ్లాను, నేను తిరిగి రాదలచలేదు! కానీ అల్లాహ్ నీవు చేయవలసినదెంతో వుంది, బెంగాల్లో గదాధరుడు అనే భక్తుడు నాలో కలవాలని ఆరాటపడుతున్నాడు. కానీ అతని పుణ్యఫలం, అవతార కార్యం ఇంకా మిగిలివున్నాయి. వాటిని నీవు స్వీకరించి, అతనిని విడుదలచేసి నీ స్థలానికి నీవెళ్లు అన్నారు. నేనలానే చేసాను" అన్నారు.సాయి పునరుజ్జీవితులైనారని తెలిసిన తర్వాత ఎంతో మంది ఆయన్ను దర్శించుకున్నారు వారిలో ఆంగ్లేయుడైన కలెక్టర్ ఒకడు.

** తర్వాత విచారిస్తే బాబాగారు గదాదర్ అని చెప్పినది రామకృష్ణ పరమహంస గురించని తేలింది. బాబాగారు పునరుజ్జీవితులైన రోజే పరమహంస గారు రాత్రి 1 గంII 2 నిII లకే నిర్యాణమయ్యారని తెలిసింది. రామకృష్ణ పరమహంస గారి పూర్వనామం గదాధరుడు.

నిర్యాణం - సూచనలు :
----------------------
1916 వ సంవత్సరంలో విజయదశమి వేడుకల్లో బాబా తన సమాధి గురించి సూచన అందజేసారు. విజయదశమి రోజు ఊరు పొలిమేరకు వెళ్లి చేసే సీమోల్లంఘనము పూజ చేసి వస్తున్నారు. అందరూ మసీదు చేరుతుండగా బాబా ఉగ్రులై తమ తలకున్న రుమాలు, కఫ్నీ, లంగోటా తీసి ధునిలో పారేసి, అగ్నికణాల వంటి కళ్లతో మసీదు ముందు దిగంబరంగా నిలబడి, "మూఢులారా! ఇప్పుడు చూచి నేని హిందువునో, ముస్లీంనో తేల్చుకోండి" అని కేకలేశారు. ఆ కేకలకి అందరూ భయపడిపోయారు. చివరికి కుష్టురోగి బాబాజో ధైర్యం చేసి ఆయన మొలకి లంగోటా చుట్టి,
"బాబా, శుభమా అని సీమోల్లంఘనం జరుగుతుంటే మీరెందుకిలా భక్తులను భయపెడతారు?" అన్నాడు. సాయి సట్కా నేలకేసి కొడుతూ "అవును ఈ దినమే నా సీమోల్లంఘనం" అని కేకలేశారు. ఆ తర్వాత కొంతసేపటికి శాంతిచడంతో చావడి ఉత్సవం యధాతధంగా జరిగింది.

1918 వ సంవత్సరంలో తరచూ శిరిడీకి తరచూ వచ్చే ఉద్ధవేశ్ బువా, శ్రీ మతి చంద్రాబాయి బోర్కర్లతో ఒకరోజు సాయి ఇక నుండి మీరు శ్రమపడి తరచూ శిరిడీ రానక్కర్లేదు అన్నారు. కొన్ని రోజుల తర్వాత సాయి, బడేబాబా కుమారుడూ ఖాసింకు కోడి పలావు తినిపించి "నీవు ఔరంగాబాద్‌లో ఫకీరు షంషుద్దీన్‌మియాను 250 రూ. లతో మౌలు(సంకీర్తన) , కవ్వాలి, నియాజ్(అన్నదానం) జరిపించమను. తర్వాత ఆయన మెడలో నేనిచ్చే ఈ పూలమాల వేసి - ముస్లింల పంచాంగంలో 9వ నెలలో, 9వ రోజున అల్లాహ్ వెలిగించిన దీపం అల్లాహ్యే తీసుకుపోతారు, ఆయన దయ అలా వున్నదని చెప్పు." అన్నారు. ఖాసిం షంషుద్దీన్మియాగారి దగ్గరకెళ్లి సాయి చెప్పినట్లే చాసాడు. సాయి పంపిన సందేశం విన్న ఆయన కొన్ని క్షణాలు ఆకాశం వైపు చూచి కన్నీరు కార్చారు. దాని భావమేమిటో అక్కడున్న వారికి అర్ధం కాలేదు.

