Wednesday, 2 October 2013

దత్తావతార పరంపర

Suneel Kumar Kota
దత్తావతార పరంపర

శ్రీ విఘ్నేశ్వరాయ నమః శ్రీ వాణ్యై నమః శ్రీగురుభ్యోనమః

2.శ్రీ నృసింహ సరస్వతి అవతారం :
---------------------------------------
శ్రీపాద స్వామి ఆదేశించినట్లు అంబిక శేషజీవితమంతా శివపూజలో గడిపింది. మరుజన్మలో ఆమె మహారాష్ట్రలోని కారంజా గ్రామంలో (అకోలా జిల్లా) ఒక సద్బ్రాహ్మణుని కుమార్తెగా జన్మించింది. తల్లిదండ్రులామెకు అంబ అని నామకరణం చేసారు. యుక్తవయస్సు రాగానే మాధవశర్మ అనే బ్రాహ్మణోత్తమునికిచ్చి వివాహం చేసారు.పూర్వ జన్మ సంస్కారానికి తోడు, ఈ జన్మలో భర్త సాంగత్యం వల్ల ప్రతిదినమూ సంధ్యా సమయంలో శివపూజ, భర్తతో కలిసి శనిప్రదోష పూజ, శని త్రయోదశీనాడు విశేషమైన పూజ చేసేది. ఇలా 16 సంవత్సరాలు గడిచాక అంబ గర్భవతియైంది. ఆమెకు 1376 వ సంవత్సరంలో సాక్షాత్తూ దత్తాత్రేయుల వారికి జన్మనిచ్చింది. పుట్టినబిడ్డ అందరిలా ఏడ్వలేదు సరికదా స్పష్టంగా ప్రణవం ఉచ్ఛరించాడు. ఒక శుభముహూర్తంలో అతనికి శాలగ్రామ దేవ అని నామకరణం చేసారు. కాని ఇంట్లో అందరూ అతన్ని నరహరి అని పిలుచుకొనేవారు. అంబ వద్ద పిల్లవానికి చాలినన్ని పాలులేవు తల్లి బలహీనంగా ఉండటంతో దాదినిగాని, పాడిగేదెను గాని ఏర్పాటుచెయ్యాలని దంపతులు ఆలోచిస్తుండగా, ఆ పిల్లవాడు ఒకనాడు తన తల్లి వక్షస్థలాన్ని చేతులతో స్పృశించాడు, వెంటనే ఆమెకు స్తన్యం పెల్లుబికి 32 ధారలుగా కారి నేలపైబడ్డాయి. అయన లీలల్ని తల్లి రహస్యంగా ఉంచడంతో, ప్రభువు యొక్క సంపూర్ణ దివ్యత్వం ఎవరికీ తెలియరాలేదు.

ఇలా సంవత్సరం గడిచింది, ఆ బిడ్డకి ఒక్కమాటా రాలేదు. పిల్లవాడికి ఫలాన విధంగా చేస్తే మాటలొస్తాయని ఎవరేది చెప్తే ఆ తల్లి తూ.చ తప్పక వాటన్నిటిని చేసింది.ఎవరేది అడిగినా ఓం అన్నదే ఆ పిల్లవాడి సమాధానం.తల్లిదండ్ర్లు దిగులుపడసాగారు. వారి బాధని చూడలేని ప్రభువు ఒక ఇనుపముక్కని ఇమ్మని సైగ చేసి దాన్ని తన చేతితో తాకాడు అది బంగారంగా మారింది. వారు ఆశ్చర్యచకితులవ్వగా తనకు ఉపనయనం అయ్యాక మాట్లాడుతానని సైగల ద్వారా తెలియజేసాడు. కొంతకాలం తర్వాత ఉపనయనయం జరిపించాక భవతి బిక్షాందేహి అని భిక్ష కోరి మొదటతల్లితోనే మాట్లాడాడు. క్రతువు పూర్తి అయ్యే సమయంలో తల్లి ఆయనతో నాయనా నీవిక భిక్షతోనే జీవించాలి అన్నది. అమ్మా మీ ఆఙ్ఞ ప్రకారం భిక్షువునవుతానని, సన్యాసం స్వీకరించడానికి అనుమతినివ్వమని కోరాడు. తల్లి దుఃఖితురాలవడం చూచి మరిద్దరు బిడ్డలు కలిగాక సన్యసిస్తానని తెలియజేసి. తల్లిదండ్రులకి ఇద్దరు బిడ్డలు పుట్టేవరకు వారితోనే ఉండి, వారు పుట్టిన తర్వాత తన తల్లికి పూర్వజన్మ వృత్తాంతం తెలియజేసి - తల్లి అనుమతితో సన్యసించారు.

