Monday 22 July 2013

అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః || ౧ ||
అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా |
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః || ౨ ||
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః || ౩ ||
స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్సచరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః || ౪ ||

గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజంచే రోజును గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించివందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు.
గురువుల పట్ల ఇదే గౌరవం అన్నివేళలా పాటిస్తున్నప్పటికీ ఈ రోజు వ్యాసమహాముని పుట్టిన రోజు కాబట్టి దీనికంత ప్రాధాన్యత ఉంది.
ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి, చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు.
గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు. తర తరాలకూ కొనసాగవచ్చు.
హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తుంటారు. వేదవ్యాసుని మానవజాతి కంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన్ను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు.
దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు.

ఈ పర్వం యతులకు అతిముఖ్యమైనది. వారీనాడు మహా భారతం మొదలైన సంహితా గ్రంథాలకు రచయిత అయిన వ్యాసుని పూజిస్తారు. వ్యాస పూర్ణిమ పర్వాన్ని ఆదిలో శంకరాచార్యులు ఏర్పాటు చేశారు.
పూజా విధానం

కొత్త అంగవస్త్రం భూమి మీద పరుస్తారు. దాని మీద బియ్యం పోస్తారు. ఆ బియ్యం మీద నిమ్మ కాయలు ఉంచుతారు. ఇది శంకరులు, అతని నలుగురు శిష్యులు వచ్చి దానిని అందుకొంటారని నమ్మకం. పూజ అయ్యాక ఆ బియ్యం తలా ఒక పిడికెడు తీసుకుకెళ్లి తమ తమ ఇళ్లల్లో బియ్యంలో కలుపుకుంటారు. బియ్యం, కొత్తవస్త్రం లక్ష్మీ చిహ్నం. శుభసందర్భాల్లో బియ్యం యథాశక్తిని రాసి పోసి లక్ష్మిని ఆహ్వానించటం హిందూ సాంప్రదాయం. నిమ్మపళ్లు కానుకగా ఇచ్చుపళ్లు.అవి కార్యసిద్ధిని సూచిస్తాయి. బియ్యం, నిమ్మపళ్లు ఉంచడం లక్ష్మీ కటాక్షం కోసమే. దక్షిణాదిని కుంభకోణంలో, శృంగేరిలో శంకర పీఠాలు ఉన్నాయి. వ్యాస పూర్ణిమ అక్కడ ఎంతో వైభవంతో జరుపబడుతుంది. ఆ పర్వసందర్భంలో అక్కడికి వేల కొలది తైర్థికులు వస్తారు. వ్యాసపూర్ణిమ గురుపూజా రోజుగా పాంచజన్యం పత్రిక (28.7.34) ఇట్లా అంటూ ఉంది.
''ఇందులో వ్యాసపదం గురుపరము. ఇప్పుడు ప్రతి చోటా తమతమ గురువుల నారాధించుకొని తరింప వలయునని శాస్త్రాదేశం. స్వస్వరూపాను సంధానమున కన్న భిన్నమగు అన్యారాధనను తెలియని యతిశేఖరులచే ఈ నాగాచార్య పీఠార్చనల నాచరింపవలసినగా శాస్త్ర మాదేశించినది. గుర్వారాశనం విశేష ప్రయోజనకారియు, అనుల్లంఘ్యమనియు చెప్పుటకు రెండు ప్రబల ప్రమాణ ములు కలవు. యస్యదేవే పరాభక్తి: యధా దేవేయతాథా గురౌ' అని శ్వేతాశ్వతరోపనిషతు నందు పేర్కొన్నారు. ఇందు వేదమాత, ఈశ్వరారాధన తోటి తుల్య గౌరవం, సమాన ప్రాధాన్యతను ఇస్తుంది. గురుపూజకు, కాని స్మృతికర్తలింకొక మెట్టెక్కుడధిష్టింప చూశారు. గురువును ''దైవేఋష్టే గురుస్తాతా,
గురౌ ఋష్టేనకశ్చన'' యని దైవానుగ్రహమునకు గురువనుగ్రహం అనివార్యం. గనుక సాధనమపేక్షించి వ్యాస పూర్ణిమలో వ్యాస పదమాధికారిక పదపరముగాని వ్యక్తి పరం కాదనునదొకటి, ఆనాడొ నర్చు గురు పీఠార్చనలలో ఇప్పుడు దేశమందములు లోనున్న యతి కర్తృక పూజ మాత్రములు ఉప లక్షకములు మాత్రమే. ఆనాడు సర్వులు సర్వవిధములు తమ తమ గుర్వర్చనజేసి గురుభక్తిని వెల్లడించి పెంపొందింప జేశారు. ఎంతో మంది ఋషులు ఉండగా ఒక్కవ్యాసుని పేరున ఈ పూజ జరుప బడుటకు ఏమిటి కారణం! ఈ పూజలో ప్రత్యేక పూజలు అందే ఆదిశంకరులు వ్యాసభగవానుని అపరావతారమని చెబుతారు. కాగా ఇది వ్యాస పూజకు ఉద్దిష్టమైనది. వ్యాస పూజ అనగా ఆదిశంకరుల పూజ. సన్యాసులందరూ ఆది శంకరులు తమ గురువుని ఎంచుకుంటారు. నేడు సన్యాసులందరూ వ్యాసుని రూపంలో తమ గురువును కొలుస్తున్నారన్నమాట అందుచేత ఇది వ్యాస పూజారోజు. శంకరాచార్యుల వారి జయంతికి వేరే ఒక రోజు ఉద్దిష్టమై ఉన్నది. కాగా దీనిని గురుపూజా దినోత్సవగా భావింపవలసి ఉంది.
మహాషాఢ వ్యాస పూజ

