Sunday, 8 July 2012

my frends post

అనుమానం లేదు..అన్నీ వేదాల్లోనే ఉన్నాయి
సంప్రదాయ కుటుంబ నేపథ్యం, గణితంలో పీజీ, బ్యాంకులో ఉద్యోగం, కమ్యూనిస్టు సాహిత్యం, ఆధ్యాత్మిక సేవ, వేదాలేం చెబుతున్నాయో పరిశోధన... ఇవన్నీ కలిస్తే - కేవీ కృష్ణమూర్తి. "మన భవిష్యత్తుకు పునాది గతంలోనే ఉంది...'' అని ఢంకా బజాయించి మరీ చెబుతున్న ఈయన పరమ చాదస్తుడు కాదు, భారతీయ విజ్ఞానం పట్ల గొప్ప నమ్మకమున్న పరిశోధకుడు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న పరిశోధకులను ఒక్కతాటి మీదకు తీసుకొచ్చే కృషి చేస్తున్న ఆధునికుడు. హైదరాబాద్‌లో 'ఐ-సెర్వ్' సంస్థను స్థాపించి ప్రాచీన శాస్త్రాలను పునరుద్ధరించడానికి పనిచేస్తున్న కేవీ కృష్ణమూర్తి అంతరంగం ఆయన మాటల్లోనే....

"సంప్రదాయ కుటుంబంలో పుట్టిపెరగడం వల్ల ప్రాచీన విజ్ఞానం పట్ల ఆసక్తి చిన్నప్పటి నుంచే ఉండేది. యూనివర్సిటీ నుంచి లెక్కల్లో ఎమ్మే పట్టా తీసుకుని, ఆంధ్రా బ్యాంక్‌లో ఇరవయ్యేళ్ల పాటు ఉద్యోగం చేశాను. ఆ సమయంలోనే ట్రేడ్ యూనియన్ల ద్వారా కమ్యూనిస్టులతో పరిచయం పెరిగింది. ఆ సాహిత్యాన్ని బాగా చదివాను. మన దేశ చరిత్రను వాళ్లు విశ్లేషించే తీరు నాకెందుకో నచ్చలేదు. దాంతో 86లో స్వచ్ఛంద సేవకుడిగా మైసూరు గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి వెళ్లిపోయాను. అక్కడ ఆధ్యాత్మిక సాహిత్య విభాగంలో పనిచేసేవాడిని. ఆ గ్రంథాలను చదువుతూ ఉండగా ఇవాళున్న సైడ్ ఎఫెక్ట్స్ లేని సైన్స్ ఒకనాడు మన దేశంలో వర్ధిల్లిందనే భావన బలంగా కలిగింది నాలో.

దాన్ని సాక్ష్యాధారాలతో నిరూపించాలంటే పరిశోధన అవసరం. అనేక శాస్త్రాల్లో, అనేక విషయాల్లో లింకులు తెగిపోయాయి. వాటిని పునరుద్ధరించాలంటే బోలెడంత పరిశోధన చెయ్యాలి. నిపుణులను సంప్రదించాలి. ఆ పనిలో ఉన్నప్పుడే నాకో సంగతి అర్థమయింది. అదేమంటే నాలాగే ప్రాచీన విజ్ఞానాన్ని మథిస్తున్నవారు ఇంకొంతమంది ఉన్నారని. అయితే ఎవరి పని వారిది. ఎక్కడో కాశీలో ఒక పండితుడు పరిశోధిస్తున్న అంశమే ఇక్కడ మైసూర్లోనూ మరొక సైంటిస్టు చేస్తుండొచ్చు. దీనివల్ల ఇద్దరి పనిగంటలు, శ్రమ అన్నీ వృథా అయ్యే అవకాశముంది.

అదే వారిద్దరికీ మధ్య కమ్యూనికేషన్ ఉంటే ఆలోచనలూ, పనీ పంచుకుని తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాన్ని పొందేవారు కదా అనిపించింది. అందరి వివరాలూ సేకరించి ఒకచోట పెట్టాలనుకున్నాను. దానిలో కొన్ని ఇబ్బందులెదురయ్యాయి. ఎలాగంటే ఆధ్యాత్మిక పరిసరాల్లో నివసిస్తున్న వ్యక్తిని అని సైంటిస్టులు కొందరు నాతో మాట్లాడటానికి ఇష్టపడేవారు కాదు. మతపరమైన ఆసక్తితో నేనీ పని చేస్తున్నానేమో అని అనుమానించేవారు. ఇలాకాదని స్వామీజీ అనుమతి తీసుకొని ఆశ్రమం నుంచి బైటకొచ్చేశాను. 2004లో హైదరాబాద్ కేంద్రంగా 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ వేదాస్' (ఐ-సెర్వ్) సంస్థను ప్రారంభించాను. ఇది ఒక పూర్తిస్థాయి పరిశోధన సంస్థ. కులమతాల ప్రస్తావన లేదు, ఉండదు.''