అటు తర్వాత ఆయన పాదచారియై తీర్ధక్షేత్రాలు సందర్శిస్తూ, కాశీ చేరారు. అక్కడ తీవ్రమైన తపస్సు చేస్తుండగా ఆయనకు వృద్ధుడైన కృష్ణ సరస్వతి రోజు ఆయనకు భక్తితో నమస్కరిస్తూ, తన శిష్యులను కూడా అయనకు నమస్కరించమనేవారు. ఒకనాడు వారి శిష్యుల కోరిక మేరకే శ్రీ ఆదిశంకరుల వారు స్తాపించిన సన్యాసమార్గాన్ని పునరుద్ధరించడానికి తానే గురువైనప్పటికీ లోకులకు గురుసంప్రదాయం గొప్పతనం తెలియజేయడానికి శ్రీ కృష్ణ సరస్వతి గారి వద్ద శిష్యత్వం స్వీకరించి, గురువిచ్చిన దీక్షానామంతో శ్రీ నృసింహ సరస్వతి అయ్యారు.

నరహరిశర్మ అనుభవం :
-----------------------
శ్రీ నృసింహ సరస్వతీ స్వామి గంధర్వపురంలో నివశిస్తున్నప్పుడు ఒకరోజు నరహరిశర్మ అనే కుష్టురోగి ఆయన దర్శనానికి వచ్చాడు. అతడు స్వామికి వినయపూర్వకంగా నమస్కరించి ఇలా మనవి చేసుకున్నాడు, "స్వామి మీరు కలియుగంలో వెలసిన దత్తావతారం అని, స్మరించినంత మాత్రానే భక్తులను రక్షిస్తారని విని మిమ్మల్ని ఆశ్రయించి వచ్చాను. కుష్టు వ్యాధి రావడం వల్ల నా జీవితం దుఃఖభరితమైంది. వేదం అభ్యసించినప్పటికీ నన్నెవరు ఆదరించడం లేదు. ఈ వ్యాధి వలన అందరూ నన్ను వెలివేసారు, మాట్లాడటం లేదు సరికదా ఎవరికైన ఎదురుపడితే మొహం తిప్పుకుంటున్నారు. అందరికీ జుగుప్స గొలుపుతూ బ్రతికి ఉండటం కన్నా చచ్చిపోవడమే మేలనిపించింది. గత జన్మల పాపాలే నన్నిలా బాధిస్తున్నాయి. ఈ వ్యాధిని తొలగించుకోడానికి నేను కలవని వైద్యుడు లేడు, చెయ్యని వ్రతం లేదు, ఆశ్రయించని దేవత లేదు. దేని వలనా ప్రయోజనం కలుగక చివరికి మీ గురించి విని, ఇక్కడికి వచ్చాను. మీరే నన్నెలాగైనా ఉద్ధరించాలి. లేకపోతే మీ ఎదుటే నేను ప్రాణాలు విడుస్తాను" అని ఏడుస్తూ సాష్టాంగ నమస్కారం చేసాడు. అప్పుడు శ్రీ గురుడు అతనిని లెమ్మని చెప్పి, "విప్రుడా ! నీవు గతంలో చేసిన పాపాల వల్లే ఇప్పుడు ఈ వ్యాధి వచ్చింది. ఇది తొలగిపోవడానికి నేనొక ఉపాయం చెబుతాను. దాని వలన నువ్వు శుద్ధుడవై దివ్యమైన శరీరాన్ని పొందుతావు" అన్నారు.

