Wednesday 25 December 2013

మూడు కోరికలు

మూడు కోరికలు

ప్రతి వ్యక్తీ అనుదినం ఈ మూడు కోరికలు ఆశిస్తే చాలు. ఈశ్వరారాధనలో స్వామిని అర్ధించవలసిన ఆకాంక్షను ఒక శ్లోకంలో అమర్చి చెప్పారు మహాత్ములు. 

"అనాయా సేన మరణం వినా దైన్యేన జీవనమ్! 
దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే!!

ఆయాసం లేకుండా మరణం , దైన్యం లేని జీవితం, దేహం విడిచాక మోక్షం..ఈ మూడింటినీ ప్రసాదించవలసినదిగా పార్వతీపతిని అర్ధిస్తున్నారు.

మొదటిది....ముందుగా ముగింపు సుఖంగా జరగాలనే కోరికను వ్యక్తం చేయడం చక్కని ఔచిత్యం. ప్రాణ ప్రయాణ సమయంలో కలిగే శారీరక, మానసిక యాతన మన ఆధీనంలో లేదు. కనుక ఆ సమయంలో ఎటువంటి యాతన ఉండకుండా; భగవత్ స్మరణతో అనాయాసంగా దేహాన్ని విడవడం ఒక వరం.

రెండవది...బతుకు గడవవలసిన తీరు. ఇది దైన్యం లేకుండా ఉండాలి. దిగులు, ఆధివ్యాదులు లేకుండా, మనసును కుంగదీసే పరిస్థితులు రాకుండా సాఫీగా జీవితం సాగాలనే అందరి కోరిక. అదే దీనిలో ఉంది.

మూడవది...అంతిమలక్ష్యం,జీవితానికి చివరి గమ్యం మృత్యువు కాదు. మృత్యువు తరువాత జీవుని స్థితి ఏమిటి? చేసిన దుష్కర్మలకు అనుగుణంగా దుర్గతులు తప్పవు. అందుకే మళ్ళీ దుర్గతుల పాలవకుండా, జన్మ పరంపరలకు లోనుకాకుండా పరమేశ్వరునిలో లీనం కావాలని కోరుకోవాలి.

ఆ లక్ష్యం నెరవేరాలంటే జీవితమంతా సద్బుధ్ధితో, సత్కర్మలతో, సద్భక్తితో సాగాలి. అటువంటి జీవితమే దైన్యరహిత జీవితం. నిరంతరం భక్తితో సదాశివుని స్మరించేవారికి , ఆరాధించేవారికి ఈ మూడు కోరికలు నేరవేరతాయనడంలో సందేహం లేదు.

By: వెంకట మధు -ప్రాచీన గాధా లహరి