Monday, 28 October 2013

కార్తిక మాసం

భక్తి సమాచారం

కార్తిక మాసం
కార్తీకం.. ఈ పేరు వింటే చాలు. భవబంధాలు క్షణాల్లో తొలగిపోయే వీలు. భక్తప్రజాళికిది మంగళకర మాసం. అద్వైతసిద్ధికి అసలైన విలాసం. చాంద్రమానం ప్రకారం సంవత్సరంలోని ఎనిమిదో మాసంగా కార్తీకం మానవాళికి కొంగుబంగారమవుతోంది. సకల చరాచర జగత్తును వృద్ధి చేసే లక్ష్మీపతి, లయం చేసే శంకరుడు ఏకోన్ముఖులై జీవజాలాన్ని ఆదుకునే గొప్ప సమయమిది. శివకేశవులు అభేదమనే నినాదం... పర్యావరణమే ప్రపంచానికి రక్ష అనే విధానం.. ఆరోగ్య సూత్రాలు పంచివ్వగల దివ్యసందేశం.. కార్తీకం నిండుగా అల్లుకున్నాయి. అందుకే ఏ మాసానికీ లేని ప్రత్యేకత దీనికే స్వంతం.

శివకేశవులిద్దరినీ ఏకకాలంలో ఆరాధించి ముక్తిని పొందేందుకు కార్తీకం గొప్పవరం. చంద్రుడు కృత్తికా నక్షత్రం సమీపాన సంచరిస్తాడు గనుకే దీనికి కార్తికమాసం అని పేరొచ్చింది.

క్షీరసాగర విహార...
ముందుగా క్షీరసాగరశయనుడైన నారాయుణ్ణి గురించి చెప్పుకోదలిస్తే ఆషాఢ శుద్ధ ఏకాదశినాడు యోగనిద్రలోకి వెళ్లే పరంధాముడు మళ్లీ కార్తీక శుద్ధ ఏకాదశినాడు చతుర్దశభువనాల వ్యవహార సరళినీ సమీక్షించే కార్యాన్ని చేపడతాడు. ఈ సందర్భంగా పద్మపురాణంలోని సోమకాసుర వధను గుర్తుచేసుకోవాలి. వేదాలను అపహరించి సాగరాంతర్భాగంలోకి చొచ్చుకుపోతున్న ఈ రాక్షసుణ్ణి విష్ణువు మత్స్యావతారమెత్తి సంహరించిన కాలమిదే. సరిగ్గా కార్తీకమాసం పదకొండవరోజున పురుషోత్తముడు మత్స్యావతారంలోకి మారాడని శాస్త్రం చెబుతోంది. దేవాసురులు క్షీరసాగరమథనం చేసిందీ, శ్రీ మహావిష్ణువు శ్రీలక్ష్మిని పరిణయమాడిందీ ఈ మాసంలోనే. క్షీరాబ్ధి ద్వాదశి (చిలుకుద్వాదశి) వంటి పర్వదినాలకు నెలవైంది గనుకనే జనార్థునికి ప్రీతికరమైనమాసంగా కార్తీకం విరాజిల్లుతోంది.

భక్తికీ ముక్తికీ...
కార్తీకానికి శివునికీ ఉన్న బంధం భక్తికీ ముక్తికీ ఉన్న అనుబంధం. త్రిపురాసురసంహారాన్ని చేపట్టి రుద్రుడు లోకాలను శాంతపరిచింది కార్తీకంలోనే. భూమిని రథంగా చేసుకుని, సూర్యచంద్రుల్ని ఆ తేరుకు చక్రాలుగా మార్చుకుని, మేరు పర్వతాన్ని విల్లుగా చేసుకుని, బ్రహ్మసారథ్యంలో శంభుడు ఆ అసురు వధను లోక కళ్యాణకార్యంగా జరిపాడు. కార్తీకంలో శివుడు సజ్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన్య ముఖాలుగా ఉదయసంధ్యనుంచి ప్రదోష కాలం వరకూ అయిదురూపాలతో భక్తులను ఆశీర్వదిస్తాడు.