ఇదే సమయంలో ఒక వ్యక్తి ఎండు కట్టెపుల్లల మోపు తీసుకుని అటుగా వెళ్తున్నాడు. శ్రీ స్వామి వారు ఆ వ్యక్తిని పిలిచి అతని మోపులో వున్న ఎండిన మేడి కట్టెనొకదాన్ని నరహరికి ఇప్పించారు. ఆ ఎండు పుల్లని చూపుతూ నాయనా "నీవు ఈ మేడి కట్టెని సంగమం దగ్గరున్న భీమేశ్వరాలయం దగ్గర నాటు. నిత్యమూ స్నానం చేసి రావి చెట్టుకు ప్రదక్షిణం చేసి, రెండు కుండలతో నీరు తెచ్చి మూడు పూటలా ఈ కట్టెకి పోస్తూ వుండు. ఈ మేడి కట్టె ఎప్పుడైతే చిగురిస్తుందో అప్పుడు నీ వ్యాధి నయం అవుతుంది, మా మాటపై దృఢ విశ్వాసం వుంచి మేము చెప్పినట్లే చేయి" అన్నారు. నరహరి స్వామి వారి పై నమ్మకముంచి ఆయన చెప్పినట్లే చేయసాగాడు. అతని దీక్షగా ఆ పని చేయడం గమనించిన వారందరూ అతన్ని చూచి నవ్వుతూ ’వెఱ్ఱి బ్రాహ్మడా ఎండిపోయిన కట్టెలెలా చిగురిస్తాయి? శ్రీ గురుడు నీ కోరిక నెరవేరదని తెలియజేయడానికే నిన్నీ పని చెయ్యమన్నారు. ఆలోచించి చూస్తే లోతైన ఈ అర్ధం స్ఫురించడం లేదా !" అంటూ అతన్ని నిరుత్సాహపరుస్తూ వున్నారు. ఇలా ఒక వారం రోజులు గడిచాయి, లోకులెంతగా నిరుత్సాహపరుస్తున్నా అతను పట్టు విడవకుండా "భువిలో అవతరించిన మహాత్ముల మాటలు నిత్య సత్యాలు, వారు సత్య సంకల్పులు వారు మాట మాత్రం చేత గొడ్డు బఱ్రె పాలు ఇచ్చింది, చనిపోయిన వారు తిరిగి బ్రతికారు అటువంటి ఆ సత్యం నా విషయంలో ఎందుకు నిరూపణకాదు !" అనే భావం కలిగి తనకప్పగించిన పనిని నియమం ప్రకారం చేస్తూనే వున్నాడు. విషయాల పట్ల అనవసరమైన ఆసక్తి కలిగిన కొందరు వ్యక్తులు అత్యుత్సాహంతో స్వామి వారి దగ్గరికి వెళ్లి "స్వామి ఆ వెఱ్రి బ్రాహ్మడు మీరు చెప్పినట్లే చేస్తున్నాడు, ఆ ఎండు కట్టెలో చిగురువేస్తున్న లక్షణాలేవీ కనిపించడంలేదు" అని చెప్పారు. అప్పుడు శ్రీ గురుడు వారితో నాయనలారా "ఈ భూ లోకంలో గురువు వాక్కు మాత్రమే ఎటువంటి వారినైనా తరింపజేయగలదు. గురువుని నమ్మిన వారికి కోరినవన్నీ సిద్ధిస్తాయి. గురువు చెప్పినట్లే సాధన చేసిన వారికి ఫలితం లభిస్తుంది. దేవత, మంత్రము, పుణ్యతీర్ధము, గురువు వీటిపట్ల ఎవరికి ఎలాంటి భావముంటుందో. వారి ప్రాప్తము కూడా అలాగే వుంటుంది. దీన్ని తెలియజేసే వృత్తాంతమొకటి చెప్తాను వినండి" అన్నారు.