అందరం కలిసి... "వేదాలు భారతీయులందరివీను. వాటి గురించిన ఊహాపోహలు కాకుండా, సరైన అవగాహన మన పౌరులందరికీ ఉండాలి. 'యథేమాం వాచమ్ కళ్యాణి మావదాని జనేభ్య' అనే శ్లోకానికి అర్థం - 'ఈ వేదస్వరం వల్ల సమస్త మానవాళి సుఖసంతోషాలతో ఉండాలి' అన్న శుభాకాంక్షే. అంత ఉదాత్త భావనలున్న వేదాలు, వాటినుంచి వచ్చిన ఉపనిషత్తులు, పురాణాలు వంటి వాటిలో మన విజ్ఞానం నిక్షిప్తమై ఉంది. ఉదాహరణకు ఒక వ్యక్తి తల తెగిపడిపోతే మళ్లీ అతికించారని ఉంది. దానికి సంబంధించిన సైంటిఫిక్ వివరాలు మాయమైపోవడం వల్ల ఈనాడది ఏదో జానపద కథలాగా అనిపిస్తుంది. అదెలా చేశారు, దానికి ఆనాడున్న వైద్య విజ్ఞానమెలాంటి పద్ధతులు అనుసరించింది అన్న వివరాలన్నిటినీ మనం పరిశోధించాలి. ఇంతకుముందు 'మిస్సింగ్ లింక్స్' అన్నాను చూడండి, అవి ఇలాంటివే. గాలిలో పుష్పక విమానం ఎగిరిందంటారు, దాని ఇంజనీరింగ్ తెలియకపోతే అది కేవలం కల్పిత కథలాగా మిగిలిపోతుంది. దాని వివరాలను ఇప్పటికైనా సేకరించి ఆధునిక శాస్త్ర సాంకేతికతలతో అనుసంధానిస్తే మన భవిష్యత్ తరాలకు అద్భుతమైన పునాది వేసినవాళ్లమవుతాం. అందుకే మన భవిష్యత్తు గతంలోనే ఉందని నేనంటాను.

ఆ గతాన్ని పరిశోధిస్తున్న వారందరికీ తగిన సౌకర్యాలున్న వేదికను కల్పించడమే ఐ-సెర్వ్ లక్ష్యం. ఈ సంస్థ దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలతో, ఇతర పరిశోధక సంస్థలతో కలిసి కృషి చేస్తోంది. బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంతో కలిసి హెర్బల్ మెడిసిన్ వంటి రంగాల్లో నాలుగు డిప్లమా కోర్సులనూ నిర్వహిస్తోంది. వివిధ భాషల్లోని ప్రాచీన విజ్ఞాన శాస్త్రాలకు సంబంధించిన పదివేల పుస్తకాల సమాచారాన్ని మా గ్రంథాలయంలో భద్రపరిచాం. దాతృత్వ దృష్టితో ఒక ఆయుర్వేద డిస్పెన్సరీనీ నిర్వహిస్తున్నాం. ఏడాదికి పదివేల మంది వరకూ దీని సేవలను వినియోగించుకుంటారని అంచనా. వివిధ శాస్త్రాలకు సంబంధించి అరుదైన రాత ప్రతులను సంపాదించడానికి, వాటిని ఆధునిక పద్ధతుల్లో అందరికీ అందుబాటులో ఉండేలా చెయ్యడానికి ముగ్గురు పరిశోధకులు రెండేళ్లుగా చాలా తిరుగుతూ శ్రమిస్తున్నారు. గణితం, పురావస్తుశాస్త్రం, పర్యావరణం వంటి ఏ రంగంలోని నిపుణులైనా సరే మాతో చేరవచ్చు. వారి విజ్ఞానాన్ని కొత్త పరిశోధనలకు ఉపయోగించవచ్చు.''

