Saturday 20 April 2013


శ్రీ సీతారామకల్యాణం
జై శ్రీమన్నారాయణ. శ్రీ మొదలి సుబ్రహ్మణ్యం గారు అనువదించిన వాల్మికి రామాయణము బాలకాండ 71 వ 72వ సర్గ లు పరిశీలించిగా , శ్రీ సీతారామ కళ్యాణం "ఉత్తర ఫల్గుణి నక్షత్రములో " జరిగినదని తెలుస్తోంది.

71 వ సర్గలో జనకమహారాజు " ఓ దశరధమహారాజా ! నేడు మఘ నక్షత్రము . నేటికి మూడవ రోజు అనగా ఉత్తర ఫల్గునీ నక్షత్రములో వివాహము" అని అన్నాడు.

72 వ సర్గలో జనకమహారాజు " ఉత్తర ఫల్గుణి నక్షత్రమునకు భగుడు దేవత. సంతాన ప్రదాత " అని కూడా అంటాడు.

ఈ నేపద్యం లో మరో విషయము గుర్తుపెట్టుకోవాలి. విశ్వామిత్ర యాగ సంరక్షణార్ధం రామలక్ష్మణులు వెళ్ళారు. యజ్ఞములు సర్వసాధారణంగా చైత్ర, వైశాఖ మాసములలో జరుగుతాయి. మిధిలానగరంలో కూడా రామలక్ష్మణులు వచ్చినప్పుడు ఓ యాగము జరుగుతోంది.
రామాయణం రచించిన వాల్మీకే పులకించిపోయి వ్రాసారు సీతారామకల్యాణం. బాలకాండలో 66వ సర్గ నుంచి 73వ సర్గ వరకూ 228 శ్లోకాలలో ఈ వివాహం గురించి వ్రాసారు. ఇంత సొగసుగా వర్ణించిన మరొక వివాహం మన పురాణ ఇతిహాసాలలో గాని, కావ్యాలలోగాని లేదేమో అనిపిస్తుంది.
రామాయణంలో మూడు ఘట్టాలలో వాల్మీకి తనను తాను మర్చిపోయి చెప్పారనిపిస్తుంది. మొదటిది వాల్మీకికి నారదుడు రాముడి గుణగణాలను వర్ణించినది. బాలకాండలో మొదటి సర్గలో నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ అని మొదలుపెట్టి ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మ ఇవాపరః అని పూర్తి చేస్తూ ఒకదాని మించినది ఒకటిగా పది శ్లోకాలు చెప్పారు. ఇది ఆదికవి వాల్మీకి పరవశించి చెప్పినది.
రెండవది సీతారాముల కల్యాణం. ఇది, వసంత ఋతువు ప్రారంభంలో వాల్మీకికోకిల పులకించి పలికినది.
మూడవది అశోకవనంలో సీతను చూసినప్పుడు హనుమంతుడి మనస్సులో మెదిలిన భావాలు. ఆమె ఎలా ఉందో చెప్తాడు. ఆమె విద్యలా ఉంది. కీర్తిలా ఉంది. శ్రద్ధలా ఉంది. బుద్ధిలా ఉంది. వాక్కులా ఉంది. పూజలా ఉంది. భూషణాలు తీసి చెట్టుకు తగిలించినా భర్తృవాత్సల్యం అనే భూషణంతో వెలిగిపోతూ పవిత్రమైన అగ్నిశిఖలా ఉంది. ఇలా ఎన్ని ఉపమానాలు చెప్పినా ఆయనకు తృప్తి లేదు. ఇది వాల్మీకి మహర్షి హృదయం కరిగిపోయి వ్రాసినది


కాబట్టి శ్రీ సీతారామకల్యాణం వసంత ఋతు ప్రారంభము చైత్ర మాసములో ఉత్తర ఫల్గుణి నక్షత్రము నవమి నుండి త్రయోదశి లోపల జరిగి ఉండవచ్చును.