పాంచాలదేశపు యువరాజు దుర్జయుడు. ఒకనాడు అతడు అరణ్యానికి వేటకు వెళ్లి అలసిపోయి దాహార్తితో బాధపడుతున్న అతనికి ఒక బోయవాడు మంచినీటి కొలను చూపించాడు. దాహం తీర్చుకుని కొలను పక్కనే వున్న శివాలయంలో విశ్రాంతి తీసుకున్నాడు. అప్పుడు బోయవాడు ఆలయం పక్కనే పడివున్న శివలింగాన్ని చూచి, "అయ్యా నాకు శివ పూజ చేసుకోవాలని కోరిక, కానీ పూజా విధి తెలియక సంశయిస్తున్నారు. దయచేసి పూజా విధానం తెలియజేస్తే మిమ్మల్ని గురుదేవులుగా భావించి శివారాధన చేసుకుంటాను" అన్నాడు. అప్పుడా రాజకుమారుడు అతనితో "ఈ లింగాన్ని తీసుకుని శుభ్రం చేసి, పూజా స్థలంలో స్థాపించు. ప్రతిరోజు స్మశానంలో బూడిద తెచ్చి శివునికి అర్పించు. నీవు తినే పదార్ధాలను ముందు ఈ లింగానికి నైవేద్యంగా అర్పించి ఆ తర్వాతే నీవు భుజించు" అన్నాడు.

ఆ బోయవాడు ఇంటికి వెళ్లి ఆ యువరాజు చెప్పిన ప్రకారమే లింగాన్ని పూజించసాగాడు. ఒకరోజు ఎంత వెదకినా చితాభస్మం దొరకలేదు. గురువు ఉపదేశించినట్లుగాక, మన ఇచ్ఛ వచ్చినట్టు చేస్తే ఫలితం వుండదు. ఆయన చెప్పినట్లు చెయ్యకపోతే ఇన్ని రోజులు చేసిన ఫలితం వ్యర్ధమైపోతుంది. గురువాఙ్ఞ మీరడం అంటే కోరి నరకాన్ని, దరిద్రాన్ని అహ్వానించడమే అని తనలో తాను మధనపడుతుండగా, అతని భార్య అతనితో ఆ రోజు శివ పూజకు కావలసిన బూడిద కోసం తన శరీరాన్ని అర్పిస్తానంటుంది. దానికి అతడు ఒప్పుకోడు, చివరికి ఆమె అతన్ని ఒప్పించి ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుని ఇంటికి నిప్పు పెట్టమంటుంది. అతడలాగే చేసి సర్వమూ భస్మమైపోయాక దానినంతా భక్తితో శివ లింగానికి అర్పించి శ్రద్ధగా పూజచేసి నైవేద్యం అర్పించి, పూజ నిర్విఘ్నంగా కొనసాగినందుకు ఎంతో సంతోషిస్తాడు. పూజ ముగిసింది కనుక ప్రసాదం స్వీకరించడానికి రమ్మని భార్యని పిలుస్తాడు. శివుని అనుగ్రహం వల్ల ఆమె పునరుజ్జీవుతురాలై వస్తుంది. దానికతడు ఆశ్చర్యపోయి ఇదంతా శివలీలని గుర్తించి శివుణ్ని స్తుతించగా శివుడు ప్రత్యక్షమయి, వారు జీవితాంతం కోటి జన్మలు శివలోకంలో నివశించేలా వరమిచ్చి అదృశ్యమవుతాడు.

