Saturday, 17 August 2013

మనస్సుని ఎట్లా సిద్ధం చేసుకోవాలో తెలుపడానికే భగవద్గీత

Jaji Sarma
మనస్సుని ఎట్లా సిద్ధం చేసుకోవాలో తెలుపడానికే భగవద్గీత
వానలు కురవటం లేదు, పంటలు పండటం లేదు, అనావృష్టి ఏర్పడుతుంది అంటే వాటికి కారణం మనలో ఉండే లోపమే తప్ప ప్రకృతిలో లోపం కాదు. ఇవి మాత్రమే కాదు ఏ రకమైన ప్రాకృతిక ఇబ్బందులైనా మనం చేసుకున్నదే తప్ప ప్రకృతికి మన మీద కోపమే ఉంటే ఈ భూమి మీది నుండి ఎప్పుడో ఏరి పారవేసేది. లేదా మనల్ని కబళించాలి అంటే భూమికి ఎంత సేపు పట్టేది. అరక్షణం చాలు భూమికి మనల్ని పీల్చిపారవేయడానికి కావాలనుకుంటే. కానీ ప్రకృతికి మన మీద కోపం లేదు, ఎప్పుడూ ప్రేమే. తప్పులు చేయడం మన వంతు అయితే, వాటిని దిద్దుబాటు చేయడం తన వంతు అన్నట్టుగా ప్రకృతి మాత మనల్ని కరుణిస్తుంది. ఎన్నెన్ని దోషాలు చేస్తాం మనం. లేవగానే కాళ్ళు పెడతాం, మలమూత్ర విసర్జనలాంటివి చేస్తుంటాం. సరే, అవసరం కోసం తప్పక చేసేవి కొన్నైతే, ఆశ తో చేసేవి ఎన్నెన్నో. బ్రతకడానికి జీవించాలని చేసేవి ఏకొన్నో, కానీ బడాయి కోసం చేసే ఘనకార్యాలు ఎన్నెన్నో. ప్రొద్దున లేచాక చేసే ధంత ధావనకు వాడే వస్తువులు మొదలుకొని రాత్రి సుకుమారంగా పడుకునేందుకు వేసుకొనే పరుపుల దాకా, వాటిలో అవసరం ఇంత ఆశలు అంతంత. ఇలాంటి కొత్త కొత్త వస్తువులు లేని నాడు మన పూర్వులు హాయిగా బ్రతికే వాళ్ళు. ఆధునిక రీతుల్లోకి వెళ్తున్నాం అనుకుంటూ ఎంతెంత ఎంతెంత ఆధునికం అనుకుంటూ పోతూ అంతంత కృత్రిమ ప్రవృత్తుల్ని మనం నేర్చుకుంటున్నాం. ఈ నాడు ఆధునికతకు నిర్వచనం కృత్రిమం, నాగరికతకు నిర్వచనం ప్రకృతిని పాడు చేయుట. ఇది వరకు సురాపానం చేయడం ఒక పాపంలా భావించేవారు, కానీ ఈ నాడు అది చేయక పోతే పాపం అన్నట్టు చేస్తున్నారు. దీనికి మనం అందమైన పేరు పెట్టుకున్నాం, నాగరికత అని. అందుకే ప్రకృతి మనకు అందించాల్సిన సౌఖ్యాలని అందించలేక పోతుంది, మన జీవనం కూడా తలక్రిందలు అయిపోతుంది.
