Friday 7 February 2014

ఈరోజు అహర్ణాహం మధ్యాహ్నం 12 గంటల నుండి చేయవలసిన భీష్మతర్పణ విధి

ఈరోజు అహర్ణాహం మధ్యాహ్నం 12 గంటల నుండి చేయవలసిన భీష్మతర్పణ విధి

మాఘ శుద్ధ అష్టమి ‘భీష్మాష్టమి’ అని పిలువబడుతుంది. ఆ రోజు భీష్ముడికి జల తర్పణం వదలాలి అంటారు. నిత్యపూజలు ముగించుకొని, దక్షిణాభిముఖంగా కూర్చొని అపసవ్యముగా పితృతీర్థముతో మూడుమార్లు తిలోదకాన్ని తర్పణంగా విడవాలి. తండ్రి జీవించిఉన్నవారు చేయకూడదని కౌస్తుభకారుడు చెప్పగా, తండ్రిఉన్నవారుకూడా భీష్మతర్పణం చేయవచ్చునని అనేక స్మృతికారులు వచించారు. మీ ఆచారవ్యవహారాలను పెద్దలనడిగి తెలుసుకొని ఆచరించటం మేలు. పితృకార్యాలలాగానే, మధ్యాహ్నవ్యాపినియైన అష్టమితిథిని చూసుకోవాలి.

ఈ సంవత్సరం ఈరోజు అంటే పిబ్రవరి ఏడవతేది 2014న – భీష్మాష్టమి. అవగాహన, నమ్మకం, ఆసక్తి ఉన్నవారికి ఉపయోగపడేలా – ఆ తర్పణవిధిని ఈ పొస్టులో పొందుపరుస్తున్నాను.
ఆచమ్య ||
ప్రాణానామమ్య ||
ఏవంగుణ … శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం మాఘ శుక్లాష్టమ్యాం భీష్మ తర్పణం కరిష్యే ||
ఇతి సంకల్ప్య ||
1. వైయాఘ్రపాదగోత్రం | సాంకృతి ప్రవరం | గంగాపుత్రవర్మాణం తర్పయామి || (3 సార్లు)
4. వైయాఘ్రపాదగోత్రం | సాంకృతి ప్రవరం | భీష్మవర్మాణం తర్పయామి || (3 సార్లు)
7. వైయాఘ్రపాదగోత్రం | సాంకృతి ప్రవరం | అపుత్రవర్మాణం తర్పయామి || (3 సార్లు)
శ్లో|| భీష్మః శాంతనవో వీరః సత్యవాదీ జితేంద్రియః |
ఆభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియామ్ || (ఇతి తర్పయిత్వా)
(అని మరొకమారు తిలోదకమును విడువవలెను)
పునరాచమ్య | సవ్యేన అర్ఘ్యం దద్యాత్ ||
(తిరిగి ఆచమించి తూర్పుముఖంగా సవ్యముతో దేవతీర్థంగా అర్ఘ్యమీయాలి)
1. వసూనామవతారాయ అర్ఘ్యం దదామి || (ఒకసారి)
2. శంతనోరాత్మజాయ అర్ఘ్యం దదామి || (ఒకసారి)
3. భీష్మాయ అర్ఘ్యం దదామి ||(ఒకసారి)
4. ఆబాల్య బ్రహ్మచారిణే అర్ఘ్యం దదామి || (ఒకసారి)

|| ఇతి భీష్మతర్పణవిధిః ||


భీష్మ తర్పణము ఎందుకు చేయాలి?
సూటిగా ఒక్క వాక్యంలో సమాధానం వ్యాసుడు క్రింది శ్లోకంలో చెప్పినదానిబట్టి – భీష్మతర్పణము చేసినవారికి ఏడాదిపాటుగా చేసిన పాపము వెంటనే నశిస్తుందని.

శ్లో|| శుక్లాష్టమ్యాం తు మాఘస్య దద్యాత్ భీష్మాయ యో జలమ్ |
సంవత్సరకృతం పాపం తత్‌క్షణా దేవనశ్యతి ||

లౌకికంగా మరికొన్ని కారణాలుకూడా ఉన్నాయి.

శ్రాద్ధకర్మలలో వరుసక్రమంలో పిత (తండ్రి), పితామహ (తాత) ఇంకా ప్రపితామహులను (ముత్తాత) తలుచుకుంటాము. ఆపైన అతి కష్టం మీద ఒకరో ఇద్దరో పేర్లు తెలియవచ్చు. కాబట్టి ఆ ముగ్గురి పైవారైన వృద్ధప్రపితామహులందరికీ కలిపి తర్పణం వదలాలంటే, భీష్మ తర్పణం ఒక దారి – అని కొందరి విశ్వాసం.