అని చెప్పి శ్రీ గురుడు వారితో "గురువు ఆఙ్ఞని పాటించే వారికి సాధ్యం కానిది లేదు. పూర్ణ విశ్వాసముండి సేవిస్తే, ఎంతటి ఫలితమైనా లభిస్తుంది. ఎవరి భావానికి తగిన ఫలితం వారికి లభిస్తుంది. కనుక నరహరి సేవకు తగిన ఫలితం లభించకపోదు" అంటారు. ఆ తర్వాత స్వామి సంగమానికి వెళ్లి అక్కడ శ్రద్ధగా పూజ చేస్తున్న నరహరిని చూచి ఆనందిస్తారు. నరహరిశర్మ స్వామి వారిని చూచి నమస్కరించాడు, అప్పుడు స్వామి వారు తమ కమండలంలోని నీరు ఎండిన మేడి కట్టెపై జల్లారు. ఆ నీరు తగలగానే మేడి కట్టె చిగురించింది. సంగమానికి వచ్చిన వారందరూ చూస్తుండగానే అది పెరిగి చిన్న మేడి చెట్టైంది. అది చూచి నివ్వెరబోయి చూస్తున్న నరహరిశర్మకి కుష్టు రోగం అదృశ్యమై అతని శరీరం బంగారు ఛాయతో మెరిసిపోసాగింది. అతడు ఆనందభాశ్పాలు రాలుస్తూ శ్రీ గురుని స్తుతించాడు.

యవనరాజు కథ :
-----------------
వైఢూర్య నగరాన్ని ఒక యవనరాజు పరిపాలిస్తుండేవాడు. పూర్వజన్మ సంస్కారం వల్ల అతను పరమత సహనం కలిగి ఉండేవాడు. అతడు విఙ్ఞుడూ, శుధ్ధాత్ముడు. ఒకనాడతనికి పూర్వజన్మ కర్మ వల్లనో, దైవయోగం వల్లనో తొడమీద వ్రణం లేచింది. ఆ బాధ రోజురోజుకి ఎక్కువవడంతో ఒక సద్విప్రుణ్ని పిలిపించి ఉపాయం అడిగాడు. రాజా తీర్ధయాత్ర, దేవతారాధన, దానముల వల్ల కొన్ని పాపాలు, వ్యాధులు తొలగుతాయి. కాని అన్నిటికంటే శ్రేష్ఠమైనది సాధు దర్శనం. సాధు దర్శనం వల్ల సర్వ పాపాలు. వ్యాధులు తొలగిపోవటమే కాక, వారికి అనుగ్రహం కలిగితే భవరోగమనే అతి భయంకరరోగాన్ని పోగొట్టి ముక్తిని ప్రసాదించగలరు. కాబట్టి విదర్భ నగరానికి సమీపంలోనున్న పాపనాశ తీర్ధానికి వెళ్లి అక్కడ స్నానం చేస్తూ, దాన ధర్మాలు చెయ్యి - దాని వలన పాపం తొలగి ఉత్తమమైన వ్యాధి నివారణోపాయం అదే లభిస్తుంది అన్నాడు.