మనిషి జీవించడానికి ప్రకృతిలోంచి కొంత వరకు స్వీకరించాల్సి ఉంటుంది అంత వరకు తప్పదు, అతిగా తీసుకోవడం తప్పు. మనకు సవ్యంగా ఉండి, ప్రకృతి మనకు ఇవ్వల్సినది ఇవ్వకపోతే ప్రకృతిని దండించే అధికారం ఉంది. మనం ఉన్న భూమికి ఒక పేరు ఉంది, పృథ్వీ అని. ఈ పృథ్వి వల్ల ఏర్పడ్డ శరీరాలు కనుకనే మనవి పార్థివ శరీరాలు అని అంటుంటారు. ఎందుకొచ్చింది ఈ పేరు, అంతకు ముందు వేరే పేరు ఉండేది. అజనాభము అని పేరు. దీనిని పృథు అనే చక్రవర్తి పాలించాక ఆపేరు వచ్చింది. చాలా కాలం కావల్సినవి ఇచ్చింది, కానీ ఈ పృథు అనే చక్రవర్తి పాలించే సమయం నాటికి వానలు లేవు, పంటలు లేవు, అందరూ ఇక్కట్లను పొందే స్థితి దాపురించింది. ఆవేళ ఆ పృథు చక్రవర్తికి కోపం వచ్చి, అందరినీ ఆదరించాల్సిన ఈ భూమి, తన బాధ్యతని విస్మరించింది అని భూమిని గోవుగా మార్చి వేటాడటం ప్రారంభించాడు. దాన్ని సంహరిస్తాను అని బాణం తీస్తే, నేను గోవును పైగా స్త్రీని వధించడం తప్పు అని తెలియదా నీకు అని గోవు అడిగిందట. పృథు చక్రవర్తి అన్నాడట, నీ బాధ్యత నీవు తెలుసుకుని ఉంటే అది సరైన మాట. పిల్లలని కని, వారి పోషించక పోతే దండనకు అర్హులే, కనుక దండించినా దోషం లేదు అన్నాడట. భూమి అంగీకరించింది, కానీ నా పిల్లలు నాపిల్లల లాగ ఉండండి, మీరు అలా ఉండగలిగితే నేను ఇవ్వల్సినది ఇస్తా, మీరు మిమ్మల్ని మరచిపోతే నేను మిమ్మల్ని మరచిపోవాల్సి వస్తుంది. ఎవరెవరు ఎట్లా ప్రవర్తించాలో అట్లా ప్రవర్తిస్తే నేను ఎట్లా ఉండాలో అట్లా ఉంటా. గోవు క్షీరాన్ని ప్రసాదించాలంటే, ఒక దూడ కావాలి, పితుక్కోవడానికి పాత్ర కావాలి అవి సిద్ధం చేసుకో అని చెప్పిందట. అంటే అప్పుడు ఆ గోవుని సంహరించడం మాని, మనుష్యుల తరపున ఒకరిని దూడగా మార్చి ఒక పాత్రలో మానవ జాతి బ్రతకడానికి కావల్సిన వన్నింటిని క్షీరముగా పితికాడట. మనుష్యుల తరపున మనువుని దూడగ చేసాడట, పాత్రగా మనస్సుని వాడారట, అప్పుడు మనుష్యులకి కావల్సిన వాటిని సంమృద్ధిగా ఇచ్చిందట. కేవలం మనుష్యులే కాదు దేవతలు, రాక్షసులు, యక్షులు, జంతువులు, పక్షులు మొదలైన జీవ జాతులన్నీ బ్రతకడానికి ఈ భూమి ఇవ్వగలిగేట్టుగా "ధుదోహ ధరిత్రి" ఈ ధరిత్రిని పితికెను అని చెబుతారు. ఇది సాదు జంతువులు ఉండాల్సిన స్థానం, ఇది కౄర మృగాలు ఉండాల్సిన స్థానం, ఇది పల్లె, ఇది పట్టణం అని ఇలా ఆయన ఏయే జీవరాశి అట్లా బ్రతకాలి అనే హద్దును ఏర్పాటు చేసాడట. అంటే భూమి ఎవరికి కావల్సిన వాటిని వారికి ఇవ్వగలదు. ఇదీ భూమికి లక్షణం.
ఈ నాడు మనకు ఇన్ని సమస్యలు ఉన్నాయంటే, బహుశ: మనల్ని మనం మరచిపోయి ఉంటాం. మనిషికి మనస్సు అనేది పాత్ర వంటిది, ఆ పాత్ర సిద్ధంగా లేకుంటే పితికే పాలు నేలపాలు కావూ!. మనిషి సవ్యంగా అనుభవించగలిగేది మనస్సు వల్ల. ముందర సంస్కరించబడవల్సినది మనస్సు. ఇది ఈ నాడు పూర్తిగా నియంత్రన లేకుండా పోయింది. మన మనస్సులు సంకుచించుకు పోయాయి. మనం పాత్రలు సిద్ధం చేసుకోలేదు. గిన్నెని తిప్పి పెట్టాం, పాలు ఇవ్వగల గోవు ఉన్నా, మనం సిద్ధంగా లేము. సంకుచించుకుపోయిన మనస్సులని భగవంతుడికేసి తిప్పితే కదా అసలు మనం సంమృద్ధిగా జీవనం కొనసాగించగలిగేది. మనిషి తన మనస్సుని ఎట్లా సిద్ధం చేసుకోవాలో తెలుపడానికే భగవద్గీత.