అక్టోబరు నెల ప్రవేశించింది, బాబా అంతకు కొద్ది రోజుల ముందే వాఘే అనే భక్తుని చేత రోజు ’రామ విజయం’ అనే గ్రంధం నియమంగా చదివించుకుని అతనికి కొబ్బరికాయ దక్షిణగా ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆయన గురుప్రసాదంగా భావించే ఇటుక మాధవ్ఫస్లే చేతిలోంచి జారి క్రిందపడి విరిగిపోయింది.కొద్ది సేపటికి మసీదుకు వచ్చిన సాయి విరిగిన ఇటుకని చూచి కోపించకుండా, కన్నీరు కారుస్తూ "విరిగినది ఇటుక కాదు నా ప్రారబ్ధం. ఇది నా జీవిత సహచరి, ప్రాణానికి ప్రాణం దాని సహాయంతోనే నేను ఆత్మను ధ్యానించేది. ఇప్పుడది విరిగిపోయింది. ఇక నేనెక్కువ కాలం జీవించను" అన్నారు. అక్టోబరు 3 పురందరే, దీక్షిత్ అనే భక్తులు దర్శనానికి రాగానే " నేను ముందు వెళ్తాను, మీరు వెనుక వస్తారు, నా సమాధి మాట్లాడుతుంది, నా మట్టి సమాధానం చెబుతుంది. నా నామం పలుకుతుంది." అన్నారు. ఆ మాటలెవరికీ అర్ధం కాలేదు.

నవరాత్రులు ఆరంభవుతూనే తాత్యాకు భయంకరమైన జబ్బు చేసింది. బాబాకు కూడా తీవ్రంగా జ్వరమొచ్చి, ఆయన ఆరోగ్యం రోజురోజుకీ క్షీణించసాగింది. అయినా బాబా తాత్యాకు నిత్యమూ ఊదీ పంపుతున్నారు. బూటీవాడాను పావనం చెయ్యకుండానే బాబా సమాధి అవుతారని భక్తులు భయపడ్డారు. ఒకరోజు తాత్యాను భోజనానికి మసీదుకు రమ్మని చెప్పి పిలిపించి, పాయసం తినిపించారు, అతడెంతో కష్టపడి మింగాడు. అప్పుడతని నొసటి విభూతు పెట్టి, "తాత్యా! మొదట మనిద్దరి కోసం రెండు ఊయలలు తెప్పించాను. కానీ మరల మనసు మార్చుకున్నాను, నేనొక్కడినే వెళ్తున్నాను, నువ్వింటికి వెళ్లు" అని అతన్ని పంపేశారు. ఇక్కడ ఊయల అంటే సమాధి అని అర్ధం. సాయి దృష్టిలో మృత్యువంటే తాత్కాలికమైన నిద్ర.

