Friday, 23 September 2011

ముఖం మీద పుట్టుమచ్చలుంటే, విబూతి, కుంకుమ పెట్టుకోనక్కరలేదా?

పుట్టుమచ్చలు జన్మసిద్ధాలు. ముఖంమీద తిలకధారణ (విభూతి, పుండ్రము, కుంకుమ వగైరాల ధారణ) శాస్త్ర సిద్ధము. శాస్త్ర విహితమైనవదానిని పుట్టుమచ్చల కారణంగా విడిచివేసే సదుపాయం ధర్మశాస్త్రంలో లేదు.


దీపారాధనకు నువ్వుల నూనె వాడాలా, కొబ్బరి నూనె వాడవచ్చా?

స్వచ్ఛమైన స్వదేశీ ఆవునెయ్యి నిత్య దీపారాధనకు ఉత్తమం. అది కుదరకపోతే నువ్వుల నూనె. అది కూడా దొరక్కపోతే కొబ్బరి నూనె. ఇదికాక ప్రత్యేక కామ్యకర్మలకు ఆయా తంత్ర గ్రంథాలలో చెప్పిన తైలాలు వేరు. అవి నిత్యపూజకు కాదు.

ఒక వ్యక్తికి కొన్ని దురభ్యాసాలు కలుగుతాయని జాతకంలో గట్టిగా కనిపిస్తే ఇక ఆ వ్యక్తి జాగర్తపడి ప్రయోజనమేమిటి?

అలా జాగర్తపడే వీలు లేకపోతే, జాతక శాస్తమ్రే వ్యర్థం. మానవజీవితం కొంతమేరకు దైవబలానికి, కొంతమేరకు మానవ ప్రయత్న బలానికీ లోబడి ఉంటుందని శాస్త్రాలు నిర్ద్వంద్వంగా నిర్ణయించాయి. రాబోయే దోషాన్ని జాతక చక్రం ద్వారా తెలుసుకుని విహిత శాంతుల ద్వారాను, వ్యక్తిగత కృషి ద్వారాను రాబోయే దోషాలను తొలగించుకోవడం సాధ్యమే. ఇందులో సందేహం లేదు.

తల్లిదండ్రుల ఆబ్ధికాలను అన్నదమ్ములు కలిసిపెట్టాలా? విడివిడిగా పెట్టాలా?
ప్రతినిత్యము కలిసి ఉంటూ, ఒకే భాండంలోని అన్నం తింటూ కలిసి జీవిస్తున్న సోదరులు కలిసి ఆబ్ధికాలను పెట్టాలని, విడి సంపాదనలతో, విడిగా కాపురాలు చేసేవారు దగ్గర దగ్గరే ఉన్నా సరే విడిగానే పెట్టాలనీ, గ్రంథాలలో స్పష్టంగా ఉంది ఐతే కొన్ని శిష్ట కుటుంబాలలో కూడా విడిపోయిన సోదరులు కలిసి ఆబ్ధికాలు పెట్టడం కనిపిస్తోంది. ఇలాంటి విషయాలలో కుటుంబాచారం ప్రకారం పోవటం సుఖం.

పూజారులు, పురోహితులు, భక్తుల చేత పాద నమస్కారం చేయించుకోవచ్చునా?
భారతీయ సంస్కృతిలో పెద్దలకు పాదనమస్కారం అనేది ఒక ప్రధానాంశం. మనకు, దైవానికి అనుసంధానం చేస్తూ వారధులుగా ఉన్న అర్చకులు, పురోహితులు, వేద పండితులు మొదలైన వారికి పాద నమస్కారాలుచేయడం వేదంపట్ల దైవంపట్ల మనకు గల ప్రేమకు సంకేతం. ఐతే దేవాలయాలలో దేవతా విగ్రహాలకు ఎదురుగా ఆ దేవతకు తప్ప వేరెవరికీ నమస్కరించరాదు. అర్చకాదులను పక్కకు తీసుకువెళ్లి నమస్కరించవచ్చు.

ఒకే నక్షత్రంలోజన్మించిన వారి జాతకాలన్నీ ఒకేరకంగా ఉంటాయా?

అది అసాధ్యం. జాతక శాస్త్రం చాలా సంక్లిష్టం. అది తొమ్మిది గ్రహాలమీద, 27 నక్షత్రాల మీద, 12 రాశులమీద, ఇవికాక కొన్ని వందల యోగాల (కాంబినేషన్స్)మీద ఆధారపడి సాగుతుంది. కేవలం నక్షత్రం మీద ఆధారపడి ఎవరో ఏదో చెపుతున్నారంటే అది వినేవారి బలహీనత
.
గ్రహదోషాలకు జపం స్వయంగా చేసుకోవాలా? పురోహితులతో చేయించుకోవాలా? ఎంత సంఖ్యలో చేయించాలి?

నిజానికి గ్రహ జపాలన్నీ ప్రాయశ్చిత రూపాలు. వీలైనంతవరకు ఎవరి అర్హతకు తగిన మంత్రాన్ని వారు పొంది వీలైనంతవరకు ఈ జపాదులు చేసుకోవడం మంచిది. దోషం తీవ్రంగా ఉన్నప్పుడు మనకు బొత్తిగా కుదరనప్పుడు పురోహితులతో చేయించుకోవచ్చును. ఒక్కొక్క గ్రహానికి గల దోష తీవ్రతనుబట్టి విశేష సంఖ్యలో జపాలు అవసరమవుతాయి. సామాన్య స్థితిలో గ్రహాల దశా సంవత్సరాలనుబట్టి గ్రహజప సంఖ్య నిర్ణయం జరిగింది.