Thursday, 5 September 2013

భాద్రపదమాసం

Brahmasri Chaganti Koteswara RAO


చాంద్ర మానం ప్రకారం, ఈ నెలలో పౌర్ణమి నాడు పూర్వభాద్ర లేక ఉత్తరభాద్ర నక్షత్రం ఉండటం వల్ల ఇది భాద్రపదమాసం అయ్యింది. దేవతలకే కాకుండ పితృదేవతలకు కుడా ప్రీతికరమైన మాసం - "భాద్రపద మాసం " ! దశావతారాలలో రెండు అవతారాలను శ్రీ మహా విష్ణువు ఈ మాసం లోనే ధరించాడు. అవి వరాహ, వామన అవతారాలు. ఈ మాసం లోని శుద్ధ తదియ రోజున వరాహ జయంతి . ఆ రోజున విష్ణువు ఆలయాలకు వెళ్ళి స్వామిని దర్శించుకుని , అర్చనలు చెయ్యాలి. ఈ మాసం లో శుక్ల పక్ష పాడ్యమి నుండి దశమి వరకు దశావతారాలలో రోజుకొక అవతారాన్ని పూజించి , చివరి రోజున అన్ని అవతారాలను పూజిస్తూ దశవతార వ్రతాన్ని ఆచరించడం వల్ల శ్రీ మహా విష్ణువు కృప లభిస్తుంది . ఈ సమయములో దేవ ఋషి పితురలకు తర్పణాలు ముఖ్య విధులుగా చెప్పబడ్డాయి. భాద్రపద శుక్ల పక్ష షష్టి నాడు పంచగవ్య ప్రాశనం చెయ్యాలి అని శాస్త్ర వచనం . అందు వల్ల అశ్వమేధ యాగం ఫలము లభిస్తుంది అని అంటారు. ఆవుపాలు, పెరుగు, నెయ్యి, ఆవుమూత్రం , గోమయం అనేవి పంచగవ్యాలు. బహుళ పక్షం పితృదేవతలకు ఇష్టమైన కాలం. అందుకే దీనికి "పితృపక్షం" లేక మహాలయ పక్షం అని పేర్లు. ఈ పక్షములో పదిహేనురోజుల పాటు పితృదేవతలకు తర్పణాలు వదలడం , శ్రాద్ధ విధులను నిర్వహించడం , పిండప్రదానాలు చేయదం వంటివి ఆచరించాలి . మహాలయ అమావాస్య నాడు కుడా ఈ విధముగా చెయ్యాలి . ఈ మాసములో ఒక పూట భొజనం , మరో పూట ఉపవాసం ఉండాలి. బెల్లం, ఉప్పులను దానం చెయ్యడం మంచిది . పూర్ణిమ నాడు శ్రీ భాగవత పురాణాన్ని దానం చెయ్య్డం వల్ల మరణ అనంతరం విష్ణువులోక ప్రాప్తి కలుగుతుంది అని శాస్త్ర వచనం . భాద్రపద పూర్ణిమ నాడు జరుపుకునే ఉమా మహెస్వర వ్రతం సర్వ విధాలా శ్రేష్టమైనది . ఈ వ్రతం చేసిన భక్తుల ఇళ్ళు సకల సంపదలతో కళకళలాడుతూ ఉంటాయి.