బాబా బాగా నీరసించడంతో, ఆయన బిక్షకి వెళ్లడం కూడా మానుకున్నారు. ఆయన ఎక్కువ కాలం మౌనంగా వుండసాగారు. ఒక రోజు కొందరు పులిని ప్రదర్శించి డబ్బు చేసుకునే ఫకీర్లు కొందరు జబ్బుగా వున్న పులిని మసీదుకు తీసుకువచ్చారు.
అదెంతో బాధతో గర్జించడం చూచిన సాయి, "పాపం దానిని అలా కట్టేశారేమి? విప్పండి దాని బాధ నేను తీరుస్తాను" అన్నారు. ఫకీర్లు ముందు భయపడ్డారుగానీ, తర్వాత గంపెడాశతో దాన్ని విప్పారు. అది మెల్లగా బండి దిగి, మసీదు మెట్లెక్కి ఆయన ఎదుటకొచ్చింది. మంత్రముగ్ధయైనట్లు కొన్ని క్షణాలు తదేకంగా ఆయన్ను చూచి, వారి చూపులకు తట్టుకోలేక కాబోలు తలదించుకుంది. బాబా పాదాలు వాసన చూచి, మూడు సార్లు తోకని నేలకు కొట్టి అక్కడే పడి ప్రాణం విడిచింది. సాయి దాని యజమానులకు 500 రూ. బహూకరించారు.

విజయదశమికి నాలుగు రోజులుందనగా సాయి నందూ మార్వాడి భార్యతో, "ద్వారకామాయిలోనూ, చావడిలోనూ వుండాలంటే నాకేమీ బాగుండలేదు. నేను బూటీవాడాకు పోతాను. అక్కడ నాకు పెద్ద పెద్దవారు సేవలు చేస్తుంటారు" అన్నారు. ఇంకో రెండు రోజులకు తాము సమాధి చెందుతామనగా బాబాగారు భక్తులతో "మీరెవరూ శోకించగూడదు" అని హెచ్చరిస్తున్నారు. ఎంతో అస్వస్థగా వున్నప్పటికీ ఆయన ఎప్పుడూ విశ్రమించలేదు. రోజంగా కూర్చునే వుండేవారు. అక్టోబరు 15, విజయదశమి రోజు తెల్లవారుఝామున బాబాగారు చాలా బలహీనంగా వున్నారు. అయినా దర్శనానికి వస్తున్న భక్తులను ఆదరిస్తూనే వున్నారు. తత్యాకు నాడి బలహీనమవుతుందని కబురు వచ్చింది. మధ్యాహ్న హారతి కాగానే భక్తులందర్నీ భోజనాలకు పంపేశారు. శ్రీమతి లక్ష్మీబాయి షిండే, బయ్యాజీ అప్పకోతే పాటిల్, బాలాషింపీ, నిమోన్కర్, శ్యామాలు మాత్రం ఆయన దగ్గరే ఉన్నారు.

అప్పుడు బాబా "నాకిక్కడ ఏమీ బాగాలేదు, ఆ దగదీవాడా(బూటీ వాడా)కి తీసుకుపొండి, అక్కడ నాకు సుఖంగా వుంటుంది" అన్నారు. ఆయన ఆసనం మీద కూర్చుని మాధవ్ఫస్లేనడిగి పాన్(తాంబూలం) తీసుకున్నారు. తర్వాత ఆయన మంచినీళ్లు తాగుతుండగా మధ్యలో మింగుడుపడక సగం నీరు బయటకు వచ్చి వారి కళ్లు అర్ధ నిమీలితాలయ్యాయి. అప్పుడాయన లక్ష్మీబాయి షిండేను పిలిచి మొదట 5. తర్వాత 4 నాణేలూ ఇచ్చి వాటిని జాగ్రత్తగా వుంచుకోమన్నారు. అబ్దుల్లాను వెంటనే రమ్మని కబురు చేస్తే అతను కాసేపాగి వస్తానని చెప్పమన్నాడు. సాయి చిన్నగా నవ్వి, తమకు మసీదులో బాగుండలేదని, బూటీవాడాకు తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి, బయ్యజీ అప్పకోతే పాటిల్ వైపు ఒరిగి కన్నుమూసారు. బాగోజీ అది గమనించి, నిమోన్కర్తో చెప్పాడు. అతడు సాయి నోట్లో కొంచెం నీరుపోసి, అది బయటకు వచ్చేయడం చూచి అందరూ పెద్దగా ఏడ్చారు. సాయి శరీరం విడిచారని వినగానే, గ్రామస్తులు, భక్తులు శోకాలు పెడుతూ మసీదు చేరారు. తన దురదృష్టానికి అబ్ధుల్ల ఎంతగానో దుఃఖించాడు. క్షణంలో శిరిడీ యావత్తూ జీవచ్ఛవమైంది. ఎప్పుడూ భయమూ, దుఃఖమూ ఎరుగని నానావల్లీ గూడా ఆ రోజు కన్నీరు తుడుచుకుంటూ కొద్దిసేఫు అక్కడ నిలబడి తర్వాత మారుతి ఆలయానికి వెళ్లిపోయాడు. అప్పటినుండి 13 రోజులపాటు, "ఓ మామా నీవు లేక నేను బ్రతుకలేను. నేనూ వచ్చేస్తాను" అని శోకాలు పెడుతూ, అన్నపానీయాలు గూడ మాని సమాధి చెందాడు!. సాయి నిర్యాణమైన కొద్ది గంటల్లోనే తాత్యా ఆరోగ్యం బాగుపడింది.