స్నానం... దానం... దీపం...
స్నానం, దానం, జపం, తపం, దీపం, ఉపవాసం వంటి సన్మార్గాల్లో పయనిస్తూ కార్తీకమాసంలో శివకేశవుల చిత్తాన్ని భక్తులెవరయినా ఇట్టే గెలవవచ్చు. వేకువఝామునే సముద్ర స్నానమో, నదీ స్నానమో లేక నివాసంలోనే శీతల స్నానమో ఆచరించి శుచిర్భూతులై ఈశ్వరార్చన చేసినా, అచ్యుతుణ్ణి శరణువేడినా లేక ఇద్దరినీ కొలిచినా కోరికలు క్షణాల్లోనే నెరవేరతాయి. మనకున్నదాన్లో కొంత భాగాన్ని పాత్ర ఎరిగి దానం చేయడం మరో పుణ్యవిధి. కార్తీకదీపం పేరిట ఈ మాసంలో వెలిగించే ప్రతీ జ్యోతీ అజ్ఞానతిమిరాలను ఆవలకు నెట్టి విజ్ఞాన రేఖలను విరబూయిస్తుంది. ఈమాసంలో ప్రతీ రోజూ దీపం వెలిగించడం మోక్షప్రదం. ముత్తయిదువులంతా కార్తీక దీపాలతో తమ కుటుంబాల్లో వెలుగులు నింపే పుణ్యకాలమిది. ఈ దీపాలు కార్తీకనక్షత్రానికి ప్రతీకలుగా భక్తులు తలుస్తుంటారు. శివాలయాల్లో ఆకాశదీపాలు, కార్తీక శుక్లపక్ష పున్నమి నాటి జ్వాలాతోరణాలు దర్శిస్తే జన్మజన్మల పాపాలు పటాపంచలవుతాయి.

ఉపవాసయోగం...
కార్తీక సోమవారాలు, కార్తీక పున్నమి ఉపవాసాలకు అనుకూలమైన రోజులు. సోమ అంటే చంద్రుడు. శివుని సిగలో వెలిగే చంద్రుని వారం గనుకే సోమవార ఉపవాసానికి అంతటి ప్రాముఖ్యత. రోజంతా శివధ్యానం చేస్తూ భగవంతునికి సమీపంగా ఉండటంతో పాటుగా, శరీరాన్ని సమస్థితిలో ఉంచే నిరాహారం మరో యోగం. కొందరు ఈ ఉపవాసాన్ని రోజు మొత్తాన ఒక మారే ఫలహారం తీసుకుని ఏకభుక్తంగా నిర్వహిస్తారు. మరికొందరయితే వండని పదార్థాలు అంటే పండ్లు, కాయలు తింటూ నక్తం చేస్తుంటారు. ఈ నక్తం కార్తీకమాసం అంతా చేపట్టే భక్తులూ లేకపోలేదు.

సతత హరితం...
పత్రహరితంతోనే మానవాళి మనుగడ ముడి వేసుకుంటుందని చెప్పడం, వృక్షోరక్షతి రక్షితః అనే పిలుపునివ్వడం కార్తీక వనభోజనాల అంతస్సూత్రం. భారతీయ ఆయుర్వేద వైద్యశాస్త్రంలో ఉసిరికున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఈ సంగతిని జనావళికి గుర్తుచేసేందుకే ఉసిరి చెట్ల కింద పనస ఆకుల విస్తట్లో జరిగే విందులు. పర్యావరణ ప్రాధాన్యతను తెలియజేసేందుకు సిసలైన రాచమార్గాలు. కార్తీకంలో తులసిమాతను ధ్యానించడం పరమశ్రేష్ఠం. ఉసిరి కాయల మీద ఆవునెయ్యి దీపాలుంచి తులసమ్మను కొలవడం సకల పాప క్షయకరం.

అద్వైతం... మోక్షదాయకం...