ఈ రోజు అష్టాదశ పురాణ నిర్మాత అయిన వ్యాస మహర్షిని పూజించాలి.
శ్లో: శంకరం శంకరాచార్యం గోవిందం బాదరాయణం

సూత్ర భాష్యకృతౌ వందే భగవంతా పున:పున:
అని పూజించిన బ్రహ్మత్వసిద్ధి లభిస్తుందంటారు.
వైష్ణవ పురాణమును ఆషాఢ పూర్ణిమకు దానమిస్తే విష్ణు లోకం కలుగును. వ్యాస భగవానుడు సకల కళానిధి, సకల శాస్త్రవేత్త. సోమకుడు అనే రాక్షసుడు వేదాలను ఎత్తుకు పోయినపుడు అవి ఒకదానితో ఒకటి కలిసి పోయాయి. కొంతకాలానికి శ్రీమహావిష్ణువే వ్యాసావతారం ఎత్తి ఆ వేదాలను విభజించి చక్క పరచాడు. చిక్కుపడిన వేదములను విభాగించిన విద్యావేత్తయేకాక అతడు శస్త్ర చికిత్సావేది కూడ. గాంధారి ఈసుపూని దిగజార్చుకొన్న గర్భస్థ పిండాన్ని పరిరక్షించి ఆపిండంలో నూట ఒక్క శిశువులు ఉండడం గుర్తించి ఆ విధంగా ఆ పిండాన్ని నేర్పుతో విభాగించి నేతి కుండలో నిక్షిప్త మొనర్చి పోషించేటట్లు చేసిన వైద్యవరుడు, వైద్యవిద్యానిధి, మేధానిధి, ఆత్మవిద్యానిధి అయిన వ్యాస భగవానుని పూజించడానికి ఉద్దిష్టమైన పర్వమిది. ఆషాఢ శుద్ధ పూర్ణిమ రుద్ర సావర్ణి మన్వంతరాది రోజు. రుద్ర పావర్ణి పన్నెండో మనువు. అతడు రుద్రపుత్రుడు ఈ మన్వంతరంలో ఋతధాముడు ఇంద్రుడు, తపస్వి, సుతపస్వి మున్నగువారు సప్తర్షులు.
వైష్ణవ పురాణమును ఆషాఢ పూర్ణిమకు దానమిస్తే విష్ణు లోకం కలుగును. వ్యాస భగవానుడు సకల కళానిధి, సకల శాస్త్రవేత్త. సోమకుడు అనే రాక్షసుడు వేదాలను ఎత్తుకు పోయినపుడు అవి ఒకదానితో ఒకటి కలిసి పోయాయి. కొంతకాలానికి శ్రీమహావిష్ణువే వ్యాసావతారం ఎత్తి ఆ వేదాలను విభజించి చక్క పరచాడు. చిక్కుపడిన వేదములను విభాగించిన విద్యావేత్తయేకాక అతడు శస్త్ర చికిత్సావేది కూడ. గాంధారి ఈసుపూని దిగజార్చుకొన్న గర్భస్థ పిండాన్ని పరిరక్షించి ఆపిండంలో నూట ఒక్క శిశువులు ఉండడం గుర్తించి ఆ విధంగా ఆ పిండాన్ని నేర్పుతో విభాగించి నేతి కుండలో నిక్షిప్త మొనర్చి పోషించేటట్లు చేసిన వైద్యవరుడు, వైద్యవిద్యానిధి, మేధానిధి, ఆత్మవిద్యానిధి అయిన వ్యాస భగవానుని పూజించడానికి ఉద్దిష్టమైన పర్వమిది. ఆషాఢ శుద్ధ పూర్ణిమ రుద్ర సావర్ణి మన్వంతరాది రోజు. రుద్ర పావర్ణి పన్నెండో మనువు. అతడు రుద్రపుత్రుడు ఈ మన్వంతరంలో ఋతధాముడు ఇంద్రుడు, తపస్వి, సుతపస్వి మున్నగువారు సప్తర్షులు.