ఆ యవనరాజు ఆ విప్రుడు చెప్పిన విధంగా చేయసాగాడు, ఒకరోజు అతడు తీర్ధంలో స్నానం చేసి వస్తుండగా అతనికొక యతీశ్వరుడు కనిపించాడు. రాజు అతనికి నమస్కరించి తరుణోపాయం చెప్పమని ప్రాధేయపడగా ఋషభయోగి పింగళ అనే వేశ్య, కర్మ బ్రష్టుడైన బ్రాహ్మణుని అనుగ్రహించిన వృత్తాంతం తెలిపి - ఓ రాజా మహాత్ముల కృపాదృష్టిచేతనే ఎంతటి వ్యాధియైనా నశించగలదు.కనుక నీవు గంధర్వపురంలో వెలసిన కలియుగ దత్తప్రభువుయైన శ్రీ నృసింహ సరస్వతీ స్వామినే ఆశ్రయించు అని చెప్పారు. సరిగా అదే సమయానికి శ్రీగురుడు, ఇక్కడికి మ్లేచ్చ రాజు వస్తాడు. మేమిక్కడే ఉంటే ఇంకెందరో భక్తీ సదాచారము లేని వారొస్తారు అన్నారు. వారిలా చెప్పిన కొద్ది సమయంలోనే యవనరాజు గంధర్వపురం చేరి శ్రీగురుని గురించి వాకబు చేసి అనుష్టానానికి సంగమానికి వెళ్లారని తెలిసి, పల్లకినీ, పరివారాన్ని అక్కడే విడిచి తానొక్కడే త్వరత్వరగా సంగమానికి వెళ్లి స్వామిని దర్శించి చేతులు కట్టుకుని దూరంగా నిలబడ్డాడు.

అప్పుడు శ్రీ గురుడు ఓరి సేవకుడా! ఇన్నాళ్లకు కన్పించావేమీ? అన్నారు. ఆ మాట వినగానే అతనికి పూర్వజన్మ స్మృతి కలిగి, ఆనంద భాష్పాలు కారుస్తూ స్వామి పాదాలపైబడ్డాడు. ప్రభూ మీరు మా శ్రీపాద స్వామియే ఈ దీనుణ్ని ఇంత ఉపేక్షించారేమి. రాజ వైభోగాల భ్రమలో చిక్కి ఇన్నాళ్లు మీ పాదసేవ విడిచి మీకు దూరంగా పడివుండేలా చేసారే అన్నాడు. అప్పుడు స్వామి గంభీరవదనులై ఏమిరా, నీవు కోరుకున్నవన్నీ తనివితారా అనుభవించావా? లేక ఇంకేమైన మిగిలివున్నాయా? బాగా ఆలోచించుకొని చెప్పు అన్నారు. మీ దయవల్ల సకలైశ్వర్యాలతో రాజ్యుమేలాను, పుత్రపౌత్రులతో నా సంతతి వృద్ధిచెందింది. ఇక ఒకేఒక్క కోరిక మిగిలింది. దయతో మీరు ప్రసాదించినవి మీరొక్కసారి స్వయంగా చూడాలన్న కోరిక ఒక్కటే మిగిలింది అనగా, అతని రాజ్యంలో గోవధని నిషేధించమని చెప్పి, అతని ప్రార్ధనని మన్నించారు.

నిర్యాణం:
---------
ఎన్నో లీలలను చేసిన శ్రీ గురుడు బహుధాన్య నామ సంవత్సరం(1456)లో ఉత్తరాయణ పుణ్యకాలంలో, కుంభరాశిలోకి రవి, కన్యారాశిలోకి బృహస్పతి ప్రవేశించిన శిశిర ఋతువులో, మాఘమాసం, కృష్ణపక్షం పాడ్యమి శుక్రవారం నాడు శ్రీశైలం చేరి - అక్కడ కదళీవనంలో తమ అవతారాన్ని గుప్తపరిచారు. అక్కడ 300 ఏళ్లు తప్పసు చేసి తిరిగి స్వామి సమర్ధగా అవతరిస్తానని తెలియజేసారు.