సాయిని ఏ విధంగా సమాధి చెయ్యాలనే అంశంపై ఇరు పక్షాలవారికి వివాదం జరిగింది. చివరికి సాయి సంకల్పాను సారం ఆయన శరీరాన్ని బూటీవాడాలో సమాధి చేసారు. విరిగిన ఇటుకని వెండితీగతో చుట్టి ఆయన తల కింద పెట్టారు. సమాధి చెందిన మరుసటి తెల్లవారుఝామునే దాసగణుకు స్వప్నంలో కనిపించి, "మసీదు కూలిపోయింది, నూనె వర్తకులు, ఇతర వర్తకులు నన్నెంతో వేధించారు. అందుకే ఆ చోటు విడిచిపోయాను. ఈ విషయం చెప్పడానికే వచ్చాను. నీవు త్వరగా వెళ్లి సమాధిని పూలతో కప్పు" అన్నారు. అతను వెంటనే శిష్యులతో శిరిడీ చేరి సమాధి పూజ, ఏకాహము, అన్నదానం చేసాడు. సాయి అదే రోజు ఉదయం లక్షణ్ మామా జోషికి స్వప్నంలో కనిపించి, "నేను మరణించాననుకొని ఈ రోజు జోగ్ ఆరతివ్వడానికి రాడు. నీవు వచ్చి పూజ, ఆరతి చెయ్యి" అని చెప్పారు. అతడు వెంటనే వెళ్లి సాయి దేహానికి ఆ సేవ జరిపించాడు. నాటి మధ్యాహ్నం మిగిలిన భక్తులతో కలసి జోగ్ సాయి దేహానికి పూజ, ఆరతి చేసాడు. బాబా చేతి వేళ్లు తెరిచి దక్షిణ పెట్టాడు, 21 గంII ల తర్వాత గూడ సాయి వేళ్లు బిగిసిపోకుండా, తెరిస్తే సులువుగా తెరుచుకున్నాయి.

బాబా సమాధి చెందిన మరునాటి రాత్రి గం. 12.30 ని.లకు శ్రీమతి ప్రధాన్కు ఒక కల వచ్చింది. బాబా సమాధి చెందుతుంటే చూచి, "ఆవిడ బాబా చనిపోతున్నారు! అని కేకలు పెడుతుంది. అపుడు బాబా మహాత్ములు చనిపోరు సమాధి అవుతారు" అన్నారు. మరుక్షణమే ఆయన శరీరం నిశ్చలమైంది. అందరూ దుఃఖిస్తున్నారు. తెల్లవారే సరికి సాయి మహాసమాధి చెందిన వార్త అందింది. కాలాతీతుడు, ద్వంద్వాతీతుడు ఐన ఆయనకు మరణం ఎక్కడిది?తనకు మరణం లేదని తన భక్తులకు తెలియజేయడానికే ఈ నిరూపణలిచ్చారు.