వివిధ రంగాల్లో పరిశోధన "ప్రాచీన విజ్ఞానానికి సంబంధించిన ఐదారు వందల పుస్తకాల పేర్లు, వాటి రచయితల పేర్లు సంపాదించి ఒక పుస్తకం ప్రచురించాను. దురదృష్టవశాత్తూ వాటిలో ఏ ఒక్క పుస్తకమూ ఇప్పుడు దొరికేది కాదు. అయితే కనీసం పేర్లయినా తెలియాలన్నది నా ఆలోచన. ఆయుర్వేదం, జ్యోతిషం, గ్రహగతుల గురించిన విజ్ఞానం ఇప్పుడు మనదగ్గర కొంతలో కొంతయినా బతికున్నాయి. అవైనా పూర్తిగా అంతరించిపోకుండా కాపాడుకోవాలని కొన్ని ప్రాజెక్టులు మొదలెట్టాం. ఉదాహరణకు జ్యోతిష, పంచాంగ శాస్త్రాల ఆధారంగా మన చరిత్ర తేదీలను కచ్చితంగా నిర్ధారించే ప్రయత్నం చేస్తున్నాం. అంటే రాముడి కాలం ఏమిటి అన్నది సరిగ్గా తెలిస్తే అప్పటి సామాజిక, రాజకీయ చరిత్రను సరిగ్గా అర్థం చేసుకోగలం. అలాగే ఒకప్పుడు జీవనదులుగా ఉన్నవి ఎప్పుడు ఎండిపోయాయో తేదీలతో సహా తెలియాలి. అలాగే వర్షాలెప్పుడు పడతాయో పూర్వీకులు సరిగ్గా చెప్పగలిగేవారు. పంచాంగాల్లో రాసిన రోజు వర్షం పడేదంతే. ఇప్పుడా పరిజ్ఞానం లుప్తమైపోతోంది. దాన్ని ఆధునిక వాతావరణ శాస్త్రంతో మేళవించి 'రెయిన్ మ్యాప్ ఆఫ్ ఇండియా' తయారుచేసే పనిలో ఉన్నాం. శ్రీహరికోటలోని ఇస్రోలో ముఖ్య వాతావరణ అధికారిగా పనిచేసి రిటైరయిన డాక్టర్ జీవీ రామ దీనిలో పాలుపంచుకుంటున్నారు.

మరో విషయం చూడండి, పూర్వం భూకంపాల వల్ల కలిగిన జననష్టం గురించి ఎక్కడా చెప్పబడలేదు. ఇన్నివేల ఏళ్ల మానవ నాగరికతలో భూకంపాలు రాకుండా ఉండి ఉండవు. కానీ వాటిని ముందుగానే అంచనా వేసి జననష్టాన్ని నివారించే పద్ధతి ఆనాడుండేది. దాన్నిప్పుడు వెలికితీయాలి. అలాగే ఐదారేళ్ల క్రితం మన దేశంలో సునామీ వచ్చినప్పుడు తమిళనాట కొన్ని గిరిజన తెగలు దాన్ని ముందుగానే ఊహించి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయాయి. వాళ్ల మీద పరిశోధనలు సాగుతున్నాయి. అనాదిగా మనది వ్యవసాయాధారిత దేశమని చెబుతూ వస్తున్నామేగాని భూసార సంరక్షణ కోసం గాని, దిగుబడి పెంచడం కోసం గాని ఏమీ చెయ్యడం లేదు. ఏటికేడూ ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో 'ప్రాచీన భారతీయ వ్యవసాయ పద్ధతులు' అనే అంశమ్మీద కిందటేడు ఆగస్ట్‌లో నూజివీడులో జాతీయస్థాయి సెమినార్‌ను నిర్వహించాం. మూడొందల మంది రైతులు, దేశవ్యాప్తంగా ఉన్న నిపుణులు వచ్చి తమ అనుభవాలను, అభిప్రాయాలను కలబోసుకున్నారు. ఇలాంటి ప్రయోజనకరమైన సదస్సులను ప్రతి రెండు నెలలకొకటి చొప్పున నిర్వహిస్తున్నాం.''

నెంబర్ వన్ అవుతాం... "భా' అంటే జ్ఞానం, 'రత్' అంటే ప్రేమికుడు అని అర్థం. అందువల్ల 'భారత్' అంటే జ్ఞానానికి నెలవని అర్థం. అదేదో పాత కాలం మాట కాదు, ఇప్పటికీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ రంగాలను ముందుకు నడిపిస్తున్నది మనవాళ్లే. ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక సాంకేతికత సాయంతో అందిపుచ్చుకుంటే వచ్చే కొన్నేళ్లలోనే మనం 'సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశం'గా నిలదొక్కుకోగలం. వేదం, సంస్కృతం తెలిసినవారు, ఆధునిక శాస్త్రజ్ఞులు కలిసి పనిచేస్తే మన దేశం శాస్త్రవిజ్ఞాన రంగాల్లో అసాధారణ ప్రగతిని సాధిస్తుందనే నమ్మకం నాకుంది.''

Prof. K.V.Krishna Murty
Chairman & Managing Director
Institute of Scientific Research on Vedas (I-SERVE)
(Recognized by DSIR as SIRO)
11-13-279, Road No. 8, Alakapuri, Hyderabad-500035
Phone: 91-40-24035013