హుమాయున్ గురువు కథ : ( పై లీల పోలివున్న కథ )
----------------------------
శిరిడీ సాయిబాబా ఒకనాడు భక్తులతో ఈ కథ చెప్పారు , "చాలకాలం క్రితం పైఠానులో నేనొక బ్రాహ్మణునితో వున్నాను. నాకు అతడే భిక్ష ఇచ్చేవాడు. ఈ రోజుల్లో అలాటివారు అరుదు, ఇప్పుడందరూ స్వార్ధపరులే. ఇప్పుడతనెక్కడున్నాడో అల్లాకే ఎరుక. నేనంతకు కొన్ని వేల సంవత్సరముల పూర్వంగూడా ఉన్నాననుకో! నేనప్పటికే వృద్ధుడుగా ప్రయాగలో చుట్టకాలుస్తూండేవాణ్ని. అక్కడ వీణ చిరుతలు ధరించి, భజన చేస్తుండే బ్రాహ్మణుడు నా వద్దకొచ్చి నమస్కరించి, ముకుంద్బ్రహ్మచారి చేస్తున్న తపస్సు త్వరలో పూర్తవుతుంది. ఓరిమి వహించమని మీరతనితో చెప్పండి, నిజంగా ఇది భగవదాఙ్ఞ. నేనొక వ్రతమాచరిస్తున్నాను కనుక ఈ పని మీరేచేయాలి అన్నారు."

నేను ముకుంద్ నివశించే మఠానికి వెళ్లాను. అది నీమ్‌గాఁవ్ అంత పెద్దది. ముకుంద్ అతని శిష్యులు నేను ముస్లీం అని తలచి, "మేమిక్కడ అనుష్టానం చేసుకుంటున్నాము, నీ రాక వల్ల ఈ మఠం అపవిత్రమైంది. మేమంతా ఆత్మాహుతి చేసుకుంటాం, ఆ పాపం నీకు సంక్రమిస్తుంది అన్నారు." నేను, "అల్లామాలిక్! అనుకొని, నేను చెప్పవలసిన మాట మనసుతోనే చెప్పి బయటకు వెళ్లాను. బజారులో ఒక యువరాజు అతని భార్య, కొద్దిమంది సేవకులు కన్పించారు. ఆ యువతికి త్రాగే నీరు కావాలని భర్త అందరినీ అడుగుతున్నాడు. నా కమండలంలో నీరిచ్చాను. అవి త్రాగి ఆమె నా పాదాలపై పడింది, ఆమెను ఆశీర్వదించాను. వెంటనే యువరాజు మోకరిల్లి, నా గతి ఏమిటి? నాకు దిక్కెవరు? అన్నాడు.నేను అమర్‌కోట వెళ్లండి, అక్కడ మీకు కొడుకు పుడతాడు. అతడు ఈ దేశానికి రాజవుతాడు. నీకేమీ భయంలేదు అని ఆశీర్వదించాను, వాళ్లు అలాగే వెళ్లారు. వారికి పుట్టిన బిడ్డడి పేరు జలాలుద్దీన్ మొహమ్మద్. అతడే తర్వాత అక్బర్ చక్రవర్తిగా కీర్తికెక్కాడు. అంతా భగవంతుని కృప."

** అక్బర్‌ చక్రవర్తికి పూర్వజన్మ స్మృతి ఉండేదని, తన పేరు ముకుంద్ అని గతంలో తానాచరించిన తపస్సులో లోపం వల్ల తాను చక్రవర్తిగా జన్మించానని అంతరంగీకులతో చెప్పేవాడని చరిత్ర.

సింధియా కథ :
---------------
సింధియాకు అందరూ కుమార్తెలే. అతడు 1903లో గాణగాపురం దర్శించి, తనకు కొడుకు జన్మిస్తే దర్శనానికి వస్తానని మొక్కుకున్నాడు. కానీ అది నెరవేరాక అతడు మొక్కు తీర్చలేదు. అతడు 1914లో శిరిడీ దర్శించాడు. అతన్ని చూస్తూనే సాయి ఉగ్రులై. " ఒక్క కొడుకు కలిగాడని నీకింత గర్వమా? అంతటి అదృష్టం నీ రాతలో లేదు. నా శరీరం చీల్చి నీకొకణ్ని ప్రసాదించాను." అన్నారు.అంటే శ్రీ నృసింహ సరస్వతియే సాయిబాబా.